"నేనే.... గాలిపటాలు చేయడం నేర్పిస్తానన్నాను."
శక్తి విసుగ్గా పిల్లలతో "పోండి....మీ ఇంటికిపొండి.... ఇవన్నీ పట్టుకుపొండి. మళ్ళీ ఇక్కడ కనిపించారంటే వీపులు చీరేస్తాను" అని అరిచింది.
వాళ్ళు బిక్కమొహాలేసుకుని పారిపోయారు.
"పిల్లలు పరబ్రహ్మ స్వరూపాలు. అలా కసరకూడదు" చెప్పాడు ఇంద్రనీల్.
"అసలు బ్రహ్మ అయినా సరే, నా ఇల్లు కంగాళీ చేసిపెడితే వూరుకునేది లేదు గానీ ముందు కళ్ళు తెరు. మీ మావగారొచ్చారు" అంది.
ఇంద్రనీల్ చటుక్కున కళ్ళు తెరిచి "బావున్నారా?" అన్నాడు.
గోపాలరావు చిరునవ్వు నవ్వి "ఎలా వుంది కొత్తకాపురం?" అన్నాడు.
"మోచేతి దెబ్బలా వుంది" చెప్పాడు ఇంద్రనీల్.
శక్తి కస్సుమని "ఆ మాట నేను అనాలి. ఇల్లు నీమీద వదిలి వెళితే యిలా అందర్నీ చేర్చి అనాధశరణాలయం చేస్తావా?" అని అరిచింది.
"మరి నేను అనాధనేగా!" వెంటనే అన్నాడు.
గోపాలరావు ఉలిక్కిపడి "శక్తీ! ఏమిటమ్మా ఆ దూకుడూ? ఇరుగూ పొరుగూ అన్నాక ఆమాత్రం సాయం చేసుకోవాలి" అన్నాడు.
మామ్మగారు బయటే నిలబడి "బాబూ.... మంచం నేయడానికి సాయం వస్తానన్నాఉ. చెయ్యి తీరుబడి అయిందా?" అని అరిచింది.
"ఆ.... ఇదిగో మా మావగారికి కాఫీ యిచ్చి వచ్చేస్తాను మామ్మగారూ" అన్నాడు ఇంద్రనీల్.
శక్తి వెక్కిరింతగా "మా నాన్నకి నేను కాఫీ యిస్తానుగానీ నువ్వెళ్ళి మామ్మగారికీ, వెనకింటి అన్నయ్యగారికీ సాయం చేసిరా..." అంది.
అతను పట్టించుకోలేదు. మావగారితో ఆరోగ్యం ఎలా వుంది? ఆయిల్ పుల్లింగ్ చేయమన్నాను చేస్తున్నారా? పొద్దుటపూట బద్దకించకుండా వాకింగ్ చేయండి" అన్నాడు.
గోపాలరావు నవ్వి, అన్నీ చేసి ఇంకా ఎన్నాళ్ళు బతకమని నాయనా? వయసు అయిపోవడంలా?" అన్నాడు.
కిటికీలోనుంచి మీనాక్షి పిల్లలు ఇంద్రనీల్ ని బయటికి రమ్మని రకరకాల సైగలు చేస్తున్నారు.
శక్తి కాఫీ కప్పుతో ఇవతలికి రాగానే చూసి "బాబోయ్ శక్తి! చంపేస్తుంది" అని పరుగెత్తిపోయారు.
శక్తి ఎర్రబడిన మొహంతో అతనివంక చూసింది.
"రాత్రికి ఉలవచారు పెడతాను. భోంచేసి వెళ్ళండి" మావగారితో చెప్పాడు.
"వద్దు నాయనా..... రాత్రిళ్ళు భోంచేయను. నిన్నూ అమ్మాయినీ పండక్కి పిలుద్దామని వచ్చాను" అన్నాడాయన.
అతను నవ్వి "నేను గాంధీ జయంతి, స్వాతంత్ర్య దినోత్సవం తప్ప ఏ పండగలూ చేసుకోనండి. కాబట్టి నాకు యివన్నీ పండుగలు కావు" అన్నాడు.
"ఏదో నా ముచ్చటకి!" అన్నాడాయన.
"మీ ముచ్చట్లన్నీ మీ అల్లుళ్ళు ఈపాటికే తీర్చి వుంటారే" నవ్వాడు ఇంద్రనీల్.
"వాళ్ళ దారి వేరు. నిన్ను మాత్రం నిజంగానే ముచ్చటపడి పిలుస్తున్నాను" అన్నాడాయన.
