"ఎందుకు పెద్దవాళ్ళు, మధ్యన కాపురం చేసేది నేను. చేయించుకునేది మీరు. ఇది మీ నా మధ్య విషయం. దీనికి ఇక పెద్ద వాళ్ళ ప్రమేయం ఏముంది?"
"అయితే! అంతా నిర్ణయించుకున్నావన్నమాట. ఇహ నన్నడగటం ఎందుకు?"
"సరే నన్ను పంపించెయ్యదలుచుకుంటే - అదే మీ అభిమత మయితే యిప్పుడే ట్రెయిన్ కి వెడతాను."
"అగు నిన్ను పంపించటం నా అభిమతం కాదు. వెడతా నంటే సరే. అంతేకాని నా మీద నింద ఎందుకు?"
"నింద ఏముంది? వెడతాను. కారణం ఎవరయినా వెళ్ళటం తప్పదు"
ఇహ మరేమీ అనటానికి ఆస్కారం యివకుండా వెళ్లి సూట్ కేస్ లో చీరలు రవికలు సర్దుకోసాగింది. బాబు గుడ్డలు కూడా తీసి పెట్టుకుంది. అన్నీ మరోమారు చూసుకుని లాక్ చేసింది.
తర్వాత సూట్ కేస్ తీసుకుని బయట పెట్టి బాబుని భుజానికి ఎత్తుకుంది. పోబోతోంటే అన్నాడు.
"అయితే వెడుతున్నావన్నమాట! వెళ్ళేముందు ఒక్క క్షణం అగు. నే చెప్పేది బాగా విన్నాక నీవు ఏం చేసినా సంతోషమే. సాయంకాలం నీవు గుడికి వెళ్లాక రాజమ్మ వచ్చింది. తన కొడుక్కి అమ్మవారు పోసిందంటు భర్త వూళ్ళో లేడని ఓ పది రూపాయలు యివమని అడిగింది. సరేనని యివబోతోంటే నీకు చెప్పవద్దని కోరింది. మొన్ననే జీతం యివటంతో మళ్ళీ యిలా అడిగితే నీవు కోప్పడతవని చెప్పొద్దంది. బ్రతిమాలితే సరే అన్నాను. ఇందులో ఏముంది లెమ్మనుకున్నాను. అదే నీవు విన్నావు. ఆ విషయం చెపితే నీవు నమ్మక ఆమెని అనుమానించి పంపేవు. పైగా అనవసరంగా అపోహలు పెంచుకుని యిప్పుడు వెళ్ళిపోతున్నావ్. ఎలాగూ యీవారంలో కాన్పుకి వెళ్ళేదానివే. అలాగే వెళుదువుగానీ.
అయితే నాపై అపోహతో మాత్రం వెళ్ళి పోవద్దు. నామాట నమ్ము. నీవు వుహించుకునేంత నిచుడిని కాను. నీకా విషయం అర్ధం కాదు. భార్యా భర్తలన్నాక సామరస్యం వుండాలి. ఎప్పుడూ యిలా చీటికి మాటికి రగడలు అవుతోంటే అది బావుండదు. రెండు చక్రాల్లా సంసార శకటాన్నిలక్కేళ్ళాలి. అంతేకాని విడితే సాగటానికి మనం అసురులం కాదు, ఒక్క ఆయనకే ఏకచక్రరధ సారద్యం అయింది.
నా మాట నమ్ము, ఇందులో దోషం ఎవరిది లేదు. ఆవేశ పడటం సహజం. అయితే తర్వాత సవరించుకోవటం లోనే అనందం వుంది.
అంతా వింది.
కానీ వుండిపోవటానికి మనసొప్పలేదు. వెళ్ళటానికి నిశ్చయించుకుని అంది.
"కానివండి. మీరు చెప్పేది చెప్పారు. ఎలాగూ వెళ్ళాలి. నేను వెడుతున్నానిప్పుడే మీ విషయం మీరు జాగ్రత్త తర్వాత వెడుతూనే ఉత్తరంవ్రాస్తాను."
బయటికి వెళ్లి రిక్షా కోసం చూసి లేకపోవడంతో బాబుని భుజాన వేసుకుని ఓ చేత్తో సూట్ కేసుని అందుకుని భారంగా నడవ సాగింది.
మాధవ్ నిశ్చేష్టుడై వుండిపోయాడు. కనీసం వెంట వెడదామన్న వూహకూడారాలేదతనికి.
13
రెండు మూడుమాసాలు గడిచాయ్.
శ్రీదేవి ఆ వెళ్ళటం వెళ్ళటంగా వెళ్ళింది జాబూలేదు.
మాధవ్ శ్రీదేవి వెళ్ళిన క్షణం నించి వారం రోజుల దాకా మనిషి మనిషిగా లేడు. పరధ్యానంగా ఎప్పుడూ ఆలోచిస్తూ వుండేవాడు.
