"సరిపోయింది" మూతి తిప్పింది మామ్మగారు.
శక్తి పాప రెక్క పట్టుకుని సదానందం దగ్గరికి తీసుకెళ్ళి "కరిచింది పిచ్చికుక్కట! చాలా ప్రమాదం వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి" అంది.
సదానందం బీడీ పీలుస్తూ "మీనాక్షి లేదుగా డబ్బులో" అన్నాడు.
"సంపాదించి ఇచ్చేస్తాను అని చెప్పండి. రేపు పొద్దుటే కష్టపడి ఏ కూలో నాలో చేసి అప్పు తీర్చేయచ్చు" తేలిగ్గా అంది.
అతను ఆమెవంక వింతగా చూసి "నేనా?" అన్నాడు.
"నిక్షేపంగా మీరే....! రాళ్ళు కొట్టచ్చు, బస్ స్టాపుల్లో మూటలు మోయచ్చు. ఏ వంటకైనా అసిస్టెంటుగా కూరలు తరగడానికి వెళ్ళచ్చు. ఏమైనా చేయచ్చు" అంది.
అతను విసురుగా లేచి "నాకు అలవాటు లేదు మీనాక్షి వచ్చి చూసుకుంటుంది" అన్నాడు.
"మీనాక్షికేనా కూతురు. మీకు కాదా?" తీవ్రంగా అడిగింది శక్తి.
"మీకు అనవసరం" సదానందం కోపంగా అన్నాడు.
"అదే నేనూ చెబుతున్నాను, మాకు అనవసరం. మామ్మగారూ, అక్కయ్యగారూ మీరంతా మీ పనులు చూసుకోండి. తండ్రి వున్నాడుగా, పిల్లదాని సంగతి అతనే చూసుకుంటాడు" అని విసవిసా తన ఇంట్లోకి పోయింది.
ఇంద్రనీల్ ఇంట్లోకి వస్తూ "మీనాక్షిగారు వచ్చేసరికి చాలా రాత్రయి పోతుంది శక్తీ" అన్నాడు.
"అవును" మొహం కడుక్కుంటూ జవాబిచ్చింది.
"ఓ నూట యాభై వుంటే ఇవ్వు. పాపని డాక్టర్ దగ్గరికి తీసుకెళతాను" అన్నాడు.
"నువ్వెందుకు తీసుకెళ్ళాలి? అనాధ కాదుగా ముప్పూటలా తిని కూర్చునే తండ్రి వున్నాడుగా" అంది.
ఇంద్రనీల్ విసుక్కుంటూ "నీ ధోరణి నాకు అర్ధంకాదు. నన్నేమో ఉద్యోగం చెయ్యవద్దని కండీషన్ పెట్టావు. అతన్నేమో ఏదో ఒక పని చేసుకోమంటున్నావు" అన్నాడు.
శక్తి బొట్టు పెట్టుకుంటున్నదల్లా ఆగి, "మా బావల్లా నువ్వూ సంపాదిస్తున్నాననే అధికారం, ఆధిపత్యం నామీద చూపే మార్గం లేకుండా నిన్ను నా కింది ఎంప్లాయీగా చేర్చుకున్నాను. కానీ ఆ సదానందం కానీ సంపాయించకపోయినా మీనాక్షిని వంగదీసి గుద్ది ఆధిపత్యం నిరూపించుకుంటూనే వున్నాడుగా? ఇంకెందుకు అతణ్ణి మేపడం?" అంది.
"సరే నా జీతం పారెయ్ డబ్బు అవసరపడింది" అన్నాడు ఇంద్రనీల్.
శక్తి మాట్లాడలేక కోపం దిగమింగుకుంటూ, అలమారాలోంచి డబ్బు తీసి లెక్కపెట్టి "ఇవిగో మూడువేలు.... ముట్టినట్లు రసీదుమీద సంతకం పెట్టు" అంది.
అతను ఆమె చెప్పినట్లే చేసి హడావుడిగా వెళ్లిపోయాడు.
శక్తి ఆ పూట భోంచెయ్యలేదు.
మీనాక్షి ఇంటికొచ్చాక ఇంద్రనీల్ దగ్గరికి వచ్చి "దేవుడు నీ రూపంలో వచ్చాడని" పొగిడి, కాసేపు ఏడ్చి వెళ్ళిపోయింది.
