Previous Page Next Page 
మొగలిబాకు పేజి 24

   

     "ఇప్పుడు చెప్పు-నువ్వు ప్రేమ గురించి ఏదో చెప్పాలనుకుంటున్నావ్ కదూ......నన్ను....నువ్వు ....ప్రేమిస్తున్నా......వ.....ని...." అతని నోటి వెంబడి ఆ మాటలింకా బయటకు రాలేదు.
   
    అతగాడి చెంప ఫెళ్ళున పేలిపోయింది.
   
    "బిహేవ్ యువర్ సెల్ఫ్.....నేన్నిన్ను ప్రేమించాలా....నీకు కూడా నేనంత చులకనైపోయానా? అటు ఆ నారాయణరావే అనుకుంటే..... అంతకన్నా భజగోవిందం గాడివి తయారయ్యావ్.....జాగ్రత్త...." అంటూ బస్సు దిగిపోతున్న సంధ్య ముందుకెళ్ళి ఆశ్చర్యాతి ఆశ్చర్యంగా ముఖం పెట్టి-
   
    "బేబీ..... నువ్వు.... నువ్వు..... ఈ లవ్ గేమ్ లో ఈ స్త్రీ జాతి వేపునందున్న సంధ్యవా" అడిగాడు పరకాయమణి.
   
    అవును అన్నట్లుగా తలూపి బస్సు దిగిపోయి, ఫుట్ పాత్ మీద నడవటం మొదలెట్టింది.
   
    ఆవిడే సంధ్యని అకస్మాత్తుగా తెలియడంతో ఆనందంతో ఉబ్బు తబ్బిబ్బు అయిపోయిన పరకాయమణి ఆ షాక్ ను తట్టుకోలేక బస్సులో పడిపోయాడు.
   
    కండక్టర్ గారికి ప్రేమ మూర్చ వచ్చిందని ఎవరో గట్టిగా అరిచారు.
   
                                           *    *    *    *
   
    ఆ సమయంలో వచ్చిన సంధ్యను చూసి విస్తుపోయింది మోతీలక్ష్మీ.
   
    "ఏవిటీ ఇలా వచ్చావ్..... ఈ లవ్ గేమ్ పూర్తయ్యే వరకూ.....స్టూడెంట్స్ యూనియన్ జనరల్ బడీ మెంబర్స్ ఎవరినీ కలవడానికి వీల్లేదనే మన రూల్ ని నువ్వు అతిక్రమించడం ఏం బాగాలేదే సంధ్య" అంటూ తలుపుకి అడ్డంగా నిలబడింది మోతీలక్ష్మి.
   
    "నువ్వు తప్పుకుంటావా? తన్నమంటావా?" బెదిరించేసరికి మోతీలక్ష్మీ పక్కకు తప్పుకుని-
   
    "అయితే.... ఎవ్వరికీ తెలీకుండా నాతో మాట్లాడి వెళ్ళిపో......" అంటూ డ్రాయింగ్ రూమ్ లో కుర్చీని చూపెట్టిందామె.
   
    "నాకిదంతా చాలా చికాగ్గా వుంది" నుదుటను పట్టిన చెమటను తుడుచుకుంటూ అంది సంధ్య.
   
    "పనిమనిషి ఇవాళ డుమ్మా కొట్టిందిలే" అంది ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ మోతీలక్ష్మీ.
   
    "నువ్వేం మాట్లాడుతున్నావ్....." విస్మయంగా ప్రశ్నించింది సంధ్య.
   
    "అదే..... నువ్వు మాట్లాడుతున్నది.... ఈ డ్రాయింగ్ రూమ్ గురించే కదా.....పనిమనిషి రోజూ టంచన్ గా వచ్చి ఊడ్చేది.....ఇవాళ రాలేదు..... అదే చెపుతున్నాను" అందామె.
   
