Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 24

 

    "ఏమిటి నాన్నా, ఈ ఆవేశం?" అంది సీత.

 

    "ఆవేశం కాదమ్మా, ఆవేదన, అసహాయత, ఆక్రందన. నీకు తెలిదమ్మా! పెద్దదానివి నీకు పెళ్ళికాకుండా అటు వాడికి ఇటు దీనికి పెళ్ళయి హాయిగా కాపురాలు చేసుకుంటు పిల్లల్ని కూడా కనేస్తే ఏం పాపం చేయకుండానే నీ బ్రతుక్కి శాపంలా చుట్టుకుంటుందమ్మా! వచ్చే పెళ్ళివారు ఊరుకొరు. లోకం నోరు మూసుకొదు. "పెద్దపిల్ల కేదో లోపం ఉంది అందుకే ఆ అమ్మాయి పెళ్ళి కాకుండా ఇద్దరికీ పెళ్ళయి పోయింది. ఈ అమ్మాయినే చేసుకోవాలనేముంది? లోకం గొడ్డు పోయిందా? ఆడపిల్లలకు కరువా?" అంటారు. ఈ జన్మలో నీపెళ్ళి కాదు. ఏ వంక లేకుండానే నీ పెళ్ళి ఇప్పటికే ఆలశ్యం అయింది. కట్న పిశాచం అదొక్కటే ఇంతవరకు అడ్డు. ఇప్పుడు ......ఇప్పుడు....."

 

    ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని రూప ముందే చెప్పిందేమే, రవి మౌనంగా వుండిపోయాడు. రామచంద్రం కోపం చల్లారాక మాట్లాడవచ్చుననుకున్నాడు.

 

    "నా మాట కాస్త వింటారా నాన్నా!" తండ్రి కోపం చల్లార్చటానికి గట్టిగా అంది సీత.

 

    "వింటాను దీన్ని మెడపెట్టి బైటికి గెంటిం తరువాత"

 

    సీత చేతులు అడ్డుగా చాచి రామచంద్రం ఎదుటికి వచ్చి నిలిచింది. "రూపకి నేనే చెప్పను. పెళ్ళి చేసుకోమని" నిదానంగా అంది. నిర్ఘాంతపోయాడు రామచంద్రం.

 

    నాన్నా! మీరు శాంతంగా నా మాట వినండి నా గురించి నా భవిష్యత్తు గురించి మీరు ముందు జాగ్రత్త పడుతున్నారు. నా మంచి కోసమే కదా మీరు చూసేది. అలానే రూప భవిష్యత్తు సుఖమయం కావాలని నే కోరుకున్నాను. రూప రవి ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరిని ఓ సమయంలోనే చూశాను. ఈ కాలంలో చాలా మంది గుడ్డిగా ప్రేమించి మోసపోయి జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. కొందరు తమ తొందరపాటుకు ప్రాణాన్ని ఫణంగా పెడుతున్నారు. ప్రేమించిన రూప మోసపోతే దాని జీవితం ఏమవుతుంది? అతను నిన్ను నిజంగా ప్రేమిస్తే పెళ్ళి చేసుకోమను. పెళ్లనంగానే పారిపోతే అతన్ని ప్రేమించటం మానేయి అని చెప్పను. రూప అతన్ని అడిగి వుంటుంది. అంతేగాక పెళ్ళి చేసుకు వచ్చింది. దీనికి కారణం ఏదో వుంటుంది." అని సీత రూప కేసి చూసింది.

