Previous Page Next Page 
సంకల్పం పేజి 25

 

      "ఆ స్టాంప్ చాలా రేర్ కలెక్షన్. దాని ఖరీదు ఇప్పుడు నాలుగు వందల కోట్లు ఉంటుంది." లిఖిత ముఖంలో ఏ భావమూ లేదు.
   
    "ఆ స్టాంప్ ని నన్నొక్కసారి చూడనిస్తారా?"
   
    "ప్రెజెంట్ చేస్తానన్నప్పుడు మళ్ళీ అడగడం..... మంచి పద్దతి కాదు." చెప్పింది లిఖిత.
   
    "మీరు స్టాంప్స్ కలెక్టరా....?"
   
    సమాధానం ఇవ్వలేదు ఆమె.
   
    "మళ్ళెప్పుడు."
   
    "మీరెప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు."
   
    అలా అయితే రోజూ ఫోన్ చేస్తాను. ప్రతిక్షణం ఫోన్ చేస్తాను. మనసులోనే అనుకున్నాడు వికాస్.
   
    ఆమె కారు స్టార్టు చేసింది.
   
    "విష్ యూ ఆల్ ది బెస్ట్" గేరు మార్చింది.
   
    తను వికాస్ కి ఇవ్వబోయే 'రేర్ స్టాంప్' తలపు కొచ్చింది. తనలో తనే నవ్వుకుంది.
   
    తను, అతనికివ్వబోయే 'రేర్ స్టాంప్' ఏవిటో తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు.
   
    ఆ రేర్ స్టాంప్.... లవ్ స్టాంప్ లవ్ స్టాంప్.... అంటే!
   
    అందాల లిఖిత గంథం రంగు బుగ్గల మీద చిన్న గులాబీ రంగు మెరుపు.....
   
                                     *    *    *    *    *
   
    మర్నాడు ఎస్.ఎఫ్.సి.లో రెండుగంటలు మేనేజర్ తో భేటీ-
   
    ఆ తర్వాత శివమూర్తి వెళ్ళిపోయాక- యూనియన్ లీడర్ని కలవడానికి చావుల మదుం దగ్గరకెళ్ళాడు వికాస్.
   
    నర్సింహమూర్తి ఒకప్పుడు పేరు పొందిన వస్తాదు. ఇంటి వరండాలో కొన్ని ఫోటోల్ని చూడగానే పసికట్టాడు వికాస్. మనిషికి యాభై ఏళ్ళుంటాయి.
   
    వికాస్ చెప్పిందల్లా విన్నాక-   
   
    "శివమూర్తి హయాంలో వర్కర్లు చాలా బాధలు పడ్డారు.... జీతాల్లేవు.... సగం సగం జీతాలిచ్చేవాడు... గట్టిగా అడిగితె... వర్కర్ల ముందే ఏడ్చేసేవాడు... శివమూర్తి.... ఆయనకు కలిసిన పార్టనర్లు కూడా అలాంటివాళ్ళే.... తాడూ....బొంగరంలేని మనుషులు...." చెప్పాడు నర్సింహమూర్తి.
   
    "ఈ నెలాఖరుకు ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తాను.... ఆ రోజు మీరు కొంతమంది వర్కర్లను తీసుకురావాలి."
   
    "తీసుకొస్తాను- గానీ- ఏదో సాధిద్దామనే కోరికుండడం సహజం. కానీ- ఏం చేస్తావు నువ్వు. కార్ ని రిపేరు చేస్తావా? కార్ ని తయారుచేస్తావా?" ఒకింత నిరాసక్తంగానే అన్నాడు.
   
    "కొత్త మోడల్ కారుని తయారుచేస్తాను" దృఢంగా చెప్పాడు వికాస్.
   
    "శివమూర్తి తయారుచేసిన లాంటిదేనా" వ్యంగ్యంగా అన్నాడు నరసింహమూర్తి.
   
    "కాదు.... నేను ఇంట్రడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ మీద నాకు నమ్మకం వుంది. మీరు హెల్ప్ చేస్తే చాలు. వర్కర్లు మనస్ఫూర్తిగా సహకారం అందిస్తే ప్రపంచంలో ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుందని నా నమ్మకము."
   