అసలే అతను అదో తరహా వ్యక్తి. ఎవర్ని దేనికి నొప్పించే తత్త్వం కాదు. అవసరానికి మించి ఓ పలుకయినా ఆడేవాడు కాదు.
ఆఫీసులో అతన్ని అంతా రంగూ రుచి వాసనా తెలియని మనిషి అంటూ వుంటారు. ఒక్కొక్కరు ఎదురుగానే అంటుంటారు. అయినా చిరునవ్వు నవ్వేసి వెళ్ళిపోయేవాడు.
అలాంటివాడు యీ సంఘటన జరిగాక మనిషి మరి మౌని అయ్యాడు. ఆఫీసు పనిలో కొంత మాంద్యం కూడా వచ్చింది. అయినా అతని సీట్ ఏమంత అర్జెంట్ ది కాకపోవటం వల్ల ఓ వారం రోజుల పని అంతా ఒక్కరోజులోనే చేసెయ్యొచ్చు, అందుకై ఆఫీసులో అతనికి ఏ యిబ్బంది కలుగలేదు.
పెళ్ళి అయ్యాక అతనెప్పుడు శ్రీదేవిని విడిచి వుండలేదు. ఆవిడ తొలి కాన్పుకి వెళ్ళిన రోజుల్లో కూడా వారం వారం వెళ్ళి వస్తూ వుండేవాడు. వెళ్ళినప్పుడయినా రెండు మూడు రోజులకి తక్కువ వుండేవాడు కాదు. అందుకని యిప్పడతనికి ఆవిడ ఎడబాటు రెట్టింపు బాధ కల్గించసాగింది.
ఆవిడ వెళ్ళిన మరురోజు ఉదయమే అతనికి అంతా గాబరాగా వుండింది. వేన్నిళ్ళు కాచుకునే ఓపిక లేక చన్నీల్లే పోసుకున్నాడు. హొటల్ కి వెళ్ళి భోజనం చేసి వచ్చాడు. ఆరోజంతా ఎలాగో గడిచిపోయింది, కానీ ఆఫీస్ నుంచి సాయంకాలం యింటికి వచ్చేసరికి అంతా బోసిగా బావురుమంటూన్నట్టుగా వుండి ఎలాగో అయిపోయాడు. ఆ ఆలోచనల్లో ఆకలి భోజనం హొటల్ విషయం గుర్తుకి రానేలేదు.
దాదాపు తొమ్మిది గంటల ప్రాంతంలో ఆకలి వేసింది. ఇహ అప్పుడా వేళ హొటల్ కి వెళ్ళినా చల్లారిపోయిన మెతుకులే కదాననుకుని భోజనం ప్రసక్తి మానుకుని యిల్లంతా వెతికాడు. ఏమయినా వుందేమోనని. బాగా మాగిన అరిటిపళ్ళు రెండు కనిపించాయ్. ఆకలి మీదనో బాగా పండటం వల్లనో అతనిపాలిటికి అవి అమృతఫలాల్లా అవుపించాయ్. తర్వాత చల్లగా చల్లారి పోయినట్టున్న పాలని గటగటా త్రాగేశాడు. చప్పగా వుండటంతో చెక్కెర కోసం గాలించాడు, మొదట కనిపించక పోవటంతో విసుగేసి అలాగే త్రాగేశాడు.
అప్పుడతనికి చిన్నపుడు తన గురువుగారు వంట చేసుకుని భోజనం చేస్తూ ఓ ప్రాచీన శ్లోకం గుర్తుకి వచ్చింది.
సయం పంచముఖాపుత్రౌ
షడానన గజాననా
దిగంబరమ్ కధంజీవేత్
అన్నపూర్ణా నచేత్ గృహమ్
తర్వాత యింకా ఆకలి అణగక పోవటంతో యిల్లంతా లైట్లు వేసుకుని ఒక్కో అల్మారా జాగ్రత్తగా వెదికి ఎలాగైతేనేం చివరికి మరమరాలు సెనక్కాయలు, సేనగాపప్పులు వేయించి కలిపిన డబ్బా వెతికి పట్టుకుని ఖాళి చేసేశాడు. అదో ధ్యాసలో చివరికి చెక్కిళ్ళు నొప్పులెత్తితే డబ్బాని విసిరేసి ఓ గ్లాసుడు నీళ్ళు తాగేసి వెళ్ళి పడుకున్నాడు.
పరుపు విదిలించకపోవటంతో ఎలాగో వుండింది. బెడ్ షీట్ తీసేశాడు. చివరికి అటూ యిటూ దొర్లి ఎలాగైతేనేం నిద్రపోయాననిపించాడారోజుకి.
మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే అతనికి ఎదురైన ప్రశ్న భోజనం ఎలాగా అని? అంత దూరం హొటల్ కి వెళ్ళి రావటం కన్నా యింట్లోనే చేసుకుంటేనో అనిపించింది.