Previous Page Next Page 
త్రినేత్రుడు-2 పేజి 24


    హాలంతా నిశ్శబ్దంగా వుంది.

    అక్కడున్న అందరూ ఏదో ఒక సమస్యతో సతమతమైపోతున్నవారే. నిజానికి వారిలోనూ ప్రభుత్వాన్ని నిలదీయాలన్న ఆవేశం వుంది.

    "అడిగితే పోలా?" హాలు మధ్య నుంచి ఎవరో పెద్దగా కేకవేశారు.

    "ఎవరు అడగాలి...? మనమందరమా?" యోగేష్ ప్రశ్నించాడు.

    "మన సెక్రటరీ" మరొకరు పెద్దగా అరిచారు హాలు మధ్య నుంచి.

    "ఎవరు మన సెక్రటరీ? నాకైతే గుర్తులేదు. మీకు గుర్తుందా?" యోగేష్ సర్ కాస్టిగ్గా అడిగాడు.

    "ఇంకెవరు...? ది గ్రేట్ త్రినాధ్" అనుకోకుండా యోగేష్ వ్యతిరేక వర్గంలోని సభ్యుడొకడు అరిచాడు.

    రాబోయిన కోపాన్ని, ఉక్రోషాన్ని అణుచుకున్నాడు యోగేష్.

    "ఓహో...త్రినాధ్ కదూ...? మరి ఏడి త్రినాధ్...? ఎక్కడ?"

    అంతే... ఆ మరుక్షణం యోగేష్ కి చెందిన కొందరు సభ్యులు "త్రినాధ్ డౌన్... డౌన్... త్రినాధ్ ని తొలగించాలి" అంటూ వెర్రిగా కొద్ది క్షణాలపాటు అరిచారు.

    "కొత్త సెక్రటరీని ఎన్నుకొని మన సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి" అంటూ మరికొందరు అరిచారు.

    మొత్తానికి కొద్ది నిమిషాలపాటు ఆ హాలంతా నిరసనలతో ప్రతి నిరసనలతో దద్ధరిల్లిపోయింది.

    త్రినాధ్ అంటే ఇష్టపడే సభ్యులు సయితం అలాంటి పరిస్థితులలో ఏం చెయ్యాలో తెలీక మౌనంగా వుండిపోయారు.

    సుదర్శన్ రావు పథకం సరీగ్గా గంటకి త్రినాధ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియలిస్ట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పదవి నుంచి ఏకగ్రీవంగా తొలగించడంతో పూర్తయింది.


                  *    *    *    *


    పబ్లిక్ ఎఫైర్స్ మేనేజర్ తెచ్చిన డాక్యుమెంట్స్ ని ఓసారి పరిశీలనగా చూసి "ఎలక్ట్రిసిటీ బోర్డ్ చైర్మన్ ఇంటికి, సెక్రటరీ ఇంటికి ఫోన్ కలుపు" అన్నాడు త్రినాధ్ సాలోచనగా.

    "ఈ టైమ్ లోనా- సార్-" మేనేజర్ సందేహంగా అడిగాడు.

    అప్పుడు సరిగ్గా టైమ్ రాత్రి పదకొండు గంటలవుతోంది.

    "ఫోన్ ఇవ్వండి" సీరియస్ గా అన్నాడు త్రినాధ్ ఆ డాక్యుమెంట్స్ వేపే చూస్తూ మరలా.


                  *    *    *    *


    "నీకో బహుమతి ఇస్తానన్నాను గుర్తుందా?" సుదర్శన్ రావు ప్రియాంకవైపు గర్వంగా చూస్తూ అన్నాడు.

    "గుర్తుండి. కానీ ఏమిటా బహుమతి డాడీ?" ప్రియాంక ఆసక్తిగా అడిగిందేకాని ఆమె ఆలోచనలు వేరేచోట పరిభ్రమిస్తున్నాయి. నిన్న సరిగ్గా ఇదే టైమ్ లో హిందూ తన దగ్గరకు వచ్చి సరిగ్గా 24 గంటల్లో మిమ్మల్ని మా బాస్ అంధకారంలోకి నెట్టబోతున్నాడు- చేతనైతే అడ్డుకొండని విసిరిన సవాల్ గురించే ఆలోచిస్తోంది.

    "బహుమతి గురించి నీకు చెప్పి ఎన్ని గంటలై వుంటుంది బేబీ?"

    "సుమారు 20 గంటలు" ప్రియాంక అన్యమనస్కంగా అంది.

