"బావా..." గాభరాగా అన్నాడు శ్రీరాములు నాయుడు.
"నేనే... ఏవిటీ... సిఎమ్ ని బెదిరించావట"
"తప్పలేదు బావా.....ప్రొహిబిషన్ జీవో ఇవాళ రాత్రి ఏ క్షణంలోనైనా రావచ్చట బావ ఏం చెయ్యమంటావు?"
కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
"పార్టీ పవర్ లోకి వచ్చిన సందర్భంగా రేపు కోర్టు హాలిడే మిగతా రెండ్రోజూలూ హాలీడేస్ ఇంకోపక్క ప్రొహిబిషన్ సెల్ కోసం యంగ్ ఆఫీసర్ కోసం వెతుకులాట....శ్రీరాములూ! ఇవన్నీ నువ్వు అక్కడుండగానే జరుగుతున్నాయని గుర్తుపెట్టుకో" అబ్బయ్యనాయుడు గొంతులోంచి ఆమాట రాగానే శ్రీరాములునాయుడు చిగురాకులా వణికిపోయాడు.
"ఏం చెయ్యమంటావ్ బావా" అంత గంభీరమైన గొంతులోంచి ఆ క్షణంలో నీరసంగా వచ్చింది మాట.,
సడన్ గా ఫోన్ కట్ అయింది.
ఫోన్ ఎందుకు కట్ అయిందో ఒక్క శ్రీరాములునాయుడికే తెల్సు ఫోన్ కట్ అయిందంటే అర్ధం.... అదొక రెడ్ లైట్...అదొక డేంజర్ సింబల్.
మరేమాత్రం ఆలస్యం చెయ్యలేదు శ్రీరాములునాయుడు... ఫోన్ వేపు నడిచాడు.
ఎవరెవరికో ఫోన్ చేసాడు. "ఒరేయ్.... ఆ బ్రీఫ్ కేసులందుకోరా" ఎదురుగా టేబిల్ మీదున్న రెండు బ్రీఫుకేసుల్ని అందుకున్నాడు.
"కారులో పెట్టు..." లాల్చీని వేసుకుంటూ ఆజ్ఞాపించాడు.
అనుచరవర్గం వెనకరాగా మెట్లు దిగుతున్నాడు.
సడన్ గా ఒక విషయం శ్రీరాములునాయుడికి జ్ఞాపకం వచ్చింది.
"ఒరేయ్... చీఫ్ జస్టిస్... ఇప్పుడెక్కడున్నాడో కనుక్కో....అలాగే వాళ్ళ ఫామిలీ మెంబర్స్ కూడా నేనిప్పుడు ఎక్కడికి వెళుతున్నానో తెల్సుకదా అక్కడికీ ఫోన్ చెయ్యి..."
రిసెప్షన్ కౌంటర్ ముందు నుంచి హడావుడిగా వెళుతున్న శ్రీరాములు నాయుడుని-
కౌంటర్ లో ఫోన్ ముందు కూర్చున్న వ్యక్తి వినయంగా లేచి గౌరవంగా పిల్చి-
"సార్... మీకు ఫోన్" అన్నాడు.
"ఈ ఫోన్ ఎక్కన్నించి..." అబ్బయ్యనాయుడు జ్ఞాపకం రాగానే శ్రీరాములు నాయుడు గుండె గుబగుబలాడింది.
"చూడు శ్రీరాములూ...ఇజ్జత్ కా సవాల్....నాకు స్టే కావాలి.... లేదా నువ్వు హైద్రాబాద్ నుండి తడ రావు" ఫోన్ కట్ అయింది.
ఒక్కసారిగా శ్రీరాములునాయుడు మెదడంతా మొద్దుబారిపోయినట్లుగా అయిపోయింది.
అడవిలోంచి నగరంలోకి అడుగుపెట్టిన మేన్ ఈటర్ లా ఆ హోటల్లోంచి బయటికొచ్చి కారెక్కాడు శ్రీరాములునాయుడు.
బేగంపేటలోని-
చీఫ్ సెక్రట్రీ వరదరాజన్ రెసిడెన్స్ హాల్లో కూర్చుని ఏవో ఇంపార్టెంటు ఫైల్స్ ని చూస్తున్న వరదరాజన్ అడుగుల చప్పుడుకి తలెత్తి చూసాడు.
ఎదురగా పి.ఎ. కరుణాకార్ నిలబడి వున్నాడు.
"మిమల్ని కలవడానికి సారా కాంట్రాక్టర్ అబ్బయ్యనాయుడు బావ మరిది శ్రీరాములునాయుడట వచ్చారు సార్.
"శ్రీరాములునాయుడా..." ఉలిక్కిపడ్డారాయన.
"రేపు ఆఫీసుకు రమ్మను" అని వరదరాజన్ అంటుండగానే, శ్రీరాములు నాయుడు లోనికి ప్రవేశించాడు.
"నా పేరు శ్రీరాములునాయుడు... అబ్బయ్యనాయుడుగారు మా బావగారు...మీతో మాట్లాడమని మా అబ్బయ్య పంపించారు."
"కూర్చోండి" అని చెప్పి పి.ఎ.వేపు చూసారు చీఫ్ సెక్రట్రీ పి.ఎ. హాల్లోంచి బయటకు వచ్చేసాడు.
శ్రీరాములునాయుడు ఈ సమయంలో ఎందుకొచ్చాడో అర్ధమై పోయింది. వచ్చిన శ్రీరాములునాయుడితో తను మాట్లాడకాపోతే, రేపు అబ్బయ్య నాయుడు ఎలా రియాక్టు అవుతాడో తెల్సిన వరదరాజన్, ఎదురుగా కూర్చున్న-
శ్రీరాములునాయుడు వేపు చూసి-
"చెప్పండి" అన్నారు చిరునవ్వు నవ్వుతూ.
