Previous Page Next Page 
సంకల్పం పేజి 23

 

        నాంపల్లిలో హోటల్ కాకతీయాలో దిగి పదిగంటలకు జూబ్లీహిల్స్ లో వున్న అపోలోకి బయలుదేరాడు.
   
    అపోలో హాస్పిటల్ ముందు పడేసి 'అప్' ఎక్కినందుకు ఇంకో అయిదు రూపాయలు ఛార్జి చేశాడు- ఆటోవాడు.
   
    "అప్ ఎక్కినందుకు అయిదు రూపాయలా?" అమాయకంగా అడిగిన వికాస్ ని ఎగాదిగా చూస్తూ-   
    "అంతే.... వూరికి కొత్తోడిలా వున్నావ్.... మరీ మాట్లాడితే తీసికెళ్ళి పటాన్ చెర్వులో వదిలేస్తాను.... జాగ్రత్త..." మరి మాట్లాడలేకపోయాడు వికాస్.
   
    పి.ఆర్.ఓ.ని కల్సి, కలవాల్సిన వ్యక్తి గురించి చెప్పాడు. ఎక్కడ నుంచి వచ్చేడో చెప్పాడు.
   
    సభాపతి దగ్గరకు డైరెక్ట్ చేశాడు పి.ఆర్.ఓ.
   
    సభాపతి మాట్లాడలేని స్థితిలో వున్నాడు. అన్నీ విన్నాక 'నో అబ్జెక్షన్' లెటర్ రాసిచ్చాడు ఆయన.
   
    పి.ఆర్.ఓ.కి థాంక్స్ చెప్పి మెట్లు దిగుతున్న వికాస్ ఒక్క అయిదు నిమిషాలు అక్కడుంటే భానోజీరావుని, లిఖితను చూసేవాడు.
   
    లిఖిత ఎవరో తెలిసిపోయేది.
   
    కుడిపక్కకెళ్ళి మలుపు తిరిగాడు వికాస్.
   
    ఎడం ప్రక్కనుంచి జింఖానా 1000 కారొచ్చి ఆగింది.
   
    అందులో నుంచి భానోజీరావు దిగాడు- ఆయన ప్రక్కన లిఖిత.
   
    భానోజీరావు ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నాడు. ఆ వ్యక్తి సభాపతి.
   
    సాయంత్రం అయిదుగంటలకు వికాస్ నాంపల్లి స్టేషన్ కొచ్చాడు. కష్టపడి వచ్చినందుకు, ఏ ఆటంకం లేకుండా పని అయినందుకు వికాస్ కి సంతృప్తిగా వుంది.
   
    అయిదూ పదిహేను నిమిషాలకు గోదావరి ఎక్స్ ప్రెస్ బయలుదేరింది.
       
    సరిగ్గా, అప్పటికి అరగంట ముందు, సడెన్ గా మళ్ళీ హార్ట్ ఎటాక్ రావడం వల్ల సభాపతి చనిపోయాడు.
   
                               *    *    *    *    *

   
    గుప్పెడు ముత్యాలు, పగడాలు, పచ్చలు, మాణిక్యాలు గుట్టగా పోసిన అందమైన ప్రదేశంలో, ఒకే ఒక్క కొమ్మకు పూసిన గులాబీలా షోగ్గా కూర్చుంది లిఖిత.
       
    అతి త్వరలో సింహాసనాన్ని ఆక్రమించుకోవడానికి సిద్దంగా ఉన్న యువరాజులా వున్నాడు వికాస్.
   
    అంతవరకూ జరిగింది ఏ ఒక్క విషయమూ వదలకుండా చెప్పాడు గర్వంగా.
   
    లిఖిత పెదవుల మీద చిరునవ్వు నది పాయల మీద వెన్నెల్లా...
   
    "రేపు ఎస్.ఎఫ్.సి. మేనేజర్, శివమూర్తిలతో మీటింగ్ వుంది. శివానీ మోటార్ ఆఫీసులో.... రేపే కీలకమైన మీటింగ్..."
   
    "గెలుపు మీదేలెండి..."
   
    "మీరిచ్చే కాన్ఫిడెన్స్ వల్లే ఇది జరిగింది...."
   