    24 గంటలు కూడా కాకముందే త్రినాధ్ సెక్రటరీ పదవిని ఊడగొట్టించాను."

    తండ్రి మాటలకు ఆమె దిగ్భ్రమ చెందింది.

    "అవును. గంట క్రితమే త్రినాధ్ ని సెక్రటరీ పదవి నుంచి దించి యోగేష్ ని ఎక్కించాను" సుదర్శన్ రావు ఆనందంగా వున్నాడు- ఎదురు దెబ్బ కొట్టగలిగినందుకు.

    కానీ... డాడీ... మనల్ని 24 గంటలలోపే అంధకారంలోకి నెట్టబోతున్నట్టు త్రినాధ్ మరో సవాల్ విసిరాడు- ఇది తెలుసా మీకు?"

    ప్రియాంక మామూలుగానే అన్నా సుదర్శన్ రావు మాత్రం ఒక్కసారి షాక్ తిన్నాడు.

    24 గంటల్లోనే అంధకారంలోకి నెట్టేస్తాడా...? ఏమిటతని సాహసం-? అదెలా సాధ్యం?

    టెలిఫోన్స్ లాగే పథకం సిద్ధం చేసుంటాడా? అదే అయుండాలి. ఈ.... ఛాలెంజ్ ని ఎదుర్కోకపోతే...

    "నాన్నగారూ..." ప్రియాంక పిలుపుకి సుదర్శన్ రావు ఉలిక్కిపడి తేరుకున్నాడు.

    "ఏమ్మా-?"

    "మన ఫోన్ కనెక్షన్స్ ఎందుకు కట్ అయ్యాయి...? కోట్ల ఆస్థి వున్నా అధికార వర్గాలలో మీకు మంచి పలుకుబడి వున్నా, త్రినాధ్ ఛాలెంజ్ ని ఆపలేకపోయారేం? ఎందుకంటారు...?"

    అతను సమాధానం ఇవ్వటానికి సందేహించాడు. ఫోన్స్ ఎలా కట్ అయిందీ కూతురికి తెలీదని ఆయన భావన.

    "కరెంట్ మీటర్స్ కూడా వెనక్కి తిప్పిస్తున్నారా?"

    షాక్ తిన్నాడు సుదర్శన్ రావు.

    "తప్పులు చేస్తే షాక్ లు తప్పవు నాన్నగారూ! మనమిప్పుడు గెలిచినా మనది గెలుపే అవుతుందంటారా?"

    మార్పు రావడానికి ముందు చేసుకునే ఆత్మ పరిశీలనా లేక మామూలుగా అంటోందా? సుదర్శన్ రావు అయోమయంగా చూశాడు.

    "టెలిఫోన్ డిపార్ట్ మెంట్ లో చేసిన తప్పే ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్ లో కూడా చేస్తున్నారా?"

    కూతురు మాటలకు గతుక్కుమన్నాడు సుదర్శన్ రావు.

    "ఒకవేళ అదే నిజమైతే అది తప్పా ఒప్పా అన్న మీమాంస తరువాత- ముందు పరువు దక్కించుకోవటం ముఖ్యం" కూతురు తనను నిలదీయడం నచ్చకపోయినా ఇచ్చిన సలహా మాత్రం నచ్చింది సుదర్శన్ రావుకు. వెంటనే బయటకు వెళ్ళిపోయాడు వేగంగా.

    తన తండ్రి చేసింది మంచైనా, చెడైనా త్రినాధ్ చేతిలో అవమానింపబడటం మాత్రం బాధాకరంగా వుంది ప్రియాంకకు.

    ఏమిటీతని ఉద్దేశం? తమ జీవితాల్ని, వ్యాపారాల్ని స్తంభింప చేస్తాడా? అది మాత్రం జరగరాదు.

    ఓ ప్రక్క త్రినాధ్ సామర్ధ్యానికి అడ్మైర్ అవుతూనే మరోప్రక్క తండ్రి ఓడిపోవడాన్ని భరించలేకపోతోంది. అహానికి, ఆత్మ పరిశీలనకు మధ్య సంఘర్షణ. 


                                          *    *    *    *


    సుదర్శన్ రావు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు మినిస్టర్ ఇంట్లో వున్నాడు.

    మినిస్టర్ అప్పటికే పి.ఏ.కి ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చేసాడు. డిపార్ట్ మెంట్ సైడ్ నుంచి ఎలాంటి ఇబ్బందులూ రాకూడదు. సుదర్శన్ రావు ఫ్యాక్టరీల ఎలక్ట్రిక్ కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేయరాదు- అని.

