Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 23

 

    తన మూలంగా ఒక జీవుడు అంతలా క్షోభ పడిపోతే అది తనకి అట్టేమంచిది కాదనితోచింది సితారకి. కేవలం అతన్ని ఉద్దరించడంకోసమే తను అతని ప్రేమని అంగీకరిస్తున్నానని తనని తాను మభ్యపెట్టుకోవడానికి కాసేపు ట్రై చేసిందిగానీ మళ్ళీ అంతలోనే గ్రహించేసింది సితార.
    
    తను అతన్ని పరమ ఘాఢంగా, అతి ఘాఢంగా ప్రేమించేస్తున్నానని.
    
    ఆ ప్రేమకూడా యివాళ హఠాత్తుగా ఈ శేషుగాడి ఉద్భోధతో పుట్టుకొచ్చిందికాదు.
    
    తనకి జెయ్ చంద్ర అంటే ఎప్పట్నుంచో ప్రేమ వుంది. చాలా యిది వుంది.
    
    కానీ ఆ ప్రేమలో ఆ యిదీ మామూలు రూపంలో మాత్రం లేవు.
    
    నీళ్ళ రూపంలో వుంటాయి. సలసలా మరిగేట్లు వేడిచేస్తే ఆవిరైపోయి వాయురూపంలోనూ వుంటాయి. ఎంతో చల్లబరిస్తే, గడ్డకట్టి ఘనరూపంలో కూడా వుంటాయి. జెయ్ చంద్రపట్ల తన ప్రేమ అంతే.
    
    తనకోపంతో కలిసి, వేడెక్కి బాయిలింగ్ పాయింటు కొచ్చేసి, తర్వాత వాయు రూపంలోకి మారి, పల్చగా తన మనసంతా వ్యాపించే వున్నా, ఆ ప్రేమ అలాంటి రూపంలో మారు వేషంలో వుండబట్టి తను చప్పున కనుక్కోలేక పోయింది.
    
    ఇప్పుడు కోపం తగ్గగానే, ఆ ప్రేమ ఒరిజినల్ షేపుకొచ్చేస్తూ, మంచు బిందువుల్లా తన మనసులో మెల్లిగా కురుస్తూ వుంటే-
    
    ఏ మాత్రం డౌట్లేకుండా ఇప్పుడుగదా అర్ధమయిపోతోంది తనకి, తనేమిటో తన మనసేమిటో.
    
    ఎండ నడినెత్తికెళ్ళి చుర్రుమంటున్నా కూడా సరేనని అక్కడే నిలబడింది సితార. అతను ఒక్కసారన్నా తల పైకెత్తి చూస్తాడేమో, అతగాడికి తన చిరునవ్వుల వరమిద్దాం అని!
    
    అబ్బే!
    
    అతను కాళ్ళూ, చేతులూ చచ్చు పడిపోయినవాడిలా అక్కడే కూర్చుని, మెడ పట్టేసినవాడిలా తదేక ధ్యానంతో శూన్యంలోకి చూస్తున్నాడు.
    
    ఇంక వుండబట్టలేక, అక్కడే వున్న చిన్న గులకరాయి తీసి అతనివీపుకి తగిలేటట్లు విసిరింది సితార.
    
    విసిర్తే అది క్రికెట్ బాల్ లా గురితప్పకుండా తగల్డానికి ఆమేమన్నా కపిల్ దేవా? అంచేత ఆ గులకరాయి తిన్నగా వెళ్ళిపాపం తన దోనవ తాను వెళ్తున్న ఓ సర్దార్జీగారి నెత్తిమీద పడింది. అయితే ఆయన తలమీద శిరస్త్రాణంలా పెద్ద తలపాగా వుండడంవల్ల ఆయనకి రాయి పడ్డట్లూ ఆ రాయిని ఓ అమ్మడు విసిరినట్లూ కూడా తెలీలేదు.
    
    రిలీఫ్ గా నిట్టూర్చింది సితార.
    
    కానీ మళ్ళీ యింకో రాయి వేసే సాహసం వెంటనే చేయలేదు.
    
    ఇంతలోనే మిట్ట మధ్యాహ్నమైపోయింది.
    
    ఆ రోడ్డు మీద జనసంచారం అస్సలు లేదు.
    
    అంచేత ఇదే అదనని అనిపించింది సితారకి.
    
    ఒక్కసారి అతని దగ్గరకెళ్ళిపోయి అస్సలు సంగతి చెప్పేసి, అతన్ని సంతోషసాగరంలో ముంచెయ్యాలి.
    
    ఈ నిర్ణయానికింక తిరుగులేదు గాక తిరుగులేదు. అలా అనుకుని ఆమె చకచకా మెట్లు దిగి వస్తూంటే రాంపండు రాబోట్ లా మేడ మెట్లెక్కుతూ కనబడ్డాడు.
    
