Previous Page Next Page 
రీవెంజ్ పేజి 23

    హఠాత్తుగా అతని రూమ్ కి రావటం అసలే అర్ధం కాలేదు.

    "హలో, కనీసం కూర్చోమని చెప్పేటట్లు లేదు మీ పరిస్థితి. మనం కూర్చుందాం అన్వీ" అని కుర్చీలో జారబడుతూ "కనీసం అతిధులకి మంచినీళ్ళన్నా ఇస్తారా?" అడిగింది రిమి.

    అప్రయత్నంగా కుర్చినుంచి లేచిన మిత్రా గ్లాసులోకి నీళ్ళని వంచుతూ, వాళ్ళొచ్చిన కారణాన్ని సరిగా గెస్ చేయలేక పోయినప్పటికీ వాళ్ళేమి ప్రశ్నించినా ఏదో సమాధానాలు చెప్పి వీలయినంత త్వరగా పంపించేయాలి. వీలయినంత వరకు తన టెన్షన్ ని తనలోని భావాలని బయటపడకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నాడు.

    "భలేవారే! మొదటిసారిగా వచ్చిన అతిధులని మంచినీళ్ళిచ్చి పంపిస్తాననుకున్నారా." అని అతనా మంచినీళ్ళతో పాటు స్వీట్స్ ని వాళ్ళ ముందుంచాడు.

    "నిన్నటి నుంచి ఏమిచేస్తున్నారు?" ఏదో సమాధానం రిమి ప్రయత్నించింది.

    "ఈ ఊరిలో ఎన్ని ఉమెన్స్ కాలేజీలు వున్నాయి? ఏ ఏ గ్రూపులో ఎంతమంది అమ్మాయిలు వుంది తెలుసుకుని వస్తున్నా" నవ్వుతూనే సమాధానం ఇచ్చాడు మిత్రా.

    "మరి ఏ కాలీజీలో ఎక్కువ మంది వున్నది తెల్సిందా..." ప్రశ్నించింది రిమి.

    "అబ్బే లేదు, కాలేజీకి వెళితే అమ్మాయిలందరు ఏ ఇందిరా పార్కుల్లోనో, సినిమాహాల్స్ లోనో వుంటారని కాలేజీలకు వెళితే లెక్చరర్స్ అనటంతో వచ్చేశా"

    "ఇంతకీ మీ విషయం ఏం చేసారు?" ప్రశ్నించింది అన్విత.

    అదే చెపుతున్నాను.

    "నాకైతే మన సాంప్రదాయాలమీద, ఈ వివాహ వ్యవస్థమీద సదాభిప్రాయంలేదు. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే నేను నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను.

    ఇవాళ ఒకరిద్దరిని కలిసాను. జరిగేది రిజస్టర్ మారేజ్ అయితే సాక్షి సంతకం పెట్టటానికి వుండాలిగా, అందుకు"

    "ఫర్వాలేదు మీది మూగప్రేమేనని భయపడ్డా మాటలొచ్చన్న మాట" అంది రిమి.

    అన్విత మాత్రం రూమ్ ని పరీక్షగా చూస్తూ,

    "మీ రూమ్ బాగుంది. బాగానే నీట్ గా ఉంచారు. మీకింత టైముంటుందా?" ఏదో ఒకటి మాట్లాడక పోతే బావుండదనిపించటంతో మిత్రాని ప్రశ్నించింది.

    "బలేవారే! అసలు నేను రూమ్ లో వుంటేగా? అందుకే నీటుగా వుంచగలుగుతున్నాను. మీకు తెలుసా ఎవరైనా నన్ను కలవాలనుకుంటే మీ హాస్టల్ ఎదురుగా ఉన్న చెట్టు దగ్గరికి వచ్చి కలుస్తుంటారు. ఓ విషయం చెప్పనా" సందేహిస్తున్నట్లు చూస్తూ ప్రశ్నించాడు.

    చెప్పండని కళ్ళతోనే రిమి బదులివ్వడంతో,

    "పెళ్ళయినరోజే ఆ చెట్టు చుట్టూ కనీసం వంద సార్లయినా ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను.ఎంతయినా ప్రేమజంటకి నీడనిచ్చిన చెట్టుగా పాపం" ఈ మాటలకి వాళ్ళకి నవ్వురాకపోగా కోపాన్ని తెప్పించాయి.

    "మీరు మరీ అడ్వాన్సుగా మాట్లాడుతున్నారు" అంది రిమి.

    ఆ మాటలు పట్టించుకోని అన్విత వైపు చూస్తూ,

    "ఇందాక మీరు రూమ్ బావుందని మాత్రమే చెప్పారు. కాని, పెళ్ళయిన మరుక్షణం ఇంతకన్నా పెద్దిల్లు తీసుకోవచ్చు. ఇంతకీ మనకి కావలసిన లిస్ట్ తయారు చేయలేదు. సంసారానికి మనకి కావలసిన లిస్ట్ ని తయారు చేసి వుంచండి."

    "ఆ లిస్టేదో మీరే తయారు చేసుకుంటే బావుంటుంది. పెళ్ళయ్యాక చేయాల్సింది మీరేగా." తెచ్చిపెట్టుకున్న కోపంతో అంది రిమి.

    ఆ మాటలకు నవ్వి,

    ఇంతలో ఏదో గుర్తు వచ్చినట్లు లేచి, ఒక పుస్తకాన్ని తెచ్చి అన్వితాకి ఇచ్చాడు.

    "ఏమిటా పుస్తకం? కొంపతీసి మీరు వ్రాసిన కవితల పుస్తకమా. మీరిప్పుడు చదవమని కోరితేమాత్రం మీ వివాహం జరుగుతుందన్న హామీని నేనివ్వలేను" కాస్త బాధగా మొహంపెట్టి అడిగింది రిమి.

    పుస్తకం చూస్తున్న అన్విత మొహంలో ఏ భావమూలేదు.

    "అబ్బే. అలాంటిదేం కాదు. భవిష్యత్తులో పుట్టబోయే పిల్లల పేర్లు గురించి కొన్న పుస్తకమది. తరువాత మళ్ళీ ఈ విషయంలో గొడవలేవన్న రావచ్చేమోనన్న బయంతో ముందుగానే కొన్ని పేర్లను టిక్ చేసి ఇచ్చాను." సమాధానం చెప్పాడు మిత్రా.

    అన్విత చేతిలోవున్న పుస్తకాన్ని రిమి తీసుకొని కొన్ని పేజీలు తిరగేసిన తరువాత.

    "మీకు మంచి టేస్ట్ ఉందండి. ఒకవేళ నాకు మారేజ్ అయిన తరువాత కొన్ని పేర్లను మాకివ్వగలరా" సందేహిస్తూ అడిగింది రిమి.

    "సారి! ఆ పేర్లన్నీ మా పిల్లలకి పెట్టడానికే సరిపోవు! మీకేమిస్తాం" కాస్త సీరియస్ గా అన్నట్లు అన్నాడు.

    ఈ మాటలకి ఎంతో సీరియస్ గా వుండాలని ప్రయత్నించిన అన్విత నవ్వుని ఆపుకోలేక పైకి నవ్వేసింది.
 

 Previous Page Next Page