Previous Page Next Page 
రీవెంజ్ పేజి 25

    "చివరిగా నేను కోరేదొకటే అంకుల్, నువ్వు మారితే చాలు" ఆమె తన వాదాన్ని ముగించింది.

    బలరాజ్ ఏమి మాట్లాడలేదు. తాగుతున్న గ్లాస్ ని పక్కనే వుంచి మౌనంగా వుండిపోయాడు. అతని ముఖంలోని భావాల్ని చదవనివ్వకుండా చీకటి అడ్డుపడుతుంది.

    ఆ మౌనాన్ని అర్ధంచేసుకున్న సౌందర్య రేఖ అక్కడినుంచి నిష్క్రమించింది.

    ఎంతరాత్రయిందో తెలియదు. అతని కళ్ళు వర్షిస్తున్నాయి. పశ్చాత్తాపంతో అతని మనసు మూగబోయింది. అతనో నిర్ణయం తీసుకుని కదిలాడు. ప్రక్కనే వున్న రూమ్ లోకి వెళ్ళి ఒక పేపర్ తీసుకొని ఏదో రాసి సౌందర్య రేఖ దగ్గరకి వచ్చాడు. ఆమె నిద్రపోతుంది. నిద్రలో కూడా ఆమె మొహం స్వచ్ఛంగా అనిపిస్తుంది. ఆమెను లేపడం అతని కిష్టంలేనట్లు అతను రాసిన పేపర్ ని ఆమె పక్కనే వుంచి బయటకు నడిచాడు.

    చీకటిలోకి ఒంటరిగా నిశ్శబ్దంగా.


                          *        *        *


    హోటల్ ఆల్ఫా రిసెప్షన్ కౌంటర్.

    అసహనంగా వాచి చూసుకున్నాడు అలెక్స్. బలరాజ్ రాలేదు. కొన్ని నిముషాలపాటు సీరియస్ గా ఆలోచించాడు.

    రిసెప్షనిస్ట్ కమ్ టెలీఫోన్ ఆపరేటర్ తో ఏదో మాట్లాడాడు. ఆమె నవ్వుతూ సమాధానం చెప్తోంది. కాసేపటికి అతనో చిన్న కవర్ని ఆమెకందించి వేగంగా బయటకొచ్చేశాడు. కవర్ని ఓపెన్ చేసిన ఆమెకు కొన్ని పచ్చనోట్లు కనిపించటంతో ఆమె వాటిని వెంటనే తన వ్యానిటిబ్యాగ్ లో వుంచి తన పనిలో నిమగ్నమయింది.

    రెస్టారెంట్ లో వెయిట్ చేస్తున్న మిత్రాకి కాలయాపన అవసరం అనిపించింది. అప్పటికి టైమ్ పదకొండు కావస్తుంది.

    రెస్టారెంట్ ని క్లోజ్ చేస్తున్నాం సార్ అని బేరర్ చెప్పటంతో రెండు క్షణాలాగి,

    బయటికి నడిచాడు మిత్రా.


                        *        *        *


    సమయం! పన్నెండు గంటలయింది.

    మంచంమీద అశాంతిగా దొర్లుతున్నాడు బలరాజ్. ఆలోచనల్ని అతను ఛేదించలేక పోతున్నాడు. అతని మనస్సు పరిపరి విధాల పరుగులు పెట్టసాగింది. సౌందర్య రేఖ పదే పదే ప్రశ్నిస్తున్నట్లు అనిపించసాగింది. అతను తీసుకున్న ఓల్డ్ మంక్ మత్తుదిగి చాలాసేపయింది.

    జీవితానికి గమ్యం తెలియలేదనిపించింది. కొద్దిపాటిబెడ్ లైట్ వెలుతురే కళ్ళలోపడి సూర్యకిరణాల్లా గుచ్చుకొన్నట్లు అనిపించటంతో లైటార్పటానికి పక్కకు తిరగటంతో ఫోన్ మ్రోగింది.

    బహుశా చంద్రశేఖర్ అయుండచ్చని ఊహించి ఫోనెత్తాడు.

    "దయచేసి ఫోన్ పెట్టేయకుండా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి" గంభీరంగా వినపడిందో కంఠం.

    "నేనెవరయిందీ మీ కనవసరం. కాని నేను చెప్పే ఇన్ఫర్ మేషన్ మాత్రం మీకు చాలా ముఖ్యమైనది."

    "ఎవర్నువ్వు?" ఆతృతగా అడిగాడు బలరాజ్.

    "నీ శ్రేయోభిలాషిని."

    "ఎదురు ప్రశ్నలు వేయకుండా విను..."

    బలరాజ్ ఎవరయింది తెలియక పజిల్ అవుతుండగా,

    "చంద్రశేఖర్ ఈజ్ మర్డర్డ్ యూ నో."

    "వ్వాట్!" అదిరిపడ్డాడు బలరాజ్.

    "యస్! హి ఈజ్ మర్డర్డ్" ఫోనులో కూల్ గా వినిపించింది అవతలి కంఠం ఒక క్షణం ఆగి,

    "ఎవరు చంపారన్నది తెలుసుకోవాలనుకుంటే..."

    "ఎవరు చంపారు..." బలరాజ్ కంఠంలో చెప్పలేని ఉద్వేగం, ఆతృత ధ్వనించాయి.

    "ఎవరు చంపారు... ఎక్కడ చంపారు..." అరిచాడు బలరాజ్.

    "ఆ వివరాలు ఫోనులో చెప్పటం, నీకు నాకు మంచిది కాదు."

    అవతల వ్యక్తి ఎక్కడ కలవవలసింది వివరంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు.

    స్థాణువులా వుండిపోయాడు బలరాజ్.


                            *        *        *


    ట్రింగ్...ట్రింగ్ మన్న శబ్దంతో ఫోన్ రింగయింది.

    ఒక్క వుదుటున ఫోనందుకున్నాడు అలెక్స్.

    "హలో......"

    "వ్వాట్..."

    "ఎప్పుడూ..."

    "ఎన్ని గంటలకీ..."

    "థాంక్స్ ఫర్ యువర్ హెల్ప్..."

    ఫోన్ పెట్టేసాడు అలెక్స్.

    ఫోన్ క్రెడిల్ చేసి తన నెవరయినా గమనించారేమో నని ఇటూ అటూ ఆదుర్దాగా చూసి,

    థాంక్ గాడ్ అనుకొని తృప్తిగా శ్వాశ పీల్చుకుంది ఆల్ఫా హోటల్ రిసెప్షనిస్ట్.
 

 Previous Page Next Page