    "మీకందరకూ మతులు పోయాయి. ఆ డేవిడ్, ఆ దివ్య చచ్చిపోవడం కాదు గానీ, మీకందరకూ మతులుపోయాయి. ఈ లవ్ గేమ్ ని తెచ్చి నా మెడకు చుట్టారు.....నాకీ పోటీల్లో పాల్గొనడం ఇష్టంలేదు...." సీరియస్ గా చెప్పింది సంధ్య.
   
    "అది చెప్పడానికొచ్చావా నువ్వు.... లాభంలేదు.....నీకు నచ్చినా నచ్చకపోయినా నేనేం చెయ్యలేను. ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అధికారం నాకు లేదు......"
   
    "పెద్ద అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ లా మాట్లాడక.....చూడు.....ఆరోజు మీ జనరల్ బాడీ తయారు చేసిన రూల్స్, రెగ్యులేషన్స్ లో ఈ కంటెన్ట్ లో పాల్గొంటున్న ఇద్దరిలో ఏ ఒక్కరి క్యారెక్టర్ అయినా, గుడ్ క్యారెక్టర్ కాదని రుజువయితే పోటీలో వుండడానికి అనర్హులని అన్నారా?"
   
    "అవును.....ఆ క్లాజ్ వుంది.....ప్రేమకు కేరక్టర్ కూడా చాలా అవసరం" అంది మోతీలక్ష్మీ.
   
    "మరి ఆ నారాయణరావుకి క్యారెక్టర్ లేదు__అంచేత నేనతన్ని ప్రేమించలేను"

    "సడన్ గా స్టోరీ అల అమలుపు తిరుగుతుందని ఊహించిన మోతీలక్ష్మీ ముఖంలో రంగులు మారిపోయాయి.
   
    "ఏవయింది..... నారాయణరావు ఎలాంటివాడో మనకు చాలాకాలంగా తెలుసు__పరీక్షల్లో కాపీ కూడా ఎలా కొట్టాలో తెలీనివాడు-సినిమాహాల్లో బాత్రూమ్ ల మీద హి- షి- అని ఎందుకు రాస్తారో కూడా తెలీక చాలాకాలం మధన పడిపోయిన అమాయకుడు నోట్లో వేలుపెడితే కొరకకుండా చప్పరించేవాడు. అలాంటి నారాయణరావుకి క్యారక్టర్ లేదని నువ్వానడం నాకేం నచ్చలేదు."
   
    "నీకు అమాయకత్వానికి, అజ్ఞానానికి తేడా తెలీదు" ఆగ్రహం వ్యక్తంచేస్తూ అంది సంధ్య.
   
    "అవును. అజ్ఞానంవేరు, వ్యక్తిత్వంవేరు. ఇప్పుడేమయిందో చెప్పు" తాపీగా అడిగింది మోతీలక్ష్మి.
   
    "ఈ లవ్ గేమ్ లో ఇద్దరి కాండిడేట్లకూ మంచి వ్యక్తిత్వం కూడా వుండాలని రూలుగదా.....ఆ మంచి వ్యక్తిత్వం నారాయణరావుకి లేదని నాకు తెల్సిపోయింది. మన నారాయణరావు ఇప్పటికీ ఒకావిడతో రహస్యంగా ప్రేమ వ్యవహారం వెలగబెడుతున్నాడు. నా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి"
   
    "నారాయణరావుకి ప్రేమ వ్యవహారమా.....నేను నమ్మను.....అతగాడు నాకు గత మూడేళ్లుగా తెలుసు....బస్టాపుల్లో నిలబడితే అమ్మాయిలమీద నుంచి వచ్చే గాలి, తనకు తగులుతుందని, అల్లంత దూరాన నిలబడేవాడు" అలాంటి వాడికి ప్రేమ వ్యవహారమా__
   
    "నువ్వలా ఆశ్చర్యపోకు.....తన లైబ్రేరియన్ కమలాక్షిలేదూ....ఆవిడతో, ఆవిడ పర్సనల్ రూమ్ లో లైబ్రేరియన్ లో చాలాసేపు గడపడం నేను మొన్న కళ్ళారా చూశాను. చెప్పు.....అలాంటి వాడిని.....నేనెలా ప్రేమించగలనో నువ్వు చెప్పు"
   
    జనరల్ బాడీ సమావేశంలో ఆ సంఘటనకు సంబంధించి వచ్చిన రిపోర్టు జ్ఞాపకం వచ్చింది మోతీలక్ష్మికి.
   
