Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 24


    ఈ పాయింట్ మీదే ధీరూభాయ్ తన తెలివితేటల్ని కేంద్రీకరించాడు దాంతో ఆటోమేటిగ్గా అతని వ్యాపార పద్దతులు, ఆలోచనలు క్లిక్ అయ్యాయి. దీన్ని మిగతా వ్యాపారస్తులు తమకు పోటీగా  అపోహ పడటం జరిగింది. దీని మూలంగానే భారతీయ బట్టలపరిశ్రమ యంత్రాంగము సంవత్సరం కాలంపాటు స్థంభించి పోయింది. ఇది ముందే పసిగట్టిన అమ్భాని ఆడిన డ్రామా మిగతా వార్ని చావుదెబ్బ కొట్టింది.
    రెండు గంటల ప్రాంతంలో దినేష్ రూంకి వచ్చిన భూపతిరావు 3.30 వరకూ కొడుకుతో చర్చిస్తూనే ఉన్నాడు.
    తండ్రి వేసిన పధకం విన్న  దినేష్ ఓ క్షణం వణికి పోయాడు.

                         
                                                         *    *    *
    
    ఆదిత్య  తమ కంపెనీ వివరాలున్న ఫైల్ ని సాహితికిఅందించాడు.
    సాహితి ఫైల్ లోని ఒక్కో పేజీని మౌనంగా పరిశీలిస్తూ ముందుకు వెళుతోంది.
    సరిగ్గా అదే సమయంలో యూనివర్శిటీ విద్యార్థి బృందం ఆ ఫ్యాక్టరీ గేటులోకి ఎంటర్  అయింది. ఆ బృందాన్ని నాగ లీడ్ చేస్తున్నాడు____    