    అతని చేతిలో బోల్డుకేసెట్లు వున్నాయి. కానీ వాటిని ఆమెకి కనబడనివ్వలేదు అతను.
    
    ఆ కేసెట్లు జెయ్ చంద్రవి, గొప్ప విషాద, విరహగీతాల కలెక్షను. వాటి సాయంతోనే ప్రేమకోసం ఈజీగా దిగులుపడగలుగుతున్నాడు అతను.
    
    ఇప్పుడు సైలెంటుగా వాటి నెత్తుకొచ్చేశాడు రాంపండు.
    
    అయితే ఈ వైనం సితారకి తెలీదు.
    
    తెలిసినా కూడా ఆమె అట్టే బాధపడేదికాదేమో.
    
    అయినా యింకెందుకూ జెయ్ చంద్రకి విషాద విరహ గీతాలసెట్టు, కేసెట్టూనూ-
    
    ఇంకయిప్పుడు అతనికీ, తనకీ కావాల్సిన నవల్లా "ప్రేమయాత్రలకి బృందావనమూ- "లేక "నీవు లేక నేను లేనె లేనులే" వగైరా, వగైరా డ్యూయెట్లేగా.
    
    "ఏరా అన్నం తిన్నావా?" అంది.
    
    "ఆ!" అన్నాడు రాంపండు.
    
    "నాన్న"
    
    "డిటో"
    
    "నేనొక్కసారి జానకీ వాళ్ళింటికెళ్ళొస్తా" అంది సితార పల్చటిఅబద్దం ఓటిఆడేస్తూ.
    
    రాంపండు మాట్లాడలేదు.
    
    గుమ్మందగ్గరికి వచ్చింది సితార.
    
    సరిగ్గా అదే టైంలో....
    
    గుమ్మంలోనుంచి లోపలికి వచ్చేప్రయత్నం చేశాడు పోలీసుబావ- వీరభద్రం. సితారకి సొంత బావ! పోలీసు ఇన్స్ పెక్టరు.
    
    అతను "జై పాతాళా!" అన్నట్లు ఆరున్నర అడుగుల ఎత్తున వుంటాడు. అతనిది ఎకరంబాతిక ఛాతి. ఏదుపంది ముళ్ళలా నిక్కబొడుచుకుని వుండే బిరుసు వెంట్రుకలు.  రెండు జెయింట్ సైజు గొంగళిపురుగుల్లాంటి దట్టమయిన కనుబొమలు. వాటికింద రెండు మిడిగుడ్లు, గేదెలాంటి మొహం. దానికి తోడు గాగుల్సూ, కోరల్లాంటిపళ్ళు, వాటిమధ్య సిగరెట్టు. పదునుచెయ్యని తోలులా రఫ్ గా వుండే నల్లటి చర్మం. గొరిల్లాకు వున్నట్లు వళ్ళంతా బొచ్చు. అతను రెండు సైజుల చిన్న యూనిఫాం వేసుకుని వున్నాడు. నడుంకి తోలుపటకాలాంటి బెల్టు వుంది. అందులో సర్వీస్ రివాల్వరు కూడా వుంది. పొరబాట్న పోలీస్ డిపార్ట్ మెంటులో మహిషాసురుడిలా వుంటాడు వీరభద్రం.
    
    అతను పోలీస్ స్టేషన్ లో పులి!
    
    కానీ సితార ముందుకి వస్తే మాత్రం పిల్లే.
    
    దానికీ కారణం వుంది - అంటే మరేం లేదు. అతను సితారని చచ్చేట్లు ప్రేమిస్తున్నాడు. కానీ ఆ సంగతి యింత వరకూ ఆమెతో చెప్పలేదు. చెప్పడానికి అతనికి బోల్డంత భయం.
    
    అసలు ఆమెతో ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని కూడా అతనికో దృఢ నమ్మకం వుంది.
    
    అతని ఉద్దేశ్యంలో సీతారామలక్ష్మి అనగానెవరు?
    
    ఆ అమ్మాయి తనక్కాబోయే నిజ భార్య.
    
    ఈ సంగతి ఈ ఊళ్ళో వున్న ప్రతి చిలక్కితెల్సు. (అని అతను అనుకుంటున్నాడు.)
    
    గత పదివేల ముఫ్ఫైకోట్ల జన్మల్లోనూ ఈ సీతారామలక్ష్మి తన పెళ్ళామై వుంటుంది.
    
    లేకపోతే ఒక్క జన్మలో ఆమె మీద తనకింత ప్రేమపుట్టుకు రావడం అనేది ఇంపాజిబుల్! ఇంపాజిబుల్!! ఇంపాజిబుల్!!!

 Previous Page Next Page