"ఓకే...ఓకే... అన్ని డిటైల్స్... చెప్పాల్సిన అవసరం లేదు... నేనొస్తున్నాను ఫోన్ పెట్టేయ్.'
టక్ మని ఫోన్ పెట్టేసి వరదరాజన్ వేపు చూసి-
"థాంక్యూ మిస్టర్ చీఫ్ సెక్రట్రీ! ఎవ్విరి డాగ్ హేజ్ ఇట్స్ ఒన్ డే....డోంట్ ఫర్ గెట్ దట్" గబగబా బయటికొచ్చేసాడు శ్రీరాములునాయుడు.
అంబాసిడర్ కారులో కూర్చున్నాడు.
"ఏంటి సార్! మన తిరుపతి లడ్లు... వాపసు రావడం... ఇదే మొదలనుకుంటాను" ఫ్రంట్ సీట్లో కూర్చున్న అసిస్టెంట్ అన్నాడు.
"ఒరే నాన్నా... కొన్ని పాములు కర్రతో కొడితే చస్తాయి.... కొన్ని పాములు కాలి మడమతో అణిస్తే చస్తాయి.... ఈ బ్యూరో క్రాట్స్ కూడా అంతే. ఒకడికి కరెన్సీ వీక్ నెస్, ఇంకొకడికి కాంత వీక్ నెస్...చూడు .... ఈ వరదరాజన్ గాడ్ని ఎలా వంచుతానో చూడు... డ్రైవర్! పోనీ" చికాగ్గా అన్నాడు శ్రీరాములునాయుడు.
కారు ముందుకు కదిలింది.
మరో పావుగంట తర్వాత హోటల్ హర్ష ఇంటర్నేషనల్ ముందు కారాగింది.
విసురుగా కార్లోంచి దిగాడు శ్రీరాములునాయుడు.
"ఒరేయ్...ఒకసారి మన లాయర్ని అర్జంటుగా రమ్మన్నానని చెప్పు..."
చెప్పేసి ముందుకు నడిచాడు శ్రీరాములునాయుడు.
సూట్ లోకెళ్ళి నిస్త్రాణగా బెడ్ మీద కూలబడ్డాడు.
అదే సమయంలో-
ఫోన్ మోగింది... వెంటనే రిసీవర్ అందుకున్నాడు.
"నేనే..."
"బావా నువ్వా...."
"అవును... చీఫ్ సెక్రట్రీ.... నీ లడ్డూల్ని తినలేదు కదూ..." పది నిముషాల క్రితం జరిగిన సంఘనట, ఎక్కడో తడలో ఉన్న అబ్బయ్యనాయుడికి వెంటనే ఎలా తెల్సిందో తెలీక జుత్తు పీక్కున్నాడు శ్రీరాములునాయుడు.
"లేదు బావా.... రేపుదయం..."
ఫోన్ కట్ అయింది. ఆ సమయంలో అబ్బయ్యనాయుడు మొహం ఎలా ఉంటుందో ఊహించుకున్న శ్రీరాములునాయుడు-
స్కాచ్ బాటిల్ ని తీసుకొని గడగడా త్రాగడం ప్రారంభించాడు.
ఒక్కొక్క 'పెగ్గూ' నరంలోకి వెళుతున్న కొద్దీ శ్రీరాములు నాయుడు ఆలోచనలు విచ్చుకుంటున్నాయి.
రేపుదయం-
ఏడుగంటలకు-తనకు-
ఒకే ఒక్క అవకాశం లభిస్తోంది.
మర్నాడు రాజధాని నడిబొడ్డులో ఒక విలయం సృష్టించైనా సరే తనకి అబ్బయ్యనాయుడు అప్పగించిన పనిని సక్సెస్ చేయడానికి సిద్దముగా వున్నాడు.
* * * * *
సరిగ్గా 8-25 నిమిషాలయింది.
పంజాగుట్ట క్రాస్ రోడ్స్ లో సందడి మొదలయింది. ప్రతిక్షణానికీ ట్రాఫిక్ పెరుగుతోంది.
అంబాసిడర్ కార్లో ముందు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న శ్రీరాములు నాయుడు గర్వంగా నవ్వుకున్నాడు.
అదే కారులో-
వెనక సీట్లో చీఫ్ జస్టిస్ సుఖరామ్ కారంత్ భార్య శోభాదేవి, కూతురు చంద్రముఖి కూర్చున్నారు. చంద్రముఖికి ఇరవై అయిదేళ్ళు వుంటాయి.
వాళ్ళిద్దరికీ కాపలాగా యాదగిరి కూర్చున్నాడు.
