ఇప్పటి లెక్కన చూసుకుంటే ఇంకో ఏడాదికల్లా ఓ స్కూటర్ సులువుగా కొనుక్కోగలదు. అసలు ఇప్పుడే ఆర్డర్ ఇస్తే ఆ వేళకి వస్తుంది.
అరుణ ఆరునెలల్లో డబ్బులెక్కలు చూసుకుంటే నెలకి ఎవరేజిని ఆరేడు వందలు వచ్చింది. ఓ నెల కాస్త ఎక్కువయినా, మరో నెల కాస్త తక్కువయినారమారమిన ఆరేడు వందలుతేలింది. అంటే కొందరిచ్చే బియ్యం, పప్పులు, కూరలు వగైరా కాక డబ్బు రూపంలో వచ్చిన లెక్క అది. అక్కడికీ ఎవరినీ నోరు తెరిచి డబ్బీయమని అరుణ అడిగేది కాదు. పల్లెటూళ్ళలో మనుషులని చూసి డబ్బుగలవారో లేదోతేల్చుకోవడం కష్టం బాగా డబ్బున్న కమ్మవారు, రెడ్లు రాజులు ఆ పల్లెలలో ఎందరో ఉంటారు. వాళ్ళు ఉండే ఇల్లు చూసి వాళ్ళుచేసే పనులు చూసి బీదవారని అనుకోవడానికి లేదు. తులాలకొద్దిబంగారం, డబ్బు పేడచేసి పెరుగు అమ్ముకునేవారి దగ్గర ఉండడం స్వయంగా చూసి తెలుసుకుంది అరుణ.
ఆ ఊరువచ్చాక అరుణకి ఒకవస్తువూ డబ్బుకి కొన్న గుర్తులేదు. మా పొలంలో సన్నబియ్యం అని ఓ అరబస్తా ఒకళ్ళుపడేసే వారు కందిపప్పు ఈకుంచెడు ఉంచండి అని మరొకరు. ఇంట్లోకాచినకమ్మని నెయ్యి అని ఓ కే.జీ ఇచ్చిపోయేవారు మరొకరు. మాతోటలో అరటిగెల, మా పొలంలో ఆవాలు మా గానుగలో ఆడిన నూనె, మాచెట్టుకి కాసిన కొబ్బరి కాయలు అని ఇలా రకరకాలుగా కొనక్కరలేకుండా వద్దన్నా వచ్చిపడేవి అరుణకి. ఎటొచ్చీ కాఫీపొడి, పంచదారమాత్రం కొనుక్కోవలసివచ్చేది.
పాలు అయితే సుబ్బారావు ఎంత చెప్పినా వినకుండా ఇంటినించి పంపేవాడు. ఓ శేరు పాలు పితికినవి పితికినట్లు అరుణకి వచ్చేవి అతనింటినించి.
"మీరిలా నన్ను మొహమాటంలో పెట్టడమే ఏమన్నాబాగుందా? ఓ రోజా, రెండురోజులా.....ఎన్నాళ్ళు పంపుతారు? మీరు పంపడానికి కష్టంలేకపోయినా, నాకు పుచ్చుకోవడానికి మొహమాటంగా ఉంది. మీరిలా దయచేసి నన్ను ఇబ్బందిపెట్టకండి" అరుణ నాలుగైదుసార్లు మొహమాటంగా వారించింది.
"అదేమిటండీ అలా అంటారు ఇంట్లో రెండు మూడు గేదెలుపాలిస్తున్నాయి. మా కెక్కువ అయినవి ఇస్తున్నానుగాని, డబ్బిచ్చి కొని ఇస్తున్నానా? ఎంతమందికో మా అమ్మ రోజూ మజ్జిగలు పోస్తూనే ఉంటుంది. అలాంటిది మీకు ఓ శేరుపంపించడానికి మాకు కష్టం ఏమిటండీ?"
"పోనీపాలు మీ కెక్కువయితే డబ్బు కీయండి. అంతేగాని ఎన్నాళ్ళిలా ఊరికే తీసుకోమంటారు?' అనలేక అంది అరుణ. సుబ్బారావు నొచ్చుకున్నాడు."అమ్ముకోవాలంటే మీకే అమ్ముకోవాలా? అలాఎప్పుడూ అనకండి" అన్నాడు. అరుణ ఇంకేమనలేక నిస్సహాయంగా చూసింది. అది చూసి సుబ్బారావు నవ్వాడు. "అంత మొహమాటమేమిటండి మీకు? పోనీ మేం ఇచ్చే ఫీజు క్రింద జమకట్టుకోండి మీ రూరికే వైద్యం చేస్తారు మేం ఊరికే పాలుపోస్తాం. రెంటికీచెల్లు సరేనా?" అనేశాడు.
