"ఇంతకాలం నాకు సర్వీస్ చేసినందుకు ఎలా ఫీలవుతున్నావు డిక్...?" డిక్ మీద జె.జె. కున్న అభిమానం, ప్రేమ అపారం!
"నా అదృష్టంగా భావిస్తున్నాను మాస్టా.... మరలా జన్మంటూ ఉంటే మీకు సేవకుడిగానే పుట్టాలని కోరుకుంటాను. మాస్టా... అంటూ ఆప్యాయంగా, ప్రేమగా, కృతజ్ఞతగా పిలుచుకునే అదృష్టాన్ని తిరిగి ఇవ్వమని జీసస్ ని మనసారా కోరుకుంటాను."
జె.జె. కళ్ళు డిక్ కృతజ్ఞతా భావానికి విశ్వాసపాత్రతకు చెమర్చాయి.
* * * * *
"మాధుర్ కి ఈరోజే పరిచయం అవుతాను" మౌనిక నమ్మకంగా, పట్టుదలగా అంది.
"ఎలా?" రమణయ్య ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు.
"చెప్తాను పదండంకుల్" అంటూ ఆమె ఛాంబర్ నుంచి బయటకు నడిచింది. వెనుకే రమణయ్య బయలుదేరాడు.
రిక్షా బయలుదేరింది.
"నాకో సందేహం పీడిస్తోందమ్మా!" రమణయ్య ఒకింత గాబరాగా చుట్టుప్రక్కలకు చూస్తూ అన్నాడు.
"చెప్పండంకుల్" మౌనిక క్యాసెట్ లో తాతగారు చెప్పిన విషయాల్నే మననం చేసుకుంటూ అంది.
"ఇప్పుడెవరయినా మన ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు చూశారనుకో ఏమిటి దారి?"
"ముందు షాక్ తింటారు. ఆ తరువాత స్పృహ తప్పి పడిపోతారు. అంతేగా?"
రిక్షా కల్పనా ఎడ్వర్ టైజింగ్ ఏజెన్సీ ఉన్న వీధివైపు సాగిపోతోంది.
"నేను భయపడి చస్తుంటే జోకులేస్తావేంటమ్మా?"
"భయపడ్డమెందుకు? నేను ఎవరన్నది మాధుర్ కి తెలిసినప్పుడు గదా ప్రమాదం?"
"ది గ్రేట్ జె.జె. మనుమరాలు సాదాసీదాగా రిక్షాలో తిరుగుతోందని, మాధుర్ అనే యువకుడితో స్నేహం చేస్తోందని తెలిస్తే ఆ వార్త బయటకు పొక్కకుండా ఆగుతుందా?"
"అందుకని మనమే ఒక వార్తను రిలీజ్ చేస్తాం. అదీ మీరు."
"నేనా? ఏమిటా వార్త?"
"మౌనికలాంటి అమ్మాయిని నేను చూశానని ఆమె అచ్చం మన మౌనిక లాగే వుంటుందని మన ఆఫీసులో పనీపాటా అంతగా లేని వాళ్ళ ముందు అనాలి. ఆ తరువాత డ్రామా నేనాడతాను."
మౌనిక మాటలకి రమణయ్య బిత్తరపోయాడు.
ఆమెకి ఎంతో సీరియస్ గా విషయాన్ని సయితం తేలిగ్గా, పెద్దగా రియాక్ట్ కానట్లు చెప్పటం జెజె నుంచి అబ్బింది. ఆమెకు తెలుసు ముందు ముందు ఇప్పుడు చిన్నవిగా అనుకుంటున్నవే ఎంత జటిలమయిపోతాయో అని. అన్నిటికీ ఆమె సిద్దపడే వుంది. కానది రమణయ్యకు తెలీకే ఆమె మనోనిబ్బరాన్ని అంచనా వేయలేక కంగారుపడుతున్నాడు.
రిక్షా ఆ వీధిలోకి మరలుతూనే "అదిగోనమ్మా... కుడివైపు ఎత్తుగా కనిపిస్తున్న ఆ ఓల్డ్ బిల్డింగే కల్పనా ఎడ్వర్టయిజర్స్ ఆఫీసు. ఇప్పుడు అక్కడ మాధుర్ వున్నదీ, లేనిదీ తెలుసుకురానా?" రమణయ్య అన్నాడు మెల్లగా.
"అక్కర్లేదు ఇప్పుడిప్పుడే మాధుర్ వున్నాడు."
"నీకెలా తెలుసు?"
"ఉన్నాడంతే.... రిక్షా ఆపు" అంది మౌనిక పరిశీలనగా ఆ బిల్డింగ్ కేసే చూస్తూ.
రిక్షా ఆగింది.
ఇద్దరూ రిక్షా దిగి ఓ క్షణమక్కడే ఆగిపోయి, కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా వున్నారు.
"మీరిక్కడే వుండండంకుల్.... నేనలా వెళ్ళివస్తాను" అంటూనే మౌనిక ముందుకు సాగిపోయింది.
రమణయ్య అక్కడే వున్న చెట్ల నీడలో నిల్చుండిపోయాడు.
ఆ ఓల్డ్ బిల్డింగ్ దగ్గరవుతూనే తన వేషధారణ వైపు ఒకసారి చూసుకుంది.
ఓ క్షణం నవ్వుకుందామె.
