Previous Page Next Page 
ఒప్పందం పేజి 24

 

    "ఉండనీ ...నాకేం?" వీళ్ళందరికీ కోపం వస్తుందని నాకిష్టం లేని పనెందుకు చేయాలి?' అనుకుని నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది.
    కానీ ఇంటికి వెళ్ళాక రాహుల్ కూడా తనతో ముభావంగా ఉండడం, పడక కూడా సోఫాలో కి మార్చేయడం చూసి ఆమెకి ఒళ్ళు మండిపోయింది.
    దిండూ, దుప్పటీ తీసుకుని సోఫాలో పడుకున్న రాహుల్ దగ్గరికి వెళ్ళి మండిపడుతూ అడిగింది. "ఏంటి నీ ఉద్దేశం? నేను పనికి రాకుండా పోయానా? అంటే నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటె ఇలా హింసిస్తావన్నమాట. హు నువ్వేదో పెద్ద ఆదర్శ పురుషుడివని మురిసిపోయాను. ఛీ... నువ్వు కూడా ఇలా ఓ మామూలు మగాడిలా ప్రవర్తిస్తావనుకోలేదు."
    రాహుల్ నింపాదిగా అన్నాడు. "ఆదర్శ పురుషుడంటే ఎలా ఉండాలి. తనూ, నిన్ను ప్రేమగా చూసుకోవడం, నీ స్వేచ్చనీ, స్వాతంత్యాన్ని నీ అభిప్రాయాలనీ గౌరవించడం , ఇంటి పనుల్లో సంసారపు బాధ్యతల్లో నీతో సమానంగా భాగం పంచుకోవడం, నిన్ను అర్ధం చేసుకుని భర్తగా సహకరించడం ఇవి కాక ఇంకేమన్నా ఉంటాయా చెప్పు చేస్తాను. కానీ... కానీ తండ్రి కావాలనుకున్న నా కోరికని శాశ్వతంగా మనసులో పాతేసి ఓ పనికి మాలిన వాడిగా బతకమని అంటున్నావే అది మాత్రం భరించలేక పోతున్నాను."
    "అంటే ఏంటి? నువ్వు తండ్రి కానంత మాత్రాన పనికి మాలిన వాడివై నట్టా....అంటే అందరూ నువ్వు మగాడివి కావనుకుంటారని భయమా? నీకా భయం అవసరం లేదు. నేను చెప్తాలే మా అయన మగాడే అని."
    "తనూజా!' గట్టిగా అరిచాడు రాహుల్. అతని కళ్ళు నిప్పు కణికల్లా ఎర్రగా అయాయి. పెళ్ళి అయిన నాలుగేళ్ళకి అతన్నలా చూస్తుంటే కొంచెం జంకు కలిగింది తనూజకి.
    ఆ పిలుపుకీ, ఆ స్వరంలోని తీవ్రత కీ కొంచెం బెదిరింది. ఎప్పుడూ ఎంతో నెమ్మదిగా, స్వరంలో లాలిత్యం నింపుకుని పిలిచే రాహులేఅనిపించింది ఓ క్షణం వణికిపోయింది కూడా.