    మినిస్టర్ తో కొద్దిసేపు పాత పరిచయాన్ని పురస్కరించుకుని మంతనాలాడి బయటపడి, తన ఫ్యాక్టరీలవైపు సాగిపోయాడు హడావుడిగా.

    పావుగంటకల్లా ఫ్యాక్టరీకి చేరుకొని తన కంపెనీలలో పని చేసే ఎలక్ట్రిషియన్స్ ను తక్షణం పిలిపించాడు.

    "ఎవరైనా ఎంక్వయిరీకొచ్చినా మనం చేసే పని ఆచూకీ దొరక్కూడదు వెంటనే చెడిపోయిన పాత మీటర్స్ స్థానంలో కొత్త మీటర్స్ బిగించి వాటి రీడింగ్ ని కాస్త ఎక్కువగానే సెట్ చేయండి. క్విక్... గంటలో ఈ పనులన్నీ జరిగిపోవాలి. అలాగే హై పవర్ లైన్ నుంచి మనం వైర్స్ వేసి లాక్కునే కరెంట్ కనెక్షన్స్ కూడా వుండకూడదు. ఎక్కడా ఏ అనుమానం రాకుండా చేయాలి. ఏదైనా పొరపాటు జరిగి, అది త్రినాధ్ దృష్టికిగాని, అతని వెంటవచ్చే జర్నలిస్ట్ ల దృష్టికి గానీ వెళ్లిందా? మీ శవాలే మీ ఇంటికి పంపబడతాయి... వెళ్ళండి...." ఆయాసపడిపోతూ హెచ్చరించాడు సుదర్శన్ రావు. రేసు గుర్రాల్లా దూసుకుపోయారు వాళ్ళంతా.

    ఇప్పుడు ఒకింత స్థిమితంగా వుంది సుదర్శన్ రావుకి. కానీ ఆయాసం బాగా పెరిగిపోయింది. ఊపిరి తీసుకునేందుకు కూడా కష్టంగా వుందనిపించింది.

    వెంటనే డ్రైవర్ సహాయంతో కారులోకి చేరి, వెంటనే ఇంటికి వెళ్ళమని చెప్పి వెనుక సీట్లో జారగిలబడ్డాడు. కారు ఇంటివేపు దూసుకుపోతోంది. ఊపిరి తీసుకోవటానికి తన యజమాని పడే అవస్థను చూసి, ఎదురుగా కనిపించిన టెలిఫోన్ బూత్ దగ్గర కారాపి ఫ్యామ్లీ డాక్టర్ కి ఫోన్ చేసి ప్రక్కనే వున్న మెడికల్ షాప్ లో ఎడ్రినలిన్ ఇంజెక్షన్ వెయిల్స్ తీసుకుని మరల కారును ముందుకు దూకించాడు.

    ఒక యువ పారిశ్రామికవేత్త సుదర్శన్ రావుపై పగబట్టినట్లు, అతను అనుక్షణం సుదర్శన్ రావును వెంటాడుతున్నట్లు సర్వనాశనం చేసేవరకు నిద్రించడన్నట్లు పుకార్లుగా వినిపిస్తున్నాయి. ఫోన్స్ కనెక్షన్స్ డిస్కనెక్టు కావటం వెనుక అతని హస్తమే వున్నట్టు... ఇంకా తెర వెనుక నుంచి తన బాస్ ని దెబ్బకొట్టే ప్రయత్నాలు చురుగ్గా సాగిస్తున్నట్టు తెలియవస్తోంది.

    ఒకచోట కాదు- అన్నిచోట్ల... ప్రజలు, కార్మికులు, సిబ్బంది ఈ విషయాల గురించే గుంభనంగా చర్చించుకుంటున్నట్టు- జరగనున్న పరిణామాలపై ఊహాగానాలు చేస్తున్నట్టు డ్రైవర్ కి తెలిసిపోయింది.

    విషయాలు అతనికి ఆనందం కలిగించినా మనిషిగా ఇప్పుడు తన యజమాని పడే బాధపట్ల ఒకింత చలించిపోయాడు.

    డ్రైవర్ సహాయంతో లోపలకు వస్తున్న తండ్రిని చూసి ప్రియాంక కంగారుపడిపోయింది. విషయం అర్ధంగాక హడావుడిగా వెళ్ళి తాను సాయం పట్టి లోపలకు తెచ్చి ఎ.సి. రూమ్ లో కూర్చోబెట్టింది.
   
    అంతలో డాక్టర్ వచ్చాడు.

