"అయ్యబాబోయ్...మాక్కూడా ఇంగ్లీష్ వచ్చండీ బాబూ....మీరేం చేస్తారో అనవసరం సారా నిషేధం జరగడానికి వీల్లేదు"
"జరిగితే..."
"పట్టుదలకు పోకండి... నలభై ఎనిమిది గంటలు టైమిస్తున్నాం. ఈ రాష్ట్రం నుంచి, మీరు క్షేమంగా మీ రాష్ట్రం మీరు వెళ్ళాలంటే.... మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.ఎస్ చదువుతున్న మీ ఏకైక సంతానం జాగ్రత్తగా ఉండాలంటే మీరు మాతో కోపరేట్ చెయ్యాలి."
ఆ మాటకు వరదరాజన్ జూలు దులిపిన సింహంలా గర్జించాడు.
"గెటవుట్... గెటవుట్ ఫ్రం హియర్... మరొక్క నిమిషం నువ్విక్కడ కన్పించావంటే ఐ విల్ కాల్ ద పోలీస్" ఆవేశంగా లేచి నిలబడ్డాడు వరద రాజన్.
"ఓకే- మిస్టర్ వరదరాజన్... నలభయి ఎనిమిది గంటలు....మరిచి పోవద్దు- ఒకే విషయం- పడుకునే ముందు- ఆ తిరుపతి దైవ ప్రసాదం...అతి పవిత్రమైన ఆ లడ్దూల్ని రుచి చూసి.... పడుకోండి- ఆ వెంకన్న మీ మనసు మారుస్తాడేమో-" శ్రీరాములు నాయుడు, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ బయటికి వచ్చేసాడు.
"ఇడియట్- ఇడియట్..." చేతిలోని ఫైల్ ని విసురుగా పడేసి, టీపాయ్ మీదున్న లడ్డూల పాకెట్ వేపు చూసారాయన. వాటిని బయటకు విసిరెయ్యాలన్నంత కోపం వచ్చింది కానీ దేవుడి ప్రసాదం....అసహనంగా లేచి నిలబడ్డాడు.
హాల్లో భర్త అరుపులు వినబడటంతో మెలకువ వచ్చిన వరద రాజన్ భార్య ఆనంది మేడమెట్లు దిగింది.
"ఏవైందండీ..." అడిగిందావిడ.
"ఏం లేదులే.... ఆ దేవుడి ప్రసాదాన్ని తీసికెళ్ళు" చిరాగ్గా అన్నాడాయన.
భర్త చిరాకుని గమనించిన ఆనంది, మరేం మాట్లాడకుండా టీపాయ్ మీదున్న ప్యాకెట్ ను తీసుకుని-
"తిరుపతి ప్రసాదమా" అనుకుంటూ....ప్యాకెట్ పై కవర్ ని తీయడానికి ప్రయత్నిస్తూ మెట్లెక్కిందావిడ. పై కవర్ని తీసి- అందులో కనిపించిన వాటిని చూసి, నోటమాటరాక, అలాగే వుండిపోయిందావిడ.
"ఏవండీ..." భయంగా అరిచింది.
వరదరాజన్ ఆమె వేపు ఆశ్చర్యంగా చూసారు.
"ఏవండీ....ఇందులో....ఇందులో" గబగబా మేడమెట్లు దిగిందావిడ.
విప్పి, ప్యాకెట్ ను భర్తకు చూపించింది.
లోన ఉన్నవి తిరుపతి లడ్డూలు కావు!
తిరుపతి లడ్డూల ప్యాకెట్ లో.
అయిదు వరసల్లో... అయిదువందల కొత్తనోట్ల కట్టలు... తళతళ మెరుస్తున్నాయి.
"డోంట్ టచిట్.... అక్కడ పడేయ్..." గాభరాగా అని పి.ఎ.ని కేకేసాడాయన.
పి.ఎ. పరుగున వచ్చాడు.
"ఇప్పుడు నా దగ్గర కొచ్చిన పెద్దమనిషి వెళ్ళిపోయాడా?"
"వెళ్ళిపోయాడు సర్..."
"ఎటెళ్ళాడో తెలుసా?"
"ఎయిర్ పోర్ట్ కని....డ్రైవర్ తో చెప్పడం విన్నాను సర్."
"అర్జంటుగా పోలీస్ కమీషనర్ కి ఫోన్ చెయ్యి- నువ్వొద్దులే- నేను చేస్తానులే-" ఫోనందుకొని- గబగబా నెంబర్స్ ప్రెస్ చేసాడాయన.
మరో అయిదు నిమిషాల్లో పోలీస్ కమీషనర్ లైన్లో కొచ్చాడు.
"కమీషన్ గారూ- అయామ్ చీఫ్ సెక్రట్రీ.... వరదరాజన్. అరక్ కంట్రాక్టర్- అబ్బయ్యనాయుడికి చెందిన ఒక వ్యక్తి నాదగ్గర కొచ్చాడు" అని జరిగిందంతా చెప్పి "ఇప్పుడతను... ఎయిర్ పోర్ట్ లో ఉంటాడు... అరెస్ట్ హిమ్ ఇమ్మీడియట్లీ... అతనిక్కడ వదిలిపెట్టిన ఎమౌంట్... ఇక్కడ నా దగ్గరే ఉంది....మీరొస్తే- మీకు హేండోవార్ చేస్తాను."
"సర్! అబ్బయ్యనాయుడు మనిషిని అరెస్ట్ చెయ్యడం...అంత మంచిది కాదు సర్....లేనిపోని గొడవలు" చెప్పబోయాడు పోలీస్ కమీషనర్...