"లేదండీ నేను ఊరెళుతున్నాను. ఊళ్ళో వుంటే వచ్చేవాడిని" అన్నాడు.
"ఏ ఊరూ? నాతో చెప్పనేలేదే?" వింతగా చూస్తూ అడిగింది శక్తి.
"అవి మాత్రమే నీ నోట్లోంచి రాకూడని ప్రశ్నలు. ఎగ్రిమెంట్ మర్చిపోయావా?" చిరునవ్వుతోనే వాడిగా అడిగాడు.
శక్తి దెబ్బతిన్నట్లు చూసింది.
గోపాలరావు ఇరకాటంలో పడినట్లు ఇద్దర్నీ మార్చిమార్చి చూశాడు.
శక్తికి అతని కండీషన్ గుర్తుకురానేలేదు. నెలరోజులూ అంత వేగంగా గడిచిపోయాయి. ఎక్కడికి వెళుతున్నాడో, ఎందుకు వెళుతున్నాడో అడగకూడదు.
ఆమె పై పెదవిని పంటితో బిగపట్టి అనేక ప్రశ్నలని బైటికి రాకుండా అణిచేసింది.
గోపాలరావు కాసేపు కూర్చుని ఆ కబురూ, ఈ కబురూ చెప్పి వెళ్ళొస్తానని బయల్దేరాడు.
తండ్రిని సాగనంపడానికి గేటుదాకా వచ్చిన శక్తితో "అబ్బాయి అందరి లాంటి వాడు కాదు. నువ్వు మొదటినుంచీ అక్కలకన్నా అదృష్టవంతురాలివి. ఆ అదృష్టాన్ని కాపాడుకో తల్లీ" అన్నాడు.
శక్తి నిర్లిప్తంగా "అదృష్టం కాదు, ఆలోచన! ఆలోచించి ప్రతి అడుగూ వేస్తాను. నా సామర్ధ్యంమీద నాకు నమ్మకం ఎక్కువ" అంది.
ఆయన ఇంకేమీ తర్కించకుండా "జాగ్రత్త" అని వెళ్లిపోయాడు.
"కొత్త కాపురం కొత్తగా నేర్చుకున్న కారు డ్రైవింగ్ తో సమానం. చాలా జాగ్రత్త అవసరం. గేరు మార్చినప్పుడు పక్కవాళ్ళకి భయం వెయ్యకూడదు. కానీ స్టీరింగ్ నా చేతిలో వుండగా, బ్రేక్ మాత్రం తను వేశాడేమిటి?" అనుకొంది శక్తి.
* * *
శక్తి ఇంటికి వచ్చేటప్పటికే వాకిట్లో జనం గుమికూడి వున్నారు. మామ్మగారు చేతులు తిప్పుతూ ఏదో అంటోంది మీనాక్షి కూతురు ఏడుస్తుంతే ఎదురింటావిడ సముదాయిస్తోంది.
శక్తి గాభరాగా "ఏం జరిగింది మామ్మగారూ?" అంది.
"ఎక్కడినుండి వచ్చిందో పిచ్చికుక్క ఆ పిల్లదాన్ని చటుక్కున కరిచి పోయిందమ్మా!" అంది మామ్మగారు.
శక్తి పాప కాలు చూస్తూ "మీనాక్షి లేదా?" అంది.
"ఈ మధ్య ఎవరింటికో సంగీతం పాఠాలు చెప్పడానికి సాయంత్రం కూడా వెళ్తోందిగా" అంది ఎదురింటావిడ.
"మరి... మరి మా ఆయనా..." అని చుట్టూ చూసింది.
"ఇంద్రనీల్ కర్ర తీసుకుని దాన్ని చంపడానికి వెళ్ళాడు. ఇప్పటికి అవతల వీధిలో నలుగుర్ని కరిచిందట" అందావిడ.
శక్తి "మరి పాపని డాక్టర్ దగ్గరికి..." అంటూ చుట్టూ చూసేసరికి అరుగుమీద బీడీ కాల్చుకుంటూ తీరిగ్గా కూర్చున్న సదానందం కనిపించాడు.
ఆమె నిటారుగా అయింది. కళ్ళు తీక్షణంగా మారాయి. స్వరం కరకుగా మార్చి "మీరంతా హడావుడి పడుతున్నారేం? తండ్రి వున్నాడుగా, ఆయనకి చెప్పండి" అంది.