"హు... పెద్ద కబుర్లు చెప్పకు, ఆ డాక్టరు వల్లించిన మాటలు మాట్లాడినంత మాత్రాన పెద్ద అభ్యుదయం వచ్చినట్లు అనుకోకు. తమదాక రానంతవరకు అంతా పెద్ద కబుర్లు చెపుతారు. అదే ఆవిడకో, ఆవిడ కూతురికో అయితే యిలా తేలిగ్గా మాట్లాడగలదా!" తీవ్రంగా ఎత్తి పొడిచాడు.
అలా ఆ వాదనని పొడిగించడంవల్ల వరిగేదేం లేదని రాధకి అర్థం అయింది. కాలం ఒక్కటే గాయాన్ని మాన్చగలదు. కాలం ఒక్కటే దుఃఖాన్ని మరపించగలదు! మాధవ్ అన్నట్టు ఆ కాలమే తమిద్దరిని మళ్ళీ చేర్చగలదు. ఆశతో బతకడం తప్ప చేయగలిగింది ఏమీ లేదని రాధకి అర్థం అయింది.
12
మినుకుమినుకుమనే రాధ ఆశ విధి వీయించిన గాలికి ఆరిపోయింది.
రాధ నెలతప్పింది!!
ఆరోజు కాలేజీలో పాఠం చెప్తూ మొహం తిరిగి పడిపోయింది రాధ. అప్పటికే గత పదిహేను రోజులుగా రాధ ఆరోగ్యం బొత్తిగా పాడయింది. ఆమె తన ఆదుర్దాలో, అలజడి, అశాంతి, ఆవేదన మధ్య మనసు సరిగాలేని ఆ స్థితిలో పీరియడ్స్ ఆలస్యం అయిందన్న సంగతి గుర్తించలేదు. పది రోజులుగా ఏదో వికారంగా తిండి సయించకుండా వుంటే మనసుకి శాంతిలేక వ్యధతో నలిగిపోవడం వల్ల యిదంతా అనుకుంది. తిండి సయించదు, ఒకటే నీరసం, దానికితోడు పని, కాలేజీకి వెళ్ళడం, మాధవ్ తో విబేధం అన్నీ కల్సి శారీరకంగా, మానసికంగా రాధమీద పనిచేసి రాధ చిక్కిశల్యమైంది. కళ్ళకింద నల్లచారలు, బుగ్గలు పాలిపోయి రాధ శవాకారంలా తయారయింది. ఆ సంగతన్నా గుర్తించలేదు ఆమె. యాంత్రికంగా పనులు చేయడం, కాలేజీకి వెళ్ళి అలవాటుగా పాఠాలు చెప్పడం అంతే!... కాలేజీలో విద్యార్థులు సయితం ఆమెని జాలిగా చూసేవారు.
కొలీగ్స్ ఏదో అంటూ సానుభూతి చూపి దయచూపేవారు. ఆ దయ, సానుభూతి కూడా భరించడం కష్టమే అని అప్పటికిగాని ఆమెకి తెలిసిరాలేదు. ప్రతివాళ్ళ చూపుల్లో ఏదో హేళన వున్నట్టు, వాళ్ళ సానుభూతి వెనక వ్యంగ్యం వున్నట్లు అన్పించి రాధ మౌనంగా ఎవరితో మాట్లాడకుండా దిగులుగా కూర్చుంటూ వుండేది. సరళ చివాట్లు పెట్టి నలుగురిమధ్యకి లాక్కొచ్చేది.
ఆ వాతావరణంకి, ఇంట్లో మాధవ్ నిరాదరణకి యిప్పుడిప్పుడే అలవాటుపడ్తున్న రాధ ఈ వార్త విన్న వెంటనే చకితురాలైంది. ఎదురుచూడని సంఘటన జరిగినట్లు విభ్రాంతి చెందింది. డాక్టరు అనుమానిస్తూ వివరాలు అడగగానే, అప్పటికిగాని తను పీరియడ్స్ మిస్ అయినట్లు గమనించలేదు. తనున్న స్థితిలో ఆ వార్తకి సంతోషించాలో లేదో అర్థం కాలేదు. ఆమె హృదయం ఒక్కక్షణం లయతప్పింది.
గత రెండేళ్ళుగా, అందులో మరీ ఏడాదిగా పసిపాపకోసం కలవరించే రాధ అకస్మాత్తుగా అనుకోని సమయంలో ఆ వార్త విని తడబడిపోయింది. మాధవ్... మాధవ్... ఏమంటాడో... సంతోషించడూ అతనుమాత్రం... పోనీ... ఈ బిడ్డ తమిద్దరిమధ్య వారధి అయితే, యీ కారణంగానన్నా మాధవ్ చేరువైతే యింకేం కావాలి తనకు!... ఆ ఆలోచనలతో ఆమె మొహం విప్పారింది. కళ్ళల్లో సంతోషం కదలాడింది. "థాంక్స్ డాక్టర్" అంటూ బయటికి వచ్చింది. బయట వరండాలో మాధవ్ కూర్చున్నాడు. రాధ బయటికి రాగానే ఆత్రుతగా చూశాడు. చాలారోజుల తరువాత రాధ మొహం కళకళలాడుతూ కన్పించింది. మాధవ్ ఏమిటన్నట్లు ఆరాటంగా చూశాడు.
