"రాధా..." తీక్షణంగా అన్నాడు మాధవ్. "ఎవడి బిడ్దనో కనే ఔదార్యం నీకుందేమోగాని, ఆ బిడ్డకి తండ్రిగా చలామణి అయి, కళ్ళెదుట అనుక్షణం ఆ నరకం భరించేశక్తి లేదు నాకు..."
"మాధవ్... దేముడంత క్రూరుడు కాడు. నాకింకా అన్యాయం చెయ్యడు. నాకు చేసిన ద్రోహానికే ప్రతిగా ఈ వరం యిచ్చాడు. నేనీపని చెయ్యలేను మాధవ్... నాకీ బిడ్డ కావాలి మాధవ్... సారం చచ్చిపోయిన ఈ వంటరి జీవితంలో ఆ బిడ్డ తోడైనా నాకు మిగలనీ మాధవ్..." ధీనంగా అంది.
"ఈ జరిగిన అవమానం చాలక, ఆ వెధవలకి పుట్టిన బిడ్డని కని నన్నీ లోకంలో తలెత్తుకోనీయవా... నాకంటే_ ఎవడికో పుట్టే బిడ్డే నీకు ఎక్కువా?" కసిగా అడిగాడు.
రాధ జవాబివ్వలేక తలదించుకుంది. ఒక్కక్షణం ఆలోచించింది. "మాధవ్... నీకోసం... నీ ప్రేమకోసం నీవు చెప్పిందానికి నాకిష్టం లేకపోయినా అంగీకరిస్తాను... కాని... ఆ తరువాత నీవు నా పూర్వపు మాధవ్ అవగలవా? కోల్పోయిన ఆ ప్రేమ, అనురాగం అందించగలవా? మళ్ళీ మన యింట అనురాగం, ఆనందం వెల్లివిరుస్తాయని మాటిస్తే నీకోసం... ఈ బిడ్డని... చంపుకుంటాను. నీ ప్రేమకోసం తల్లిని కావాలనే కాంక్షని బలిపెట్టుకుంటాను... నీ అనురాగం కోసం బిడ్డని చంపిన పాతకిని అవుతాను. చెప్పు మాధవ్... మాటియ్యగలవా మాధవ్..." ఆవేశంగా అంది.
మాధవ్ మొహంలో రంగులు మారాయి. ఆ మారుతున్న రంగులని చూసిన రాధకి మాధవ్... పూర్వపు మాధవ్ అవడం అసంభవమన్పించింది...
"రాధా, నేను చెప్పాను. నేను శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను రాధా... నా వీక్ నెస్ అర్థంచేసుకుని ఇంకొన్నాళ్ళు టైమివ్వు రాధా..."
"హు... నీకోసం బిడ్డని చంపుకోవడానికి తయారైనా, యింకా నా సహ్రీరం మైలపడిందన్న భావం నీలో తొలగిపోవడంలేదు. అంటే... నామీద ఎంత ప్రేమ ఉందో అర్థం అయింది మాధవ్... యింకా నీకోసం ఈ త్యాగం చెయ్యమంటావా" నిరసనగా చూస్తూ అంది.
మాధవ్ మొహం గంటు పెట్టుకున్నాడు. "త్యాగం చేస్తావో ఏం చేస్తావో, ఆ బిడ్డని కనడానికి వీలులేదు" కచ్చితంగా అన్నాడు పౌరుషంగా.
"కంటే... ఏం చేస్తావు...?" రాధ సహనమూ ఆఖరిమెట్టుకి వచ్చింది.
జవాబుకి మాధవ్ తడబడ్డాడు. అంతదాకా వచ్చాక తగ్గిపోవడం యిష్టంలేక తీవ్రంగా చూస్తూ "నేను కావాలో, ఆ బిడ్డ కావాలో తేల్చుకోమంటాను."
"తేల్చుకున్నాక-...?" ఏదో తెగింపు వచ్చింది రాధలో.
