"ఏమిటి అలా మాట్లాడుతున్నావ్ రాజేష్!"
నిట్టూర్చాడు రాజేష్.
"లావణ్యా! నన్ను పెళ్ళి చేసుకోవాలని ఎప్పుడూ ఆలోచన రాలేదా నీకు? నాకు క్షణ క్షణం అదే ఆలోచనగా ఉండేది. నువ్వు నా దానివే , మనిద్దరికీ పెళ్ళి ఖాయం అన్న ఉహతోనే గడిపేశాను. 'ఇవాళ అడుగుదాం' 'ఇవాళ అడుగుదాం' అనుకుంటూ గడిపేశా లావణ్యా!"
"నీ మీద నాకలాంటి ఉద్దేశ్యం ఎప్పుడూ లేదు రాజేష్."
"ఇప్పుడు? నేను నా ఉద్దేశ్యం బయట పెట్టిన తర్వాత?"
లావణ్య సీరియస్ గా చూసింది.
"నా పెళ్ళి నిశ్చయమైపోయింది."
"ఇంకా ఎవరితో ఫార్మల్ గా చెప్పలేదు- అని నువ్వే అన్నావ్. తెంపేసుకోవడం అంత కష్టం కాదు."
"ఎందుకు తెంపేసుకోవడం? నాకు శ్రీహర్ష అంటే ఇష్టం."
"ఏముంది అతనిలో! బజారులో తల మీద రూపాయి పెడితే పావలాకు అమ్ముడుపోడు."
లావణ్య కోపంగా చూసింది.
"మన తాహతెక్కడ, అతని తాహతెక్కడ? వాళ్ళు వాళ్ళ మధ్య తరగతి నీతులు నియమాలూ, చాలీ చాలని కొంపలు, పనిచేస్తే గానీ గడవని జీవితాలూ- ఇవన్నీ ఎప్పుడన్నా ఆలోచించావా?"
"రాజేష్! ఆ ప్రస్తావన వద్దు. ఇంకేమన్నా మాట్లాడు."
నిదానంగా చెప్పాడు రాజేష్.
"లావణ్యా! నాకు మొదట్నించి ఎంత బద్దకమో , నీ కంత తొందరపాటు ఎక్కువ. తీరిగ్గా ఆలోచించు. వచ్చే నెల అందరికి చెప్పేస్తానన్నావ్. నెల రోజులు టైముంది. ఆ లోపల అతన్ని నన్ను పక్కన పక్కన ఉహించుకుని ఆలోచించుకో. సరైన నిర్ణయం తీసుకో! గుడ్ లక్" అంటూ లేచి నిలబడి , పెద్ద పెద్ద అంగలేస్తూ వెళ్ళిపోబోతూ , ఆగి, వెనక్కి తిరిగి,
"ఐ లవ్ యూ!" అన్నాడు.
* * *
రెండ్రోజుల తర్వాత-
సుధతో కూడా సికింద్రాబాద్ స్టేషన్ లో నిలబడి ఉంది లావణ్య.
"ఎన్ని గంటలకు వస్తుంది ఎక్స్ ప్రెస్" అంది.
"ఇప్పుడొచ్చేయ్యాలి. ఆ! ఎక్స్ ప్రెస్ అంటే గుర్తొచ్చింది. మంచి ఎస్ ప్రెస్సో కాఫీ దొరుకుతుంది. తాగుదామా?" అంది సుధ.
"కాఫీ కూడా వద్దనేంత వైరాగ్యానికి ఇంక రాలేదులే ఈరోజు దాకా. పద తాగుదాం. " అంది లావణ్య.
కాఫీ తాగి , పక్కనే ఉన్న బుక్ స్టాల్ లో పుస్తాకాలు పరికిస్తుండగా-
వచ్చింది ట్రైయిన్.
ప్లాట్ ఫారం మీదకి ట్రైయిన్ రాగానే అది చేస్తున్న శబ్దం లాగా దడదడమంటోంది లావణ్య గుండె.
పిల్లలు.
ఎలా ఉంటారో!
ఎంత అల్లరివాళ్ళో! ఎంత గడుగ్గాయలో?
ఎలాంటి అలవాట్లో వాళ్ళవి?
రైలు ఆగింది.
లావణ్యా, సుధ దిగేవాళ్ళందరినీ ఆదుర్దాగా చూస్తున్నారు.
అంతలో-
ఒక కంపర్టుమెంటులోంచి దిగుతూ కనబడ్డాడు శ్రీహర్ష. అతని చేతిలో బెడ్డింగు.
అతని వెనకే పదేళ్ళ కుర్రాడు. చురుగ్గా కనబడుతున్న కళ్ళు, కాస్త బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. నిక్కరేసుకుని ఉన్నాడు. చేతిలో రెండు బుట్టలు.
ఆ వెనుక....కాస్త కళ్ళు పెద్దవి చేసి చూసింది లావణ్య.....పొడుగాటి అమ్మాయి. సన్నగా, నాజుగ్గా, మెరుపు తీగలా ఉంది. పెద్ద పెద్ద కళ్ళు, చెక్కిన శిల్పంలాంటి ఒళ్ళు, చమన చాయగా ఉంది. నున్నటి బుగ్గలు, చక్కటి ఒంపు తిరిగిన పెదాలూ, నీలం రంగు పట్టు పరికిణి కట్టుకుంది. పైన ఎర్రటి నైలాన్ ఒణి.
షాక్ తగిలినట్లయింది లావణ్యకి. వీళ్ళా "పిల్లలు?" ఈ అమ్మాయా తమతో కలిసి ఉండబోయేది. మనసు చేదుగా అయిపొయింది.
తీక్షణంగా శ్రీహర్ష వైపు చూసింది.
శ్రీహర్ష నవ్వాడు.
"లావణ్యా వీళ్ళే ముకుందరావుగారి పిల్లలు. స్నేహమాయీ, రాజు. ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం చూశాను. అసలు గుర్తుపట్టలేకపోయాననుకో. వీళ్ళు నన్ను గుర్తుపట్టలేదు. స్నేహా! ఈమె లావణ్య, ఈమె సుధారాణి."
స్నేహ చేతులు జోడించి నమస్కరించింది. లావణ్య ఊరికే తల పంకించి నవ్వింది.
"సరిగ్గా నా బెల్టు దగ్గరికి వచ్చేది ఇదివరకు. ఎంత పొడుగు పెరిగిపోయిందో చూడు. నా చెవుల దాకా వస్తోంది ఇప్పుడు."
సిగ్గుగా నవ్వింది స్నేహ. తను నవ్వితే ఆ నవ్వు పెదిమల మీద కంటే కళ్ళలో ఎక్కువ కనబడుతుంది.