"నా మూలంగా మీ భృతి పోయిందా? ఎలా? అసలు మీరెవరో నాకు తెలీదు. నేనెవరో మీకు కొద్దిగా తెలిసినట్లుంది. అందుకే నా పేరు పెట్టి పిలిచారు. అయినా నాకే భృతి లేక నేనుంటే, మీ భృతిని ఎలా తొలగిస్తాను? నాకర్ధం కావటం లేదు."
మాధుర్ కి అంతా అయోమయంగా వుంది.
"మీరు వారం క్రితం ఓ చిన్న హోటల్ కి లవర్స్ కార్నర్ అని పేరెట్టి, పబ్లిసిటీ ఎలా చేసుకోవాలో చెప్పారా?" ఆమె సూటిగా చూస్తూ అడిగింది.
"అయితే....!?"
"అయితే ఏముంది.... చూస్తుండగానే ఆ హోటల్ బాగా పికప్ అయింది. చుట్టుపక్కల వాళ్ళ హోటల్స్ అన్నీ దెబ్బతినిపోయాయి. అలా దెబ్బతిన్న ఒక హోటల్ లో నేను ఎకౌంటెంట్ ని. నా ఉద్యోగం ఇప్పుడు హరీ అంది. కారణం వెతగ్గా అందుకే మీరే ప్రధాన కారకులని తెలిసింది. అందుకే నిలదీద్దామని వచ్చాను."
మాధుర్ ముందు ఒకింత ఆశ్చర్యపోయి, పెద్దగా నవ్వేస్తూ "మనం ఫుడింగ్ కి డింకీ.... డబ్బు ల్లేకుండా ఓరోజు ఆ హోటల్ లో టిఫిన్ తిన్నాను. నా దగ్గర డబ్బుల్లేక ఆ ఐడియా ఇచ్చాను. అవునూ....ఎలా నడుస్తోందా హోటల్?"
"అది బ్రహ్మాండంగానే నడుస్తోంది. నా గతేమిటి? మీరే నాకేదో ఉద్యోగం చూపించాలి" అందామె మొండిగా.
"నేనా-?! మీరెవరో గాని భలే జబర్ధస్తీ చేస్తున్నారే....? నాకే ఉద్యోగం లేదు. మరలా మీకు ఉద్యోగమివ్వటమా?" ఆశ్చర్యపోతూ అన్నాడు.
"అదేం చేస్తున్నారుగా....రంగులేస్తున్నారుగా? మీరు చేసే పనికి మీకిచ్చే జీతంలో సగం నాకివ్వండి. మీ పనిలో సగం నేనూ చేస్తాను."
భార్గవకు వారిద్దరి సంభాషణ సరదాగా వుంది.
"ఇది నా ఉద్యోగం కాదు. ఇందులో చిన్న వ్యాపారం పెడదామని దీన్ని బాగుచేస్తున్నాం. అసలీ బిల్డింగ్ ఇదిగో ఈ భార్గవది నాది కాదు...."
"మిస్టర్ భార్గవా... మీరే చెప్పండి. నా కోరికలో న్యాయముందా? లేదా? మధ్యతరగతి ఆడపిల్లను. పేదదాన్ని ఎలా బ్రతకాలి? అక్కడికి ధైర్యం చేసి జె.జె. ఎంఫైర్ కి ఇంటర్వ్యూకెళ్ళాను. లేదు... పో... నువ్విక్కడ పనికిరావు పో అన్నారు. పెద్ద అక్కడేదో మహా మేధావులున్నట్లు" ఆమె కావాలని నిరసన వ్యక్తం చేస్తూ అంది.
ఆమె పథకం సక్సెస్ అయింది.
"దటీజ్ ఫూల్స్ పేరడైజ్... కాకా పట్టేవాళ్ళకు, చెంచాగిరి చేసే వాళ్ళకే అక్కడ ఉద్యోగాలు నాకు మీకు జరిగిందే జరిగింది" మాధుర్ లోని జె.జె. ఎంఫైర్ మీద కోపం మౌనిక మీద జాలిగా మారింది.
"మరి మీరైనా నన్నాదుకోరా?" ఆమె జాలిని ప్రదర్శిస్తూ ఆఖరి బాణం వేసింది.
అదెళ్ళి సూటిగా మాధుర్ జాలి గుండెపై తగిలింది.