                                     10


    సాహితి ప్రక్కనే ఆదిత్య ఒక్కో ఫైల్ అందిస్తూ వాటికి సంబంధించిన వివరాలు సంక్షిప్తంగా వివరిస్తున్నాడు.
    సాహితి ఓ ప్రక్క అవి చూస్తూనే తన వంతుగా ఎంత పెట్టుబడి పెట్టవలసి వుంటుంది....ఎంత కాలానికి కంపెనీ తన  అస్వస్థత నుంచి బయటపడి బ్రేక్  ఈవెన్ (లాభాలదశ)కి వస్తుందనే  విషయాన్ని అంచనా వేసుకుంటోంది మనస్పులోనే.
    సాహితి కూర్చున్న గది బయట కార్మికులు ఆశగా నిలబడిచూస్తున్నారు.... ఆ గది తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా? కంపెనీ తిరిగి రన్నింగ్ లోకి వస్తుందా? ఆ చల్లని మాట చెబుతారా? ఈ ప్రశ్నలే వారి మెదళ్ళను తొలుస్తున్నాయి.
    ఇరవై నిమిషాల తర్వాత సాహితి ఓసారి తలెత్తింది.
    తన  అభిప్రాయం ఏం చెప్పకుండానే బయటకు నడిచింది. ఆమె వెనుక  బాడీగార్డ్స్ ఇద్దరూ నిశ్శబ్దంగా ఆమెను  అనుసరించారు.
    సాహితి గదినుంచి బయటకు రాగానే కొన్ని వందలమంది కార్మికులు ఆశగా, భయంగా, ఆందోళనగా చూస్తూ కనిపించారు, వార్ని ఆ ఆ స్థితిలో చూస్తూ అడుగు  ముందుకేయలేక పోయింది సాహితి.
    ఎన్నిరోజులయిందో కడుపునిండా తిండితిని? ఆకలితో అప్పులతో అల్లాడిపోతున్నట్లు వారి ఎముకని గూడులాంటి శరీరాలు తెలియజేస్తున్నాయి.....ఆస్థిపంజరాలు చర్మాన్ని కప్పుకున్నట్లున్నరు.
    మీకు మేలుజరుగుతుందన్నట్లు అభయం ఇస్తూ ఓసారి కుడిచేయి పైకెత్తి గాల్లో ఊపుతూ ముందుకు నడిచింది.
    గుమికూడిన కార్మికులు ఆమె దగ్గరగా  వస్తుండగా భక్తిశ్రద్ధలతో చీలిపోయి  దారి ఇస్తున్నారు......
     అదే కంపెనీ కేంపస్ లో ఓ ప్రక్క పరిశుభ్రత కార్యక్రమంలో నిమగ్నమైవున్న  నాగ బృందం ఈ హడావుడికి తలెత్తి చూసారు.
    సరిగ్గా ఆ సమయంలో నాగ చూస్తున్నది ఆ హడావుడినికాదు....
     దూరంగా కంపెనీ సైకిల్ స్టాండు దగ్గర్లో వున్న ముగ్గురువ్యక్తుల్నే చూస్తున్నాడు. మెల్లగా ముందుకు నడుస్తూనే వారు తన దృష్టిలోంచి తప్పుకోకుండా చూసుకుంటున్నాడు నాగ్.
    గంట క్రితం ఓ హొటల్ గదిలో ప్రారంభమైన సమావేశపు వివరాలు తెలుసుకుంటేతప్ప ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరన్నది అక్కడికి ఎందుకొచ్చారన్నది తెలియదు......
    తాజ్ హొటల్లో, ఓ సూట్ లో  నలుగురు వ్యక్తులు తర్జన భర్జనలు చేసుకుంటూ, మరో వ్యక్తికోసం ఎదురుచూస్తున్నారు. అతనే భాగ్యరాజ్.
    తన భారీ శారీరాన్ని ఈడ్చుకుంటూ, ఓ చేతితో బట్టతలనునిమురుకుంటూ సూట్ లోకి ఎంటర్ అయ్యాడు భాగ్యరాజ్.
    అతన్ని చూసి నలుగురు ఒక్కసారి గుండెలనిండా ఊపిరిపీల్చుకున్నారు.
    ఎలాంటి సమస్యనయినా చిటికలో పరిష్కరించే భాగ్యరాజ్ అంటే పారిశ్రామిరంగంలో గొప్ప గౌరవం.
    "నాకు తెలుసు మీరు నాకోసం అల్లాడి పోతుంటారని....." అని  తేలిగ్గా అంటూ సోఫాలో చతికిలబడ్డాడు. ఆ తరువాత తాపీగా రెండు కాళ్ళు బార్లాజాపి ముందుసోఫాలో పెట్టాడు.
    "ఇప్పుడేం చేయమంటారు.....?" నలుగురిలో ఒకతను అడిగాడు భాగ్యరాజ్ వైపు ఆందోళనగా చూస్తూ.
    "ఇప్పుడిక చేయగల్గింది ఒకటే-పరిస్థితి దాదాపు చేయిదాటిపోయినట్లే-కొన్ని వేలమంది కార్మికుల జీవితాలకు సంబంధించిన విషయం ఇది ఇక ఫ్యాక్టరీని నడపటం మీ చేతకాదని తేల్చిపారేసారు మీ కార్మికులు. నాకు తెల్సినంతవరకు కార్మికమంత్రి తన వ్యక్తిగత ప్రెస్టేజ్ కోసం  దాన్ని గవర్నమెంట్ హండో వర్ కి ప్రయత్నం చేస్తాడు. ఆ  సందర్భంలో ఓ స్టేట్ మెంటు పారేస్తాడు- నా ప్రియమైన కార్మిక కుటుంబాలు ఆకలితో అలమటించటం ఇష్టంలేదని, మేం చేపట్టి దాన్నిఊడబోడుస్తామని......"
    "అంతేనంటారా......?" దిగులుగా అడిగాడు ఒకతను.
    "అంతేగదామరి. కుక్కకి, మాంసం విసిరినట్లు పదిడిమాండ్లు వాళ్ళడిగితే, మీరు ఫ్యాక్టరీ ఫైనాన్సియల్ పొజిషన్ బావోలేదని రెండు తీరుస్తా వస్తే, ఇంతదాకా వచ్చేదికాదు....." భాగ్యరాజ్ సలహా బదులు ఇలా అంతకుముందే చేస్తుంటే బావుండేదన్న ధోరణిలో గతాన్నిఎత్తి చూపుతూ, తమ అసమర్థతపై చావుదెబ్బ కొట్టడం వారికి నచ్చలేదు నలుగురు అసహనంగా కదిలారు.
    ఆవలించకుండానే పేగులు లెక్కెట్టగల భాగ్యరాజ్ కి వారి రియాక్షన్ ని కనిపెట్టడం పెద్ద కష్టంకాలేదు.

 Previous Page Next Page