"బాగుంది మీ దగ్గిర కూడా ఫీజు తీసుకోమంటారా ఏమిటి?" అంది అరుణ.
"ఆ అరుణ మా దగ్గిర ఫీజు తీసుకోరు గాని, మీ దగ్గిర పాలకి డబ్బు తీసుకోవాలా భలేవారండీ"
అరుణ అతనితో వాదించలేక ఊరుకుంది పాలే కాదు ఏ పిండి వంట చేసినా రుక్కు తీసుకొచ్చేది. ఏ పండుగ వచ్చినా భోజనం అక్కడే. సరే ఏ కాలంలో పళ్ళు ఫలాలు అన్నీ తోటలోనివి అని పంపించేవాడు సుబ్బారావు.
సుబ్బారావు, అతని కుటుంబం తనపట్ల చూపించే ఆదరాభిమానాలకి అరుణ మనసు కృతజ్ఞతతో నిండిపోయేది.
"నిజంగా సుబ్బారావు గారూ, మీరే ఈ ఊళ్ళో లేకపోతే ఈ ఊళ్ళో నేను ఉండగలిగేదాన్ని కాను. అన్ని విధాల మాఇంట్లో వాళ్ళ కంటే కూడా నా మీద శ్రద్దతీసుకుంటున్నారు ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. మీ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు" ఎన్నోసార్లు అంది అరుణ సుబ్బారావుతో.
సుబ్బారావు నవ్వేసి ఊరుకునేవాడు లేదా "దానిదేముంది లెండి" అనేవాడు తేలిగ్గా.
నవ్వడంకాదు సుబ్బారావు గారూ మీరునాకు చేస్తున్నదానికి ప్రతిగా నేనుమీకేం చెయ్యగలనా అని ఆలోచిస్తూంటాను ఎప్పుడూ..."
"మాచెల్లెలికి ఫ్రీగా చదువు చెపుతున్నారు. మాకు జబ్బులొస్తే మందులిస్తున్నారు. అంతకంటే ఇంకేం చేస్తారు? మీ చేతుల్లో ఉన్నది మీరు చేస్తున్నారు. మాచేతుల్లో ఉన్నది మేం చేస్తున్నాం. దానికోసం మీరు ఇలా మనిషిని నిలబెట్టి పొగిడేయడం ఏం బాగులేదండి. దయచేసి ఇలాంటిఆలోచనలు పెట్టుకోకండి. మీ కిదివరకే చెప్పాను. మీరు చేస్తున్న పనిముందు మాకేకాక, ఈ ఊరి వాళ్ళందరికి మీరు చేస్తున్న సత్కార్యంముందు మేం చేసేది ఏపాటి చెప్పండి? ఎన్నాళ్ళయినా మీరు ఇలా మొహమాటపడడం, ఈ పొగడడం అదిమానరా? దయచేసి ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి, అరుణాదేవిగారూ:"సుబ్బారావు సున్నితంగా నచ్చచెప్పాడు.
* * *
ఆ ఊళ్ళో అరుణకి 'మంచి డాక్టరమ్మ' చల్లని తల్లి మా లచ్మి డబ్బే అడగదు మా అదృష్టం ఇలాంటి డాక్టరమ్మ దొరికింది వగైరా బిరుదులు మెచ్చుకోళ్ళు ప్రతి నోట వినడానికి ఆర్నెల్లకంటే ఎక్కువకాలం పట్టలేదు.
తన ఆశయం సఫలమైనందుకు తను చేపట్టిన కార్యం నిర్విఘ్నంగా కొనసాగిపోతున్నందుకు పొంగిపోయేది అరుణ.
వారానికోసారి ఇంటికి రాస్తే ఉత్తరంలో ఎప్పటి సంగతులు అప్పుడు విశదంగా రాసేది అరుణ. ఆ ఊళ్ళో ఇంకా నిలదొక్కుకున్నానని, మంచి పేరే వస్తూంది అని కూతురు రాసిన ఉత్తరం చూసి రామారావుగారు చాలా సంతోషించారు. ఈమధ్యలో ఒకసారి కృష్ణమూర్తి వచ్చి చెల్లెల్ని చూశాడు. ఏవిషయంలోనూ అరుణ గురించి భయపడ్డానికి ఏం లేదని తృప్తిపడ్డాడు. చెల్లెలి ప్రాక్టీసు, చెల్లెలు చేస్తున్న పని గురించి నలుగురు చెప్పుకునే మంచి మాటలు అన్నీ విని, తృప్తి పడ్డాడు. చెల్లెలిని అభినందించడానికి సందేహించలేదు.