శ్రీరాములునాయుడు తన చేతిలోవున్న ప్యాకెట్ వేపొకసారి చూసాడు.
మినీ సూట్ కేసులా ఉందా ప్యాకెట్... ప్యాకెట్ మీద తిరుపతి వెంకటేశ్వరుని దివ్య ప్రసాదం, లడ్డూల్ని అందజేయడం మా సంప్రదాయం స్వీకరించండి."
"పెద్దవారి దగ్గరకు వచ్చేముందు తిరుపతి వెంకటేశ్వరుని దివ్య ప్రసాదం, లడ్దూల్ని అందజేయడం మా సంప్రదాయం స్వీకరించండి."
తన చేతిలోని ప్యాకెట్ ను ఇద్దరికీ మధ్యనున్న టీపాయ్ మీద పెట్టాడు శ్రీరాములునాయుడు.
వరదరాజన్ ఆ ప్యాకెట్ వేపొకసారి చూసి, నాయుడు ముఖంలోకి చూసారు.
"చెప్పండి" ఆయన ముఖంలో చిరునవ్వులేదు.
శ్రీరాములు నాయుడు చెప్పడం ప్రారంభించాడు.
"మా బావగారి పేరు మీరు వినే వుంటారు. అన్ని పార్టీలకూ కావలసిన వ్యక్తి ఆయన ముఖ్యంగా అధికార పార్టీకి. మాజీ ముఖ్యమంత్రి, ఆయనతో చెప్పకుండా, ఏం చేసేవాడు కాడు. ఈ ముఖ్యమంత్రి....త్రిభువనేశ్వరి ఏదో స్వంత నిర్ణయాలు తీసుకుంటోందట."
"మీరసలు ఏ విషయం చెపుతున్నారో నాకర్ధం కావడంలేదు" సీరియస్ గా అన్నాడు వరదరాజన్.
"అదే చెపుతున్నాను....రాష్ట్రంలో కొన్ని విషయాల గురించి స్వంత నిర్ణయాలు చీఫ్ మినిస్టర్లు... చీఫ్ సెక్రట్రీలు... పోలీస్ చీఫ్ లు తీసుకోకూడదు దానికో సెపరేట్ ప్యానల్ ఉంది. పవర్ పార్టీ అడిగినపుడల్లా కోట్లు, కోట్లు పార్టీ ఫండ్ గా ఇచ్చే... సారా కాంట్రాక్టర్లు... బడా బిజినెస్ మెన్ లని సంప్రదించాలి...వాళ్ళేం చెపితే అవ్వే... గవర్నమెంటు జీవోలుగా రావాల...గత ముఫ్ఫై ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం ఇది. ఆ సంప్రదాయాన్ని మరిచి పోవద్దని చెప్పమని మా బావగారు అబ్బయ్యనాయుడుగారు తమకు చెప్పమని నన్ను పంపించారు" చెప్పాడు శ్రీరాములునాయుడు.
ఆ మాటకు చీఫ్ సెక్రట్రీకి కోపమా వచ్చింది.
"నేనెవరో తెల్సా నీకసలు..."
"తెల్సేకదా వస్తా... చూడండి చీఫ్ సెక్రట్రీగారూ! సారా నిషేధం మంచిది కాదు. అసలీ ఐడియా ఎవడిచ్చాడండీ బాబూ...తెల్సి తెల్సి కొన్ని వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఏ గవర్నమెంటయినా వదులుకుంటుందా చెప్పండి."
"దిసీజ్ గవర్నమెంట్ పాలసీ"
"ఓకే పాలసీ డెసిషన్.... డెసిషన్ తీసుకోండి జీ.వోలు ఇష్యూలు చేసుకోండి ప్రచారమూ చేసుకోండి. మాకేం సంబంధం లేదు. మా జోలికి రాకండి. అటు మీకు ప్రజల్లో పాప్యులారిటీ వస్తుంది. ఇటు మా వ్యాపారం హాయిగా..."
"తీరుబడిగా లెక్చర్లు ఇవ్వడానికొచ్చావా నువ్వు" అసహనంగా అడిగారు వరదరాజన్.
"కాదు..ఎవరి పేరు చెప్తే ఈ రాష్ట్రంలో అన్ని డిపార్టుమెంట్లూ గడ, గడా వణుకుతాయో, ఎవరి కరుణా కటాక్షం కోసం ఎమ్మెల్యే దగ్గర్నించి, సెంట్రల్ మినిస్టర్ వరకూ ఎదురు చూస్తారో కింగ్ మేకర్, లిక్కర్ సామ్రాట్ శ్రీ అబ్బయ్యనాయుడుగారు మీతో స్వయంగా చెప్పమన్న మాటలు చెపుతున్నాను సారా నిషేధం లాంటి పిచ్చి, పిచ్చి ఆలోచనలు మానేయండి. మీ పిరియడ్ ఇంకా పన్నెండు నెలలుంది. ఏడాదిపాటు హాయిగా ఉండండి. అబ్బయ్య నాయుడుగారు మీకిస్తున్న సిన్సియర్ ఎడ్వైజ్ ఇది."
"మిస్టర్! గెటప్-గెటవుట్ ఫ్రమ్ హియర్" సాధ్యమైనంత కూల్ గా అన్నారు చీఫ్ సెక్రట్రీ వరదరాజన్.