Previous Page Next Page 
రీవెంజ్ పేజి 24

    ఆమె నవ్వటం చూసి మిగతా ఇద్దరూ నవ్వేసారు.

    కాసేపటికి రిమి,

    "పెళ్ళి గురించి మాట్లాడారు గాని, హత్యెప్పుడు చేస్తారు" వుండబట్టలేక అడిగేసింది రిమి.

    ఐస్ క్రీమ్ పార్లర్ లో హత్య గురించి జరిగిన సంభాషణని మిత్రా సీరియస్ గా తీసుకొని ఉండొచ్చన్న అనుమానం రిమిని పీడించడంతో అతను సీరియస్ గా ఆ విషయం ఆలోచిస్తున్నట్లయితే అప్పటికప్పుడే అన్విత చేత అది జోక్ అని అతని ఎదురుగానే చెప్పిద్దామనుకుంది కాని ఆ విషయం అన్వితకు ముందుగానే చెబితే ఆమె మిత్రా రూమ్ కి రాకపోవచ్చు. అందువల్లే అన్వితను అతని రూమ్ కి తీసుకువచ్చింది. ఎంతకీ అతను హత్య గురించి మాట్లాడాక పోవటంతో తానే అడిగివేసింది.

    "హత్యా... హత్యా... ఇంకా టైముందిగా తొందరెందుకూ" అని నసిగి వాచ్ వైపు చూసుకుని "టైమ్ చాలాసేపయిందే నా కర్జంట్ గా ఓ పని వుంది. నేను వెళ్ళాలి సారి..."

    "బలేవారే మాకు మాత్రం పనులు లేవనుకున్నారా? మేము వెళతాం" అని రిమి, అన్వితలు అతని రూమ్ నుంచి బయటికి వస్తూ అన్వితతో రిమి అంది.

    "హత్య పేరెత్తిసరికి పనుందని ఎలా తప్పించు కొన్నాడు గురుడు."

    "ఇప్పటికైనా నమ్ముతావా అతనిది ప్రేమకాదని." కాస్సేపాగి

    "హద్దుమీరి మాట్లాడాడు"

    ఆమె కంఠంలోని కోపాన్ని గుర్తించి రిమి మౌనాన్ని వహించింది.

    అన్విత రిమిలు బయటికి వెళ్ళగానే చాలా రిలీఫ్ గా ఫీలయ్యాడు మిత్రా.

    కర్తవ్యాన్ని మరోసారి గుర్తు చేసుకుని రూమ్ కి లాక్ చేసాడు.

    రెండు క్షణాల తరువాత అతని హోండా హోటల్ ఆల్పావైపుకి దూసుకుపోయింది.


                        *        *        *


    చీకటిగా వున్న ఆ గదిలో ఓ పక్కగా సోఫా వుంది. ఆ సోఫాముందు బలరాజ్ కూర్చొని వున్నాడు. అతని చేతిలో ఓల్డ్ మంక్ నింపిన గ్లాసుంది.

    ఇంతలో నిశ్శబ్దంగా ఆ గదిలోకి ప్రవేశించింది సౌందర్యరేఖా.

    "అంకుల్! తొమ్మిదిన్నరకి హోటల్ కి వెళ్ళి డిన్నర్ చేద్దామని అనుకున్నాం. బహుశ చంద్రశేఖర్ గాని వెయిట్ చేస్తుంటాడేమో"

    "నాకిప్పుడు రావాలని లేదు. రేపు కలవచ్చులే చంద్రశేఖర్ ని"

    కాసేపు నిశ్శబ్దం తరువాత అన్నాడు బలరాజ్.

    "అంకుల్ ఎన్నాళ్ళనించో నిన్నో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సమాధానం సాధ్యమయినంత ఫ్రాంక్ గా చెప్పు"

    నువ్వడగ బోయేది నాకు తెలుసు. నేనీ పాడు జీవితానికి స్వస్తీ ఎప్పుడు చెపుతాననేగా నువ్వడిగేది. నీకు తెలుసా బేబి.

