Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 24

 

    ఎగసిపడుతున్న కార్పణ్యంతో, మళ్ళీ వచ్చి తంతులో కూర్చుని అంత్యక్రియలు కొనసాగించాడు.
    
    సుందరమ్మ గోలగోలగా ఏడుస్తోంది. ఇంత గొడవ జరుగుతున్నందుకు ఏడుస్తోందో, లేకపోతే ప్రతిమలాంటి బెస్టు పనిమనిషి చెయ్యిజారిపోయినందుకు ఏడుస్తోందో తెలియదుగానీ - ఆమె శోకాలవల్ల ఆ ఇంటికి అచ్చమైన చావుకళ వచ్చేసింది.
    
    శంకర్ బయట నిలబడి ధవళ కష్టాలు కాల్చేస్తున్నాడు.
    
    పొగలతో, పగల సెగలతో, మసిబారిపోయి వున్నాయి వాళ్ళ మనసులు.
    
    ఆడపిల్లలు చిన్నప్పుడు బొమ్మలకి పెళ్ళిళ్ళు చేసి ఆడుకుంటారు.
    
    వయసొచ్చాక వాళ్ళనే బొమ్మలుగా చేసి, వాళ్ళకీ ఓ మనసుంటుందని మర్చిపోయి, వాళ్ళ ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా, కట్నాలు, కానుకలూ, హోదాలూ మాత్రం సరిచూసుకుని పెళ్ళిళ్ళు చేసేస్తారు పెద్దలు! అదీ ఒక రకమైన బొమ్మల పెళ్ళిలాంటిదే!
    
    కేశవరావు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళిపోయి బొమ్మల చావు జరిపిస్తున్నాడు!
    
    ఇక్కడ ఈ బొమ్మల చావులో ఇరుక్కున్నది ఆయన కూతురు. కానీ ఎక్కడ, ఏ రకం చావుల్లో అయినా ఇరుక్కుంటున్నది ఆడ కూతుళ్ళే!
    
                                                             * * * * *
    
    ఆ రోజు శాలరీ డే.
    
    అనిల్ పాండే సౌందర్యని పిలిచి అయిదు వందల రూపాయల నోట్లు అందించాడు.
    
    లెక్కపెట్టుకుని చూసుకుంది సౌందర్య. తర్వాత అనిల్ వైపు ప్రశ్నార్ధకంగా చూసింది.
    
    "ఏమిటి?" అన్నాడు అనిల్.
    
    "ఈ నెలనుంచీ నాకు నాలుగొందలే రావాలి. మా అమ్మ పోయినప్పుడు తీసుకున్న మూడువేల రూపాయల అడ్వాన్సూ ఈ నెలనుంచీ వంద రూపాయల చొప్పున తీరుస్తానని చెప్పానుకదా!"
    
    "బాస్ మీకు ఐదొందలూ ఇచ్చెయ్యమన్నారు" అన్నాడు అనిల్ క్లుప్తంగా.
    
    శ్రీరాం గదిలోకి వెళ్ళింది సౌందర్య. శ్రీరాం శేషగిరిరావుకేదో లెటరు డిక్టేట్ చేస్తున్నాడు. అది చూసి కొంచెం నొచ్చుకుంది. తన పనిమీద శ్రీరాంకి అట్టే నమ్మకం లేదని చాలా రోజుల క్రితమే గ్రహించింది తను.
    
    కేవలం తనమీద సానుభూతితో ఉద్యోగంలోనుంచీ తీసెయ్యకుండా భరిస్తున్నాడని అర్ధమయింది సౌందర్యకి.
    
    అనిల్, శేషగిరిరావూ వీళ్లిద్దరూ కలిసి ఆఫీసు కరెస్పాండెన్స్ అంతా చూసుకుంటూ ఉంటారు. నిజానికి తనకీ ఆఫీసులో పనేమీ లేదు. వూరికే అలంకారప్రాయంగా కూర్చోవడం తప్ప!
    
    బయట షోరూంలో అందమైన అమ్మాయిల కట్ అవుట్ బొమ్మలు ఉన్నాయి. లోపల తను కూడా అందమైన బొమ్మలా కూర్చుని ఉంటోంది.
    
    షోకేసులో బొమ్మలకీ, తనకీ తేడా ఏమీలేదు. కస్టమర్సుని ఆకర్షించడానికే తనని ఇక్కడ షోపీస్ గా పెట్టారు.
    
    మనసులోనే నవ్వుకుంది సౌందర్య.
    
    శ్రీరాం డిక్టేషన్ చెప్పడం ముగించి, తలెత్తి చూశాడు. శేషగిరిరావు బయటికి వెళ్ళిపోయాడు.
    