 

    
    "క్షమించండి నాన్నా! కాస్త నా మాట వినండి. రవీ నేను ప్రేమించుకున్నాం గాని పెళ్ళి మాటలు అనుకోలేదు. ఓనాడు అక్క మమ్మల్ని చూసింది. ఎన్నో మంచి విషయాలు భోధించింది. రవి దగ్గర పెళ్ళి విషయం ఎత్తాను. రవి ముఖం చాటు వెయ్యలేదు కాని తనకు మేనత్త కూతురుంది. ఆ పిల్లనే పెళ్ళాడమని పెద్దల బలవంతం. మా ప్రేమ భైటపడితే పెద్డంతస్తులో వున్న వాళ్ళ వాళ్ళు అడ్డుపడవచ్చు. రవి మనసు పరిస్థితులకి మారవచ్చు. అక్క పెళ్ళికోసం ఆగితే నా జీవితమే మారిపోవచ్చు. అందుకే రవి కన్నా ముందు నేనే ఓ అడుగు వేశాను. రవి నా మాట విన్నాడు అంతే. రవి చాలా మంచివాడు నాన్నా అక్క వివాహం విషయం మీకు భారం లేకుండా నేనూ రవీ చూసుకుంటాము," నెమ్మదిగా ఒక్కోమాట ఆగి ఆగి చెప్పింది రూప.

 

    రామచంద్రం పెదవి కదిపెలోగా రవి అందుకున్నాడు.

 

    "మావగారూ! మేము తొందర పడిన మాట వాస్తవమే. మీరు మమ్మల్ని అర్ధం చేసుకుని మనస్పూర్తిగా అశిర్వదించండి. రూప ముందుచూపుతో ప్రవర్తించింది. మంచిదే కదా?"

 

    "ఎందుకు మంచిది కాదూ మంచిదే, మీకు ముందు చూపుంది. మీ మంచి మీరు చూసుకున్నారు. కాని మనమంచి ఇతర్లకి చెడుపని ఆలోచించారా? రూపకి మంచిదయింది సీతకి చెరువవుతుంది. దాని భవిష్యత్తెం కావాలి! అదేమయిపోవాలి"

 

    "మీరు బాధ పడకండి. పెద్దలు మామాట వినరేమో అని తొందర పడ్డాము. సీత విషయం మేం చూసుకుంటాము" అన్నాడు రవి.

 

    "మీరు దిగులు పడకండి నాన్నా" అంది రూప.

 

    "నాన్నా! ఎదేప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది. వేదాంతం కాదిది. కొన్ని అలా తోసుకు వస్తాయి. రూప తొందరపడవచ్చు. పెద్దవారు మీ దీవెన వాళ్ళకితప్పక కావాలి. బాబాని ఆవేశంతో తొందరపడి దూరం చేసుకున్నారు. రూపని అలా దూరం తరిమేయటం మంచిది కాదు నాన్నా ఆడపిల్ల దాని కన్నీళ్ళు మనందరికీ మంచిదా నాన్నా. రూప సంతోషం మన సంతోషం కాదా! రూప సుఖమే మన సుఖం కాదా!"

 

    "రూప సుఖ సంతోషాల గురించి నే విచారించటం లేదు సీతా! నీ గురించి నీ భవిష్యత్తుగురించి....."

 

    "నా గురించి నేనేం దిగులు పడటం లేదు నాన్నా! వాళ్ళని ఆశిర్వదించండి అదే నాకు సంతోషం. అదే నాకు మంచి" స్థిరంగా అంది సీత.

 

    "నీ వెలా చెపితే అలానే తల్లి! మొదటి నుంచీ నన్ను నీ వురడిస్తున్నావు గాని నేను నిన్ను సముదాయించటం లేదు. కానియ్యి ఎలా జరగాలనుందో అలానే జరుగుతుంది. "నిర్లిప్తంగా అన్నాడు రామచంద్రం.

 

    తను ధైర్యంగా నచ్చచెప్పటం వల్లనే తండ్రి తగ్గాడని సీత గ్రహించింది. ఎగసిపడే ఆవేశం తన మాటలతో గప్పున చల్లారగానే నిరాశ నీరసం తండ్రిలో కలిగివుంటాయి. ఎలా అయితే నేమి రూప కన్నీళ్లు పెట్టుకోకుండా వుంటే చాలు. ఇంటి ఆడపడుచు కొత్త పెళ్ళికూతురు.....

 Previous Page Next Page