"రాధా..." అరిచాడు. "ఏం ఎదిరించి జవాబులు చెప్పేదాకా వచ్చిందా. తేల్చుకున్నాక నేను అక్కరలేదంటే యింట్లోంచి వెళ్ళమంటాను..."
రాధ అతనివంక సూటిగా చూసింది. "సరే మాధవ్, నిండా మునిగాక చలి ఏమిటి?... ఈ యింట్లో యిప్పుడు నీవు నాకిస్తున్న స్థానం వంటమనిషిది మాత్రమే. నీ భార్యగా లోకానికి చలామణి అవుతున్నాను. మన మధ్య యింకా భార్యాభర్తల సంబంధం ఏం మిగిలిందని. నీ ప్రేమ, అనురాగం ఏం మిగిలాయని ఈ ఇల్లు పట్టుకు వేళ్ళాడాలి. నేనెప్పుడూ వంటరిదానిగానే బతికాను, యిప్పుడు మాత్రం వంటరిగా బతకలేనా!" రాధ విరక్తిగా అంది.
మాధవ్ మొహం నల్లబడింది. రాధ యింత తెగించగలదని అతను అనుకోలేదు. భర్తని విడిచి వెళ్ళడానికి సిద్ధపడగలదని అతను అనుకోలేదు. బెదిరిస్తే భయపడి తనకోసం ఆ పాప ఫలాన్ని దూరం చేసుకుంటుందనుకున్నాడు. కాని, రాధ వెళ్ళిపోతానంటుంది. రాధ నిజంగా వెళ్ళిపోతే తన పరువు ఏం కావాలి. అందర్నీ కాదని ఎదిరించి, ప్రేమించి చేసుకున్న పెళ్ళి యిలా అయితే అందరూ తనని ఎంత హేళన చేస్తారు? రాధ మీద అత్యాచారం జరిగాక అందరి సానుభూతి రాధమీద వుంది. అంత జరిగినా భార్యని మామూలుగా ఆదరిస్తున్నాడనుకుని అంతా తననో సంస్కారవంతుడిగా భావిస్తున్నారు. ఇప్పుడు రాధ వెళ్ళిపోతే...తను నలుగురి ముందు దోషి అవుతాడు. భార్యకి మానభంగం జరిగింది కనక యింట్లోంచి వెళ్ళగొట్టాడు అని చెప్పుకుంటూ తన కుసంస్కారాన్ని వేలెత్తి చూపుతారు... ఒక్కక్షణంలో అతని మనసులో మెదిలిన ఆలోచన అది... కలవరపాటు అణిచిపెట్టి... ఆమెముందు తగ్గిపోవడం యిష్టంలేక బింకంగా "సరే, నీకు అంత నిర్లక్ష్యంగా వుంటే అలాగే కాని" అని విసురుగా వెళ్ళిపోయాడు.
