సరిగ్గా-
అదే సమయంలో
దూరంగా ట్రాన్స్ ఫారమ్ దగ్గర పెద్ద ఎత్తున చప్పుడు కావడం, కరెంట్ పోవడం అంతా క్షణకాలంలో జరిగిపోయింది.
"పాడు కరెంట్ ఇప్పుడేపోవాలా. పెట్రో మాక్స్ లైట్స్ తీసుకురండి" గట్టిగా అరిచి ముందుకు పరుగెత్తాడు పీతాంబరం.
కారులోంచి తెల్లటి దుస్తుల్లో ఒక వ్యక్తి దిగడం, నలుగురు వ్యక్తుల మధ్య ఆ వ్యక్తి వడివడిగా నడుస్తూ పెళ్ళి అరుగుమీదకెక్కి మయూష పక్కన కూర్చోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది.
"జీవితంలో అతి విలువైన పెళ్ళికి కూడా ఇంత లేటేవిటి చేయాల్సిన తతంగం చాలా వుంది" అని అన్నాడు పురోహితుడు అసహనంగా.
అంతా చీకటి.
ఎవరో దూరంగా ఒకరిద్దరు టార్చిలైట్లు వెలిగించిన చిన్న వెలుగు తప్ప అంతా గాడాంధకారం.
"ముహూర్తం మించిపోతుంటే తతంగాలెందుకయ్యా మంగళ సూత్రధారణ కానివ్వండి పంతులుగారూ "గంభీరంగా ఒక మగగొంతు విన్పించింది.
"అలాగే నాదేం పోయిందీ" అంటూ పెద్ద గొంతుకతో పురోహితుడు మంత్రాలు చదవడం ప్రారంభించాడు.
మసక చీకటిలో రేడియం ముల్లు, తొమ్మిది గంటలు చూపిస్తోంది.
కొబ్బరి బొండాం మీదున్న మంగళసూత్రాన్నితీసి పెళ్ళి కొడుకుకి అందించాడు పురోహితుడు.
మాంగళ్యం తంతునానేనా.....మమ జీవన హేతునా.....
కంఠే బద్దాన్ని....అని పురోహితుడు మంత్రాలు చదువుతుండగా__
పెళ్ళికొడుకు లేచి నిలబడ్డాడు.
మయూష తల తిప్పి పెళ్ళి కొడుకుని చూడటానికి ప్రయత్నించింది-
* * * *
తలకు కట్టిన తెల్లటి పగిడీ తప్ప మరేం కనిపించడంలేదు.
పెళ్ళి కొడుకు దుస్తుల మీదనుంచి వస్తున్న 'పాయిజన్' సెంట్ వాసన మత్తుగా వుంది.
తగిన సమయంలో__
కరెంట్ పోయినందుకు బాధగా వుంది మయూషకు-
"పెళ్ళికొడుకు మంగళసూత్ర ధారణ చేస్తున్నాడు. అక్షంతలు తీసుకోండి" చీకట్లోనే అరిచాడు పురోహితుడు.
మంత్రాలు మిన్నంటుతుండగా__
పెళ్ళి కొడుకు మయూష మెడలో తాళి కట్టాడు.
తాళికడుతున్న సమయంలో అతగాడి వెచ్చని వేళ్ళ స్పర్శకు మయూష చీకట్లోనే సిగ్గుపడింది.
"ఈ టైమ్ లో కరెంట్ వచ్చేస్తే ఎంత బావున్ను" నిరాశగా అనుకుందామె.
అంతలోనే ఒక ఫోటో గ్రాఫర్ వాళ్ళిద్దరినీ ఫోటో తీసాడు. సరిగ్గా అదే సమయంలో.....
ఫ్లాష్ వెలుగు పెళ్ళికొడుకు మీద పడడం, ఆ వెలుగులో పెళ్ళి కొడుకు ముఖం అస్పష్టంగా కనబడడం-
మయూష ఆశ్చర్యంగా తల పైకెత్తడం-
మరుక్షణంలో కరెంట్ రావడం-
తెల్లని ట్యూబ్ లైట్లు వెన్నెల కాంతుల్తో మెరవడం...అంతా క్షణాల్లో జరిగిపోయింది.
పెళ్ళి కొడుకు ముఖంవేపు చూసిన పెళ్ళి కూతురు మయూష ముఖం ఒక్కసారిగా వివర్ణం అయింది.
"నువ్వా?" అని ఆమె నోటివెంబడి వచ్చిన మాటకు అతను "అవును" అని తాపీగా జవాబు చెప్పడం-
అంతా మాయలా వుంది మయూషకు.
ఏం జరిగిందో అర్ధం కావడంలేదామెకు. తల గిర్రుమని తిరిగిందామెకు.
"నేనే జ్వాలాముఖిరావుని. నువ్వు ద్వేషించిన జ్వాలాముఖిరావు. పురోహితుడు సాక్షిగా, దైవ సన్నిధిలో వేద మంత్రాల మధ్య నీ మెడలో మంగళ సూత్రం కట్టిన నీ భర్తను" గంభీరంగా నివ్పించింది జ్వాలాముఖిరావ్ గొంతు.
కొంచెం దూరంలో నుంచున్న పీతాంబరరావుకి ఆ పక్కన వరసగా కూర్చున్న శారదాంబ, మాలతి, గాయత్రి తదితరులకు ఫోటోలోని కుర్రాడికి బదులు-
నడివయసు మనిషి మయూష పక్కన కనబడడంతో పాలిపోయిన ముఖాల్తో ఆ దృశ్యాన్ని చూస్తున్నారు.
"నువ్వు ఎవడ్రా.....నవనీత్ ఏడీ... ఆ పతిగాడేడీ.....అంతా మోసం....ఒరేయ్ ....కాళహస్తి .....అంతా మోసం" పీతాంబరం ఒక్క సారిగా అరుస్తూ ముందుకు రాబోయి, పెళ్లరుగును తన్నుకుని కింద పడిపోయాడు.
"నాన్నా" హృదయ విదారకంగా రోదిస్తూ లేచి ముందుకొచ్చింది మయూష.
ఆడవాళ్ళందరూ ఒక్కసారిగా గొల్లుమన్నారు.
"అంబులెన్స్ ను పిలవండి. హాస్పిటల్ కు తీసికెళ్ళండి" ఎవరో సలహా ఇచ్చారు.
పదిహేను నిమిషాల సేపు అక్కడేం జరుగుతోందో ఎవరికేం అర్ధం కాలేదు.
స్పృహ కోల్పోయిన పీతాంబరాన్ని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసికెళ్ళారు.
ఆయనతో పాటు శారదాంబ, కాళహస్తి వెళ్ళారు.
కళ్యాణమండపంలోని అతిధులు తలోరకంగా మాట్లాడుకోవడం మొదలెట్టారు.
"పాతికేళ్ళయినా నిండని పిల్లని నడివయసు మనిషికిచ్చి పెళ్ళి చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చిందో?"
"డబ్బండీ.....డబ్బు....వరుడే తిరిగి చాలా డబ్బు ఇచ్చాడట" అని అక్కడున్న వాళ్ళు తలోరకంగా మాట్లాడసాగారు.
కన్నీటి ప్రతిమలా ఉంది మయూష.
"నా కెక్కువ టైమ్ లేదు మనం ఇక్కడ నుంచి వెళితే బాగుంటుందనుకుంటాను."
జ్వాలాముఖిరావు గొంతులోంచి ఆ మాతగానే సర్ర్ మని కాటు వేయడానికి వెనుదిరిగిన ఆడ నాగులా అతగాడి వేపు చూసింది మయూష.
అయిదు నిమిషాలసేపు మొద్దుబారిపోయిన ఆమె మెదడు వేగముగా ఆలోచించడం మొదలెట్టింది.
"జ్వాలాముఖిరావు పగ పాము పగ" అని చాలా మంది హెచ్చరించినా ఆ సంఘటన తర్వాత జ్వాలాముఖిరావు గురించి ఎందుకో తను ఆలోచించలేకపోయింది.
పతి అనే వ్యక్తి భుజంగాపతి అని ఎందుకు తెల్సుకోలేకపోయింది.
అంటే....
తన తండ్రిని ఒక ట్రాప్ లో ఇరికించి ఉపకారం చేసినట్టుగా చేసి తన తండ్రిని లోబరుచుకుని.
ఇదంతా.....ఇదంతా....నాటకమా?!
ఈ పెళ్ళి....ఈ పెళ్ళి?!!
కళ్ళల్లోంచి కన్నీటికి బదులుగా రక్తం వస్తున్నట్టుగా ఉంది మయూషకు.
ఒక్కసారి కోపంగా ముందుకెళ్ళబోయి ఆగిపోయింది.
ఆమె కొంగుకి అతని ఉత్తరీయానికి కట్టిన ముడి ఉరి తాడులా కన్పిస్తోంది.
చివ్వున జ్వాలాముఖిరావు కళ్ళల్లోకి చూసింది.