    "తనూజా.... నేనూ మనిషినే నాకూ కొన్ని కోరిక లుంటాయి. నీ వ్యక్తిత్వం, నీ అస్తిత్వం కాపాడుకోవాలి నువ్వెంత తపన పడుతున్నావోనాకూ అంతే తపన ఉంటుందని తెలుసుకో. నీ  ఆశల్నీ.... ఆశయాలనూ నేను మన్నించి గౌరవించినట్టే నువ్వు కూడా నా ఆశల్ని, గౌరవించాలన్న చిన్న విషయం నీకు తెలియనందుకు నాకు చాలా బాధగా ఉంది. ఏం? నీ అభిప్రాయాలను భర్తగా నేను గౌరవించాలి, కానీ భార్యగా నా అభిప్రాయాలను నువ్వు గౌరవించవా? చూడు తనూ...గౌరవం ప్రేమ, అనురాగం వాత్సల్యం అనేవి ఇచ్చి పుచ్చుకోవాలి. ఎంతసేపటికీ అవి నీ ఆస్తులే అని, అందరూ నిన్ను గౌరవించాలని, ప్రేమించాలని అనుకోవడం మూర్ఖత్వం . అరె....చిన్న కోరిక ....అందరిలా నాకూ నాన్న అనిపించుకోవాలని ఉండడం తప్పా, ఛ ...ఈ చిన్న విషయంలో నిన్ను కన్విస్స్ చేయలేకపోయాక ఇంకెందుకు నా బతుకు? మన అనుబంధానికి, ప్రేమకీ భార్యాభర్త ల ఆన్యోన్యానికి ఏంటి అర్ధం?" బాధగా అన్నాడు.
    "అంటే! నేను పిల్లల్ని కనకపోతే మన మధ్య అనుబంధం తెగిపోయి నట్టేనా?"
    "ప్లీజ్ తనూ....నీతో వాదించే ఓపిక కానీ, ఆసక్తి గానీ నాకు లేవు. దయ వుంచి నన్ను వంటరిగా వదిలేయ్. అయినా పిల్లలు వద్దనుకున్న నీకు నేను మాత్రం ఎందుకు? హాయిగా స్వేచ్చగా వంటరిగా బతుకు. ప్లీజ్' రెండు చేతులూ ఎత్తి దండం పెట్టాడు.
    తనూజ విసురుగా గదిలోకి వచ్చింది. లైట్ ఆఫ్ చేసి, మంచం మీద వాలిపోయి, "పోనీ ఈయన పొందు కోసం నేనేం తపించడం లేదు. నేను కావాలంటే తనే వస్తాడు. ఛ....ఏం మనుషులు? అసలీ మగవాళ్ళ కి ఆడదంటే పిల్లల్ని కనిచ్చే యంత్రం అని తప్ప రక్త మాంసాలున్న మనిషిగా గుర్తించారేమో. పిల్లలు, పిల్లలు అని అంత తపిస్తుంటే దేశంలో అనాధలెందరో ఉన్నారు. వెళ్ళి వాళ్ళందరినీ ఎత్తుకుని ముద్దు చేసుకుంటే సరి. వీళ్ళ కోసం తను.... నో ఒక్కసారి కడుపు వైపు చూసుకున్న తనూజ విరక్తిగా అనుకుంది. నా వల్ల కాదు. చటుక్కున దుప్పటి ముసుగేసుకుని పడుకుండి పోయింది.
    అయితే డాక్టర్ ఇచ్చిన వారం గడువు దాటిపోయింది. రాహుల్ గాంబీర్యం వదల్లేదు. తనూజతో మాట్లాడడం లేదు. రాత్రిళ్ళు ఆలస్యంగా వస్తున్నాడు. ఇంట్లో భోజనం కూడా చేయడం లేదు. తనూజ కి వాంతులవుతున్నా పట్టించుకోవడం లేదు. అతని ప్రవర్తన తనూజ కి కోపాన్ని కలిగించినా ఎందుకో ఎన్నడూ తను చూడని మరో రాహుల్ ని అలా చూస్తుంటే కొంచెం బాధగా అనిపిస్తోంది. గడ్డం చేసుకోకుండా పిచ్చి వాడిలా తిరుగుతున్నాడు. అతన్నలా చూస్తుంటే డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ల మని అడిగే సాహసం కలగడం లేదు. అక్కడికి తెగించి అడిగింది ఓరోజు. "డాక్టర్ దగ్గరి కెళ్ళాలి, మర్చిపోయావా?" అని.
    "ఎప్పుడు వెళ్దామంటే అప్పుడు తీసుకెళతాను. నీ ఇష్టం" అన్నాడు ముక్తసరిగా.
