Previous Page Next Page 
సంకల్పం పేజి 24

 

      "రేపు ఎస్.ఎఫ్.సి.లో మన పనైపోయాక కలుస్తాను..."
   
    ఇద్దరూ బైటకొచ్చారు.
   
    శివమూర్తి కారెక్కి వెళ్ళిపోయాడు.
   
    వికాస్ టెలిఫోన్ బూత్ వేపు నడిచాడు.
   
    "ఫోన్ దగ్గరే వున్నారా...?" గొంతు వినపడగానే అడిగాడు వికాస్.
   
    "రెండు గంటల్నించి ఎక్కడికీ వెళ్ళలేదు... ఫోన్ పక్కనే కూర్చున్నాను" చెప్పింది లిఖిత.
   
    "పదిరోజుల్లో శివానీ మోటార్స్ మనం హేండోవర్ చేసుకోవచ్చు..."
   
    "కం....గ్రా....చ్యు....లేషన్స్..." ఫోన్లో గట్టిగా అరిచి చెప్పింది లిఖిత.
   
    "మరి ఈ అకేషన్ని ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటున్నారు?" మళ్ళీ అడిగింది.
   
    "వంటరితనంతో...." ఫక్కున చెప్పాడు వికాస్.
   
    ఒక్కక్షణం మౌనం. లిఖిత మాట్లాడలేకపోయింది వెంటనే.
   
    "ఎక్కడున్నారు మీరు?" తేరుకుని అంది మళ్ళీ.
   
    చెప్పాడు వికాస్.
   
    "అక్కడే వుండండి.... నేనొస్తున్నాను" సమాధానం చెప్పేలోపే ఫోన్ పెట్టేసింది.
   
    మరో అరగంట తర్వాత బస్టాండ్ కేంటీన్లో వున్నారు వాళ్ళిద్దరూ.
   
    అపారమైన దీక్షాదక్షతతో వున్నాడు వికాస్. అతి త్వరలో ప్రపంచం ఆశ్చర్యపడబోతున్న ఒక సంఘటన జరగబోతోంది. ఈ సమయంలో వికాస్ నిరాశతో ఉండకూడదు- అతనిలోకి మరింత ఉత్సాహాన్ని 'ఇంజెక్ట్' చెయ్యాలి.....
   
    అతనెదుట తనెవరో, తనేవిటో అన్నీ మర్చిపోతోంది లిఖిత.
   
    ఒక అమ్మాయి....
   
    కనుపాపల్లో యౌవన వాయులీన తరంగాలు చిలికిస్తున్న అందాల అమ్మాయి.... అణువణువునా ప్రణయ విపంచికలు మ్రోయిస్తున్న పసిడిబొమ్మ...
   
    నడుస్తున్న దారంతా తీయతీయని స్వప్నాల పుష్పాలు....
   
    "ఇప్పటివరకూ ఏ అమ్మాయితోనూ స్నేహం చెయ్యలేదా మీరు?" సడెన్ గా ఆ ప్రశ్న అడిగింది లిఖిత.
   
    లిఖిత నోటివెంట అలాంటి ప్రశ్ననెప్పుడూ వూహించలేదు వికాస్.   
   
    ఆశ్చర్యంగా చూశాడు. జవాబుని వెతుక్కుంతున్నాడు.
   
    "లేదు"
   
    "ఏం... అమ్మాయిలంటే పడదా... అయిష్టతా... అసహ్యమా..." నవ్వుతూ అంది లిఖిత.
   
    "రెండూ కాదు... టైమ్ లేకపోవడం..."
   
    "టైమ్ లేకపోవడమా?' పగలబడి నవ్వింది లిఖిత.
   
    నవ్వుతున్న ఆమెవేపు చూస్తున్నాడు వికాస్. తను నవ్వుతున్నప్పుడు చాలా అందంగా వుంటుందని లిఖితకు తెలుసు!
   
    "కనీసం ఆలోచించడానిక్కూడా టైమ్ లేనంత బిజీగావుంటారా మీరు....అస్సలు... అస్సలంటే అస్సలు... మీరెవర్నీ కనీసమంటే... కనీసం.... అమ్మాయిని యిష్టపడలేదా... అబద్దం చెప్పకూడదు... నిజం చెప్పాలి..." గోముని అభినయిస్తూ అడిగింది లిఖిత.
   
