"అలాగేలెండి."
బైటకెళ్ళి తను లుంగీ మార్చుకుని, తన ఫ్యాంటూ, షర్టూ తెచ్చిచ్చి, బైటకెళ్ళిపోయాడు అరవింద్.
నీలిమ డ్రెస్ ఛేంజ్ చేసుకుంది.
అరవింద్ దుస్తులు నీలిమకు సరిగ్గా సరిపోతాయి.
"వండ్రఫుల్ దీన్నిబట్టి చూస్తే మీ శారీ, బ్లౌజ్ నాకు సరిగ్గా సరిపోతాయి." ప్రశంసగా అన్నాడు అరవింద్.
నీలిమ, అరవింద్ కు హాస్టల్ ఫోన్ నెంబర్ ఇచ్చింది.
ఒక గంటతర్వాత అక్కడనుంచి బయటకొచ్చింది. అటూ, ఇటూ పరిశీలనగా చూస్తూ బస్టాండ్ లో కొస్తూ, దూరంగా కన్పించిన పోలీస్ జీపును చూసింది.
అరవింద్ వూహించింది కరెక్ట్ బహుశా తనను కూడా చూసే ఉండవచ్చు.
జీపులో కూర్చున్న ఇన్ స్పెక్టర్ నీలిమ కట్టుకున్న చీరను బాగా గుర్తుపెట్టు కున్నాడు. ఆ చీరలో నీలిమ కన్పిస్తే, అరెస్టు చేసి నానా బాధలూ పెట్టేస్తాడు.
"థాంక్ గాడ్." బస్ లో కూర్చున్న నీలిమ అనుకుంది తను వేసుకున్న బ్యాగీఫాంటూ, షర్ట్ చూసుకుంటూ మరో అయిదు నిమిషాలకు బస్సు బయలుదేరింది.
అదేరోజు రాత్రి ఏడు గంటలకు అరవింద్, మిగతా ఫ్రెండ్స్ దుస్తులూ, వేషాలూ మార్చుకుని అమ్మాయిల రూపంలో గూడూరువరకూ పాసింజర్ ట్రైన్లో వెళ్ళి అక్కడ అందరూ తిరిగి డ్రెస్ లు చేంజ్ చేసుకుని, హైద్రాబాద్ ట్రైన్ ఎక్కారు.
ఈ సంఘటనకు తొమ్మిది గంటల ముందుకు, అంటే నీలిమ, శ్రీకాళహస్తికి బయలుదేరిన సమయం దగ్గరకు వస్తే-
కాటేజ్ మెట్లు దిగి ఎడమవేపు మలుపు తిరిగి ముగ్ధ, కాటేజ్ లన్నీ చూస్తూ నడుస్తోంది.
ముగ్ధ అటువేపు వెళ్ళగానే కుడివేపునుంచి వస్తున్న శ్రీధర్ ని చూసి ఆశ్చర్యంతో, కుర్చీలోంచి ముందుకడుగేసింది సురభి.
* * * * *
రోజ గార్డెన్ దాటి, వెంకట్రమణనగర్ దాటి శంఖుమిట్ట పార్క్ దగ్గర కొచ్చింది ముగ్ధ.
'పుట్టుకతో వృద్దుడు' అని తమ ఫ్రెండ్స్ పేరుపెట్టిన ఆ కుర్రవాడు కనిపిస్తాడా? కనిపిస్తే బాగుణ్ను.
పార్క్ దగ్గర నిలబడి కుడివేపు - కేంటీన్ వేపు వెళ్ళే దారివేపు ఎడమవేపు ఆనంద్ అళ్వార్ తోటవేపు వెళ్ళే దారివేపు చూస్తోంది ముగ్ధ. ఆ రెంటికీ మధ్యన కొంచెం లోపలికి వున్న గజేంద్ర మోక్షం చెరువుకి కొంచెం దూరంలో గుంపుగా జనం గుమిగూడి వుంటే అటువేపు అడుగు వేసింది ముగ్ధ.
ఏవో నేలమీద పెట్టి అమ్మే చిల్లర వస్తువులు కొనుక్కుంటున్నారు భక్తులు.
ప్రమిదలు, రుద్రాక్షమాలలు, గంధపు చెక్కలు, గంటలు, దేవుడి పటాలు ఇలా ఎన్నో అక్కడున్నాయి.
'ఏదైనా ఐదురూఅప్యాలు కొనండి బాబూ....కొనండి" ఆ గొంతుని ఎక్కడో విన్నట్టు అనిపిస్తే, అడ్డుగావున్న భక్తుల్ని తప్పించుకుని ముందుకడుగేసింది ముగ్ధ.
"ఏదైనా ఐదురూపాయలు కొనండి బాబూ.... కొనండి" ఆ గొంతుని ఎక్కడో విన్నట్టు అనిపిస్తే, అడ్డుగావున్న భక్తుల్ని తప్పించుకుని ముందుకడుగేసింది ముగ్ధ.
"కొనండి బాబూ... కొనండి" ఆ వస్తువుల్ని అమ్మే దుకాణదారుడ్ని చూడగానే నవ్వుకుంది ముగ్ధ.
'పుట్టుకతో వృద్దుడు' ఇలా ఈ వేషంలో ప్రత్యక్షమౌతాడని వూహించలేదు ముగ్ధ మామూలు ఫాంటూ, షర్ట్ లో వున్నాడతను.