'తేరగా వచ్చాయని కన్నీళ్ళు కార్చడంతప్ప ఇంట్లోని పనికిరాని సామాన్లు రిపేరు చేసుకునేది లేదు' అనుకుంది శక్తి. ఆమెకయితే సదానందాన్ని వరుసగా వారంరోజులు పస్తు పడుకోబెట్టీ, అన్నం కావాలంటే పని చెయ్యాల్సిందే అనే పాఠం నేర్పాలని వుంది. మీనాక్షి పతివ్రత వేషాలు చూస్తే ఆమెకి ఒళ్ళుమంట.
పడుకోబోయేముందు ఇంద్రనీల్ "నీకు ఇబ్బంది లేకుండా పచ్చడులూ పొడులూ చేసిపెట్టాను. ఈ నాలుగురోజులూ పొద్దుట పాలు పోయించుకోవడం మర్చిపోకు" అన్నాడు.
ఆమెకి మనసంతా మంటగా వుంది. అతనివైపు కాకుండా గోడవైపు తిరిగి పడుకుంది.
కాసేపయ్యాక "నాకన్నా దగ్గరవాళ్ళు ఎవరైనా వున్నారా?" అంది.
"లేరు ఈ మంచంమీద పట్టరు కూడా" అన్నాడు.
ఆమె అతనివైపు తిరిగి "ఇక్కడని కాదు. అసలు ఎక్కడైనా వున్నారా?" అంది.
"ఎక్కడో వుంటే దగ్గరగా అని ఎందుకంటా?" అన్నాడు.
"అదికాదు.....మానసికంగా" అంది.
ఇంద్రనీల్ నవ్వి "డబ్బులిచ్చి ఎంప్లాయిమెంట్ ఇచ్చేవాళ్ళు మనసుల్ని శాసించలేరు. శరీరాల్నే తప్ప" అన్నాడు.
ఆమె చటుక్కున గోడవైపుకి తిరిగింది. తన కన్నీళ్ళు అతను చూడటం ఆమెకి ఇష్టంలేదు.
తెల్లవారుజామున అతను నిద్రలేపి వెళ్ళొస్తానని చెప్తుంటే, "ఎప్పుడొస్తావో తెలుసుకోవచ్చా?" అని అడిగింది.
"శుక్రవారం పొద్దుటే నీ ముందుంటాను. భోజనం విషయం అశ్రద్ద చేయకు" అని ఆమె బుగ్గమీద ముద్దుపెట్టుకుని వెళ్లిపోయాడు.
శక్తికి అతను వెళ్ళాక ఇల్లంతా బావురుమంటున్నట్లూ, ఆనందం అంతా గంతులేస్తూ అతని చిటికెనవేలు పట్టుకుని వెళ్ళిపోయినట్లూ అనిపించింది. 'ఛీ! అతను లేకుండా పాతికేళ్ళు లేనా?' అనుకుంటూ లేచి పనిలో పడింది. కానీ కూర తరుగుతుంటే వేలు తెగింది. నీళ్ళు తొలుపుకుంటుంటే కాళ్ళమీద చింది చురుక్కుమన్నాయి. ఏవిటో పని అలవాటు తప్పిపోయినట్లు అంతా కొత్తగా వుంది.
తార లంచ్ టైమ్ లో "శక్తీ! ఓ ఐదు వందలు సర్ధగలవా?" అని అడిగింది.
"ఇస్తాను కానీ ఎందుకే?" అంది.
"మా ఆడబిడ్డ కొడుకు పుట్టినరోజు వాచీ కొంటానని ఈయన వాగ్దానం చేశారుట. చేతిలో ఏగానీ లేకుండా అయ్యగారు మాట లిచ్చేస్తారు" భారంగా అంది.
శక్తి చిరాగ్గా "తారా! ఈ ఖర్చు అవసరమా? నీ కొడుక్కి సైకిల్ కొనడానికి ఆర్నెల్లనుంచీ ఆలోచిస్తున్నావు. నీ ఆడబిడ్డ కొడుకు అదీ వేలెడు లేడు. వాడికి వాచీ ఎందుకు? అయినా అది నీ పూచీకాదు. డబ్బు లేకపోతే అప్పుచేసి కొనిచ్చుకుంటాడు. మళ్ళీ తీర్చుకుంటాడు. అని నువ్వు వూర్కోవచ్చుగా" అంది.