    అతను సంతోషంగా తీసికెళ్ళకపోయినా కనీసం నార్మల్ గా ఉన్నా వెళ్ళచ్చుకానీ, మరీ ఇలా ఉంటె తను అబార్షన్ ఎలా చేయించుకోగలదు అనిపించింది తనూజకి. అందుకే మరో నాలుగు రోజులు వాయిదా వేసింది. ఆ నాలుగు రోజులూ కొంచెం వాంతులు తగ్గినట్టు అనిపించింది. మాములుగా ఆఫీస్ కి వెళ్ళసాగింది. కొలీగ్స్, అందరికీ అప్పటికీ విషయం తెలిసి పోయినట్టుంది. అందరూ వచ్చి అభినందించారు. "దానిమ్మ పళ్ళు తిను, పళ్ళ రసం తాగు , కొంచెం పుల్లటి పదార్ధాలు తిను." అంటూ సలహాలిచ్చారు. వాళ్ళ సలహాలు, అభినందన లూ తిరస్కరించలేక పోయింది.
    ఇప్పుడు వెళ్ళాలి, అప్పుడు వెళ్ళాలి అనుకునే లోగానే మూడో నెల దాటింది. రాహుల్ కి ఎక్కువ రోజులు దూరంగా ఉండలేక పోయింది. ఈ నాలుగేళ్ళుగా ఏనాడూ సరదాక్కూడా తమ మధ్య అభిప్రాయ భేదాలు రాలేదు. తనెలా అంటే అలా చేసే రాహుల్ తనకి చీమ కుట్టినా, దోమ కుట్టినా విలవిల్లాడే రాహుల్ అకస్మాత్తుగా అలా మారిపోవడం జీర్ణం చేసుకోలేకపోయింది. దానికి తోడూ అటు తల్లి గానీ, ఇటు అత్తగారు గానీ ఎవరూ కూడా ఫోన్ చేయడం లేదు. తననెంతో ప్రేమించే తండ్రి కూడా ఈ పది రోజులుగా ఒక్కసారి కూడా ఫోన్ చేసి ఎలా వున్నావురా? అంటూ ప్రేమగా పలకరించలేదు. హటాత్తుగా అందరూ కలిసి తనని వెలేసినట్టు అనిపించింది. అనుకోకుండా తనకేదురైన ఈ విముఖతని తట్టుకునే శక్తి లేదు ఆమెకి. ఒక్కసారిగా తను పూర్తిగా వంటరి అయినట్టుగా అనిపించింది. అందుకే నెమ్మదిగా మనసుకు సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించ సాగింది.
    కానీ చిన్నప్పుడు తమింట్లో పనిచేసిన పద్మ ఏడాది కోసారి కడుపుతో ఉండడం, ఓ పిల్లని చంకలో మరో పిల్లాడిని చేతిలో పట్టుకుని పనికి రావడం వాళ్ళ ఏడుపు లూ, ఉచ్చలూ, గోల.... గుర్తుకొచ్చి చీదర కలిగేది.
    అలాగే బస్సుల్లో, సినిమా హాల్స్ లో చిన్నపిల్లల్ని ఎత్తుకుని వచ్చే తల్లులంతా కళ్ళ ముందు కదిలి భయంతో వణికి పోయేది . అమ్మో! నా పరిస్థితి కూడా అలాగే ఉంటుందేమో....అనుకోసాగింది.

                                      ***

    కన్వీన్స్ అయాక అందరమ్మాయిల్లా ఉత్సాహంగా కాకుండా దిగులుగా, చిరాగ్గా ఉన్న తనూజని తరచి, తరచి అడిగి  విషయం తెలుసుకున్న కొలీగ్ సుప్రజ తనూజ అభిప్రాయాలు విని మెత్తమెత్తగా చివాట్లు పెట్టింది.
