Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 24

 

    పదివేల ముఫ్ఫైకోట్ల జన్మల్లో తన పెళ్ళామయిన సీతారామలక్ష్మి మరి యీ జన్మలో మాత్రం తన పెళ్ళాం కాకుండా ఎలా పోతుందీ? అబ్సర్డు గదా!
    
    అందుకే అతనికా ధీమా.
    
    అతను అలా ఆలోచించుకుంటూ లోపలికి రాబోతుంటే గుమ్మం అంతా మూసుకుపోయినట్లయి పోయింది.
    
    అంత పొడుగూ, వెడల్పు వున్నాడతను. గుమ్మంలో బొటాబొటీగా ఇరుక్కుపోయాడు.
    
    "సీతా" అనుకున్నాడు వీరభద్రం సితారని చూడగానే తమకంగా.
    
    "నువ్వా" అనుకుంది సితార విసుగ్గా.
    
    సరిగ్గా యిప్పుడే దిగబడ్డాడేం యితనూ? వేళాపాళాలేకుండా.
    
    ఆమెని అలా గుమ్మం దగ్గరే ఆపేశాక. తక్షణం ఏదయినా సరస సంభాషణ చెయ్యాలని ప్రగాఢ వాంఛ కలిగింది వీరభద్రానికి.
    
    అందుకుని అర్జెంటుగా ఆలోచించి అన్నాడు.
    
    "సీతారామలక్ష్మీ! ఇవాళేం జరిగిందో తెల్సా?"
    
    "ఏమిటి?"అంది సితార. ఆ అమ్మాయికి సీతారామలక్ష్మి అన్న ఆ పొడుగాటి పేరు పరమ అనాగరికంగా కనబడింది. తన పేరు సితారయితే ఇతనిలా పిలుస్తాడేం అనుకుంది కూడా.
    
    "మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మనిషని పంది కరిచింది యివాళ" అన్నాడతను ఉత్సాహంగా.
    
    "మరి ఆ పందిని అరెస్టు చేశావా?" అంది నిర్లిప్తంగా.
    
    "అబ్బే! కాదు ఆ మనిషినే అరెస్టు చేశా"
    
    "ఎందుకూ?"
    
    "ఆయన చర్మం చాలా దళసరి. పాపం! పందికి ముందు పళ్ళు మూడు విరిగిపోయాయి."
    
    "వెరీగుడ్!" అంది సితార.
    
    "మొన్నరోడ్డు రోలరు కిందపడి అప్పచ్చిలా అయిపోయిందే కుక్క దాన్ని గురించి చెప్పానుగదా, ఆ కుక్కని తర్వాత అట్లకాడతో ఒలిచి తీశాం. మొత్తానికి దాని ఐడెంటిటీ తెలిసింది."
    
    "హోంమినిస్టరుగారి కుక్కా ఏమిటి?"
    
    "బ్బె బ్బె బ్బే! అదసలు కుక్కే కాదు. దారితప్పిన నక్కట. అడవిలో వాళ్ళ వాళ్ళకి కబురుపెట్టాం."
    
    ఓపిగ్గా నిట్టూర్చింది సితార.
    
    అప్పుడామెకి యింకోటి అనిపించింది కూడా.
    
    "పాపం! ఈ పోలీసు వీరభద్రాన్ని పెళ్ళి చేసుకునే అభాగ్యురాలు ఎవరో!"
    
    ఆ భాగ్యం తనకే కలిగించాలని వీరభద్రం ఊహిస్తున్నట్లు ఆమెకి సుతరామూ తెలీదుగాక తెలీదు.
    
    "అడ్డం లేస్తావా? నేనోసారి బయటికెళ్ళొస్తా" అంది సితార.    

    "వెళ్తావా?" అన్నాడు వీరభద్రం బాధగా.
    
    "అవును"
    
    "కాఫీ పెట్టిచ్చి వెళ్ళరాదూ?"
    
    అతను కాఫీ పెట్టమని అడిగినప్పుడల్లా కుడితి పెట్టమని వెనకబడే గేదెలాగా కనబడతాడు సితారకి.
    