ఆమె అతనేం చెబుతాడోనని ఆతృతగా ఎదురుచూస్తోంది.
మాధుర్ ఆలోచిస్తూనే భార్గవవేపు చూసాడు.
భార్గవ పాపం ఆడపిల్లన్నట్టు చూసాడు.
మాధుర్ మౌనికవేపు తిరిగాడు.
కొద్దిక్షణాలు సంశయంగా ఆమెకేసి చూస్తూండిపోయాడు.
"మేం కావాలనే కష్టాల్లోకి దూకుతున్నాం. మునిగిపోయిన ఓడను పైకిలేపే బృహత్తర కార్యక్రమంలో వున్నాం. మీకు ఉద్యోగం అంటూ ప్రత్యేకంగా ఇవ్వలేం. మాతోనే కల్సి పనిచేయాలి. మేం తిన్నది తినాలి... పడుకున్న చోటే పడుకోవాలి. ఆడపిల్ల మీకెందుకు యీ కష్టాలు?"
ఆమెకు తొలి మెట్టుపై విజయం సాధించినందుకు ఆనందంగా వుంది.
"కష్టాలు, నష్టాలు మీ మగవారివి, లాభాలు, సుఖాలు మావి అనే ఆడపిల్లను కాను నేను. అవేవయినా మీతోటే కల్సి పంచుకుంటాను" అంది సంతోషంగా.
మాధుర్ నవ్వుతూ చెయ్యి చాపాడు. ఆమె రెండంగల్లో మాధుర్ ని సమీపించి అతని చేతిలో తన కుడిచేతిని కలిపింది.
మౌనికకు కొద్దిక్షణాలు షాక్ లాంటి ఫీలింగ్.
మాధుర్ మామూలుగానే వున్నాడు.
మౌనిక నవ్వుతూ భార్గవవేపు చూసింది.
భార్గవ చటుక్కున లేచి వచ్చి, తన చేతిని వారి చేతులతో కలిపాడు.
"ఒకరికిద్దరం-ఇద్దరికి ముగ్గురం... మెడిసన్ ఎవన్యూ ఎడ్వర్ టైజింగ్ ఏజన్సీకి ఈరోజే శుభారంభం. ఇకనుంచి ఆలోచనలు నావి. ఆచరణ మీది. లెటజ్ హోప్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్" అన్నాడు మాధుర్ ఆనందంగా. మాధుర్ తన చేతిలోని రంగు డబ్బాని మౌనికకు అందించాడు. ఆమె దాన్నందుకోగానే తనొకటి తీసుకున్నాడు.
అరగంటైనా మౌనిక రాకపోవటంతో ఏం జరిగిందో తెల్సుకుందామని రమణయ్య అటుగా వచ్చి, గేటు దగ్గర నుంచుని లోపలకు చూశాడు.
కొద్దిక్షణాలు ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి నమ్మలేకపోయాడు.
మౌనిక మరో ఇద్దరు యువకులతో కలిసి వెలిసిపోయిన గోడలకు రంగువేస్తోంది.
"నిజంగా నువ్వు సమర్దురాలివేనమ్మా... అనుకున్నది తప్పక సాధించగలవు. మే గాడ్ బ్లెస్ యూ...." మనస్సులోనే అనుకుంటూ ముందుకు సాగిపోయాడు రమణయ్య.
"మనకిప్పుడో మంచి పెయింటర్ కావాలి భార్గవా" తల తిప్పకుండానే అన్నాడు మాధుర్.
"ఎక్కువ డబ్బులు తీసుకుంటారేమో మాధుర్" భార్గవ సందేహిస్తూ అన్నాడు.
వాళ్ళ దగ్గర అంతంత మాత్రమే వుంది డబ్బు.
"నాకు కొద్దిగా వచ్చు పెయింటింగ్.... ట్రై చేయించకూడదూ?" మౌనిక కళ్ళను తమాషాగా ప్రక్కకి తిప్పి చూస్తూ అంది.
"గోడమీద పద్దులు రాయవు గదా?" నవ్వుతూ అన్నాడు మాధుర్.
"పద్దులా...? పద్దులేంటి?" మౌనిక కర్ధంకాక అడిగింది.
"ఇంతకుముందు హోటల్లో ఎకౌంట్స్ రాసానన్నావుగా.... అందుకన్నాను అప్పుడే పాత జాబ్ ని మర్చిపోయావా?"
