Previous Page Next Page 
కలగంటినే చెలీ పేజి 24

    
    "అయ్యో అంతదూరం నడవగలనా?" అంది ఊర్మిళ. ఆమెకీ వెళ్ళాలనే వుంది. బయట ప్రపంచం చూస  కొన్ని నెలలయింది. ఇంట్లోనే వుండి  బోర్ కొడుతోంది. అందులోనూ మరిదితో షికారంటే ఉత్సాహం తన్నుకొస్తోంది.

    చంద్రరేఖ చెప్పినప్పట్నుంచీ వెంకటాచలంతో ముందులాగా వుంటోంది.

    అతనితో క్లోజ్ గా మూవ్ కావడానికి కొద్దిగా ఇబ్బందిగా వుంది గానీ పాపభీతి మాత్రం లేదు.

    తను ఆ రోజు చెప్పి వచ్చాక రోజూ ఎవర్నో ఒకర్ని ఊర్మిళ ఇంటికి పంపించేది చంద్రరేఖ.

    అలా వెళ్ళిన వాళ్ళు  "నీ చెల్లెలు ఆయుష్షుతీరి కడతేరి పోయింది,. నువ్వు మాత్రం ఏం చేస్తావ్! అప్పటికీ నువ్వు ఆ పిల్లను బితకించుకోవడానికి ఎంత కష్టపడ్డావో కూడా మాకు తెలియదా....?" అంటూ చెప్పేవాళ్ళు.
 
    ఇలా చెప్పమని ముందుగానే చంద్రరేఖ రిహార్సల్స్ చేయించింది.

    దాంతో ఊరంతా తన గురించి చెడ్డగా అనుకోవడం లేదని ఊర్మిళ నమ్మింది.

    "రోడ్డు వరకు నడువ్ వదినా. అక్కణ్నుంచి ఎస్ యు పురం బస్సులో వెళదాం"

    "సరే"

    ఇద్దరూ పదిగంటల ప్రాంతాన బయల్దేరారు. వాళ్ళు రోడ్డు కొచ్చే సరికి మూడు బస్సుల జనం వున్నారు.

    సంతరోజు అంతే. ఒకపట్టాన బస్సులుదొరకవు. ఊర్మిళ ఉసూరు మంటూ ఓ బండమీద కూర్చుండిపోయింది. ఆమెకు ఇక ఓ అడుగు వేసేందుకు కూడా శక్తి చాలడంలేదు. రెండు ఫర్లాంగులు దూరమున్న రోడ్డుకి వచ్చేందుకే అరగంట పట్టింది.
 
    బస్టాండ్ లో వున్నవాళ్ళు ఇక బస్సులు దొరకడం కష్టమని నడవడం మొదలుపెట్టారు. అక్కణ్నుంచి టౌన్ కేవలం మూడు కిలోమీటర్లే.

    "మనమూ నడుద్దాం వదినా"

    "అయ్యో నా వల్ల కాదు బాబూ"

    మరో అరగంటకు వాళ్ళకి బస్సు దొరికింది.

    సంతలో అన్నీ కొనుక్కొని మెస్లో భోజనం చేసేటప్పటికి సాయంకాలం నాలుగయింది.

    "వెళ్ళేప్పుడు బస్సులు దొరకడం కష్టం వదినా. నడిచెళదాం నేనున్నాగా" అంటూ ఆమెను బలవంతంగా నడిపించడం ప్రారంభించాడు.

    చెక్ పోస్టు దాటేటప్పటికి అయిదయింది. వానాకాలం కావడంవల్ల మబ్బులు ఆకాశంలో చేరిపోయాయి అప్పటికే. మధ్యదారిలోకి వచ్చేటప్పటికీ సాయంకాలం అయిపోయింది.

    ఆమె అప్పుడే నడక నేర్చుకుంటున్నట్లు ఒకడుగు తీసి మరో అడుగు వేస్తోంది.

    "వదినా! ఇప్పుడు మనం ఓ తమాషా ఆట ఆడుదామా?" అని అడిగాడు అతను.

    "సరే! ఏమిటా ఆట" అని ఉత్సాహంగా అడిగింది ఊర్మిళ.

    "చాలా సింపుల్ వదినా. నేను స్పీడ్ గా నడుస్తాను. నువ్వు పరుగెత్తి నన్ను పట్టుకోవాలి. అలా పట్టుకున్నావ్ అనుకో నువ్వు ఇప్పటి వరకు ఎలాంటి పాపం చేయనట్టు లెక్క" అని తను చెప్పిన ఆటగురించి వివరించాడు వెంకటాచలం.

    పాపం అనేమాట వినగానే ఊర్మిళకు తన చెల్లెలు చావు. పడక మీదున్నప్పుడు తనకు వచ్చిన ఆలోచన మెదిలింది. అలా ఆలోచించడం మహా పాపమని ఇప్పటికే ఒక మూల మనసులో ఉంది. అది పాపం కాదని నిరూపించుకోవాలంటే తనిప్పుడు మరిదిని పట్టుకోవాలి.

    ఆమెకు ఎక్కడలేని ఆవేశం వచ్చింది. తను గెలవాలన్న పట్టుదల హెచ్చింది. తనకు కాళ్ళు నొప్పులన్న విషయం మరచిపోయింది.

    వెంకటాచలం స్పీడ్ గా నడవడం ప్రారంభించాడు.

    ఆమె శక్తినంతా కాళ్ళల్లోకి తెచ్చుకుంది. ఆవేశం తప్ప మరేమీ మనసులో మెదలడంలేదు. చాలారోజుల తరువాత ఆమె మొదటిసారి పరిగెత్తింది. అతను ఓసారి వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోయాడు.

    ఊర్మిళ పరుగెత్తుతోంది.

    అతను వేగాన్ని మరింత పెంచాడు.

    ఆమె జింకలా దూకుతోంది

    సంత నుంచి వస్తూ మార్గమధ్యంలో ఈ పందెం వేయమని చెప్పిన చంద్రరేఖకు అతను మనసులోనే కృతజ్ఞతలు చెప్పాడు.

 Previous Page Next Page