    "బాస్! ఈ నెలనుంచీ వందరూపాయల చొప్పున నేను తీసుకున్న అడ్వాన్సు తీర్చెయ్యాలనుకున్నాను. కానీ, మీరు అయిదొందలూ ఇచ్చెయ్యమని చెప్పారుట!"
    
    "అవును!"
    
    "ఎందుకు?" అంది సౌందర్య సందేహంగా.
    
    "ఆడపిల్లలకి ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకునేంత అసమర్దున్ని అనుకున్నావా నేను?"
    
    "అది కాదు! మీరు నాకు అడ్వాన్సుగా ఇచ్చిన మూడువేలూ, అమ్మ పోయినప్పుడు ఖర్చయిన డబ్బూ అంతా తీర్చెయ్యడం నా బాధ్యత కాదా? అఫ్ కోర్స్! డబ్బు తీర్చేసినంత మాత్రాన ఋణం తీర్చినట్లు కాదని నాకు తెలుసు! అయినా..."
    
    "అడ్వాన్సా? అడ్వాన్సుగా ఎవరిచ్చారు? అది అడ్వాన్సు కాదు! నేను నీకు హెల్ప్ చేయదలుచుకున్నాను. చేశాను. దటీజ్ దట్!"
    
    "అయినా తీర్చడం నా మోరల్..."
    
    ఇంటి దగ్గర తను పనిలో ఉన్నప్పుడు తన పెంపుడు కుక్కపిల్ల కాళ్ళ చుట్టూ తిరుగుతూ విసిగిస్తుంటే మురిపెంగా ఎలా విసుక్కుంటాడో అలా విసుక్కున్నాడు శ్రీరాం.
    
    "సంధూ! అర్ధం చేసుకోవేం? నా దగ్గర పనిచేసే వాళ్ళ బాగోగులు పట్టించుకోవడం నా మోరల్ రెస్పాన్సిబిలిటీ! అంతేగానీ, నువ్వేదో వడ్డీతో సహా తీర్చేస్తావని ఆ డబ్బు ఇవ్వలేదు నేను! నో! నన్నిక విసిగించకు! బీ ఎ గుడ్ గర్ల్! వెళ్ళి ఆ వందరూపాయలతో మంచి చెప్పులు కొనుక్కో! లేదా సేవింగ్స్ బాంక్ లో వేసుకో! లేదా..."
    
    "కానీ, బాస్, మీరు అంత డబ్బు..."
    
    "గెట్ లాస్ట్!" అన్నాడు శ్రీరాం - ఆమెను చనువుగా, ఆప్యాయంగా వెళ్ళగొట్టేస్తూ.
    
    ఆ వంద రూపాయల నోటు అలానే పట్టుకుని శ్రీరాం కళ్ళలోకి చూస్తూ ఉండిపోయిన సౌందర్యని గమనిస్తే ప్రేమాంకురం చిగురించడం అంటే ఏమిటో స్లోమోషన్ ఫిలిమ్ లో చూసినంత స్పష్టంగా అర్ధమైపోతుంది ఎవరికైనా!
    
    ఆ అమ్మాయి అప్పుడే హైస్కూలు నుంచీ బయటికి వచ్చింది. తను సన్నిహితంగా మాట్లాడిన మొదటి మొగాడు శ్రీరామే! తను కష్టంలో ఉన్నప్పుడు తటపటాయించకుండా ఆదుకున్నవాడు ఇతనే!
    
    ఆదుకున్నాడు కదా అన్న గర్వంతో, తనతో ఆడుకోవాలని చూడని మొగాడు కూడా ఇతనే!
    
    సంధూ అని పిలిచాడా తనని! అమ్మ కూడా తనని అలాగే పిలుస్తుంది.
    
    అతనంటే హీరో వర్షిప్ కలగడం మొదలెట్టింది సౌందర్యకి.
    
    సౌందర్య మనసులో మెదులుతున్న భావాలు శ్రీరాంకి తెలియవు. అతను ప్రతిమని గురించి కలలు కంటూ, ఇంక ఆఫీసులో కూర్చోవడానికి బుద్దిపుట్టాక ఇంటికి వెళ్ళిపోవడానికి లేచాడు.
    
    'ఇంట్లో ప్రతిమ ఉంటుంది' అని తలుచుకాగానే ఆహ్లాదం కలిగింది.
    
    ఇదివరకు తల్లి ఎంత బతిమాలినా అర్ధరాత్రికి ముందు ఎప్పుడూ ఇల్లు చేరని శ్రీరాంకి - ఇప్పుడు ఇల్లు అయస్కాంతంలా కనబడుతోంది. రోజుకి మూడుసార్లు వెళ్ళివస్తున్నాడు ఇంటికి.
    
                                                               * * * * *

 Previous Page Next Page