    "నువ్వు పిచ్చిదానివా? అసలీ ఆలోచనలు ఎండుకోస్తున్నాయి? నీకు పిల్లలు రోగాలు, రొష్టుల గురించి ఆలోచించే ముందు వాళ్ళ చిరునవ్వులూ, చిలిపి అల్లర్లూ, ముద్దు ముద్దు మాటలు, తప్పటడుగులు గుర్తుచేసుకో. నీ పిల్లలు అలా నీ ఇంట్లో తప్పటడుగులు వేస్తూ  లక్క పిడత లాంటి నోటితో అమ్మా అంటుంటే వినాలని అనిపించటం లేదూ. ఆ మాధుర్య భావనలో, ఆ అనుభూతుల జల్లుల్లో నిలువునా తడిసి పోవాలని పించడం లేదూ. నాకెందుకో నీ మెంటల్ కండిషన్ మీద అనుమానంగా ఉంది" అంది.
    తనూజ మండిపడింది. "అంటే నీ ఉద్దేశం ఏంటి?" నాకు పిచ్చి ఉందనుకుంటూన్నావా?"
    "అంతేగా, నార్మల్ గా ఆలోచించే వాళ్ళెవరూ నీలా ఆలోచించరు'."
    ఆ అమ్మాయితో చర్చించాక నిజంగానే "నేను నార్మల్ గా లేనా?' అన్న అనుమానం కలిగింది తనూజ కి. దాదాపు నెల రోజుల పాటు ఇదే విషయం తీవ్రంగా అలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది.
    పోనీలే ఇదేదో కనిస్తే సరిపోతుంది. పిల్లలుంటే బాగానే ఉంటుంది. కానీ అబ్బా! వాళ్ళకి సేవలు చేయాలి. వాళ్ళ కేర్ తీసుకోవాలి. తన యాక్టివిటీస్ ఫ్రీడం అన్నీ వదులుకోవాలి. అనిపించినా నెమ్మదిగా ముందటి నిర్ణయం మార్చుకోడానికి ప్రయత్నించసాగింది.
    ఆరోజు రాత్రి రాహుల్ దగ్గరకి వెళ్ళి అతని పక్కన కూర్చుని నెమ్మదిగా అంది. "ఇదేం బాగాలేదు రాహుల్. నన్ను సాధించడానికి కాకపొతే నువ్వీ మౌన వ్రతం చేయడం దేనికి? నీకు పిల్లలు కావాలి అంతేనా? సరే.... నీకోసం ఒక్కర్ని కంటాను సరేనా? అది ఆడపిల్లా, మగ పిల్లాడా అనకూడదు. నేను ఎవర్ని కంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి."
    ఊహించని పరిణామానికి రాహుల్ ఉలిక్కిపడ్డాడు. ఆమె అలా తన పక్కన కూర్చుని ఆ మాటలంటుంటే అది కలో, నిజమో తేల్చుకోవడానికి అతనికి కొన్ని క్షణాలు పట్టాయి. అర్ధం అయ్యాక ఆమె మాటలు అతనికి చాలా సంతోషాన్ని కలిగించాయి. తనూజ ఈ మాత్రం అనుకూలంగా మారడం  తృప్తిని కలిగించింది. అయినా కొంచెం బెట్టుగా "నాకోసం నువ్వెందుకులే తనూజా కష్టాలు భరించడం' అన్నాడు.
    "ఈ సినిమా డైలాగులు, హిపోక్రసీ మానేయ్ నీకు పిల్లలు కావాలి అంతేగా.... సరే అన్నాను. అబార్షన్ సంగతి మర్చిపో.... కానీ గుర్తుంచుకో....నీ మౌనవ్రతం చూసి, నీ సాధింపు చూసి నేనేం బెదిరిపోయి ఒప్పుకోవడం లేదు. నా అంతట నేనే ఒప్పుకుంటున్నాను."

 Previous Page Next Page