పూర్తి గోల్డ్ జరీ కస్టమ్ మేడ్ శారీస్ కంచిలో తయారుచేయించి పంపేవారు తాతగారు. మోడరన్ డ్రస్ లు, ఫ్రాన్స్ ఫ్యాషన్ కింగ్ సెయింట్ లారెంట్ కి ప్రత్యేకంగా మెసేజ్ పంపి, తన వైటల్ స్టాటిస్టిక్స్, కాంప్లెక్షన్ కి మేచ్ అయ్యేలా పర్సనల్ గా స్టిచ్ చేసి పంపమనేవారు. ప్రతినెలా ఫ్రాన్స్ నుంచి డిహెచ్ ఎల్ కొరియర్ సర్వీస్ లో పాతిక రకాల లేటెస్ట్ డ్రస్ లు తను ఎక్కడున్నా అందేవి. వాటి ఖరీదు లక్షల్లో వుండేది. అవి ప్యారిస్ నుంచి ఇండియా చేరటానికే కొన్ని వేలు ఖర్చయ్యేది.
ప్రపంచ భాగ్యవంతుల కుటుంబాలలోని సబ్యులకు, దేశ దేశాల ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్, బ్రిటీస్ రాజు కుటుంబాలకి మాత్రమే సెయింట్ లారెంట్ ప్రత్యేక శ్రద్దతో దుస్తులు పంపిస్తాడు. అంత రేంజ్ వున్న లారెంట్ ఫ్యాషన్ కాస్ట్యూమ్స్ మాత్రమే ధరించే తనిప్పుడు, కేవలం యాభైరూపాయల ఖరీదు చేసే శారీలో వుంది.
అదే ఆమెకిప్పుడు థ్రిల్లింగ్ గా వుంది.
ఆ బిల్డింగ్ గేటుముందు నించుని లోపలకు చూసింది. ఇద్దరు యువకులు ఆ ఇంటికి పెయింట్ వేస్తూ కనిపించారు.
నెమ్మదిగా గేటు తీసుకుని లోపలకు నడిచింది.
వారిద్దరూ పనిలో నిమగ్నమయి ఆమెకేసింకా చూడలేదు.
ఆ ఇద్దరిలో మాధుర్ ఎవరు?
తనింతవరకు కనీసం అతని ఒడ్డు పొడుగు గురించైనా విని వుండలేదు.
పేరుపెట్టి పిలిస్తే ఎవరు ముందు తనకేసి చూస్తారో వారే మాధుర్ అని తెలుసుకోవడం తేలికని భావించి-
"మిస్టర్ మాధుర్!" అంది కల్పనా స్వరాన్ని పెంచి.
ఆమె ఊహించినట్టే మాధుర్ చటుక్కున వెనుతిరిగి మౌనికను చూసి కొన్ని క్షణాలపాటు ఓ విచిత్రమైన ఉద్వేగానికి గురయ్యాడు.
పాలరాతి విగ్రహానికి హఠాత్తుగా ప్రాణం వస్తే లేచి సరాసరి తననే చూసేందుకు వచ్చినట్లుగా ఫీలయ్యాడు మాధుర్ మౌనికను చూడగానే!
అందమైన ముఖం.....
డార్క్ హెయిర్....
కారు మేఘాల్లాంటి అందమయిన జుత్తు చిరుగాలికి పట్టుకుచ్చులా, అలల్లా కదిలిపోతూ, ఆమె అందమైన మోమును కప్పేస్తుంటే, ఆమె అలవోకగా తలను ఒవైపుకు వంచి ఒకింత విసురుగా జుట్టు ప్రక్కకు తప్పుకొనేలా తలెగురవేస్తూంది మధ్య మధ్యలో.
ఆమె పెదవులపై చెరగని చిరునవ్వు...
అసలామె నవ్వే ప్రయత్నం చేయకపోయిన ఆమె విశాలమైన కళ్ళు, లేత తమలపాకుల్లాంటి పల్చని చెక్కిళ్ళు, తడిదేరిన పెదవుల చిరునవ్వును చిలకరిస్తాయా?!
కొద్దిక్షణాలకి తేరుకున్న మాధుర్-
"ఎస్....వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ?" అన్నాడు ప్లెజెంట్ గా మాధుర్.
"కెన్ యూ డూ ఎనీథింగ్ ఫర్ మీ?" ఆమె కంఠంలో ఏదో తెలీని రాజసం తొంగిచూసినట్టనిపించింది.
తను కేజువల్ గా అన్న మాటల్ని ఎంత షార్ట్ గా త్రిప్పి అడిగిందని విస్తుపోయి "ఐ మీన్... మీరెవరు? ఎందుకొచ్చారో? నాతో ఏం పని?" సర్దుకుంటూ అడిగాడు.
ఆమె మౌనంగా నవ్వింది ముందు.
మరో రెండడుగులు మాధుర్ కేసి నడిచి, "మీ మూలంగా జీవన భృతిని పోగుట్టుకున్నాను. మీరే కదా తిరిగి నాకు భృతి చూపించాల్సింది" అందామె మాధుర్ కేసే ఆసక్తిగా చూస్తూ.
మాధుర్ కి ఆమె అన్న మాటలు అర్ధం కాలేదు.
ఆమె అలాగే అతనికేసే చూస్తోంది. పెరిగిన గడ్డం, చెదిరిన అందమైన రింగులు తిరిగిన జుత్తు, కర్కశంగా అనిపించే భుజాలు, మొరటుగా కనిపించే దృఢమైన శరీరం... వీటన్నిటిని మించి అతని కళ్ళలో ఏదో తేజస్సు.....బ్రైట్ నెస్... అతని తెలివితేటలకు నిదర్శనంగా కొనదేరిన ముక్కు ఆమె అలాగే అతనికేసే చూస్తుండిపోయిందే తప్ప తను ఆడపిల్లనని, అందునా మధ్యతరగతి వేషంలో వున్నానన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది.