Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 23

 

    అతను చెడ్డవాడు కాదు. కానీ 'ఎగ్జిబిషనిజమ్' - అంటే తనకు ఉన్నది అందరికీ గొప్పగా ప్రదర్సించి ప్రదర్శించి, పొంగిపోయే లక్షణం అతనిలో కాస్త ఎక్కువే ఉంది.
    
    అసలు అందరూ చూసి మూర్చపోవాలనే ప్రతిమని చేసుకుంటున్నాడు కూడా!
    
    సరస్వతి అందించిన గద్వాల చీరె కట్టుకుని బాత్ రూంలోనుంచీ బయటికి వచ్చింది ప్రతిమ.
    
    "వెనకటికి మా హైమావతమ్మ అత్తయ్యకి ఉండేది ఇంత పెద్ద జడ!" అంది సరస్వతి ఇష్టంగా ప్రతిమని చూస్తూ.
    
    శ్రీరాం ఛాతీ ఉప్పొంగింది.
    
    "మరేమనుకున్నావ్, నా సెలక్షనంటే?" అన్నట్లు చూశాడు తల్లి వంక.
    
    నిజమే! అతని ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికీ, ఎవ్వరికీ కూడా -ఇంత అందమైన భార్య లేదు!
    
    తనకెంత గొప్పగా, ఇంకెంత గర్వంగా ఉంటుంది! చివరికి క్లబ్బులో తన పేకాట ఫ్రెండు సిన్హాగాడి పెళ్ళాం, సిన్మా తారలా ఉంటుందని వాడి గర్వం - అది కూడా ప్రతిమ ముందు దిగదుడుపే! మహా అయితే ప్రతిమ ఎడంకాలి చిటికెనవేలి గోటికి నెయిల్ పాలిష్ వెయ్యడానికి పనికివస్తుందేమో అంతే!
    
    తరవాత భోజనాలకి కూర్చున్నారు. ప్రతిమకి మనసంతా చేదుగా అయిపోయి అసలు ఆకలి వేయటం లేదు. కళ్ళు మూసినా, తెరిచినా బ్రాహ్మలూ, కుండలూ, మంత్రాలే గుర్తొస్తున్నాయి.
    
    ఆమె స్థితి గమనించి వాతావరణాన్ని తేలిక చెయ్యడానికి జోకులెయ్యడం ఎక్కువ చేసింది శృతి. నిజానికి తనకీ మనసు హాయిగా లేదు.
    
    కానీ, ప్రతిమ దృష్టి పొద్దుటి సంఘటన మీద నుంచీ మళ్లేలా చెయ్యాలి. అది ముఖ్యం.
    
    "పిన్నీ! పిన్నీ! అన్యాయం! పులుసులో ముక్కలన్నీ నీ కోడలికే వేసేస్తున్నావ్! నాకు అసలు వెయ్యటం లేదు!" అంది ఆరోపణగా.
    
    "ఏమిటే నీ అల్లరి!" అని నవ్వుతూ గరిటనిండా ముక్కలు తీసి శృతి కంచంలో వేసింది సరస్వతి.
    
    "పిన్నీ! పిన్నీ! ఇది మరీ అన్యాయం! నాకిష్టం లేదని తెలిసీ చేమదుంప ముక్కలన్నీ నాకు వేస్తున్నావ్! నీ కోడలికెయ్! దానికి ఇవంటే ఇష్టం!" అంది మళ్ళీ.
    
    "నిజంగానా?" అంటూ గిన్నెలో కలియపెట్టి చూసింది సరస్వతి. చేమదుంప ముక్కలు ఇంక లేవు. అన్నీ శృతికే పడిపోయాయి.
    
    "పోన్లే, పిన్నీ నాకు పడ్డవి కొన్ని నీ కోడలికిచ్చేస్తాను" అని అంతలోనే ప్రతిమ వైపు తిరిగి, "ఓహ్! ఐయామ్ సారీ! మేము నాయుళ్ళం! మీరు మా..." అనబోయింది.
    
    ఒక్కసారి కళ్ళెత్తి తన స్నేహితురాలివైపు చూసి, మాట్లాడకుండా ఆమె కంచంలోని చేమదుంప ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంది ప్రతిమ.
    
                                                               * * * * *
    
    భోజనాలయాక ప్రతిమని తన బెడ్ రూమ్ లోనే పడుకోమంది సరస్వతి.
    
    నిద్రపట్టకపోయినా, వూరికే కళ్ళు మూసుకు పడుకుంది ప్రతిమ. డైనింగ్ హాల్లోనుంచీ సరస్వతీ, శృతీ, శ్రీరాం మాట్లాడుకుంటున్న మాటలు వినబడుతూనే ఉన్నాయి.
    
    "అయితే ఎప్పుడు పెట్టిస్తావు పిన్నీ, పెళ్ళికి ముహూర్తం? అందర్నీ పిలుస్తావా?" అంటోంది శృతి.
    
    "అలా ఎలా చెయ్యగలం?" అంది సరస్వతి సాలోచనగా. "ఇంత గొడవ జరిగాక ఇంక మామూలుగా బంధువులందరినీ పిలిచి చెయ్యటం కుదరదు."
    