    అయిదు నిమిషాలు ఆలోచనలో పడ్డాడు యూనియన్ లీడర్.
   
    "అలాగే.... పెద్దవాణ్ని ఒక సలహా చెప్తున్నాను.... ఏమనుకోకు... పది రూపాయలు సంపాదించాలంటే కనీసం ఒక రూపాయైనా మన దగ్గరుండాలి. ఆ రూపాయిని మనం పెంచగలిగే తెలివితేటలుండాలి. నీకు తెలివితేటలుంటేనే దిగు. నువ్వూ.... నిన్ను నమ్మబోతున్న మేమూ అందరం మళ్ళీ రోడ్డుమీదకు రాగూడదు."
   
    ఓ అరగంట తర్వాత-
   
    అక్కడనుంచి తిరిగొచ్చేశాడు వికాస్.
   
    పదిరూపాయలు సంపాదించాలంటే కనీసం ఒక రూపాయైనా మన దగ్గరుండాలి.... అవును.... నిజం...
   
    లక్షల రూపాయలు బిజినెస్ చెయ్యడానికి ఉద్యుక్తుడవుతున్న వికాస్ దగ్గర ప్రస్తుతమున్నది....
   
    వెయ్యిరూపాయలే.... అంతే!
   
    ఈ నెలాఖరుకు ఆ వెయ్యిరూపాయలూ అయిపోతాయి. టీ కప్పుక్కూడా డబ్బులుండవు.
   
    రూం తలుపు తీస్తున్న సమయంలో వికాస్ కి మేనమామ చయనులు గుర్తుకొచ్చాడు.
   
    మూన్నెలయింది కలిసి. ఈ సమయంలో మేనమామ సలహా చాలా అవసరం.
   
    మేనమామను కలవడానికి ముందు తను చెయ్యాల్సిన ముఖ్యమైన పని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారుచెయ్యడం!
   
                                      *    *    *    *    *
   
    మూడురాత్రులు, మూడు పగళ్ళు... కంటిమీద కునుకు లేదు. తనేం చెయ్యబోతున్నాడు? ఎలా చెయ్యబోతున్నాడు? నోట్సు రాసుకున్నాడు వికాస్.
   
    ఈ పదిరోజుల్లో తనేం చెయ్యాలి?- మొట్టమొదట మేనమామని కలవాలి.
   
    అప్పటికీ, ఇప్పటికీ మేనమామ ప్రవృత్తిలో ఏం మార్పూలేదు, వయసు తెచ్చిన తేడా తప్ప- అదే జీవన విధానం- అలుపులేని పోరాటం తన కాళ్ళ మీదే తాను నిలబడాలనే బ్రతుకు ఆరాటం.
   
    కొత్తవలస సంతలో గేదెల్ని అమ్ముతూ కనిపించాడు చయనులు. ఇంతకు పూర్వంలా పదిరూపాయలకి, వందరూపాయలకు వెతుక్కునే పరిస్థితి లేదిప్పుడు ఆయనకు.
   
    అలాగని వేలకు వేలు సంపాదించాడనీ కాదు- రొటీన్ - రొటీన్- వేలకు వేల రూపాయల రొటీన్- అందులో కమీషన్- కొత్తవలసలోనే చిన్న లాడ్జింగ్ హౌస్ లీజ్ కి తీసుకున్నాడు.
   
    పది, పదిహేను మడతమంచాలు రాత్రివేళ వుండిపోయేవారికి మంచానికో పది రూపాయలు వసూలు చేస్తాడు.
   
    రోజుకి వంద తక్కువ లేకుండా మినిమమ్ వ్యాపారం.
   
    "జింఖానాలో మానేశావా.... ఎందుకు తెలివితక్కువ పనిచేశావ్?"
   
    లాడ్జింగ్ హౌస్ ఆఫీసు గదిలో కూర్చున్నారిద్దరూ.
       
    జింఖానాలోంచి బయటకు రావడానికి దారితీసిన పరిస్థితుల దగ్గర్నించి శివానీ మోటార్స్ పరిస్థితి వరకూ చెప్పాడు వికాస్.
   