    చిన్న చిరునవ్వు నవ్విందామె.
   
    "చూడు సంధ్యా__మనుషులన్నాక పొరపాటు పడడం చాలా సహజం.....ఒక్కొక్కప్పుడు దేవుడే పొరపాటు పడతాడు.....ఈ విషయమై నేను ఇప్పటికే చాలా పుస్తకాలు తిరగేసాను. మనుషులకున్నట్టు, వృద్దాప్యం వచ్చాక దేవుడికీ కూడా చత్వారం వస్తుందని నేను నమ్ముతున్నాను" తన కళ్ళజోడుని తీసి పైట చెంగుతో తుడుచుకుంటూ అంది మోతీలక్ష్మి.
   
    "నేనిప్పుడు చత్వారం గురించీ, కళ్ళజోడు గురించీ మాట్లాడడానికి రాలేదు.....పాయింట్ కిరా....ఆ కమలాక్షితో రహస్య సంబంధమున్న ఆ నారాయణరావుని నేను ప్రేమించనుగాక ప్రేమించనంతే......నేనీ లవ్ గేమ్ నుంచి విరమించుకుంటానంతే"
   
    భారంగా నిట్టూరుస్తూ సంధ్యవేపు చూసింది మోతీలక్ష్మి.
   
    "లేదు సంధ్యా__రూల్స్ ఒప్పుకోవు.....నాకు అనుమానంవచ్చిన ఒక ఆరోపణను నువ్వు జనరల్ బాడీలోని ఒక ఇంపార్టెంట్ మెంబర్ ముందు పెట్టావు.....దీని తర్వాత నేను ఎంక్వయిరీ కమీషన్ వెయ్యాలి. ఆ కమలాక్షి, నారాయణరావు విషయానికి సంబంధించి దర్యాప్తు జరగాలి.....దర్యాప్తు నివేదిక రావాలి.....ఆ నివేదికను జ్యూరీ పరిశీలించాలి అంతవరకూ నువ్వు ఈ లవ్ గేమ్ నుంచి తప్పించుకోకూడదు.....తప్పించుకుంటే లక్షరూపాయలు ఫైన్ కట్టాల్సి వుంటుంది."
   
    "లక్షరూపాయల ఫైనా? ఇదెక్కడిగోల.....మొదట తయారుచేసిన రూల్స్ లో ఈ లక్షరూపాయల గోల లేదుగా" షాక్ తింటూ అంది సంధ్య.
   
    "అవును__అప్పటివరకూ అంటే ఒక ఐదు నిమిషాల క్రితం వరకూలేదు.......ఇప్పుడే నాకు ఐడియా వచ్చింది.....దాన్ని రూల్స్ రెగ్యులేషన్స్ లో యాడ్ చేస్తాను....సీ సంధ్యా.....ఇక నుంచి నువ్వుగానీ, నారాయణరావుగానీ జ్యూరీ సభ్యులుండే ఇళ్ళకు, హాస్టల్స్ లోని రూములకు లోకూడదు....వస్తే రూల్స్ ని అతిక్రమించినట్టు లెక్క.....దానికి ఐదువందల చొప్పున ఫైన్ కట్టాల్సి వుంటుంది" అంటూ సీరియస్ గా లేచి నిలబడింది మోతీలక్ష్మి.

 Previous Page Next Page