    ఐదు నిమిషాలు టెస్టులు చేసి "అనవసరంగా ఆవేశపడిపోయుంటారు. అందుకే తొలిసారి బ్లెడ్ ప్రెజర్ బయటపడింది... కంగారేం లేదు. మానసికంగా ఏ అందోళనా లేకుండా వుండకపోతే ఈ వయస్స తెచ్చే జబ్బులు చాలా వుంటాయి..." అని ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు డాక్టర్.

    ఇదంతా త్రినాధ్ మూలంగానే గదా...?

    నిన్ను ఊరికే వదిలిపెట్టను...

    నిన్ను సర్వనాశనం చేసిందాకా నిద్రపోను... ప్రియాంక అపరకాళికలా మారిపోయింది.

    సరిగ్గా అదే టైమ్ లో ఎలక్ట్రిసిటీ బోర్డు సెక్రటరీ ఇంట్లో వున్నాడు త్రినాధ్.

    ఆ సెక్రటరీ ఐ.పి.యస్. ఆఫీసర్.

    నీతి, నిజాయితీలంటే ప్రాణమిస్తాడు...

    ఆ వివరాలన్నీ ముందుగా తెలుసుకొనే వచ్చాడు త్రినాధ్ అక్కడకు.

    ఇప్పుడా ఆఫీసర్ ఎదురుగా త్రినాధ్, అతని వెంట వచ్చిన ఏడెనిమిదిమంది జర్నలిస్టులున్నారు. ఆ ఆఫీసర్ ముఖమిప్పుడు కందగడ్డలా వుంది.

    "నిజంగానే అభియోగం చేస్తున్నారా?" సెక్రటరీ సీరియస్ గా అడిగాడు.

    "నిజంగానే... సుదర్శన్ రావు ఫ్యాక్టరీలో తయారయిన ప్రొడక్షన్, సేల్స్ రిపోర్టు మీ ముందుంచాను. లాజిగ్గా ఆలోచించండి. పద్నాలుగు కోట్లకు అమ్మకాలు కనిపిస్తున్నాయి. ఇవి సేల్స్ టాక్స్ డిపార్టుమెంట్ కి ఆయన కంపెనీ కట్టిన టాక్స్ రసీదులు. ఈ లెక్కలు 1985-86 ఆర్ధిక సంవత్సరానివి. అదే సంవత్సరం మీ బోర్డుకి ఆయన కంపెనీలు చెల్లించిన కరెంట్ బిల్లు 1,17,000 వేలు.

    ఇది సాధ్యమా...? కేవలం లక్షా పదిహేడు వేలు ఖరీదు చేసే కరెంట్ తో 14 కోట్ల రూపాయల ఉత్పత్తుల్ని తయారుచేయగలరా ఎవరైనా...? పైగా అతని ప్రోడక్ట్స్ అన్నీ ఎక్కువ కరెంట్ ని తీసేసేవే. టెలిఫోన్స్ విషయంలో అయితే మీటర్స్ ఎక్సేంజ్ లో వుంటాయి కనుక మాటువేసి రెడ్ హాండెడ్ గా పట్టించాను. ఇప్పుడు అలా కాదే? మీటర్స్ అన్నీ మీరు కనెక్షన్స్ ఇచ్చిన బిల్డింగ్ లోనే వుంటాయి. చివరిగా ఈ ఫోటోలు చూడండి. హైపవర్ ఇండస్ట్రియల్ లైన్ అది. ఈ లైన్ సుదర్శన్ రావు ఆటోమొబైల్స్ స్పేర్ పార్ట్స్ ఫ్యాక్టరీ ప్రక్కగా వెళ్తుంది. మరి కొంచెం శ్రద్ధగా చూడండి- ఒక వ్యక్తి గాల్లో నిచ్చెన వేసి పైకెక్కి వున్నాడు. క్రింద ఆ నిచ్చెనను పట్టుకుని మరో నలుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు..."

    సెక్రటరీ ఆశ్చర్యపోయాడు త్రినాధ్ చెప్పేది వింటూ.

    జర్నలిస్ట్స్ ఆసక్తిగా చూస్తున్నారు. నిశ్శబ్దంగా వున్న ఆ హాలు నాలుగు గోడల మధ్య త్రినాధ్ కంఠమొకటే వినిపిస్తోంది.

    "మీరు పర్మిషనిస్తే ఇప్పుడో వ్యక్తిని లోపలకు పిలిపిస్తాను..." త్రినాధ్ సెక్రటరీని అడిగాడు.   

 Previous Page Next Page