ఓ క్షణం కలవరపది వెంటనే తేరుకుంది.
"ఛా....ఛా... కాకపోతే మీకే నమ్మకం వుండాలి నామీద" ఆమెకి అప్పటికే చేతులు నొప్పెట్టసాగాయి. పట్టుపరుపులు, మెర్సిడస్ కార్లు, పోష్ బంగ్లాస్, సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ కార్యాలయాలు, డైమండ్స్, గోల్డ్, కరెన్సీ కట్టల మధ్య పెరిగిన సుకుమారి మౌనిక నొప్పుల్ని నిగ్రహించుకుంటోంది పళ్ళు బిగువున.
"నే చెప్పింది మన కాంపౌండ్ వాల్ కి కుడివేపున వున్న స్పేషియస్ సాఫ్ట్ కాంక్రీట్ వాల్ మీద రాయాలి. రాస్తావా?" అంటూ ఆమెకేసి చూసి నవ్వాడు ఫక్కున.
"ఏమిటి ఈ మాత్రానికే నుదుటన చెమటలు పట్టేశాయి" అంటూ మౌనిక దగ్గరకు వెళ్ళాడు.
ఆమె నిచ్చెన మీదుంది.
దాంతో ఆమెకు నుదుటన పట్టిన స్వేదాన్ని అడ్డుకునేందుకు వీలుపడలేదు. పైగా ఓ చేతిలో పెయింట్ డబ్బా, మరో చేతిలో బ్రష్ వుండిపోయాయి.
మాధుర్ తన భుజం మీదున్న నేప్ కిన్ తీసుకుని తనే దగ్గరకు వెళ్ళి సుతారంగా ఆమె నుదుటిని అద్దాడు.
అప్పుడామె మాధుర్ చర్యకు ఓ క్షణం ఆశ్చర్యపోయి అతని కళ్ళలోకి చూసింది. వాటిలో ఎలాంటి కాంక్ష లేదు. ఒక యువతిని ముట్టుకోవాలని మగాడిలో సహజంగా వుండే లాలస అతని కళ్ళలో మౌనికకు కనిపించలేదు.
తమ కష్టం పంచుకుంటుందే అన్న అభిమానంతోనే అలా చేసినట్టు అనిపించి మాధుర్ వేపు కృతజ్ఞతగా చూసింది.
మాధుర్ ఇంకా నవ్వుతూనే వున్నాడు.
ఏం? ఎందుకన్నట్లు కళ్ళెగురవేసింది తమాషాగా మౌనిక.
"రంగు వేయమన్నది గోడకు" ఈసారి భార్గవ కూడా నవ్వాడు.
"అంటే...?" మౌనికకింకా వాళ్ళెందుకు నవ్వుతున్నారో అర్ధం కాలేదు.
"వేయమన్నాంగాని, వేసుకోమనలేదుగా?" ఆమె అప్పుడు తనకేసి చూసుకొని సిగ్గుపడి పోయింది.
బుంగమూతితో- "మీరే పెద్ద గొప్పలేండి" చిన్నపిల్లలా ఉక్రోషపడుతూ.
ఆమె ఉక్రోషాన్ని చూసి మరింత నవ్వాడు మాధుర్.
ఎంత హాయిగా నవ్వగలుగుతున్నాడతను. రేపు తిండికి డబ్బు లేకున్నా ఎంత సంతోషంగా వుండగలుగుతున్నాడు?
కొత్త కొత్త ఆలోచనలొస్తున్నాయ్ మౌనికకు.
మరో గొప్ప ఫీలింగ్ ఆమె మనస్సు మూలల్లో రిజిష్టర్ అయిపోయింది.
తనకు పదిహేను సంవత్సరాలప్పుడు సమ్మర్ హాలిడేస్ కి న్యూయార్క్ లో వున్న తాతగారి దగ్గరకు వెళ్ళింది. అప్పుడో రోజు తాతగారు మనస్సుపడి కొనుక్కున్న రోల్స్ రోయిస్ కారు వీకెండ్ రిసార్ట్ ముందుపెట్టి వుండగా, తను చూసుకోక త్రోబాల్ ని విసరగా, అదెళ్ళి కారు ప్రక్కగా వున్న నీళ్ళ గుంటలో పడి బురద నీటిని కారుమీదకు చిమ్మింది.