Previous Page Next Page 
త్రినేత్రుడు-2 పేజి 25


    "వైనాట్... ప్లీజ్..." అన్నాడు సెక్రటరీ.

    అతనికి మతిబోతోంది ఆ వివరాలన్నీ చూస్తుంటే.

    త్రినాధ్ బయటకు వెళ్ళి ఓ వ్యక్తితో లోపలకు వచ్చాడు.

    త్రినాధ్ తో వచ్చిన వ్యక్తి వినయంగా సెల్యూట్ చేశాడు.

    "ఈయన రాఘవ. సుదర్శన్ రావు ఫ్యాక్టరీలున్న ఏరియా స్టేషన్ కి చెందిన సర్కిల్ ఇన్స్ పెక్టర్" సెక్రటరీ త్రినాధ్ చెప్పకముందే అతను పోలీస్ డిపార్ట్ మెంట్ మనిషని గ్రహించాడు అతను సెల్యూట్ చేసిన విధానాన్ని చూసి.

    "చెప్పండి రాఘవగారు..." త్రినాధ్ సి.ఐ.కేసి చూస్తూ అన్నాడు.

    "సరీగ్గా మూడు గంటలక్రితం నాకో ఫోన్ వచ్చింది సార్. దాన్నందుకుని హడావుడిగా బయలుదేరే సమయానికి ఒక వ్యక్తి వచ్చి ఫోన్ చేసింది మా మనిషే- పదండి- మీకో విచిత్రం చూపిస్తానంటూ బయలుదేరాడు. అతను చెప్పిన దిక్కుకే నా మోటార్ సైకిల్ వెళ్ళింది సార్. కొంతదూరం వెళ్ళాక ఓచోట ఆగిపొమ్మన్నాడు సార్. టెలీలైన్స్ అమర్చిన కెమేరా ఒకటి నా చేతికిచ్చి ఓ దిక్కుకేసి చూపించి నన్ను చూడమన్నాడు సార్. చూసాను సార్. అప్పుడు ఇప్పుడు మీ ముందున్న ఫోటోలోని దృశ్యమే కనిపించింది సార్. వాళ్ళేమన్నా వైర్స్ దొంగతనంగా కట్ చేస్తున్నారా లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారా అన్న అనుమానాలు వచ్చి కెమేరాను అనుకోకుండానే క్లిక్ చేసాను. ఆ వ్యక్తి వెంటనే నా చేతిలోంచి తన కెమేరా తీసేసుకుని వైర్స్ దొంగతనం చేస్తున్నారు. వెళ్ళండనడంతో హడావిడిగా అక్కడకు వెళ్ళేసరికి ముగ్గురు పారిపోయారు. ఒకడు దొరికాడు సార్. వాణ్ణి నాలుగు తన్నితే చాలా ప్రమాదకరమైన విషయాన్ని వెళ్ళగ్రక్కాడు సార్..." సి.ఐ. చెప్పటం ఆపాడు.

    "అసలు జరిగింది నేను చెబుతాను సార్. నాకు సుదర్శన్ రావు తప్పుడు పనులు ఓ సందర్భంలో అనుభవంలోకి వచ్చాయి. బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను చేయవల్సింది చేస్తే మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ ఎలాంటి అవకతవకనైనా సెట్ రైట్ చేస్తారన్న నమ్మకం వుంది. బహుశా ఇలాంటివి మీ దృష్టికి రావు. మీ డిపార్ట్ మెంట్ సిబ్బంది మీదాకా రానివ్వరు. చిన్న పారిశ్రామికవేత్త కరెంట్ బిల్లు కట్టడం ఒక్కరోజు లేట్ చేస్తే చాలు కనెక్షన్స్ తీసేస్తారు. మరి సుదర్శన్ రావులాంటి ఘరానా వ్యక్తుల విషయంలో...? అఫ్ కోర్స్ మీలాంటి ఆఫీసర్స్ అయితే ఘరానా వ్యక్తుల్ని సయితం క్షమించరను కోండి. మీ బోర్డుకి నష్టాలు వచ్చేది ఇలాగేకదా? దాన్ని తప్పుదారి పట్టించటం కోసమే నీ కరెంట్ కనెక్షన్స్ తీసేయబోతున్నారు బోర్డువారు అని కొద్దిగా బెదిరించాను. ఆ తరువాత అతని మూమెంట్స్ మీద నా మనుష్యులు నిఘా వేశారు. అతను ముందుగా మినిస్టర్ ఇంటికి వెళ్ళాడు ఎందుకెళ్ళి వుంటాడో మీరూహించగలరు. ఆ తరువాత తన ఫ్యాక్టరీలకు వెళ్ళాడు. అక్కడ తన సిబ్బందిని ఎలాంటి అవకతవకలు పైకి కనిపించకుండా చేయమని ఆదేశించి వుంటాడు. ఆ మరుక్షణం వాళ్ళు రంగంలోకి దిగారు. ఈలోపు అతనికి బి.పి. రెయిజ్ అయింది. ఏ తప్పూ చేయనివాడికి, గతంలో ఎలాంటి అనారోగ్యం లేని వ్యక్తికి మానసిక ఆందోళన ద్వారా వచ్చే జబ్బే వచ్చింది. ఇప్పుడు చెప్పండి... లాజికల్ గా ఆలోచించండి. తప్పు ఉన్నదీ లేనిదీ- ఉంటే ఎక్కడున్నదీ మీకే అర్ధమయిపోతుంది..." త్రినాధ్ అన్నాడు.

