Previous Page Next Page 
ఆరోరుద్రుడు పేజి 23

 

        బొగ్గు గనుల మాఫియా ముఠా వెనకున్న కీలకమైన వ్యక్తి అధికార పార్టీకి చెందిన రాష్ట్ర గనుల శాఖా మంత్రి కావడం యాదృచ్చికం కాహ్డు. ఆ మాఫియా ముఠా కెదురుగా, ధైర్య సాహసాల్తో పోరాడినవాడు శత్రుఘ్న."
    
    ఆ న్యూస్ ఐటెమ్ ను, రెండుసార్లు చదివింది త్రిభువనేశ్వరీదేవి.
    
    సీరియస్ గా ఆలోచిస్తోందామె.
    
    "వాట్.... మేడమ్....ఏంటా న్యూస్....సడన్ గా ఆలోచనలో పడ్డారు?"
    
    అయోమయంగా అడిగాడు వరదరాజన్.
    
    "చూడండి.... మీకే తెలుస్తుంది" ఇండియాటుడేను ముందుకు తోస్తూ అంది త్రిభువనేశ్వరీదేవి.
    
    ఆ ఐటెమ్ ను సీరియస్ గా చదివి, ఆ ఫోటోవేపు ఆసక్తిగా చూసాడు వరదరాజన్.
    
    "హి ఈజ్ ఆంధ్రామేన్....మనవాడే..." ఎక్సయిటింగ్ గా అన్నాడు వరదరాజన్.
    
    "మన లిక్కర్ మాఫియాను చీల్చి చెండాడడానికి ఎగ్జాట్లీ- ఎగ్జాట్లీ...అలాంటి వ్యక్తే నాక్కావాలి. నా ఊహల్లో ఉన్న వ్యక్తి, ఇలాంటి ఆఫీసరే కోల్ మాఫియాను ఢీ కొన్నాడంటే...అతని గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి..." ఆమె కళ్ళల్లో ఏదో వెలుగు కనిపించింది.
    
    "ఇట్సే... రేర్ థింగ్.... ఏ బ్యాచ్ వాడో మన ఆంధ్రా ప్రెస్టేజీని నిలబెట్టాడు." ఇండియాటుడేని పక్కన పెడుతూ అన్నాడు వరదరాజన్.
    
    "అలాంటి సాహసం ఎప్పుడొస్తుందంటారు మిస్టర్ వరదరాజన్? ఎవరూ తెలియనప్పుడు....రెండు ఎవర్నీ లక్ష్యపెట్టనప్పుడు....ఇక్కడ మాఫియా ముఠాలకు మన ఆఫీసర్లు తెలుసు.....మన వ్యవస్థలో....ప్రతి చిన్న విషయం వాళ్ళకు బాగా తెలుసు.....అందుకే మనం ఆటంకాల్ని అధిగమించ లేక పోతున్నాం అవునంటారా..."
    
    "ఎస్ మేడమ్....యు ఆర్ కరెక్టు."

    "అందుకే.... ఇలాంటి వ్యక్తికి, మన ఆపరేషన్ ని అప్పగిస్తే మన ఆశయం నెరవేరడానికి వీలవుతుంది" తన మనసులోని అభిప్రాయాన్ని చెప్పింది సి.ఎం. త్రిభువనేశ్వరీదేవి.
    
    "ఇలాంటి వ్యక్తికే కాదు.... మేడమ్ ఈ వ్యక్తికే మనం ఎందుకు అప్పగించకూడదు?"
    
    చటుక్కున తలతిప్పి వరదరాజన్ వేపు సాలోచనగా చూసింది త్రిభువనేశ్వరీదేవి.
    
    "అతన్ని ఇక్కడకు పంపడానికి బీహార్ గవర్నమెంటు ఒప్పుకుంటుందా?"
    
    "బీహార్ గవర్నమెంటు చీఫ్ సెక్రట్రీ... నరేంద్రకుమార్ నాకు తెలుసు మేడమ్ నేను మాట్లాడతాను."    

    "ఏం మాట్లాడతారు.... పేపర్లలో వార్తల్ని చూసి, మనం పూర్తిగా నమ్మలేం... అతను మన ఆపరేషన్ కి సరిపోతాడో లేదో మనకు తెలియాలి. ఒక పదిహేనురోజులు డిప్యుటేషన్ మీద....అతను మనకు కావాలి... అతనికో ఎస్సైన్ మెంటు ఇద్దాం... అందులో సక్సస్ అయితే-
    
    ప్రొహిబిషన్ సెల్ ని అతనికి అప్పగిస్తాం లేకపోతే" నవ్వింది... సి.ఎం. త్రిభువనేశ్వరీదేవి.
    
    త్రిభువనేశ్వరీదేవి వ్యూహాన్ని అంచనా వెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు చీఫ్ సెక్రట్రీ వరదరాజన్. లేచి నిలబడ్డాడాయన.
    
    "మినిస్టీరియల్ సబ్ కమిటీ మీటింగ్... ఎప్పుడు పెట్టమంటారు మేడమ్" అడిగాడాయన.
    
    "ఆ మీటింగ్ ను కేన్సిల్ చెయ్యండి....ఎక్సయిజ్ మినిస్టర్ రాజ్య హెడ్ గా ఉన్న సబ్ కమిటీవల్ల ఉపయోగం ఏం లేదు అరక్ కాంట్రాక్టర్స్ కి....మన డెసిషన్స్ లీక్ కావడం తప్ప డిస్ట్రిక్ కలెక్టర్స్ మీటింగ్ పెట్టండి ఈ లోపల బీహార్ చీఫ్ సెక్రట్రీని ఇప్పుడు కాంటాక్టు చేయండి."
    
