ఎలాగైతే ఏం? ఒప్పుకుంది అది చాలు తనకి అనుకున్నాడు రాహుల్.ఆమె చేయి తన చేతులోకి తీసుకుని నమ్మలేని వాడిలా అడిగాడు. "మనస్పూర్తిగా అంటున్నావా?"
"నమ్మకం లేదా?" నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలి?"
"ఏమీ వద్దు . పద....తయారవు. ఇవాళ ఇద్దరం ఏదన్నా హోటల్లో భోం చేద్దాం." అన్నాడు హుషారుగా.
"ఊహూ.... అమ్మా వాళ్ళింటికి వెడదాం'. ఆవిడగారూ కూడా అలిగినట్టున్నారు ఫోన్ కూడా చేయడం లేదు" అంది.
"నీ ఇష్టం " అన్నాడు రాహుల్. అ తరువాత ఇద్దరూ బయలుదేరి మంజుల దగ్గరికి వెళ్ళారు.
***
అయిష్టంగా, అసంతృప్తిగా గర్భం మోయడానికి తనూజ సిద్దపడిన దగ్గర్నుంచీ అందరి ప్రవర్తనల్లో ఎంతో మార్పొచ్చింది. అటు తల్లీ తండ్రీ, ఇటు రాహుల్...పూవులా చూసుకుంటున్నారు. ఊరి నుంచి అత్తగారు రకరకాల పచ్చళ్ళు, పిండి వంటలు చేసి పంపించింది. ఇంట్లో పనంతా రాహులే చేస్తున్నాడు. ఏది ఎలా ఉన్నా ఈ వంకతో తనకీ రాణీయోగం పట్టిందని మురిసి పోయింది తనూజ.
ఏడో నెల వచ్చింది. అత్తగారు, తల్లి కలిసి ఆర్భాటంగా సీమంతం చేశారు. అలా బాహాటంగా మా అమ్మాయి కడుపుతో ఉంది అని అందరికీ చాటింపు వేస్తున్నట్టుగా చేస్తున్న ఆ ఆర్బాటం తనూజ కి చికాకు కలిగించింది. కానీ తల్లి సంతోషం కోసం ఒప్పుకుంది. అయితే ఆ రోజు నిలువుటద్దంలో తనని తను చూసుకున్న తనూజ కి మొదటిసారిగా తనలో ఉన్న అందం కనిపించింది. ఎప్పుడూ షల్వార్, కమీజుల్లో నుదుట చిన్న స్టిక్కర్లో , మేడలో పుస్తెల తాడు మాత్రం వేసుకుని సింపుల్ గా తిరిగే తనూజ ఆరోజు పెద్ద పూలజడ, మెడనిండా నగలు, పట్టుచీర , కళ్ళకు కాటుక , చేతి నిండా గాజులు వేసుకుని ఎంతో అందంగా ఉంది. నిండుగా, అందంగా ఉన్న తన ఆకారాన్ని చూసుకుంటే చిత్రంగా అనిపించింది ఆమెకి.
తనూజ కి నెలలు నిండుతున్నాయి. ఆఫీసుకు సెలవు పెట్టి పుట్టింటికి వచ్చింది. కాలు కడపనివ్వ కుండా మంజుల సేవలు చేస్తోంది. ఏది కావాలంటే అది క్షణాల మీద అమరుతోంది.
నెమ్మదిగా కడుపులో పాపాయి కదలికలు మొదలవు తుంటే తనూజకి ముందు భయం, చికాకు వేసింది. "ఏమిటమ్మా ఈ న్యూసెన్స్ ....నాతో పాటు కదుల్తుందే ఈ పాప. నోరు మూసుకుని కూర్చోవచ్చుగా" అంది.
"పాప కాదు....నువ్వు నోర్ముసుకో" అంటూ మంజుల కన్నెర్ర చేసేటప్పటికీ చేసేది లేక మాట్లాడకుండా ఊరుకుంది. కానీ ఆ తరువాత ఆ కదలికలు ఆమె గుండెల్లో చిత్రమైన పులకింతలు కలిగించసాగాయి. బుజ్జిబుజ్జి పాదాలతో పాపాయి గర్భ గోడలు పగలగొట్టుకుని బైటకి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించి ఏవిటో ఈ తొందర?" అనుకుంది మురిపెంగా. ఆ తరువాత అవును....పాపాయి త్వరగా బైటికి వస్తే బాగుంటుంది. ఎలా ఉందొ.. తనలా ఉందొ, రాహుల్ లా ఉందొ....తెల్లగా ఉందొ, నల్లగా ఉందొ అని పాపాయి భూమ్మీద పడే మధుర క్షణం కోసం ఎదురు చూడసాగింది.
ఆరోజు రానే వచ్చింది. ఉదయాన్నే నలతగా ఉన్న కూతుర్ని తక్షణం హాస్పిటల్ కి తీసుకెళ్ళింది మంజుల. ఊరి నుంచి అత్తగారు కూడా వచ్చింది. రాహుల్ ఆఫీసు కి సెలవు పెట్టి హాస్పిటల్లో ఎదురు చూస్తూ కూర్చున్నాడు.