"మిస్టర్ కమీషనర్... డు... వాట్ ఎవర ఐసే... వాడ్ని వదలడానికి వీల్లేదు.... అరెస్ట్ హిమ్.. ఇమ్మీడియట్లీ- మీకోసం- నేను... ఎదురు చూస్తుంటాను" టక్కున ఫోన్ పెట్టేసాడు చీఫ్ సెక్రట్రీ వరదరాజన్.
నలభై నిమిషాలు గడిచాయి.
చీఫ్ సెక్రట్రీ వరదరాజన్ అసహనంగా వరండాలో పచార్లు చేస్తున్నాడు.
రెండు అంబాసిడర్ కార్లు వచ్చి ఆగాయి పోర్టికోలో ఆ వెనక పోలీస్ జీప్... ఆ జీప్ లోంచి సిటీ పోలీస్ కమీషనర్ సూర్యారావు దిగారు.
మొదట ఆగిన అంబాసిడర్ కార్లోంచి....హుందాగా దిగాడు శ్రీరాములు నాయుడు.
"నమస్కారం వరదరాజన్ గారు! స్వయంగా కమీషనర్ గారే... ఎయిర్ పోర్ట్ కొచ్చి చెప్పినంతవరకూ నేను చేసిన పొరపాటేవిటో నా కర్ధం కాలేదు" చేతిలోని ఓ ప్యాకెట్ తో శ్రీరాములునాయుడు మెట్లెక్కుతున్నాడు. అంతకు ముందు చీఫ్ సెక్రట్రీ ఇంట్లో వదిలేసిన ప్యాకెట్ లాగే ఉందా ప్యాకెట్.
"చీఫ్ సెక్రట్రీగారూ! మీరు పొరపాటు పడ్డారు సర్... అసలు జరిగింది" ఏదో చెప్పబోయాడు పోలీస్ కమీషనర్ సూర్యారావు.
చీఫ్ సెక్రట్రీ వరదరాజన్, సూర్యారావు వేపు ఉగ్రంగా చూడడంతో ఆయన చూపులు తిప్పేసుకున్నాడు.
"చిన్న పొరపాటు జరిగిపోయింది సర్.... నిజంగా దేవుడి ప్రసాదమే.. మీకివ్వాలనుకున్నాం సర్- కార్లో కేష్ ప్యాకెట్లు.... లడ్డూల ప్యాకెట్లూ... పక్క పక్కనే ఉండడంవల్ల- ప్యాకెట్లు తారుమారై పోయాయి. సారీ సర్!"
తన చేతిలో వున్న ప్యాకెట్ ను టీపాయ్ మీద పెట్టి, టీపాయ్ మీదున్న పాకెట్ ను చేతుల్లోకి తీసుకుని తన పక్కనే నిలుచున్నా అసిస్టెంట్ కి ఆ ప్యాకెట్ ను అందించాడు శ్రీరాములునాయుడు.
ఇది డ్రామా అని స్పష్టంగానే తెలుస్తూనే ఉంది వరదరాజన్ కి. గబుక్కున ముందు కడుగేసి టీపాయ్ మీదున్న ప్యాకెట్ ను తెరిచి చూసాడు.
సువాసనలు వెదజల్లుతున్న తిరుపతి లడ్డూలు!
"మీరు కరెన్సీ తిరుపతి లడ్దూల్లో పెడతారన్నమాట...అంత ఎక్సెస్ కరెన్సీ ఉంటే.... తిరుపతి హుండీలో వేస్తే పుణ్యం, పురుషార్ధం వస్తుంది... ఆ పని చెయ్యండి" వ్యంగ్యంగా అన్నాడాయన.
ఆ వ్యంగ్యాన్ని అర్ధం చేసుకున్న శ్రీరాములునాయుడు నిస్సహాయంగా గుటకలు మింగాడు.
"రేపు మా కంపెనీలకు సాలరీస్ డే సర్... మీకు తెలుసు....మాకు నెల్లూరులోనే కాదు.... ఇక్కడ కూడా కంపెనీలున్నాయని. ప్రతి పైసాకు...ఎకౌంట్స్ ఉన్నాయి సర్....ఇదేం బ్లాక్ మనీ కాదు."
"తను- ఐజీకి ఫోన్ చెయ్యల్సింది...కమీషనర్ కి ఫోన్ చేసి, పొరపాటు చేసాడు" మనసులోనే బాధపడ్డాడు వరదరాజన్.
"ఒకే మిస్టర్ కమీషనర్" కోపంగా అనేసి, కమీషనర్ ముఖం వేపు కూడా చూడకుండా గబగబా మేడమెట్లెక్కుతున్నాడాయన.
అదే సమయంలో ఫోన్ మోగింది.
మెట్లెక్కుతున్న వరదరాజన్ మెట్లు దిగి ఫోన్ అందుకున్నాడు.
"ఎస్! వరదరాజన్ హియర్."
ఆ ఫోన్ ఎవరికొచ్చిందో తెలీగానే ఓరకంట శ్రీరాములునాయుడు వేపు చూసాడు.
"అలాంటి వ్యక్తులెవరూ ఇక్కడ లేరు" ఫోన్ కట్ చెయ్యబోయాడు.
ఆ ఫోన్ తనకే వచ్చిందని తెల్సుకున్న శ్రీరాములు నాయుడు గబుక్కున ముందుకు అడుగేసి వరదరాజన్ చేతుల్లోని రిసీవర్ని అందుకున్నాడు.
"ఆఁ...నేనేరా చెప్పు..."
"అన్నా... నేనే... ఆ కారంత్....రేపుదయం ఏడుగంటలకు" చెప్పుకుపోతున్నాడు అవతలి వ్యక్తి.