    "ఇమ్మీడియట్ గా కాంటాక్టు చేస్తాను మేడమ్..."
    
    చీఫ్ సెక్రట్రీ వరదరాజన్ తన ఛాంబర్ లో కొచ్చాడు....ఏం చెయ్యాలో పి.ఎకి చెప్పాడు.
    
    పి.ఎ వెంటనే బీహార్ సెక్రటేరియట్ కు ఫోన్ చేసాడు. బీహార్ చీఫ్ సెక్రటరీ నరేంద్రకుమార్ లైనులో కొచ్చారు.
    
    కుశల ప్రశ్నలయ్యాక, తనెందుకు ఫోన్ చేసాడో చెప్పారు ఆంద్రప్రదేశ్ చీఫ్ సెక్రట్రీ వరదరాజన్.
    
                                        *    *    *    *    *
    

    హోటల్ హర్ష ఇంటర్నేషనల్.
    
    సూట్ నెం. 303 :
    
    చేతిలోని స్కాచ్ విస్కీ బాటిల్ ను పట్టుకుని అప్పుడప్పుడు సిప్ చేస్తూ అసహనంగా అటూఇటూ తిరుగుతున్నాడు శ్రీరాములు నాయుడు.
    
    "ఏందిరా ఫోన్ రాలేదు.... బావ ఎక్కడి కెళ్ళినట్టు" తనని తను ప్రశ్నించుకున్నట్టు అన్నాడు శ్రీరాములు నాయుడు.
    
    "హర్షద్ మెహతా తిరుపతి కొండకు వస్తున్నాడంటే, వెళ్ళాడన్నావ్ గదా" ఎదురగా కూర్చున్న వ్యక్తి చెప్పాడు.
    
    "లేదురా... ఆ మీటింగ్ కేన్సిలైంది."
    
    అదే సమయంలో ఫోన్ మోగింది....గబుక్కున ఫోన్ రిసీవర్ అందుకున్నాడు శ్రీరాములునాయుడు.
    
    "బావగారూ... నేనూ శ్రీరామ్" అనబోయి ఆగిపోయాడు. ఆ ఫోన్ తడ నుంచి వచ్చింది కాదు.
    
    సెక్రటేరియత్ నుంచి వచ్చింది.
    
    "నువ్వా చెప్పు... మన దెబ్బకి సెక్రటేరియత్ ఎలా ఉందేవిటి? మీ సి.ఎమ్ కి చెవట్లు కార్పించా.... మరో క్షణం నేనక్కడుంటే... అంతే" పెద్ద పెట్టున నవ్వాడు శ్రీరాములు నాయుడు.
    
    "ఏం చెమట్లండీ బాబూ- జీవో మీద మరో గంటలోనో, అరగంట లోనో సి.ఎం. సంతకం చెయ్యడానికి సిద్దంగా వుంది."
    
    "అయితే.... కోర్టుకెల్తావయ్యా ఎందుకలా కంగారు పడతావ్?"
    
    "కోర్టుకెలా వెళ్తారండీ బాబూ....మా సి.ఎమ్. చాలా తెలివిగా ప్లాన్ చేసిందండీ బాబూ."
    
    "ఏం చేసిందయ్యా?"
    
    హైకోర్టు హాలీడే డిక్లేర్ చెయ్యడం మర్నాడు సెలవులు. మొత్తం విషయమంతా చెప్పాడు అవతలి వ్యక్తి.
    
    శ్రీరాములు నాయుడికి ఎక్కినా నిషా నతా ఒక్కసారి దిగిపోయింది.
    
    చేతిలోని స్కాచ్ బాటిల్ ని ఫట్ మని కోపంగా గోడకేసి కొట్టాడు.
    
    "నేను.... హైద్రాబాద్ లో ఉండగా ఇలాంటివి జరగడానికి వీల్లేదు ఇంతేనా ఇంకేవైనా.'
    
    "ప్రొహిబిషన్ సెల్ కి.... ఒక సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ ని హెడ్ గా వెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి."
    
    "ఎవరి పేర్లున్నాయి లిస్ట్ లో?"
    
    "ఇంకా ఆ ఫైలు చూడలేదండి."
    
    "ఆ లిస్టులో ఎవరెవరి పేర్లున్నాయో....రేపుదయానికల్లా నాకు తెలియాలి అర్ధమైందా?"
    
    "ఉంటాను సార్..." ఆ వ్యక్తి ఫోన్ పెట్టేసాడు.
    
    శ్రీరాములు నాయుడు ఆదరాబాదరాగా అబ్బయ్యనాయుడు కోసం తడ తిరుపతి మద్రాసు బొంబాయి ట్రై చేస్తున్నాడు.
    
    ఎక్కడా లేడు అబ్బయ్యనాయుడు రిసీవర్ని పెట్టి సిగరెట్టుని సగం కాల్చి, మిగతా సగాన్ని కోపంగా బయటికి విసిరేసాడు.
    
    అదే సమయంలో ఫోన్ మోగింది....
    
    గబుక్కున ఫోన్ అందుకున్నాడు.

 Previous Page Next Page