    "నేను కాన్ఫిడెన్స్ ఇచ్చానా? మీ పట్టుదలే... నన్ను పొగడకండి. నాకసలే సిగ్గెక్కువ" జోగ్గా అంది లిఖిత.
   
    నవ్వాడు వికాస్.
   
    "మీ కంపెనీ తయారుచేసిన కార్లో మీరెళ్ళటం అతి త్వరలో చూస్తామన్న మాట... అప్పుడు మాలాంటి వాళ్ళని గుర్తుంచుకుంటారు కదూ?"
   
    ఆ మాటకు-
   
    "అలాంటిదే జరిగితే, ఇన్నేళ్ళ నా తపన ఫలిస్తే.... నేను తయారుచేసే మొట్టమొదటి కారు... కానుకగా ఇచ్చేది ఎవరికో తెల్సా?"
   
    "ఎవరికీ?" వెంటనే అడిగింది లిఖిత.
   
    "సస్పెన్స్... చెప్పాల్సిన టైమ్ లో చెప్తాను." నవ్వుతూ అన్నాడు వికాస్.
   
    ఇద్దరూ విజయా పార్లర్ దగ్గర బటర్ మిల్క్ తాగి బయటికొచ్చారు.
   
    "డ్రాప్ చెయ్యనా?" అడిగింది లిఖిత.
   
    "వద్దులెండి.... బస్సులో వెళ్ళకపోతే ఆ రోజంతా నా మూడ్ బాగోదు...." నవ్వుతూ అన్నాడు.
   
    "బై..." కారెక్కింది లిఖిత.
   
    బస్టాప్ వేపు నడుస్తున్నాడు వికాస్.
   
    "వికాస్..." గట్టిగా పిల్చింది. తల తిప్పాడు.
   
    "రేపు మీటింగ్ అవగానే ఫోన్ చేసి చెప్పండి.... ఫోన్ దగ్గరే వుంటాను మర్చిపోకండి...."
   
    తలూపాడు.
   
    అప్పుడు లిఖిత మదిలో ఓ చిలిపి వూహ కలిగింది.
   
    దాన్ని వికాస్ చెప్పి, వూరించాలనుకుంది.
   
    ఒక్క క్షణం ఆలోచించి ఇప్పుడు కాదు- రేపు అనుకుంది.
   
                                       *    *    *    *    *
   

    శివానీ మోటార్స్ ఫ్యాక్టరీ ఊరికి రెండుమైళ్ళ దూరంలో ఉంది.
   
    మూడు ఎకరాల స్థలంలో- ఎడంపక్క ఎడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, రెండో పక్క ఇంజనీరింగ్ డివిజన్- దాని వెనక మాన్యుఫాక్చరింగ్ డివిజన్ వున్నాయి.
   
    అంతా సిస్టమేటిగ్గా డిజైన్ చేశాడు శివమూర్తి.
   
    "ఆరు నెలల వరకూ గూర్ఖా వుండేవాడు. అనవసరమని మాన్పించేశాను...." మెయిన్ గేట్ కి వేసిన తలుపు తాళం తీస్తూ చెప్పాడు శివమూర్తి.
   
    గేటుదాటి లోనికెళ్ళగానే ఖాళీ జాగా, పిచ్చి పిచ్చి మొక్కలెన్నో లేచిపోయాయి.
   
    ఎడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ తాళం తీశాడు.
   
    చెత్తా, చెదారం.... బూజు...
   
    ప్రతి విభాగాన్నీ చూపించాడు.
   
    మిషన్లన్నీ తుప్పు పట్టేశాయి- ఎందుకూ పనికిరావు...
   
    తన గదికి తీసికెళ్ళాడు. తను రూపకల్పన చేసిన 'ట్రై సైకిల్' నమూనాని చూపించాడు. తయారుచేసి, 'అసెంబెల్' చెయ్యకుండా ఉంచిన 'పార్ట్స్'ని చూపించాడు.
   
    "నాకెప్పటికయినా నమ్మకం వుంది.  ఈ ట్రై సైకిల్ సక్సెస్ అవుతుందని" అని అన్నాడు.
   
    చర్చల ప్రారంభానికి ముందు.
   
    చర్చలు రెండు గంటలు జరిగాయి.
   
