Previous Page Next Page 
చిలకలు పేజి 26


    "ఆరు నెలలు " ఠక్కున సమాధానం ఇచ్చి తలతిప్పి కిటికీ అద్దాలతో నుంచి బయటికి చూడసాగింది. భారతి.
    "ఒంటరిగా వెళ్తున్నావా?"
    భారతి తల తిప్పకుండానే "అవును" అన్నట్టు తల ఆడించింది.
    "స్టేషన్ కు వచ్చినాయన నీకేమవుతాడూ? మామయ్యా అంటున్నావ్. నీ భర్త తండ్రా?"
    "కాదు. నా మేనమామ" తలతిప్పకుండానే విసుగ్గా సమాధానం ఇచ్చింది.
    "అదేమిటి? కొత్తగా అత్తవారింటికెళుతున్నావు గదా? మీ తల్లిదండ్రులు కానీ. అన్నదమ్ములు కానీ  ఎవరూ రాలేదేం?"
    "నాకెవరూ లేరు"
    "అయ్యో! పాపం!" జాలిగా అన్నది ఎదురు బల్లమీద  ఉన్న స్త్రీ .
    "పోనియ్ లేమ్మా బాధపడకు."
    భారతి వినిపించుకొనట్టే ఉండిపోయింది.
    "ఈ ఆడవాళ్ళకు అన్నీ కావాలి. అపరిచితులను ఇలా ప్రశ్నించడం ఎంత కుసంస్కారమో వీళ్ళకుతెలియదు. ఈమెగారు హైదరాబాదులో చేరేలోపుగా  తన ప్రాణాలు తోడేసేలా ఉంది ప్రశ్నలతో.
    "మీ ఆయన ఏం చేస్తాడూ?"
    "బిజినెస్" పూర్తిగా ఆలోచనల నుంచి బయటపడకుండానే అనేసింది భారతి.
    "పెద్ద బిజినెస్ సేనా? బాగా ఉన్నవాడేనా?"
    "ఆ"
    "మరి సెకండ్ క్లాస్ లో వెళుతున్నావేం?"
    "ఫస్టుక్లాసు దొరకలేదు" బయటకి చూస్తూనే భారతి యాంత్రికంగా తోచిన సమాధానాలు ఇస్తున్నది.
    "అదృష్టవంతురాలిని. అనాధవైనా శ్రీమంతుని ఇంటి ఇల్లాలి వయ్యావు. నీ అందం చూసి చేసుకొని ఉంటాడు అవునా?"
    "అవును" కసికసిగా అన్నది భారతి.
    తను అదృష్టవంతురాలైతే, ఈ లోకములో దురదృష్టవంతులని ఎవర్ని అనాలి? తను పుడ్తూనే తల్లిని చంపుకొన్నది. పదేళ్ళుతిరక్కుండానే తండ్రిని తినేసింది. మేనమామ ఇంట్లో తనేం సుఖపడింది. ఈ రోజు ఇంత ప్రేమ వలకపోస్తున్నాడు అప్పుడు ఒక్కసారైనా అప్యాయంగా దగ్గరకు తీసుకొని ఓదార్చాడా? ఇంటి చాకిరి చేస్తూనే తిట్లూ, శాపనార్థాలు తింటూనే పద్దెనిమిదేళ్ళ వయసులో అడుగు పెట్టింది. తన కంటే రెండేళ్ళు చిన్నదైన మామ కూతురి పెళ్ళి గురించి ఆలోచించే వాళ్ళే కాని తన గురించి ఏనాడైనా ఆలోచించారా?
    మామయ్య తనకు ఏం చెయ్యకపోయినా తనను పది వరకు చదివించాడు. ఈ విషయంలో మాత్రం పెళ్ళాం మాట వినలేదు.
    తాను పది పాసయ్యాక రెండేళ్ళు ఇంట్లోనే ఉంది. అప్పటికి తనకు పద్దెనిమిదేళ్ళు నిండాయి. మామయ్యను ఎలాగో ఒప్పించి టైపు ఇన్ స్ట్యూట్ లో చేరింది.
    తను బజారున నడుస్తుంటే అందరి కళ్ళూతన మీదే ఉండేవి.
    అప్పుడే పరిచయం అయింది ఆ దుర్మార్గుడితో. ఎంతో నిదానంగా, మూర్తీభావించిన సంస్కారంలా కన్పించే అతడు, తన జీవితంలో తను పోగొట్టుకున్నది ఏదో అందించడానికి వచ్చాడని మురిసి పోయింది. తనే కాదు  అతడి రూపం ఎవర్నయినా ఇట్టే మోసం చెయ్యగలదు. అతడ్ని చెడ్డవాడిగా ఎవరూ ఊహించలేరు.
    ఎన్ని ప్రలోభాలు చూపించాడు.
    "ప్రపంచంలోని ప్రతి వస్తువులో రంగులనే చూపించాడు. జీవితమే ఒక రంగుల కలలా మారిపోయింది.
    పెళ్ళి చేసుకుంటానన్నాడు.
    తన కోసం ఈ ప్రపంచంలో అంత అమూల్యమైన నిధిదాగి ఉందని మొదటిసారిగా తెలిసినట్టుగా అన్పించింది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది.
    మేనత్త ఇంట్లో కష్టాలు తప్పుతాయని భావించింది.
    సినిమాలకు తీసుకెళ్ళాడు.
    పార్కులకు తీసుకెళ్ళాడు.
    అతడితో కూర్చుంటే గంటలు క్షణాలుగా గడిచిపోయేవి. తనను తెగ నవ్వించేవాడు.
    "నువ్వు నవ్వుతుంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా?" అన్నాడు ఒకరోజు.
    "ఎందుకు?" తను అడిగింది.
    "నవ్వుతున్నప్పుడు నీ బుగ్గలు చొట్టలు పడ్తాయి.
    నీ బుగ్గల చొట్టల్లో నా హృదయం జారి పడిపోయింది. దాన్ని వెతికి తీసుకోవడానికే నిన్ను నవ్విస్తూ ఉంటాను" అన్నాడు.
    "అమ్మబాబోయ్. అయితే ఇక నుంచి నేను  నవ్వను" అన్నది తను."
    "ఎందుకని?"
    "నీ హృదయాన్ని వెనక్కు తీసేసుకుంటే నేనేమైపోవాల?" అన్నది తను.
    ఆ మాటకు అతడు  పకపకా నవ్వుతూ తనను హృదయాన్నికి హత్తుకొన్నాడు ఆర్థిగా.
    ఒక బలహీనమైన క్షణంలో జరగరానిది జరిగిపోయింది.
    "పురుషుడు, స్త్రీ తనకు లొంగిపోయేంత వరకూ పిచ్చిగా ఆమె వెంట పడ్తాడు. స్త్రీ తను ఒకసారి లోంగిపోయాక అతడి వెంట పిచ్చి దానిలా పడుతుంది" అని ఎక్కడో చదివింది తను.
    సరిగ్గా అలాగే జరిగింది.
    పెళ్ళి సంగతి ఎత్తితే కబుర్లు చెప్పి అప్పటికి తప్పించు కునేవాడు.
    తనకు నెలతప్పిందని తెలియగానే ప్లేటు మార్చాడు. తను నాలుగు నెలలు అయ్యాక గాని అతడికి చెప్పలేదు. చెప్పాలంటే ఏదో భయం, సిగ్గు అడ్డుపడ్డాయి.
    లేడీ డాక్టర్ దగ్గర కెళ్ళీ అబార్షన్ చేయించుకొమన్నాడు. ఆ బిడ్డ తన బిడ్డేనని నమ్మకం ఏమిటి అన్నాడు.
    కళ్ళముందు గాఢంధకారం కమ్మింది.
    కళ్లు తిరిగి పార్కు బెంచీమీద పడిపోయింది.
    తమ కళ్ళు తెరిచేసరికి పార్కుకు వచ్చినవాళ్లు కొందరు తన చుట్టూ మూగి ఉన్నారు. ఆ దుర్మార్గుడు ఎక్కడ కనిపించలేదు.
    అనేక కళ్ళు తనను చూస్తున్నాయి.
    అనేక నోళ్ళు తనను ప్రశ్నిస్తున్నాయి.
    తను లేచి బయటికి పరుగుతీసింది. ఆటో ఎక్కి ఇంటికిచేరింది. ఆలస్యంగా ఇంటికి వచ్చినందుకు అత్తచేత  నానామాటలూ తినాల్సివచ్చింది.
    తన పరిస్థితి ఇంట్లోవాళ్ళకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? రాత్రికి రాత్రి రైల్వే స్టేషన్ కి వెళ్ళి నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ ఎక్కి విజయవాడ చేరింది.
    రైల్లో వెల్ ఫేర్  ఆఫీసరు కలిసింది. మాటల్లో తన గురించి చెప్పుకోవడం, ఆమె  తనను  స్త్రీ సదనంలో చేర్పించడం అనుకోకుండా జరిగింది. అలా జరక్కపోతే తను ఏమై ఉండేది? వయసులోఉన్న ఆడపిల్ల కట్టుబట్టలతో బయటికివస్తే రక్షణ కల్పించగల సమాజం ఈ దేశంలో ఉందా? స్త్రీ జీవితానికి భద్రత ఉందా?
    స్త్రీ సదనంలోనే తన బిడ్డను కన్నది.
    అక్కడ ఉండే తను టైపులో హైయ్యర్ పరీక్ష పాసయింది.
    స్త్రీ సదన్ వాళ్ళే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పించారు. బిడ్డతో వంటరిగా ఉంటోంది.  వంటరి స్త్రీ  ఎదుర్కొనే అవమానాలన్నిటినీ ఎదిర్కొంటూనే బండి లాగిస్తుంది. తన కొడుక్కువచ్చే దీపావళికి నాలుగేళ్ళు నిండుతాయి.
    అనుకోకుండా ఓ రోజు తన మేనమామ ఓ బట్టలకొట్లో కన్పించాడు.
    అత్తయ్య చచ్చిపోయిందని చెప్పాడు. కొడుకులిద్దరూ అమెరికాలో సెటిల్ అయ్యారని కూడా చెప్పాడు. తన ఇంటికి వచ్చాడు. తన  కొడుకుని చూశాడు. అతడికి తండ్రి ఎవరో చెప్పింది. తను ఏ పరిస్థితుల్లో చెప్పకుండా హైదరాబాద్ నుంచి వచ్చేసిందో చెప్పింది.
    ఆ రోజు ఆయన తన ఇంట్లోనే ఉన్నాడు. పిల్లవాడికి బట్టలుకొని  ఇచ్చాడు. తను వద్దంటున్నా ఓ వెయ్యి రూపాయలు బలవంతంగా చేతిలో పెట్టాడు. కాని తనలో హైదరాబాద్ వచ్చెయ్యమని అనలేదు. అందుకు తను ఎంతో బాధపడింది. మాట మాత్రంగానైనా అనలేదు.
    అలాంటివాడు నిన్నరావడం, తనను బలవంతంగా  హైదరాబాద్ తీసుకెళ్ళడం ఆశ్చర్యంగానే ఉంది పైగా ఎంతో ఆప్యాయత చూపిస్తున్నాడు. అదంతా నటనా? మామయ్యకు తన దగ్గర నటిస్తే అతడికి వచ్చేదేముంది?
    ఎంతలేదన్నా రక్తబంధం కదా? తెంపుకోవడం అంత తేలికకాదు. తన పరిస్థితి చూసి వెళ్ళాక అతడితో మాట్లాడి ఉంటాడు. మామయ్యా సామాన్యుడుకాడు. భయపెట్టి ఉంటాడు. దాంతో అతడు పశ్చాత్తాపపడుతున్నట్టు నటించి వుంటాడు. తనకోసమే ఇంతవరకు వివాహం కూడా చేసుకోలేదని చెప్పి ఉంటాడు. పిచ్చి మామయ్య నమ్మేసి ఉంటాడు. మంచిగా ఉన్నట్టే నటించి తనను ఏమైనా చెయ్యవచ్చు అతడు దుర్మార్గుడు గోముఖవ్యాఘ్రం. అతడిలో మార్పురావడం అసంభవం. అందుకే తన బిడ్డను స్త్రీ సదన్ సూపరింటెండెంట్ కు అప్పగించివచ్చింది.
    కారుచీకట్లు కమ్మి ఉన్న తన జీవితనికి ఓ వెలుగురేఖను చూపించాడు మామయ్యా కాని అది నిజంగా వెలుగురేఖేనా అనే అనుమానం తనను వదలడం లేదు.
    చేదు తప్ప తీపి రుచి తెలియని తనను జీవితం పిరికిదాన్ని చేసింది.
    అందుకే అతడు మారడన్నా, తనను స్వీకరించడానికి సిద్దంగా ఉన్నాడన్నా నమ్మకం కలగడం లేదు.
    మామయ్య చెప్పిందంతా నిజమేనా?
    మామయ్య అబద్దం ఎందుకు చెప్తాడూ?
    ఏమో! మామయ్యకూడా స్వార్థపరుడు. ఆడదిక్కులేని ఇళ్ళు, అందుకే....
    ఒక్కసారిగా చలి కుదుపువచ్చినట్టుగా అయింది భారతికి.
    "నో!నో! మామయ్య తనను మోసం చేస్తాడా?
    మరి! బిడ్డను ఎక్కడో వదలడం ఏమిటి? మనకు ఇల్లు లేదా? తీసుకురా అని ఎందుకు అనలేదు? ఇందులో ఏదో తిరకాసు ఉన్నట్టే అన్పిస్తోంది ఆలోచిస్తున్నకొద్దీ.
    ఛ! మామయ్యను గురించి తనేమిటిలా ఆలోచిస్తున్నాది. అతడికి మామయ్య తనకు కొడుకు  ఉన్నట్లు చెప్పలేదేమో! అంతే  అయివుండాలి.
    తను మాత్రం ఆ విషయం దాచడు. దాచలేదు. బిడ్డనుకూడా స్వీకరిస్తేనే తను అతడితో ఉండిపోవడం జరుగుతుంది. అంతే!

 Previous Page Next Page