"అరుణా నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందే ఇంకా నాన్నగారి ఒడిలో కూర్చుని కథలు వింటున్నట్టే ఉన్నావనిపిస్తూంది. అప్పుడే డాక్టరవడం ఇలా ఏమగవాళ్ళు సాధించలేని పని నీవు చేస్తున్నందుకు నిన్ను చూస్తే చాలాసంతోషంగా ఉందమ్మా:" అన్నాడు మనస్ఫూర్తిగా అరుణముఖం వెలిగింది. "చూశావా అన్నయ్యా? ఆనాడు మీరందరూ నన్నుతిట్టారు బెదిరించారు, భయపెట్టాడు అవన్నీ లెక్కచేసి మీ మాటలు విని ఉంటే ఈ నాటి తృప్తి ఆనందం నాకు దొరికేవి కావు. ఏమంటారు? ఆ ఊళ్ళో హాస్పిటల్లో అందరి డాక్టర్ల మధ్య నేనూ ఓ డాక్టరునయి, ఏ ప్రత్యేకతా లేకుండా యాంత్రికంగా పని చేస్తూ జీతం డబ్బులు తీసుకుంటూ....." అవునవునులే ఒప్పుకున్నానుగా" నవ్వుతూ అన్నాడు కృష్ణమూర్తి" అంతా బాగానే ఉంది కానీ....." సందేహిస్తూ అడిగాడు.
"ఏమిటికానీ?"
"అదే నీ పెళ్ళి కూడా అయిపోతే ఇంక నీ గురించి మాకు నిశ్చింత నాన్నగారు రోజు అదే అనుకుంటూ బాధపడుతున్నారు. అరుణా, నాన్నగారు నాలుగైదుసంబంధాలు చూస్తున్నారు. అందరూ డాక్టర్లే. నీ అభిప్రాయం చెబితే....."
"అన్నయ్యా" అరుణ సీరియస్ గా మొహంపెట్టింది. "దయచేసి అలాంటి ప్రయత్నాలు ఏం చెయ్యవద్దని నాన్నగారితో చెప్పు. ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఉద్దేశం నాకు లేదు."
"అరుణా అదిగో అలా మాట్లాడితేనే చిరాకేస్తుంది చెప్పిన మాట విను.
పెద్దవాళ్ళు ఎందుకు చెపుతున్నారో ఆలోచించు. నీవు చేస్తున్న పనిని ఆమోదించే వాడినే నీ ఆశయాన్ని అర్ధం చేసుకునేవారి కోసమే నాన్నగారు వెతుకుతున్నారు. ఇంక ఆలాంటప్పుడు నీకభ్యంతరం ఏమిటి? పెళ్ళి చేసుకుని హాయిగా ఇద్దరూ ఇక్కడే ఉండి, మీ ఆశయానికి పాటుపడవచ్చు. ఇలాంటి ఊళ్ళో ఇంకోడాక్టరు సాయం కూడా నీకుంటే ఎంత బాగుంటుందో ఆలోచించు. అన్నింటిలోనూ నీకు తోడు నీడగా ఉండే మనిషి ఉంటే నీ కెంతనిబ్బరం, ధైర్యం ఉంటాయో ఆలోచించు." అరుణ వింటూ తల అడ్డంగా తిప్పింది. "క్షమించన్నయ్యా.
నీవుచెప్పింది నిజమేకాని, ఎందుకో ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలనిపించడం లేదు. కనీసం ఇంకో సంవత్సరం, రెండు సంవత్సరాలవరకు ఆ మాట ఎత్తద్దు కారణాలు అడగవద్దు" తల వంచుకుని అంది అరుణ. "అరుణా" చెల్లెలిమాటలలో భావం అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఏదో చెప్పబోయాడు కృష్ణమూర్తి. "ప్లీజ్ అన్నయ్యా ఆ విషయం తప్ప ఇంకేదన్న మాట్లాడునాకు పెళ్ళి చేసుకోవాలనిపించినప్పుడు నేనే చెబుతాగా?" నవ్వేస్తూ అంది అరుణ.
"నాకు తెలుసు నీవిలామాట్లాడతావని నాన్నగారికి చాదస్తం ఎంత చెప్పినా ఊరికే నీపెళ్ళి గురించి ఆరాటపడిపోయిబాధపడతారు. నీవేమో మొండిదానివి" చిరాగ్గా అన్నాడు కృష్ణమూర్తి. "అయినా అంత మొండిపట్టుపట్టడానికి కారణం ఏమిటో కాస్త చెబుతూ. అప్పుడు వేణుని కాదన్నావంటేపోనీ అర్ధం ఉంది నీ అభిప్రాయాన్ని మన్నించే వాడినేతెచ్చి పెళ్ళిచేస్తామంటేకూడా ఈ అర్ధం లేని పంతంఏమిటి? కారణం ఏమిటి?"