ఆ కళ్ళు నవ్వుతున్నట్లుగా వున్నాయి. ఆ పెదవులు కసి తీర్చుకున్న తృప్తితో నవ్వడానికి సిద్దంగా వున్నట్టున్నాయి.
"వదినా....." అంటూ మయూష కుప్పలా కూలిపోయింది.
"పిరికివాళ్ళు కొండను ఢీకొనడానికి ప్రయత్నించగూడదు. నాకు టైమ్ లేదు. నేను వెళుతున్నాను న అవేనక నువ్వు రావాలనుకుంటే అయిదు నిమిషాల్లో వచ్చి కారెక్కు."
చెప్పేసి వేగంగా వెళ్ళిపోయాడు జ్వాలాముఖిరావు.
పదిహేను నిమిషాల క్రితం మంగళ వాద్యాలతో కళకళ్ళాడిన కళ్యాణమండపం స్మశానభూమిలా కన్పిస్తోంది.
ఒక భూకంపం తాకిడికి వెయ్యి ముక్కలయిపోయిన నేలలా అయిపోయిందామెకు మనసు.
కన్నా కలలల్నీ నల్లటి ఆకుల్లా మాడిపోయి కనుల ముందే రాలిపోతున్నట్లుగా వుంది. పెను దుఃఖపు వర్షపాతంలో తడిసిపోయి నిలువునా నీరయిపోయి శతాధా భిన్నమైపోయిన మనసుతో__
దూరంగా కారు దగ్గరగా విలాసంగా నిలబడి తనవేపే చూస్తున్న జ్వాలాముఖిరావు వేపు చూస్తోంది.
అందాల జీవితపు వర్ణచిత్రం మీద విధి చిమ్మిన నెత్తురు మరక.
ఒక్కక్షణం__
ఆమెకు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనిపించింది.
సిగ్గుతో, అవమానంతో కసితో మట్టి బొమ్మలా నిలబడిపోయింది. ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో తెలీన వదిన మాలతి ఓదార్పుగా వచ్చి మయూష భుజం మీద చేయి వేసి ఆమె కళ్ళల్లోకి చూసింది.
"వ....ది....నా....అమ్మ జాగ్రత్త.... నాన్న జాగ్రత్త....నేను వెళుతున్నాను" ఉక్రోషంగా అంది మయూష.
"ఎవరమ్మా అతను?" ప్రేమగా అడిగింది వదిన మాలతి.
"నాకు తాళి కట్టిన భర్త"
"ఇంతకీ ఆయనెవరు? నవనీత్ ఏడీ?"
"ఔను. నవనీత్ ఏడి? తనతో ప్రేమగా, అభిమానంగా, చల్లగా, చక్కగా మాట్లాడిన నవనీత్ ఏడి?
జ్వాలాముఖిరావు ఆడించిన నాటకంలో నవనీత్ ఒక పాత్ర అని ఆమెకి అర్ధం కావటానికి అట్టే సమయం పట్టలేదు.
తనవేపే ఆశ్చర్యంగా చూస్తున్న అందరివేపూ ఒకసారి చూసి వడి వాడిగా ముందుకడుగేసింది ఆమె.
తనవేపే ఆశ్చర్యంగా చూస్తున్న అందరివేపూ ఒకసారి చూసి వడి వడిగా ముందుకడుగేసింది ఆమె.
కారుకు ఆమెకు మధ్య అయిదు అడుగుల దూరం మాత్రమే వుంది.
ఎందుకో అకస్మాత్తుగా తలెత్తి చూసిన మయూష వేపు జాలిగా చూస్తూ కన్పించాడు గాయత్రి మొగుడు శివాజీ.
అతని కళ్ళ చివర చిప్పిల్లిన కన్నీటి బిందువు!
శివాజీ తన పరిస్థితికి బాధపడుతున్నాడని తెల్సుకున్న మయూష గుండె భారమయిపోయింది.
మౌనంగా కారులోకి ఎక్కి కూర్చుందామె.
ఆమె పక్కనే జ్వాలాముఖిరావు.
ఆ కారు తిరుమల కొండ మీంచి దిగి మద్రాసు వేపు దూసుకు పోయింది.
మరో మూడు గంటల తర్వాత__
హైద్రాబాద్ వెళ్ళే విమానంలో జ్వాలాముఖిరావు పక్కన కూర్చుందామె.