"ఎవరు మీరు? ఎక్కడకు తీసుకెళుతున్నారు?" గాభరాగా అడిగింది శోభాదేవి.
అలా అడగడం పదోసారి.
సమాధానం లేదు.
"యూనో మిస్టర్.... మేమెవరో తెల్సా.... చీఫ్ జస్టిస్" ముందుకు పడుతున్న జుత్తుని వెనక్కి తోసుకుంటూ ఏం జరుగుతుందో తెలీక ఉద్వేగంగా అంది చంద్రముఖి.
ముందు సీట్లోంచి సమాధానం రాలేదు.
నిజాం హాస్పిటల్ దాటి అంబాసిడర్ కారు పంజాగుట్ట క్రాస్ రోడ్స్ దగ్గరకొచ్చి ఆగింది.
ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర రెడ్ లైట్ ని చూసి నవ్వుకున్నాడు శ్రీరాములు నాయుడు.
చేతి వాచీవైపు చూసుకున్నాడు.
నిమిషాలు గడుస్తున్నాయి.
శ్రీరాములునాయుడు కళ్ళు విండో మిర్రర్ లోంచి వెనక వస్తున్న కార్లను నిశితంగా పరిశీలిస్తున్నాయి.
అదే సమయంలో-
చీఫ్ మినిస్టర్ ఆ దారంట వస్తున్న సమాచారం తెలియటంతో...పంజాగుట్ట ఎస్.పి. స్టేషన్ కి కొంచెం దూరంలో పెట్రోలింగ్ వ్యాన్ పక్కన స్టిఫ్ గా నుంచున్నాడు.
శ్రీరాములు నాయుడు కళ్ళు ఎస్ పీని సూటిగా చూసాయి.
రెడ్ లైట్ మారిపోయి గ్రీన్ లైట్ వెలగటానికి రెండు సెకండ్ల టైముంది...
శ్రీరాములు నాయుడు అంచనా తప్పలేదు.
అంబాసిడర్ కారు పక్కగా కొంచెం దూరంలో వచ్చి ఆగిన మారుతీ కారులోని-
చీఫ్ జస్టిస్ సుఖరామ్ కారంత్ సడన్ గా బ్రేక్ వేసి రెడ్ సిగ్నల్ వేపొకసారి చూసి- యధాలాపంగా...
తల తిప్పి, ఎడమవైపు చూసి ఒక్కక్షణం ఖిన్నుడయ్యారు.
అంబాసిడర్ కారు వెనక సీట్లో మిర్రర్ లోంచి చేతులతో సంజ్ఞ చేస్తున్న తన భార్య- ఆ పక్కన కూతురు...
ఏం జరిగిందో....ఆయనకు అర్ధం కావడానికి....లిప్తకాలం పట్టింది...
అటూ ఇటూ గాభరాగా చూసాడాయన.
శ్రీరాములునాయుడు డ్రయివింగ్ సీట్లోంచి డోర్ తెరచుకొనిబయటికొచ్చాడు.
అప్పుడు చూసాడు చీఫ్ జస్టిస్ సుఖరామ్...అంబాసిడర్ కారులోంచి దిగి తనవైపు వస్తున్న-
ఆ వ్యక్తిని!
ఎవరా వ్యక్తి...వాట్స్ గోయింగ్ ఆన్ హియర్... ఆయన మనకు ఆక్రోశిస్తోంది.
ఏం చేయాలిప్పుడు...
ఆయన కళ్ళకు దూరంగా నుంచున్న ఎస్. పీ. కన్పించాడు.
శ్రీరాములునాయుడు మద్యలో అడ్డుగా వున్న కారుని దాటి జడ్జీ కారు దగ్గరకొచ్చి-
చేతిలోని సిగరెట్ ను పక్కన పడేసి-
"చూడండి.... చీఫ్ జస్టిస్ గారూ... మీ భార్య, కూతురూ మా కస్టడీలో వున్నారు అంటే కిడ్నాప్ చేశానన్న మాట...ఎందుకో తెలుసా? సారా కాంట్రాక్టర్ అబ్బయ్యనాయుడు పేరు విని ఉంటారు కదూ-"
"ఎస్... ఎస్.... అబ్బయ్యనాయుడు..." కంగారుగా అన్నారు చీఫ్ జస్టిస్.
"లిక్కర్ ప్రొహిబిషన్ కు సంబంధించి, గవర్నమెంట్ జీ.వో. నిన్నరాత్రి ఇష్యూ చేసింది కదూ..."
"ఎస్... ఎస్... అయితే?"
"ఇవాళ కోర్టు హాలీడే కదూ..."
"ఎస్.... ఎస్..." ఒకవైపు భార్య, కూతురువైపు చూస్తూ అన్నారాయన.