    ఇంక తప్పదని మనసులోనే నిట్టూర్చి వెనక్కి తిరిగింది సితార.
    
    కాఫీ పెట్టే ప్రయత్నంలో పడిపోయింది.
    
    వినాయకుడు ఎలుక మీద కూర్చున్నట్లు తనమహాకాయాన్ని చిన్న మోడా మీదకుదేశాడు వీరభద్రం.
    
    తలవంచుకుని పరధ్యానంగా కాఫీ పెడుతోంది సితార. ఆమెకి కాఫీ గిన్నెలో, అగ్గిపెట్టెలో, నేలమీదా, సింకులో అన్నిట్లోనూ జెయ్ చంద్రే కనిపిస్తున్నాడు.
    
    మోడా మీద కూర్చుని వున్న వీరభద్రానికి కులాసాగా కాస్త కూనిరాగం తియ్యాలనిపించింది.
    
    ఆడపిల్లలు పాటలకి వశమైపోతారని ఎవరో చెప్పగా విన్నాడు అతను.
    
    అతనికి పాటలు రావు. అయితే బుర్ర వేడెక్కేలా ఆలోచించగా, ఆలోచించగా అతనికో పాట తట్టింది.
    
    వెంటనే రెగ్యులేషన్ బూట్లతో నేలమీద గట్టిగా దరువేస్తూ ఓ పాట అంకించుకున్నాడు.
    
    "కాకి ఒకటి నీటికై....
    
    కావు కావు మనుచునూ....
    
    ఊరంతా తిరిగెనూ....
    
    విసిగి వేసారిపోయెనూ...."
    
    ఆ పాట అతనికి ఐదో క్లాసులో వచ్చింది. అది నేర్చుకుని అప్పచెప్పలేదని తెలుగు మాస్టారు మార్కండేయులుగారు వీరభద్రాన్ని చింతబరికెతో తోలూడేటట్లు కొట్టాడు అప్పట్లో.
    
    ఉత్తపుణ్యానికే కూర్చున్నా, నిలబడ్డా కొడుతూ వుండేవాడు. మొన్నెప్పుడో కూడా వీరభద్రం రోడ్డుమీద కనబడితే అలవాటుగా చింతబరిక కోసం చూడబోయి, అంతలోనే వీరభద్రం చేతిలోని పోలీసు లాఠీనీ, అతని నడుంకి వేళ్ళాడుతున్న సర్వీస్ రివాల్వర్ ని చూసి తమాయించుకుని తగ్గిపోయాడు.
    
    మేష్టారి మీద కసి అంతా యిప్పుడు తన బారినపడ్డ వాళ్ళ మీద చూపిస్తుంటాడు వీరభద్రం.
    
    మార్కండేయులు నిరంతరంగా అతన్ని అలా కొట్టిన ఫలితంగా పాఠాలు ఏమాత్రం అతనికి వంటబట్టలేదుగానీ కాకి ఒకటి నీటికై మాత్రం అతనికి అక్కడక్కడ (అచ్చుతప్పులతోనే) వచ్చింది.
    
    "విసిగి వేసారిపోయెనూ...." తర్వాత అతనికి మిగతాపాట గుర్తురాలేదు. అందుకని బూట్ల చప్పుడు రెట్టింపుచేసి మళ్ళీ మొదటికొచ్చేశాడు.
    
    "కాకి ఒకటి నీటికై...." అని లంకించుకున్నాడు సితార వైపు ఆరాధనగా చూస్తూ.
    
    "పాపం! ఇతనిక్కాబోయే పెళ్ళాం ఎవత్తో" అనుకుంది సితార జాలిగా.
    
    "నాక్కోబోయే పెళ్ళానివి నువే...నువే" అనుకున్నాడు వీరభద్రం ఆ రోజు తెల్లారేక అప్పటికి అరవైఆరోసారి.
    
    కాఫీ యిచ్చింది సితార.
    
    అది గటగటా తాగేశాడు వీరభద్రం.
    
    గేదె కుడితి తాగుతున్నట్లు అనిపించింది సితారకి.

 Previous Page Next Page