    శివానీ మోటార్స్ ని వెనక్కి తీసుకొని, దాని నిర్వహణని, బాధ్యతని వికాస్ కి అప్పగించేటట్టు నిర్ణయం జరిగింది.
   
    ఈ పరిస్థితుల్లో అలా అయితేనే 'డిలే' జరక్కుండా పని జరుగుతుందని చెప్పాడు ప్రాజెక్ట్ మేనేజర్ ఏలుమలై.
   
    అంగీకరించాడు శివమూర్తి.
   
    "రీ ఫైనాన్స్ చేసే అవకాశం ఏమైనా వుందా.....?" అడిగాడు వికాస్.
   
    "అసలు మీ ప్రాజెక్ట్ ఏమిటో....రిపోర్టు సబ్ మిట్ చెయ్యండి ముందు..."
   
    కాసేపు అఫీషియల్ ఫార్మాలిటీస్ గురించి చర్చలు జరిగాయి.
   
    మర్నాడు ఆఫీసుకొస్తే మేనేజర్ తో డిటైల్ గా మాట్లాడొచ్చని, అంతా అయిపోతే పదిరోజుల్లో వికాస్ కి ఫ్యాక్టరీని స్వాధీనం చేయొచ్చని చెప్పి వెళ్ళి పోయాడు ఏలుమలై.
   
    ఒక పావుగంట తర్వాత....
   
    వికాస్, శివమూర్తి బయటికొచ్చారు.
   
    ఊళ్ళోకొచ్చాక శివమూర్తి కారుని ఓ హోటల్ ముందు ఆపాడు.

    "కాఫీ తాగుదాం..."
   
    ఇద్దరూ లోనికి నడిచారు.
   
    "మిస్టర్ వికాస్.... నాదో రిక్వెస్ట్... అడగనా? ..." అన్నాడు శివమూర్తి.
   
    "చెప్పండి సర్...."
   
    "సైటుకి సంబంధించిన లీజ్ గురించి అనుకున్నాం కదా... దాని కేదో ఎమౌంట్ ఫిక్స్ చేస్తారు కదా... ఆ ఎమౌంట్ నువ్వు నాకివ్వొద్దు. ఈ ఫ్యాక్టరీలో నేను పార్టనర్ గా వుంటాను.... నా సర్వీసెస్ ఉపయోగించుకో.....ఏమంటావ్....."
   
    ఒక్కక్షణం ఆలోచనలో పడ్డాడు వికాస్.
   
    "ఓ.కే... అలాగే సర్...." ఆ మాటతో శివమూర్తి ముఖం వికసించింది.
   
    వికాస్ తన దగ్గరకు వెతుక్కుని వచ్చిందగ్గర్నించి, ఇప్పటివరకూ ప్రతిక్షణం అతన్ని 'అబ్జర్వ్' చేస్తున్నాడు శివమూర్తి.
   
    ఈ కుర్రవాడు ఏదో సాధిస్తాడు, ఏదో చేస్తాడు. ఆ క్వాలిటీస్ పుష్కలంగా కనిపించాయి వికాస్ లో ఆయనకు.
   
    "ఆ రెండేళ్ళ కాలంలో శివానీ మోటార్స్ లో 150మంది వరకూ వర్కర్స్ వుండేవారు. వాళ్ళకి యూనియన్ కూడా వుంది..... మళ్ళీ ప్రారంభించే ముందు.... ఆ యూనియన్ లీడర్ని ఒకసారి కలిస్తే మంచిది..... వర్కర్స్ ఎక్కడెక్కడో వెళ్ళిపోయారనుకో.... వచ్చినవాళ్ళనీ, పనికి వచ్చినవాళ్ళనీ తీసుకుంటే తప్పేం లేదుకదా...." కాఫీ తాగుతూ చెప్పాడు శివమూర్తి.
   
    "ఆ యూనియన్ లీడర్ పేరు..."
   
    "నరసింహమూర్తి."
   
    "ఎక్కడుంటాడు?"
   
    "చావులమదుం దగ్గర... అక్కడున్న కిళ్ళీబడ్డీ షాపుల్లో అడిగితే ఎవరయినా చెప్తారు. వాళ్ళ తమ్ముడో, ఎవరో అక్కడ కిళ్ళీబడ్డీ నడుపుతున్నాడు".

 Previous Page Next Page