    అప్పుడు ఆమెకు కావల్సిన సమాధానం....
       
    లిఖితను యిష్టపడుతున్నానని వికాస్ చేత చెప్పించడం.
   
    "నిజంగా చెప్తున్నాను.... ఏవనుకోకండి.... ఒకే ఒకసారి ఓ అమ్మాయిని చూసి, చాలా బాగుందనుకున్నాను. అప్పుడు నేను బస్ లో వెళుతున్నాను. ఆ అమ్మాయి కూడా బస్ లోనే వుంది... ఒక్కత్తే కూర్చుని వుంది. అప్పుడు నేను ఓ కార్ల డీలర్ దగ్గర పని చేస్తున్నాను. సెలవు రోజు మేనమామ దగ్గరకు వెళ్తున్న సమయంలో ఇది జరిగింది. ఎలాగైనా ఆ అమ్మాయితో మాట్లాడాలని తాపత్రయం... ఇద్దరి మధ్యా ఒక్క సీట్ వుంది.... ఎక్కడి వరకూ ప్రయాణం....ఆఖరికి తెగించి అడిగాను.... జవాబు లేదు... సంజ్ఞలు చేసాను. ఓ గంటసేపు నానా బాధలు పడ్డాను... లాభం లేదు... విసుగొచ్చింది. రెస్పాన్స్ లేక పోయేటప్పటికి విసుగొచ్చింది. నా కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టేశాను. ఓ అరగంట తర్వాత బస్సు ఏదో వూళ్ళో ఆగింది. ముందు కూర్చున్న నడివయసు మనిషి ఆమె దగ్గర కొచ్చి, వెనగ్గా కూర్చున్న నడివయసు మనిషి ఆమె దగ్గర కొచ్చి, వెనగ్గా కూర్చున్న నన్ను కోపంగా చూశాడు. నేను చేసిన వికృత చేష్టలన్నీ వీడు చూశాడా... గుండె గుభేలుమంది.
   
    "ఎంతరిచినా అది పలకదు.... చెవిటిది... ఆడాళ్ళని చూడగానే అలా వంకర్లు తిరిగిపోయే బదులు, పెళ్ళి చేసుకోకూడదు....అనేసి ఆ అమ్మాయిని తీసుకుని దిగిపోయాడు.
   
    అందమైన ఆ అమ్మాయి చెవిటిదా! ఇప్పటికీ నేను నమ్మలేక పోతున్నాను."
   
    "అప్పటి నుంచీ మరెప్పుడూ అమ్మాయిల జోలికెళ్ళలేదా...." నవ్వుతూ అంది లిఖిత.
   
    తలూపాడు లేదన్నట్టు.
   
    "ముక్కూ, మొహం తెలియని అమ్మాయిల్ని ఎవరైనా చూస్తారా....?
   
    "ముక్కూ, మొహం తెలిస్తేనే చూడాలా...? ముక్కూ, మొహం రహస్య దేశంలో లేవు కదా... వాటిని చూడడం, మెచ్చుకోవడంలో తప్పేం లేదు కదా...?"
   
    "తెలియని వ్యక్తుల్ని ప్రేమించడం.... థ్రిల్లింగ్ గా వుంటుందా.... అబ్బాయిలకి...."
   
    "నేనో ప్రశ్న అడుగుతాను... చెప్పండి."
   
    "స్మశానంలోకెళ్ళి సమాధుల్ని ఎప్పుడైనా చూస్తారా మీరు"
   
    "ఎందుకు చూస్తాం?"
   
    "ఆ సమాధి అందంగా వుంటే.....మనం చూస్తాం.....ఫర్ ఎగ్జాంపుల్..."  వికాస్ చెప్పబోయేంతలో-
   
    "తాజ్ మహల్... ఇదేనా మీరనేది?" అంది ఆమె.
   
    "ఎగ్జాక్టిలీ."
   
    "ఓ.కె... మహానుభావా.... ఒక ఆడపిల్ల.... ఒక సమాధి ఒకటే నంటారా?"
   
