"అలా అనుకోవడం ఒక్కక్షణమే కదా! ప్రతి మనిషిలోనూ రెండు మనసులుంటాయి. ఒకటి ఈ సమాజంలోని కట్టుబాట్లను అనుసరిస్తూ వుంటుంది. రెండో మనసు అంటే లోపలి మనసు దానిష్టానికి దానికి కావాల్సింది కోరుకుంటూ వుంటుంది. ఇది నీకే కాదు -అందరికి వున్నదే" అన్నది చంద్రరేఖ.
ఊర్మిళ ఇలా తనను సమర్ధిస్తున్న చంద్రరేఖ వంక నిశితంగా చూస్తూ శ్రద్దగా వింటోంది.
"మన మహా గ్రంధాలని అనుకుంటున్న మహా భారతంలోనూ రామాయణంలోనూ ఇలాంటివి చాలానే వున్నాయి. ఓ సందర్భంలో నీ కోరిక ఏమిటి అంటే ద్రౌపది ఏం అందో తెలుసా?
తనకు బావైన కర్ణుడు కావాలన్నది. రామాయణంలో వాలి తన తమ్ముడు సుగ్రీవుడ్ని తన్ని తరిమేసి అతని భార్యని, రాజ్యాన్ని ఏలుకున్నాడు!"
ఊర్మిళ ముఖంలో చిన్నపాటి వెలుగు.
"అలా నువ్వు నీ మరిదిమీద మరులుగొనడం తప్పేమీకాదు. చిన్నప్పట్నుంచీ నువ్వు మగపిల్లాడితో సమానమన్న భ్రమలో పెరిగావు. అందుకే నీకు వయసొచ్చినా నీ చూపు అబ్బాయిలమీద పడలేదు.
అయితే ఒక పురుషుడు మీ ఇంటికి వచ్చాడు. ఏదో పొరబాటునో, ఏమరపాటునో అతను నిన్ను స్పృశించడం జరిగింది. ఆ స్పర్శ ఎక్కడో ఓ మూల నిద్రపోతున్న నీ స్త్రీత్వాన్ని మేల్కొలిపింది.
దాంతో నీకు కోరిక మొదలైంది. కాని దురదృష్టవశాత్తు అతను నీకు మరిదైపోయాడు. నేను తప్పు చేస్తున్నానేమోనన్న శంక నీలో మొదలయింది. కానీ అతని ఆకర్షణ నుంచి తప్పించుకోలేక పోయావ్.
ఇది ధర్మసమ్మతం కాదని ఆ కోరికను ఎక్కడో ఓ మూల నొక్కిపట్టావ్. దాంతో నీకు అనారోగ్యం మొదలయింది. చివరికి చెల్లెలు చావు పడకమీదున్నప్పుడు ఆ పిల్ల చనిపోతే వెంకటాచలాన్ని చేసుకోవడానికి ఏ అభ్యంతరమూ వుండదనుకున్నావ్.
అదేదో పాపపు ఆలోచనలా భావించావు. దాంతో నీ జబ్బు మరింత ముదిరింది.
అంతే తప్ప ఆకాశంలో తథాస్తు దేవతలెవరూ లేరు నువ్వనుకున్నట్టు నీ చెల్లెల్ని చంపడానికి.
అదంతా నీ భ్రమ. మగపిల్లలతో సమానమని చిన్నప్పుడు ఎలా భ్రమపడ్డావో ఇప్పుడూ అంతే"
చంద్రరేఖ చెప్పినదంతా నిజమేననిపిస్తోంది ఊర్మిళకు. తను ఇంత కాలం ఎలా పొరబాటుగా తన ఆలోచనల్ని అర్ధం చేసుకున్నదో తెలుస్తోంది.
"మరి ఇప్పుడు ఏమిటి చేయడం?" ఎక్కడో బావిలోంచి మాట్లాడుతున్నట్లు అడిగింది ఆమె.
"నువ్వు ఏ పాపమూ చేయలేదని నమ్ము చాలు" అని వచ్చేసింది చంద్రరేఖ.
ఆ తరువాత ఏం చేయాలో వెంకటాచలంతో చెప్పింది తమ మధ్య మామూలుగా తిరుగుతున్న చంద్రరేఖ అంత లోతుగా వివరంగా తన వదినకు వచ్చిన సమస్యను వివరిస్తుంటే అతను ఆశ్చర్యపోయాడు. పురాణాల్లో వర్ణించినట్టు ఎవరో దేవత శాపవశాత్తు రామాపురంలో కాపురం పెట్టి తమను ఉద్దరిస్తున్నట్లు అతను ఫీలయ్యాడు.
చంద్రరేఖ ఊహించినట్లే ఊర్మిళకు బాగవడం ప్రారంభించింది. పిక్కల్లో నొప్పి కొంత తగ్గింది. ఇంటి బయటికి నడవగలుగుతోంది.
పొక్కులు మాత్రం ఇంకా అలాగే వున్నాయి. ఈ మార్పుకే రఘురామయ్య చాలా సంతోషించాడు.
ఓ రోజు పళ్ళెంలో రెండు ఆపిల్ పండ్లూ, మరో నాలుగు బత్తాయిలూ, తాంబూలం, వాటి మధ్య కొన్ని వంద రూపాయలు నోట్లు పెట్టుకుని వచ్చాడు.
వాటిని సుతారంగా తిరస్కరిస్తూ, "ఎందుకివన్నీ? ఏదో నాకు తెలిసిన అరవాకోరవా వైద్యం చేస్తున్నాను. మీ అభిమానమే నాకు చాలు" అంది చంద్రరేఖ.
ఆయన బలవంతం చేశాడుగానీ ఆమె తీసుకోలేదు.
"మీ అల్లుడితో ఓ పని చెప్పాను. అది చేశాడోలేదో కనుక్కోండి" అంది ఆయన వచ్చేస్తున్నప్పుడు.
వెంకటాచలం సమయం కోసం చూస్తున్నాడు తప్ప ఆ విషయం మరిచిపోలేదు.
ఆ రోజు టౌన్ లో సంత. ప్రతి శనివారం ఆ టౌన్ లో బ్రహ్మాండంగా సంత జరుగుతుంది.
జిల్లాలో వున్న చిన్నా చితకా వ్యాపారులంతా సంతలో తమ వస్తువులను సరసమైన ధరలకు అమ్ముతుంటారు. ఆ టౌన్ కి చుట్టుపక్కలున్న పల్లెటూళ్ళ ప్రజానీకం అంతా సంతలకెళ్ళి తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కుని వస్తుంటారు.
"ఎద్దుల ముక్కుతాళ్ళు కొనాలి. మంచాలకు నులకదారం కొనాలి. ఇక మెత్తాళ్ళు,ఏవైనా కూరగాయలు కొనాలి. రా వదినా వెళదాం" అని పిలిచాడు ఉదయాన్నే వెంకటాచలం.