    "అవును! వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు కదా అమ్మాయి తరఫు వాళ్ళు రాలేదేమని? అందరికీ సంజాయిషీలు చెప్పుకోలేక తలప్రాణం తోకకి వస్తుంది."
    
    "ప్రతిమ తరఫు వాళ్ళు ఎందుకు రారూ? ఖచ్చితంగా వచ్చి తీరుతారు. తలమీద అక్షింతలు వెయ్యడానికి కాదు - తలవాచేటట్లు చివాట్లు పెట్టడానికీ, తలవంపులు తేవడానికీనూ! తప్పకుండా గొడవ జరుగుతుంది." అన్నాడు శ్రీరాం.
    
    "గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్ళి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదేమో!" అంది శృతి.
    
    కాస్సేపు మౌనంగా ఉండిపోయింది సరస్వతి. తర్వాత నెమ్మదిగా అంది. "నిజమే! ఈ పెళ్ళి అసాధారణంగా జరుగుతోంది. అందువల్ల దీనికి రికార్డులూ, సంతకాలూ ఉండడం అవసరమేనేమో! ఆ అమ్మాయి ఇబ్బందుల్లో పడిపోవడం నాకిష్టం లేదు. రిజిస్టర్ మారేజ్ అయితే ఎవరూ ప్రశ్నించడానికి వీలుండదు." అంది.
    
    ఆమె మాటలు తనకి సరిగానే వినబడుతున్నాయా? అని అనుమానమొచ్చింది ప్రతిమకి. ఎంత ముందు చూపుతో, ఎంత శాంతంగా మాట్లాడుతోంది! అసహ్యకరమైన పరిస్థితులలో వదిలి వచ్చేసిన తనంటే ఆమెకి ఏ మాత్రం చులకనభావం లేదా? రిజిస్టర్ మ్యారేజ్ కూడా కొడుకు మంచి కోసం కంటే, తను ఇబ్బందుల్లో పడిపోతుందేమోనన్న ఆరాటంతోనే ఒప్పుకుంటోందా?
    
    ఈవిడ సగటు అత్తగారు కాదా? సగటు ఆడది కాదా?
    
    కృతజ్ఞతతో ప్రతిమ మనసు బరువెక్కిపోయింది.
    
    సరస్వతి గొంతు వినబడుతోంది.
    
    "రిజిస్ట్రార్ ఆఫీసుకి ఇచ్చిన నెల రోజుల నోటీసూ వచ్చే ఆరో తారీఖుతో అయిపోతుందన్నావు కదూ? అంటే ఆ తర్వాత పెళ్ళి రిజిస్టర్ చేయించవచ్చన్నమాట. ఇవాళ శాస్త్రిగారిని పిలిపించి మంచి రోజెప్పుడో అడుగుదాం."    

    శృతి సరస్వతిని చూసి నవ్వింది.
    
    "నువ్వు తమాషా మనిషివి పిన్నీ! ఒకవైపు రిజిస్టర్ మ్యారేజ్ అంటావూ, ఒకవైపు మంచిరోజూ, శాస్త్రిగారూ అంటావు - ఏమిటిది?" అంది.
    
    సరస్వతి కూడా నవ్వింది. "పాత పద్దతులన్నీ తప్పనిసరిగా చెడూ - కొత్తవన్నీ ఆటోమాటిక్ గా మంచీ అనుకునే మనిషిని కాను నేను. పాతలో, కొత్తలో కూడా కొంత మంచి ఉందని నమ్ముతాను. అది పాటిస్తాను. ఏం తప్పా?"
    
    "కాదు! ఒప్పే!" అని ఒప్పేసుకుంది శృతి సరదాగా.
    
                                                               * * * * *
    
    ప్రతిమ ఇంట్లోనుంచీ వెళ్ళిపోయిన సంగతి ఆరోజు చాలాసేపటిదాకా గమనించలేదు కేశవరావు.    

    ప్రతిమని బెదిరించడానికీ, హడలగొట్టటానికీ ఆయన ఈ ఖర్మకాండ మొదలెట్టాడు. "శ్రీరాంని పెళ్ళి చేసుకు వెళ్ళిపోతే ఇక నీకూ, మాకూ ఈ జన్మలో సంబంధం ఉండదు!" అన్న హెచ్చరిక ప్రతిమ మనసులో నాటేలా చెయ్యడానికి ఈ నాటు పద్దతి, ఆటవికమైన మనస్తత్వంతో అవలంబించాడు ఆయన.
    
    బ్రాహ్మణులు మంత్రాలు చదువుతున్నంతసేపూ ఆయన కచ్చ తీరినట్లు ఆనందిస్తూ, ప్రతిమ భయంతో నీరు కారిపోతున్నట్లు వూహించుకుంటూ ఉన్నాడు. మధ్యలో ఒకసారి గదిలోకి వెళ్ళి చూస్తే ప్రతిమ లేదు!
    
    అంతే!

 Previous Page Next Page