    "బాగానే వుందిరా... ఇప్పుడు కావల్సింది డబ్బు.... ఎంతవసరం ఉంటుంది?"
   
    చెప్పాడు వికాస్.
   
    "పాతిక వేలయినా చేతిలో లేకపోతే పని మొదలుపెట్టడం కష్టం" చెప్పాడు వికాస్.
   
    "పాతికవేలు?!" ఆలోచనలో పడ్డాడు చయనులు.
   
    "ఒరేయ్ బాబీ! నువ్వు తయారుచేసే కారు సక్సెస్ అవుతుందని నీకు నమ్మకం వుందా... ఏమైనా డౌట్లున్నాయా? డౌటు వుంటే మాత్రం మానెయ్. ఉన్నదీ పోయింది... ఉంచుకున్నదీ పోయింది... వచ్చింది గుడ్డిది అన్నట్టుగా వుండకూడదు వ్యవహారం. నాకు తెల్సినంత మట్టుకు నీకో రహస్యము చెప్తాను.....అవకాశం, అదృష్టమే కాదు- ఆలోచన కూడా చాలా అవసరం- ప్రజల అవసరాన్ని కనిపెట్టి, ఆ సరుకుని ఎక్కడ అమ్మాలో, అక్కడ అమ్మితేనే సరుకు గిట్టుబాటవుతుంది. అంచేత నీ కష్టమర్లెవరో... స్పష్టంగా నిర్ణయించుకో.....రెండవది... నువ్వు తయారుచేసే సరుకు మార్కెట్లో అంతకు ముందున్న సరుకుకంటే తక్కువ ధర వుండాలని గుర్తుంచుకో.... మూడు..... కస్టమర్లకు నువ్విచ్చే అదనపు సౌకర్యాలు గురించి ఆలోచించు.... నాలుగు ఇంత పెద్ద ప్రాజెక్టు చేపడుతున్నావ్ కాబట్టి, నీ ఆశని, నీ ఆశయాల్ని నమ్మి నీతో కష్ట, సుఖాల్ని మనస్ఫూర్తిగా పంచుకోగలిగిన వ్యక్తినే నమ్మకంగా నీ దగ్గర పెట్టుకో! అలాంటి వాళ్ళని పదిమందిని తయారుచేసుకో నీ ముందో మాట...... నీ వెనకో మాట.... చెప్పేవాళ్ళని, నిన్ను నిరాశపరిచే వాళ్ళనీ దగ్గరకు రానీయకు అభిమానంతో చెప్పే విమర్శలుంటాయి. అలాంటి వాళ్ళను దూరం చేసుకోకు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం.
   
    నువ్వు చిన్నప్పటి నుంచీ అక్కడా, ఇక్కడా పనిచేసి నేర్చుకున్నది ఒక ఎత్తయితే, యిప్పుడు చేసేది ఇంకో ఎత్తు అంచేత అనుభవం ఎప్పుడూ గొప్పదే..... కానీ ముందు చెయ్యాల్సింది.... ఈ ఫీల్డ్ లో అనుభవజ్ఞుల్ని కలవటం, వాళ్ళ సలహా తీసుకోవటం అన్ని రకాలుగా ఆలోచించి దిగినవాడు ఎప్పుడూ ఓడిపోడు" ఒకవేళ ఓడినా ఆ ఓటమికి ఆయుష్షు తక్కువ ఉంటుంది చెప్పడం ఆపేడు మేనమామ.
       
    సరిగ్గా వికాస్ మనసులో ఏ ఆలోచనలున్నాయో, వాటినే బహిర్గతం చేశాడు చయనులు.
   
    "మావయ్యా... నువ్వు నాలుగో పాయింట్ గా చెప్పిందాని గురించి మాట్లాడదాం. నువ్వు నాతో వుండాలి. నువ్వుంటే.... చాలు. నువ్వు నాతో రాగలవా?"
   
    ఆ మాటకు చయనులు ఒకసారి సూటిగా వికాస్ మొఖం వేపు చూసి-

 Previous Page Next Page