ఆలోచనలు- అందులో మనిషికి తనవైపు వాదన బలం పెంచుకోవాలనుకునేవారు- ఆలోచనల్తో తేనెలో పడ్డ యీగల్లే అవుతారు. ఇక అందుకో తారట్లాడుతూ వుండాల్సిందే తప్ప యివతలికి రాలేరు.
మళ్ళీ ఆలోచనలు కమ్ముకున్నాయ్.
అయినా దీనికి పరిష్కారం ఏమిటి?
అయితే దానికి పరిష్కారం ఏమిటి?
అయితే దాన్ని పనిలోంచి మాన్పించగలిగింది. అంతే కానీ రేపు మరో మనిషిని ఏర్పాటు చేసుకోదా? తానెలాగూ పని చేసుకోలేదు. ఆ వచ్చే మనిషి దీనికంటే బుద్దిమంతురాలనే నమ్మకం ఏమిటి? ఆ మాట కొస్తే పాపం యిదే కాస్త మెరుగనిపిస్తుంది.
పనిలోకి వచ్చినప్పటినుంచి తను గమనిస్తూనే వుంది. ఓ చేతి వాటుతనం కానీ మరే దుడుకుపనులు కానీ లేవు, తల బిరుసు సమాధానాలు యివదు.
కానీ.....కానీ యీసారి అది నేరుగా తన కాపురానికే ఎసరు పెట్టింది.
తనైతే యీ నాడు కనుక్కోబట్టి బయటపడింది. కానీ యిలా ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో! అందువల్లేనేమో అది తను ఎన్నిసార్లు వెళ్ళి పొమ్మన్నా మళ్ళీ రమ్మన్నప్పుడల్లా నవ్వుకుంటూ వచ్చేది. తన కళలు తెలిసిన మనిషిలే అనుకుంది తప్ప యీ రహస్యం తనకేం తెలుసు?
భగవాన్!
ఎలా?
అసలు తను యిలా తప్పంతాదానిదని ఆలోచిస్తుంది గానీ నిజంగా ఆలోచిస్తే దానిది ఏమి తప్పులేదేమో? మాధవ్ ముందుగా తనే చొరవ చేసుకున్నాడెమో--- అయ్యగారు అందునా అందగాడు తనని కోరితే దాని లాంటిది తిరస్కరించినా దోషమే, అంగీకరించినా దోషమే. పాపం దానిదేమి తప్పులేదేమో! అనవసరంగా తను దాన్ని అనుమానిస్తోందేమో?
ఏమైతేనేం తప్పు జరిగిపోయింది.
కారణం ఎటునుంచైతేనేం? ఎవరైతేనేం?
తను ఏదయినా సహిస్తుంది. కానీ తనతో భర్తని ఎవరైనా పంచుకోవటం మాత్రం సహించలేదు. దండించి ఖండించి తీరుతుంది.
అయినా భర్తే తప్పు చేశాడేమో ననుకునేసరికి ఒళ్ళంతా కంపరమెత్తినట్టయింది శ్రీదేవికి.
ఎంత మోసం!
తనతో ఎన్నిసార్లు ఎన్ని ప్రమాణాలు చేశాడు. నిన్ను తప్ప వేరే స్త్రీ ని ముఖమేచూడనన్నాడు. చివరికంతా యిలా చేశాడు.
చీ! చీ!
ఎవత్తేవత్తేతోనో కులికి వచ్చి తనతో మళ్ళీ!
తనని ప్రేమించానంటాడు ప్రేమంటే ఇదేనా? భార్య కాస్త కనుమరుగయితే చాలు ఎవరు దొరికితే వాళ్ళతో పోవటమేనా?
ఇక నిగ్రహించుకోలేకపోయింది.
విసవిసా నడిచి నేరుగా మాధవ్ ఎదురుగా వెళ్లి నుంచుంది.
మాధవ్.....కుర్చీలో అలసటగా పడుకుని ఆలోచిస్తున్నాడు. ముఖమంతా చెమటలు పట్టి అతని మనోవ్యాకులతని వ్యక్తపరుస్తోంది. అతనికి ఏమి పాలుపోవటంలేదు.
"ఒకమాట అడుగుతాను చెపుతారా?"
అతను కళ్ళు తెరిచి చుశాడే కాని జవాబు యివలేదు.
"నిజమే చెప్పాలి"
నిదానంగా అన్నాడు. "చెప్పింది నిజమేనని నమ్మే నమ్మకం నీలో వుందా?"
"అది నా యిష్టం.....మీ మాటల్ని బట్టి తేల్చుకుంటాను."
"ఇక నన్నడిగి లాభం?"
మండిపడి అంది "సరే! చెప్పండి. ఈ నాడిలా ఎందుకు జరిగింది? దీనికి కారణం ఎవరు?"
తాపిగా అన్నాడు "అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? అడిగి తెలుసుకునే ఓపిక వుందా ముందు?"
చిత్కరిస్తూ అంది. "విపులంగా మళ్ళీ చెప్పక్కర్లేదు. నేను ఉహించుకో గలను. కారకులు ఎవరో చెపితే చాలు."
పెదవి విరుస్తూ అన్నాడు "ప్చ్, లాభం లేదు, జరిగిందేమిటో తెలుసుకోకుండా యిలా ప్రశ్నిస్తే నీకు సమాధానం దొరకదు. చెప్పినా అర్ధం కాదు."
"అయితే చెప్పరా?"
"చెప్పానుగా"
"అదే అడుగుతున్నాను-దోషం ఎవరిది?"
నిశ్చలస్వరంతో అన్నాడు "ఎవరిది తప్పులేదు"
నిప్పులు కురిసేలా చూచి అంది "అవును ఎవరిది తప్పులేదు. యౌవనం- యౌవనందది ఆ తప్పు, అంతేనా?"
ప్రళయ గర్జా నిర్ఘోషంగా అన్నాడు. నోర్ముయ్- నోటికి ఎలా వస్తే అలా అనేస్తే పర్యవసానం బావుండదు."
"ఏం కొడతారా?"
"చీ! నిన్ను> కొడతానా? దానివల్ల లాభం ఏమిటి? దున్నపోతుపై వర్షం కురిసినా ఒకటే కురవకున్నా ఒహటే" అసహ్యం అంతా స్పురించేట్టుగ అన్నాడు.
"అంత అసహ్యం అయితే ఇహ వారితో కలిసి వుండటం కూడా కష్టమే- పైగా తప్పుకూడాను. అది తెలియదా?"
అతను వెంటనే జవాబుయివలేదు.
"ఏం జవాబు యివరు?"
"అది పెద్దవాళ్ళతో పని" తాపిగా అన్నాడు.