సరిగ్గా అప్పుడే__
తిరుపతి రూయా హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోంచి బయటికొచ్చిన డాక్టర్ కాళహస్తిశర్మతో చెప్పాడు.
"సారీ మిస్టర్....యువర్ పాదర్ ఈజ్ నో మోర్....."
ఆ మరుక్షణం.....
శారదాంబ పెనుకేక వేస్తూ క్రింద పడిపోయి స్పృహ కోల్పోయింది.
* * * *
హైదరాబాద్ కి దాదాపు ముప్పై, కిలోమీటర్ల దూరంలో విశాలమైన తోట మధ్య ఉందా భవనం.
జ్వాలాముఖిరావు సిటీలో వున్న గెస్ట్ హౌసుల్లో అదొకటి.
ప్రస్తుతం అదే అతని నివాసం.
ఎత్తయిన ఇనప గేటు.
ఆ గేటు పక్కన సెక్యూరిటీ.
అందమయిన లాన్. కొంచెం దూరంలో ఆహ్లాదంగా కనిపించే స్విమ్మింగ్ ఫూల్.
రెండంతస్తుల భవనంలో మర మనుషుల్లా కనిపించే పని మనుషులు.
రాత్రి ఎనిమిది గంటలయింది.
ఫస్ట్ ఫ్లోర్ లో విశాలమయిన బెడ్ రూమ్ లో__
డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుంది మయూష.
ముందు రోజు రాత్రి ఆ భవనంలోకి తీసుకొచ్చి వొదిలిపెట్టిన జ్వాలాముఖిరావు ఆ తర్వాత కన్పించలేదు.
ఎప్పుడు ఏం కావాలో అన్నీ సరిగ్గా సమయానికి అమర్చే పని మనుషులున్నారు?
జ్వాలాముఖిరావు తనను ఎందుకు మాయచేసి పెళ్ళి చేసుకున్నాడు.
భార్గవి విషయంలో తనమీద కక్ష తీర్చుకోడానికా?
లేక__
మరో భార్గవిలా తనను తయారు చేయటానికా?
పరిపరి విధాలుగా ఆలోచిస్తోందామె మనసు.
జ్వాలాముఖిరావు తననిపుడు ఏం చేస్తాడు?
లీగల్ గా తనతో సంసారం చేస్తాడా?
ఆ తర్వాత.....!
ఆ ఆలోచన దుర్భరంగా ఉందామెకు.
నో....నో .... జ్వాలాముఖిరావులాంటివాడి కింద నలగడంకంటే తను ఆత్మహత్య చేసుకోవడం మేలు.
లేదు.....
తను పిరికిదానిలా ఆత్మహత్య చేసుకోదు.
తన జీవితాన్ని నాశనం చేసిన జ్వాలాముఖిరావు అంతాన్ని చూస్తుంది.
అంటే.....
జ్వాలాముఖిరావును తను చంపుతుందా?
చంపి జైలు కెళుతుందా?
అంతలోనే కమ్ముకొస్తున్న దుఃఖం అంతలోనే తనను తాను ఓదార్చుకుంటోంది.
ఒకపక్క పిరికితనం. మరొకపక్క తెలియని ధైర్యం.
* * * *
సరిగ్గా అదే సమయంలో__
తలుపు దగ్గర అడుగుల చప్పుడయితే తల ఎత్తి చూసింది మయూష.
జ్వాలాముఖిరావు!
గదిలోకి అడుగు పెట్టిన అతను తలుపు రెక్కలు దగ్గరగా వేసి బెడ్ రూమ్ లో గాలికి ఊగుతున్న ఉయ్యాల మీద విలాసంగా కూర్చున్నాడు.
అతని వేపు చూడటానికే అసహ్యంగా ఉందామెకు.
"ఏం మయూషా! ఎలా ఉంది నా దెబ్బ" భీకరంగా వుంది ఆ గొంతు.
"నువ్విప్పుడు నన్ను అసహ్యించుకుంటున్నావ్. నీ చేతుల్లో ఓ పిస్టల్ ఉంటే నువ్విప్పుడు నన్ను చంపడానిక్కూడా వెనకాడవు. నాకు తెలుసు. మృత్యువును నేను ఎప్పుడూ లెక్కచెయ్యను. కానీ అవమానం__ అవమానం నాకు మృత్యువుతో సమానం" లేచి విసురుగా దగ్గరకెళ్ళాడు జ్వాలాముఖిరావు.