పెయిన్స్ ప్రారంభం అవడంతో తనూజ ని లేబర్ రూంకి తీసుకెళ్ళారు. ఆ నొప్పులు భరించలేక తనూజ వెర్రి కేకలు పెట్టసాగింది. "డాక్టర్! నేను భరించలేను, ముందీ పాపను బయటకు తీయండి." అంటూ పిచ్చి పిచ్చిగా అరవ సాగింది. మంజుల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "పాపం పిచ్చిది ....అందరూ కలిసి దాన్ని సాధించి తొమ్మిది నెలలు మోసేలా చేయగలిగారు కానీ ఈ ప్రసవ వేదన తమలో ఎవరు భరిస్తారు? భారించాల్సింది నా కూతురిగా. పాతికేళ్ళు లేని పసిది మరో పసిగుడ్డుకి జన్మ నివ్వడం అంటే మాటలా. ఈ యజ్ఞంలో నా కూతురికి ఏ ఆపదా కలక్కుండా కాపాడు తండ్రీ! నా బిడ్డకు సుఖ ప్రసవం అవాలని దీవించు . నన్ను క్షమించు తండ్రీ! పాపిష్టి దాన్ని నా బిడ్డని అనవసరంగా బాధపెట్టాను. ఎంత బాధపడిందో పిచ్చి తల్లీ" అనుకుని బాధపడసాగింది. లోపల నుంచి తనూజ అరుపులు, ఏడుపు వినిపిస్తోంటే మంజుల తల్లి మనసు విలవిల్లాడసాగింది.
దాదాపు నాలుగు గంటల తరవాత తనూజ అరుపులు, ఆగిపోయాయి. పాపాయి కేర్ మన్న శబ్దం వినిపించి కారిడార్ లో నిరీక్షిస్తున్న వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రసవ పోరాటంతో అలసి, సొలసిన తనూజ చెవులకి ఆ శబ్దం శంఖారావం లా , గాలికి కదుల్తోన్న గుడి గంటల సవ్వడి లా సుతారంగా, మధురంగా వినిపించింది. అలసిన కనురెప్పలు, వాలిపోతోంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి "డాక్టర్ ....ఏ పాప?' అడిగింది.
"ఆడపిల్లమ్మా!' డాక్టర్ తనూజ దగ్గరగా వచ్చి మొహం మీద పడిన జుట్టు సవరిస్తూ మృదువుగా చెప్పింది.
తనూజ మొహంలో మెరిసిన మెరుపు చూసి డాక్టర్ చిరునవ్వుతో అడిగింది "నువ్వు దరిద్రం అని తీసి పారేయమన్న పాపని చూస్తావా?"
తనూజ చిన్నగా తల ఊపింది.
"చూద్ద్దువు గానీ, సిస్టర్ స్నానం చేయించి తీసుకు వస్తుంది. నీకెలా వుంది" పల్స్ చూస్తూ అడిగింది.
తనూజ నీరసంగా నవ్వింది. 'చాలా సంతోషంగా ఉంది."
"గుడ్ చూశావా? కొంచెం సహనం వహిస్తే ఎంత గొప్ప విజయం సాధించగలమో అర్ధం అయిందా? తనూజా.... ఇది స్త్రీ జీవితంలో ఎదురయ్యే అతి ముఖ్యమైన మధురాతి మధురమైన సన్నివేశం. ఎంత అవివేకంతో దీన్ని మిస్ అయ్యేదానివో తెలుసా? ఒకే టెక్ రెస్ట్' అంటూ ఇంజక్షన్ చేసింది.
కొంతసేపటికి తనూక కళ్ళు మూతలు పడ్డాయి.
తిరిగి మెలకువ వచ్చేసరికి పక్క మీద మెత్తగా, గులాబీరేకులా పాపాయి స్పర్శ తగిలింది. చటుక్కున కళ్ళు తెరిచింది. తెల్ల గులాబీలా ఉన్న చిన్న పాప కళ్ళు మూసుకుని, గుప్పిట్లు మూసుకుని అమ్మ పక్కలో వెచ్చగా పడుకుంది.
"ఎలా ఉంది తనూ!' ఆప్యాయంగా అడుగుతున్న రాహుల్ ని, "నీ కూతురు అచ్చు నీలాగే ఉంది' అంటోన్న మంజుల మాటల్ని పట్టించుకోకుండా తన గర్భగుడి నుంచి బైటకి వచ్చి అమాయకంగా నిద్రపోతున్న ఆ చిన్నారిని అపురూపంగా చూస్టూ "ఈ అమాయకపు పాపాయేనా నా కడుపులో అంత అల్లరి చేసింది" అనుకుంటూ గుండెల్లోంచి వెల్లువెత్తుతోన్న మమతానురాగాలతో మైమరచి పోయి తన చేతిని పాపాయి వంటి మీద సున్నితంగా వేసింది తనూజ.
***