    నన్నడగకూడని ప్రశ్న అడుగుతున్నావని. నిన్ను నేను కూతురుగా చేరదీసిన రోజే ఈ ప్రశ్న వస్తుందని వూహించాను. కొన్ని జీవితాలు మిస్టరీగానే మిగిలిపోతాయి. నేనెందుకు ఇలా మారింది చెప్పాల్సిన అవసరం లేదు కాని, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒక చిన్న నిర్ణయం కొందరి జీవిత సరళినే మారుస్తుంది. తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకొన్నా అది మన చేతుల్లో ఉండదమ్మా. నాకు ఈ జీవితం మీద విరక్తి కలిగింది. కాని ఏం చేయను నాకు ఈ వయసులో మనసు వైరాగ్యం మీదకి మళ్ళుతుంది. ఆశ్చర్యపోకు పైకి కటువుగా కనిపించే నాకు ఇలాంటి ఆలోచన్లు కలగడం నీకు విచిత్రంగా కనిపించదు. కాని ఒకటి మాత్రం నిజం. ఈ ఒంటరి పోరాటం మీద ఏదో చెప్పలేని స్థబ్ధత ఏర్పడింది. మానసికంగా నేను కృంగిపోయాను. పోరాడే శక్తి కోల్పోయాను. పోరాడాలని నాకు లేకపోయినా పోరాడాలవలసి వస్తుంది. ఎవరికోసం అని ప్రశ్నించకు. నేనెంచుకున్న ప్రొఫెషన్ అటువంటిది. నా జీవితం ఉన్నంత కాలం నాకిష్టం లేకపోయినా తప్పదు. నాకోసం కాకపోవచ్చు. మీకోసం కావచ్చు. మరెవరికోసమో కావచ్చు. అతను చెప్పడం ఆపేశాడు. వయసు తెచ్చిన అనుభవాలు అతని నుదుట గీతలుగా నిలిచాయి. ఈ మాటలంటున్నప్పుడు అతని కంఠం గద్గదమైంది.

    "అంకుల్! మీకు తెలుసనుకుంటాను. ఒక చిన్న అగ్గిరవ్వ చాలు. మహారణ్యాలు తగల బెట్టటానికి. చిన్న నిర్ణయం చాలు మనిషిని మృగంగా మార్చటానికి. నువ్వు ఎప్పుడో తీసుకున్న చిన్న నిర్ణయం నిన్ను ఒక ప్రొఫెషనల్ కిల్లర్ గా, ఒక గూండాగా బ్రతకమని శాశించింది.

    నువ్వా నిర్ణయం తీసుకోకుండా వుంటే నీకున్న ఆత్మస్థైర్యానికి నువ్వో మహాత్ముడిగా మారివుండేవాడివి.

    ఎవరికోసం అంకుల్ ఈ పోరాటం! ఈ హత్యలు? నీకు బాధనిపించదూ నీ వాళ్ళని హత్యచేస్తే. ఎవరో నీవాళ్ళని ఏదో చేస్తారని భయపడి ఎన్ని హత్యలు చేస్తావంకుల్? నిజం చెబుతున్నాను, ఈ సమయంలో మా ప్రాణాలు పోయినా బాధపడం అంకుల్, నువ్వు మారితే చాలు. ఈ మార్పు పదిమందికి స్ఫూర్తి కావాలి. ఈ మార్పే పదిమందిని ఉత్తేజుల్ని చేయాలి. ఏ త్రివేది కోసమో, త్రిపాఠి కోసమో హత్యలు చేయటంలో అర్ధంలేదు." ఆమెలో వచ్చిన ఆవేశం వల్ల ఆమె గొంతు కంపించసాగింది. చిరు స్వేద బిందువులు మొహంమీద అలుముకున్నాయి.

 

 Previous Page Next Page