13
రాధ తరువాత వారంరోజులు తీవ్రంగా రాత్రింబవళ్ళు ఆలోచించింది. ఈ బిడ్డ ఎవరి బిడ్డ! మాధవ్ ది కాకపోతే ఆ రౌడీ వెధవల బిడ్డని తను కని పెంచగలదా!... ఏం చెయ్యాలి తను, మాధవ్ కోసం... యిదివరకయితే, మాధవ్ యిలా కోరితే అరక్షణం ఆలోచించకుండా అంగీకరించేది. కాని, మాధవ్ తన నిర్లక్ష్యం నిరాదరణతో తనలో ఏదో సున్నిత పొరను బలంగా తాకాడు. తన మనసు కరుడు కట్టింది. ప్రేమంటే యిదేనా? వివాహ బంధానికర్థం యింతేనా? కష్టంలో, సుఖంలో తోడు నీడగా వుంటామని చేసిన ప్రమాణాల విలువ యింతేనా, మనిషి హృదయం యింత చంచలమా, గతం మరిచిపోవడానికి అరక్షణం పట్టదా!... ఆమె మనసుని దొలిచివేసే ఆలోచనలు క్రమంగా ఆమె మనసుని బండబార్చాయి. ఇప్పుడీ బిడ్డని చంపుకున్నా మాధవ్ తనవాడవుతాడన్న నమ్మకం లేదు. మాధవ్ ద్వారా మళ్ళీ తను తల్లినవగలనన్న నమ్మకం వుంటే పోనీ అతని కోరికను అంగీకరించగలదు! మాధవ్ ధోరణి కేవలం లోకం కోసం కల్సి వున్నట్లుంది. అలాంటి అతనికోసం తల్లినవ్వాలనే కాంక్ష బలిపెట్టుకోవాలా?... పరిపరి విధాల ఆలోచించింది. మాధవ్ ని కాదని ఆ బిడ్డని కంటే... ఒకవేళ ఆ బిడ్డ ఆ వెధవల బిడ్డ అయితే... కనీసం రూపురేఖలలో తెల్సిపోతుంది ఎవరి బిడ్డో. అప్పుడు ఆ బిడ్డని తను ప్రేమించి పెంచగలదా? ఎవరికి పుట్టినా, ఎలా పుట్టినా బిడ్డని తల్లి ప్రేమించకుండా వుండలేదంటారు! కన్నకడుపు, పేగుతీపి ఎక్కడికి పోతాయి ఎలా పుట్టినా!... ఎలాంటివాడికి పుట్టినా మంచి పెంపకంలో, పరిసరాలలో వుంటుంది ప్రభావం! పోనీ ఎవడికి పుట్టినా తల్లిగా తను ఆ బిడ్డని తీర్చిదిద్దలేదా! ఇప్పుడీ బిడ్డని చంపుకుంటే యింక ఈ జన్మకి తల్లినయ్యే కాంక్ష వుండదు. కట్టుకున్న భర్తే కన్నెత్తిచూడనప్పుడు, మాధవ్ ని విడిచి వెళ్ళినా యింకెవడు ముందుకు వస్తాడు పెళ్ళాడడానికి! మాధవ్ ఎప్పటికో మారుతాడన్న ఆశతో ఆ అవకాశాన్ని వదులుకోవడం తెలివితక్కువ అవదా!
ఎన్నివిధాల ఆలోచించినా గర్భం పోగొట్టుకోడానికి రాధ మనసు ఎదురుతిరుగుతూంది. ఎంత నమ్మించుకోవాలని చూసినా ఆమె మనసుని నమ్మించుకోలేకపోయింది. దానికితోడు పదిరోజులుగా మాధవ్ అసలు రాధతో మాట్లాడడం మానేశాడు. రాధ అనే మనిషి లేనట్లు తన పనులు తను చేసుకుంటున్నాడు. అసలు యింటపట్టునే వుండడం మానేశాడు. కాలేజీనుంచి సాయంత్రం యింటికైనా రాకుండా ఎటో వెళ్ళిపోయేవాడు. రాత్రి పది, పదకొండు, పన్నెండు అతనిష్టం వచ్చినట్లు రావడం, ఎక్కడో భోంచేసి రావడం, రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం తొమ్మిదింటికి లేచి కాలకృత్యాలు తీర్చుకుని, టేబుల్ మీద రాధ భోజనం వడ్డిస్తే తినేసి వెళ్ళిపోవడం... ఇంటిపట్టున మెలకువగా వున్న ఒక గంట కూడా రాధతో అసలు మాట్లాడేవాడు కాడు. అతని ప్రవర్తన చూసి రాధ మనసు పూర్తిగా విరిగిపోయింది. ఇన్నాళ్ళూ అటూ ఇటూ వూగిసలాడిన ఆమె కృతనిశ్చయం చేసుకుంది. బిడ్డని కనడానికే నిశ్చయించుకుంది. మాధవ్ మళ్ళీ ఆ ప్రసంగం ఎత్తి యింట్లోంచి పొమ్మంటే వెళ్ళడానికి మానసికంగా తయారైంది కూడా.