అక్కడి వస్తువుల్ని చూస్తూ అక్కడి వస్తువుల్ని అతడు అమ్మే తీరును చూస్తూ గంటసేపు గడిపింది ముగ్ధ పదిన్నర కావడంతోనే సామానుని మూటకట్టేసి, పార్క్ దగ్గరికొచ్చి ఓ చెట్టుకింద కూర్చున్నాడా యువకుడు.
కొంచెం దూరంలో వుండి అతన్ని గమనిస్తున్న ముగ్ధ ఆ చెట్టుకిందకు నడిచి "నేను జ్ఞాపకం వున్నానా?" అని అడిగింది.
చేతిలోని డబ్బుల్ని లెక్కపెట్టుకుంటున్న ఆ యువకుడు తలెత్తి-
"లేదండి... లేదండి.... నేను మిమ్మల్నెప్పుడూ చూడలేదండీ...." అన్నాడు.
అతని పరధ్యానానికి మనసులోనే నవ్వుకుంది ముగ్ధ.
"తెల్లవారుఝామున గుడిలో కలవలేదూ?" పక్కనే పచ్చికలో కూర్చుంటూ అంది ముగ్ధ.
"అవునండోయ్! కలిశాం సుమండీ! మీకు భలే జ్ఞాపకం వుంటుందే! నాకే విషయం జ్ఞాపకం వుండదండీ" అన్నాడు డబ్బులు లెక్కపెట్టుకుంటూనే.
అతని అమాయకమైన మాటల్ని చూసి నిజంగా అమాయకుడేనా అని అనుకుంది ముగ్ధ.
"చెప్పండి... ఏం కావాలి? పూజామందిరం ఐటమ్స్ కావాలా?" ఆ మాట అన్న అతనివేపు చూసింది. 'ఐటెమ్స్' అన్న పదాన్ని అతను ఉచ్చరించిన పద్దతిని చూసి ఇతను బాగా చదువుకున్న వ్యక్తిలాగే వున్నాడే అనుకుంది.
"నా పేరు ముగ్ధ ఇక్కడి యూనివర్శిటీ స్టూడెంట్ ని మీ మాట, మీ పద్దతి చూస్తే మీరు చిత్తూరుజిల్లా వారిలా లేరు అవునా?"
"నా గురించి ఎందుకు మేడమ్?" మళ్ళీ తన డబ్బులు లెక్కపెట్టుకోవడంలో వున్నాడు.
"ఒక వ్యక్తి తన పేరు చెప్పి, పరిచయం చేసుకుందంటే దానికి రియాక్షన్ ఇలాగేనా వుండేది?" చనువుగా తీసుకుంటూ అంది ముగ్ధ అతను తలెత్తి ఒకసారి ముగ్ధవేపు చూశాడు.
ముగ్ధలోని నల్లటి లావణ్యం అతనికెంతో నచ్చింది. నల్లగులాబీలా వుంది అని అనుకున్నాడు.
"నా పేరు రాజేంద్రప్రసాద్ మా అమ్మ రాజూ అని పిలుస్తుంది. మా నాన్న ఇప్పుడు లేడులేండి ప్రసాద్ అని పిలిచేవాడు. నాకు వాళ్ళిద్దరే మాది రాజమండ్రి" సీరియస్ గా చెప్పాడు రాజేంద్రప్రసాద్.
"నాకు వాళ్ళిద్దరే అని ఈ సందర్భంలో వాడరు. వాళ్ళిద్దరికీ మీరే అని అనాలి. మరి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫీకేషన్స్ చెప్పలేదు?"
"మీరేవైనా సి.బి.ఐ డిపార్టుమెంట్ నుంచి రాలేదుగానీ మీ క్వాలిఫికేషన్స్ చెప్పచ్చుగదా?"
"కావాలా? ఆంధ్రా యూనివర్శిటీ, ఎం.కాం., సరిపోయిందా?"
ఇతను ఎం.కామ్ చదివాడా? అస్సలు నమ్మలేకపోయింది ముగ్ధ పరిస్థితి బాగోలేక ఇలా చిన్న వ్యాపారం చేసుకుంటున్నవాడిలా కనబడిన అతడ్ని చూసి జాలిపడింది ముగ్ధ.
"ప్రతి స్త్రీలోనూ, దేవతను చూడగలిగిన మీరు, ఉదయం నా కాళ్ళకు దండం పెట్టిన మీరు, ఇప్పుడు నామీద కోప్పడుతున్నారు?" అంది ముగ్ధ.
"నిజం చెప్పండి నేనేం కోప్పడ్డానా? నా పనిని డిస్ట్రబ్ చేస్తున్నారన్నాను అంతే పోనీ, మీకేం కావాలో అడగండి చెప్తాను."
"ఇద్దరం అపరిచితులం అవునా, కాదా? సాధారణంగా అబ్బాయిలె అమ్మాయిల్ని పలకరిస్తారు. కానీ యిందుకు భిన్నంగా నేనే మిమ్మల్ని పలకరించాను. అంటే ఏంటీ? ఫ్రెండ్ షిప్ కోసమేకదా మరి" ఏదో చెప్పబోతున్న ముగ్ధకు అడ్డొచ్చాదు రాజేంద్రప్రసాద్.
"ఫ్రెండ్ షిప్పా? నాతోనా? మీకేం పిచ్చా? వెర్రా? అసలు మీరెవరో తెలీదు. నేనెవరో మీకు తెలీదు. నా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మీరు నాటకం ఆడుతున్నారో, లేదా నన్ను ఫూల్ ని చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారో నాకేం అర్ధంకావడంలేదు."