Previous Page Next Page 
కలియుగంలో సీత పేజి 23

 

    రూప మెడలో పసుపుతాడు పచ్చగా కొత్తగా కనపడుతున్నది.

 

    "మనం కూచుని మాట్లాడుకుందామా కాసేపు నాతో మాట్లాడటానికి మీకభ్యంతరం లేదు కదండీ?" రవి వినయంగా రామచంద్రంతో అన్నాడు.

 

    రూప ఓ అందమైన అబ్బాయిని నా క్లాస్ మేట్ అంటూ వెంటబెట్టుకొచ్చి పరిచయం చేయటమే ఓ వింతగా వుంది రామచంద్రంకి. కూచుని మాట్లాడుదామా అని రవి అడగటం మరో వింతగా అనిపించింది కొద్దిగా కంగారు పడ్డాడు. "ష్యూర్, ష్యూర్, మనం కూచునే మాట్లాడుకుందాము. కుచోమని చెపుదామనే అనుకుంటున్నాను సరే అడగటం అయిపోయింది, కూర్చుందాం." అంటూ రవికి కుర్చీ చూపి తానో కుర్చీలో కూచున్నాడు రామచంద్రం.

 

    రూప సీత పక్కకొచ్చి నుంచుంది. సీత పదేపదే తన మెడకేసి చూడటం గమనించి తప్పుచేసిన దానిలా తలవంచుకుంది రూప. పెదవి కదపలేదు.

 

    నా పేరు రవి. మా నాన్నగారు చేసేది టుబాకో బిజినెస్. మాకు బాగానే డబ్బుంది." అంటూ చకచక రవి చెపుతుంటే రామచంద్రం అతనేందుకు యివన్నీ చెబుతున్నాడో తెలియక ఊకొడుతున్నాడు. అతనలా రావటం మాటలతీరు అయోమయంగా వుంది రామచంద్రంకి.

 

    "ఓ కుటుంబంలో పెళ్ళి కెదిగిన ఆడపిల్లలుంటారు. కట్నాల బెడదతో ఆయింటి పెద్ద పిల్లకి పెళ్ళి చేయలేని స్థితిలో వుంటాడు. అ  సమయంలో నాలాంటి వాడు ముందుకొచ్చి కాని కట్నం అక్కరలేదు, మీ పిల్లని చేసుకుంటానంటే, ఇదే స్థితిలో మీరుంటే ఏమంటారు."

 

    "నేనా.....నేనా..... నేనేమంటను?" కంగారు పడ్డాడు రామచంద్రం.

 

    "ఏమి బాధపడరుగా?"

 

    "బాధా?"

 

    "నాకు కట్నం అక్కరలేదు. మీ అమ్మాయి అందచందాలే నే కోరిన కట్నం అంతస్తు గురించి మీరేం భయపడక్కర లేదు...."
    
    రవి చెప్పేది పూర్తిగా వినకుండానే సీత వేపు తిరిగి "అమ్మా సీతా?' అన్నాడు రామచంద్రం తదికళ్ళతో.

 

    సీత తల పక్కకి తిప్పుకుంది టక్కున.

 

    "పరిస్థితులు మమ్మల్ని తొందరపడేలా చేశాయి. జరిగిన దానివల్ల మీ అమ్మాయి సీతకేం ఫరవాలేదు. పెద్దవాళ్ళ ఆమోదం తీసుకోకుండా మా స్వయం నిర్ణయమయిన మేమేమి తప్పు చేయలేదు. మిమ్మల్ని మీ మాటని కాదనే వాళ్ళం కాదు. ముందు జాగ్రత్త పడ్డాము. మీరు మనస్పూర్తిగా మా దంపతులని దివించండి" అన్నాడు రవి.

 

    రూప నెమ్మదిగా ముందుకొచ్చింది.

 

    ఇదేమిటన్నట్టు సీత వేపు చూశాడు రామచంద్రం.

 

    సీత అప్పటికే అంతా అర్ధం చేసుకుని ఓ నిర్ణయానికొచ్చింది.

 

    "నాన్నా! వాళ్ళిద్దరిని మనస్పూర్తిగా దీవించండి." అంది రూప భుజం మీద చెయ్యి వేసి "ఇద్దరూ నాన్నకి నమస్కరించండి" ఆమె భుజం మీద చెయ్యి తీసేసింది.

 

    రూప రవి పక్కపక్కన నుంచుని రామచంద్రం పాదాలకి నమస్కరించారు.

 

    రామచంద్రంకి తేరుకోవటానికి కొద్ది నిమిషాలు పట్టింది. వాళ్ళని దివించటం మర్చిపోయాడు. అయోమయంగా "ఇదేమిటి? ఇదేమిటి? అంటూ గొణిగాడు.

 

    తండ్రికి కోపం రాకుండా వుండటానికి ముందే జాగ్రత్త పడుతూ

 

    "చెల్లాయి, అతను జంట బాగున్నారు కదూ నాన్నా?" అంది సీత.

 

    వాస్తవంలోకి వచ్చాడు రామచంద్రం. కలలాంటిది కరిగిపోయింది. "రూప" అంటూ గావుకేక వేశాడు.

 

    "ఏమిటి నాన్నా!" అంటూ ముందుకు వచ్చింది రూప.

 

    "నాన్నా!" అంది సీత.

 

    రామచంద్రం సీత మాట వినిపించుకోలేదు. కోపంతో ఉగిపోతున్నాడు. రూపని నమిలిమింగేసేలా చూశాడు. అయన చూపులు అప్పుడే రూప మెడలో పసుపు తాడు మీద పడ్డాయి.
    
    "నికృష్టపుదానా ! నువుచేసిన పనేమిటే? నీకు కాస్త కోపం వస్తే "బంగారు తల్లి! బంగారు కొండా!" అంటూ పసితనం నుంచి గారాలు చేసి బతిమిలాడే వాడిని కన్న తండ్రిని నాతో మాటమాత్రం చెప్పకుండా మూడుముళ్ళు వేయించుకు వచ్చావా? పెళ్ళి....దానికర్ధం తెలుసా? పసుపుతాడు మాత్రం మెడలో వుండాలి. కన్నవాళ్ళ అనుమతి మాత్రం అవసరంలేదు. మీరంతా ఎదిగిపోయరే. తెలివి మిరిపోయరే రెక్కలొచ్చిన పక్షులు. ఇంటికి మగబిడ్డ పెద్దవాడు, వాడలా ఆదర్శం పేరిట అఘోరించాడు. నువ్వు...."

 

    "నాన్నా! అంది రూప నెమ్మదిగా.

 

    రామచంద్రం వినిపించుకోలేదు.

 

    "నీది ఆదర్శమా, గాఢ ప్రేమో? ఏదో ఒకటి నా ప్రాణం తీసేది. సీతని చూడవే నీకన్నా పెద్దది. నివాడింది అట పాడింది పాటగా గడిపేస్తుంటే కన్నతల్లి లేని లోటు కానరాకుండా ఇంతదాన్ని చేసిందికదే దానికున్న యింగితంలో ఆవగింజంత నీకూ నీ అన్నకి వుందా?

 

    రూప కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి.  

 Previous Page Next Page