"పదండి, చెప్తా... యింటికి పదండి..." అంది.
"డాక్టర్ ఏమంది?" స్కూటర్ మీద వెళ్తుండగా మళ్ళీ అడిగాడు.
"ఎందుకంత గాభరా... కంగారేం లేదు..." అంది నవ్వుతూ రాధ.
మాధవ్ కి ఏదో అర్థమైనట్లయింది.
"మాధవ్..." చాలారోజుల తర్వాత నోరారా పిలిచింది రాధ.
ఇంటికెళ్ళి తలుపుతీసి బెడ్ రూములోకి వెళ్ళగానే "మాధవ్... మనం ఇన్నాళ్ళుగా కావాలని పరితపించిన కోరిక తీరింది. మాధవ్... నాకు చాలా సంతోషంగా వుంది... నీకేమనిపిస్తూంది మాధవ్..." అంటూ అతని మొహం చూసి ఆగిపోయింది. "మాధవ్" అంది కంపిస్తున్న గొంతుతో నల్లబడిన అతని మొహం చూసి.
"మైగాడ్" అన్నాడు మాధవ్. ఆఖరికి నోరు పెగుల్చుకుని "నిజమా... ఇది... ఇది... వాళ్ళు... చేసిన..."
"మాధవ్... ఏమిటి... ఏమిటంటున్నావు?" అతని భావం అర్థం అయి భయవిహ్వలయి అంది కళ్ళు పెద్దవిచేసి. అప్పటివరకు ఆ ఆలోచనే తట్టని ఆమె ఒక్కసారిగా వణికిపోయింది.
మాధవ్ మొహం కూడా మలినమైంది. అతనికి వచ్చిన ఊహ సరి అయినదే అని ఎందుకో అన్పించింది.
ఇద్దరికిద్దరూ ఏం చెప్పాలో తెలియక అలా కొద్ది క్షణాలుండిపోయారు.
రాధ ఉత్సాహం అంతా ఎవరో మంత్రించినట్లు ఎగిరిపోయింది. "మాధవ్... కాదు మాధవ్... దయచేసి అలా అనకు. నా సంతోషాన్ని నాశనం చెయ్యకు. నాకు మిగిలే ఈ సంతోషాన్ని దూరం చెయ్యకు. అలా అనకు. దయచేసి ఆ పీడకల నేను మర్చిపోయాను. మళ్ళీ గుర్తు చెయ్యకు..." గద్గ కంఠంతో అంటూ చేతులు జోడించింది.
"హు... నీవు మర్చిపోయినా ఆ దేముడు నిన్ను, నన్ను మర్చిపోకుండా చెయ్యాలనే ఇలా చేశాడు. అనుక్షణం ఆ పాపం, ఆ అవమానం మన కళ్ళముందు నిలవాలనే ఇలా శిక్షించాడు. రాధా... వద్దు... నేను భరించలేను... ఆ బిడ్డ మనదికాదు... పద డాక్టరు దగ్గిరకు వెళదాం. శాశ్వితంగా నిలిచిపోయే మచ్చని మొదట్లోనే తుడిచేయాలి" గంభీరంగా అన్నాడు.
"మాధవ్..." రాధ దెబ్బతిన్నట్టు చూసింది. గిలగిలలాడుతూ "మాధవ్ ఏమిటంటున్నావు... తీరక తీరక కోరిక తీరుతూంటే యిప్పుడు ఇలా మాట్లాడుతున్నావేమిటి?"
"రాధా... నీకెలా చెప్పాలి. ఆ బిడ్డ మనదికాదు. ఎవరో రౌడీ వెధవ పాపఫలం మోస్తావు నీవు... ఆ బిడ్డని కంటావా?" తీవ్రంగా అడిగాడు.
"ఆ బిడ్డ నీది కాదని నీకెలా తెలుసు?" రాధ కఠినంగా అడిగింది.
"తెలుసు అంతే, సిక్త్ సెన్స్ లాంటిది చెపుతూంది. గత ఏడాదిగా మనం ఎంత కావాలనుకున్నా కలగనిది ఇప్పుడింత హఠాత్తుగా ఎలా అయింది. అందులో... గుర్తుతెచ్చుకో... ఈ సంఘటనకి ముందు అసలు మనం ఎన్నిసార్లు... లేదు రాధా... నాకు తెలుసు... ఇది నా బిడ్డకాదు... రాధా... ఈ ఊహే కంపరంగా వుంది... మరొక్క క్షణం భరించలేను పద డాక్టరు దగ్గిరకి..."
"ఒకవేళ మన బిడ్డే అయితే... చేతులారా చంపుతారా... వద్దు మాధవ్... అలా ఆలోచించకు... ఈ పాపం కూడా చెయ్యమంటావా నన్ను.