    "నా దృష్టిలో ఒకటే. ఒక ఆడపిల్లని మనసారా ప్రేమించి, విఫలమైన మగాడికి లైఫంతా సమాధిలాంటిదే."
   
    "మీ రీజనింగ్ బాగుంది.... కానీ ఒకపప్తి 'డీప్ లవ్' ఇప్పుడెక్కడుంది."
   
    "ఉంటుందండి.... ఎందుకుండదు...
   
    ఈ సమాజంలో నిజమైన ప్రేమికులెప్పుడూ చనిపోయాకే కనిపిస్తారు. బతికున్నప్పుడు వాళ్ళనీ సమాజం గుర్తించదు."
   
    ఆ అభిప్రాయంతో ఏకీభవించక తప్పలేదు లిఖితకు.
   
    కాఫీలొచ్చాయి. ఇద్దరూ తాగుతున్నారు.   
   
    "ఇప్పుడు మనల్ని చూసినవాళ్ళు ఏమనుకుంటారో చెప్పండి?"
   
    "అబ్బాయి, అమ్మాయి కాఫీ తాగుతున్నారనుకుంటారు..." ఆమెకు రావలసిన జవాబు వికాస్ లోంచి రాలేదు.
   
    "ఏమనుకుంటారో చెప్పనా?!" 'ప్రేమికులు' అని మనసులో అనుకుని 'లగేజీ లేకుండా వీళ్ళే వూరెళ్తారో అనుకుంటారు. ఎందుకో చెప్పండి" అంది లిఖిత.
   
    "మీరే చెప్పండి."
   
    "బస్టాండ్ కాబట్టి."
   
    ఆ మాటకు నవ్వేశాడు వికాస్.
   
    "సిన్మాకెళ్దామా... ఈ మధ్య ఏం సినిమా చూశారు మీరు?"  కాంటీన్లోంచి బయటికొస్తూ అడిగింది ఆమె.
   
    "లవకుశ..." వెంటనే చెప్పాడు వికాస్.
   
    "లవకుశా! బీ.సీ.నాటి లవకుశ. ఓ ఆరుగంటలో, అరవై గంటలో సిన్మాహాల్లో వుండాలి. అదేనా? అన్ని గంటలు హల్లో ఎలా వున్నారండీ బాబూ!"
   
    పార్కింగ్ ప్లేస్ వేపు నడుస్తూ అంది.
   
    "బోర్ కొట్టి వెళ్ళాను.... నిద్రొచ్చింది.... సుబ్బరంగా పడుకున్నాను."
   
    గలగలా నవ్వింది లిఖిత.
   
    దానిమ్మగింజల్లాంటి పలువరుస తళుక్కున మెరిసినట్లయింది.
   
    ఎవరికయినా బోర్ ఎందుకు కొడుతుంది?"
   
    "ఏ పనీ లేకపోతే బోర్ కొడుతుంది అవునా?"
   
    "పని లేనప్పుడు శుభ్రంగా ముసుగుతన్ని పడుకుంటే బోరు కొట్టదుగా నవ్వాడు వికాస్.
   
    "మంచి సూత్రమే."
   
    "సిన్మాకెళ్దామా... వద్దా... చెప్పండి.... కారు డోర్ తీస్తూ" అంది లిఖిత.
   
    "నెక్స్ట్ టైమ్"
   
    "ఓ అమ్మాయి, సిన్మాకు రమ్మని పిలుస్తుంటే.... నెక్స్ట్ టైమ్ అనే వ్యక్తిని మిమ్మల్నే చూశాను."
   
    "అదికాదు.... నా ఉద్దేశ్యం...." ఏదో చెప్పబోతున్న వికాస్ మాటల్ని కట్ చేస్తూ-
   
    "సరదాగా అన్నానులెండి...." అని "మిస్టర్ వికాస్ .... ఎలాగైనా మీ గోల్ ని మీరు రీచవ్వండి. ఆ రోజు మీకు నేను అపురూపమైన 'స్టాంప్'ని ఇస్తాను."
   
    "అంత పెద్ద ఎడ్వంచర్ కి చిన్న స్టాంపా.... ప్రెజెంటేషన్....."

 Previous Page Next Page