అమలకి అభిముఖంగా తిరిగి దగ్గరగా నుంచున్న కృష్ణ స్వర్గం తగ్గించి "తప్పించుకున్నానని మురిసిపోకు. నేను వూరు నుంచి వచ్చి నీ అంతు చూస్తాను" అన్నాడు.
"మీ ఎర్రగీరల షర్ట్ నాకు చాలా ఇష్టం అది ధరించి రండి" అంది అమల.
ఎర్రగీరల షర్ట్ లోనే లెటర్ పెట్టింది అమల. అది యింట్లో బీరువాలో వుందని బొత్తిగా ఎరుగని పిచ్చిపిల్ల.
"ఇడియట్! నీజోక్స్ నీ ధైర్యం నీ చేటు కాలానికేనని గుర్తుంచుకో. ముద్దుపెట్టుకుంటే పురుష స్పర్శ ఎరుగని దానిలా అమాయకంగా ఏడ్చిపోయావే. నీలాంటి దాన్ని రేప్ చేసినా అంతే! అనుభవించి ఆనందిస్తారు. మహానటి నీకు జోహార్లు."
అమల ముఖం పాలిపోయింది.
"ఆహా. ఆహా, ఏం నటన. ఎర్రగీరల షర్ట్ వేసుకు రావాలా బుల్లెమ్మా! గుర్రం ఎక్కి రానక్కరలేదా? తాళి కూడా తీసుకురానా?" అన్నాడు కృష్ణ వీలయినంత వ్యంగ్యంగా.
అమల ధైర్యం తెచ్చుకుంది.
"తాళికట్టి ఈ మహామారిని భరించగలవా కృష్ణా?"
ఒక్కసారిగా కృష్ణ ఖంగుతిన్నాడు.
అమల ఎగతాళిగా నవ్వింది, అల్లరిగా పెదవి విరిచింది.
కృష్ణకి అరికాలి మంట నేత్తిదాకా పాకింది.
"గుర్తులేదా, ముద్దునే భరించలేకపోయావు. చూస్తాను నీ పొగరు, వగరు. నే నొచ్చిం తరువాత నలిపి నలిపి నల్లేరు చేసి పారేస్తాను, బీ కేర్ ఫుల్" అంటూ అమల చేతివేళ్ళను బలంగా నొక్కి వదిలేసి వెనుతిరిగాడు కృష్ణ.
లోలోపల బాధగా "అబ్బా" అనుకున్న అమల చేతివేళ్ళని నోట్లో పెట్టుకుంది.
వెళ్ళడానికి అటు తిరిగిన కృష్ణ రయ్యిన మళ్ళి అమల వేపు తిరిగాడు. నెప్పిగా వుందా, పాపం?" అన్నాడు తగ్గుస్వరంతో.
"అబ్బే, తియ్యగా వుంది. మళ్ళీమళ్ళీ కావాలన్నంతగా" అంది అమల ఏమాత్రం తొణక్కుండా.
"నేను వెళ్ళి వచ్చేలోపల మామయ్యకి ఏదన్నా జరిగితే నిన్ను బంధించమని యీ ఇంట్లో నాకు నమ్మకమైన వాళ్ళకి చెప్పిపోతున్నాను. పిచ్చివేషాలు వేయకు."
"ఈ యింట్లో ఎవరు నమ్మకమైనవాళ్ళో ఎవరు తిన్న ఇంటి వాసాలు లేక్కపెట్టేవాళ్ళో నీకు తెలియదు కృష్ణా?" అనుకుంది. "పిచ్చివేషాలు వేయటం ఎలాగూ తప్పదు. వేస్తాను. పిచ్చి కృష్ణ" అంటూ రాగం తీసింది.
అవతల టైము అయిపోవటంతో "వచ్చి కుదురుస్తా నీ పిచ్చి" అనేసి వెళ్ళిపోయాడు కృష్ణ.
కృష్ణ, భుజంగరావుగారు ఎక్కిన కారు బైలుదేరింది.
అమల అక్కడ అలా చూస్తూ చాలాసేపు నంచుండిపోయింది.
15
భగవాన్ ప్లాన్ ప్రకారం కృష్ణని మార్గం మధ్యలో చంపటానికి తన మనిషిని నియమించాడు.
కృష్ణ నిజంగా స్నేహితుడి దగ్గరకు వెళితే ఫోన్ కాల్ దొంగదని తెలిసిపోతుంది వెంటనే తిరిగివస్తాడు. కృష్ణ వెంటనే తిరిగి రాకూడదు. అంతేకాదు. తిరిగి వచ్చే ప్రసక్తి అసలురాదు. అతను అమలను అనుమానించాడు. ఇది మొదటికే మోసం.
కృష్ణ అక్కడ రైలు దిగిన మరుక్షణం నుంచే మృత్యువుకి చేరువయినట్లే. మృత్యువు తన కబంధ హస్తాలు చాచి రెడీగా వుంది.
అమల లోలోపల భయపడేది అదే.
భగవాన్ సామాన్యుడు కాదు. కృష్ణని నాలుగురోజులపాటు వూరికి పంపిస్తానన్నాడు అలాగే పంపించగలిగాడు.
అలాంటి భగవాన్ ఏమైనా చేయగలడు.
కృష్ణని తిరిగి రాకుండా కూడా చేయగలడు.