    లోగడ సెక్రటరీ ఎస్.పి.గా వుండగా డబ్బు, పలుకుబడి వున్న కొందరు ఘరానా వ్యక్తుల హ్యుమిలియేషన్ కి గురయి వున్నాడు. ఆ కోపం ఈ కోపం కలిసి సెక్రటరీని పిచ్చివాడ్ని చేసాయి.

    సెక్రటరీ త్రినాధ్ వైపు, జర్నలిస్ట్స్ వైపు ఓసారి సాలోచనగా చూశాడు.

    కొద్ది క్షణాలు మౌనం...

    త్రినాధ్ లేచాడు- జర్నలిస్ట్స్ కూడా లేచారు.

    "ఆగండి... దయచేసి కూర్చోండి. నా రియాక్షన్ నీ, నేను తీసుకునే యాక్షన్ ని తెలుసుకుని వెళ్ళండి. ఇలాంటి వాటిని క్షమించను. వాళ్ళెంత పెద్దవాళ్ళయినా సరే చర్య తీసుకొని తీరతాను..." అంటూనే ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు సెక్రటరీ.

    త్రినాధ్ సంతృప్తిగా లేచాడు. అతనితోపాటు సి.ఐ. రాఘవ కూడా బయలుదేరాడు.

    జన్మనిచ్చిన తల్లి వసుంధరాదేవి...

    పునర్జన్మనిచ్చిన దైవం మాలినీదేవి...

    న్యాయబద్ధంగానే మీ పగ, ప్రతీకారాన్ని తీర్చుకుంటూ వెళుతున్నాను. మీ కోరికలు తీర్చలేక రుణగ్రస్తుణ్ణి కాలేను. ఎలాగోలా తీర్చి రాక్షసుడ్ని కాలేను- సరీగ్గా సంవత్సరం అయిపోయింది మాలిని కాలేజీకి శెలవు పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి. ఆమె అకారణ అంతర్ధానానికి సరీగ్గా ఏ కారణాన్ని చెప్పలేక పోతున్నాడు. తిరిగి ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు...

    త్రినాధ్ జర్నలిస్ట్స్ కి కృతజ్ఞతలు చెప్పి మామిడితోపు వేపుకు సాగిపోయాడు సి.ఐ. రాఘవతోపాటు.

    త్రినాధ్ అక్కడకు చేరుకొనేసరికి దాదాపు నలభైమంది కూలీలు నిర్విరామంగా శ్రమిస్తూ కనిపించాడు. దూరంగా శివాలయం... ఓ ప్రక్క సిద్దప్ప తల్లి స్మారక చిహ్నం. ఈ రెంటికి మధ్యలో అందమైన బొమ్మరిల్లు ఊపిరి పోసుకుంటోంది.

    బాపు భావచిత్రంలా... వాల్మీకి సృష్టించిన రసరమ్య పర్ణశాలలా... ప్రశాంతతకు పుట్టినిల్లులా... రూపుదిద్దుకుంటున్న రెల్లు పొదరిల్లు.

    చుట్టూ రెండెకరాల విశాలమైన ఆవరణ. సరీగ్గా మధ్యలో బొమ్మరిల్లు... చుట్టూ ప్రకృతి అక్కడే వూపిరి పోసుకుందా అన్నట్టు గార్డెన్... రివ్వున వీస్తున్న చల్లటిగాలి...

    త్రినాధ్ ని చూస్తూనే మేస్త్రీ పరుగెత్తుకు వచ్చాడు.

    "అయిపోయింది బాబు... మరొక్క రెండు నెలలలో మీ అభిరుచికి ననిదర్శనంలా, శాంతినికేతన్ లా దీన్ని తీర్చిదిద్దుతాం-" అన్నాడు వినయంగా. 

    త్రినాధ్ మౌనంగా పర్ణశాల కేసే కొద్దిసేపు చూస్తుండిపోయాడు.

    ఇప్పుడతని మోములో మంచితనం, మానవత్వం, దయ.... జాలి.... కరుణ వుట్టిపడుతున్నాయి.

    కొద్ది నిమిషాలక్రితం వరకు శత్రువును మట్టి గరిపించే మరో మనిషి అతనిలో వున్నాడు. ఇప్పుడో-? అందుకు భిన్నమైన మనిషి.

    పదినిమిషాలకు త్రినాధ్ వెనుదిరిగాడు.

    కారు అలా వెనుతిరిగేలోపే త్రినాధ్ మోములో ప్రశాంతత చెదిరిపోయి ఆ స్థానంలో పగ ప్రత్యక్షమయింది.

    దయ, జాలి చెదిరిపోయి రాక్షసత్వం చోటు చేసుకుంది.

    ఇప్పుడతను ఆవలిస్తే పేగులు లెక్కించే మేధావి... అంచెలంచెలుగా అందలం ఎక్కాలనుకునే రియలిస్టిక్ డ్రీషర్. తన చేతికి మట్టి అంటకుండా శత్రువుని మన్నుగరిపించే అనితరసాధ్యుడు.

    తన జీవితాన్ని యుద్ధ ప్రాతిపదికపై అత్యంత క్రమశిక్షణతో సరిదిద్దుకున్న అద్భుత వ్యక్తి.

    కారు వెనకసీట్లో జారగిలబడ్డాడు. ఇప్పుడతని మనోనేత్రం ముందు ఎన్నో దృశ్యాలు... ఎన్నో అనుభూతులు- తత్ సంబంధమైన వ్యక్తులు- సంఘటనలు లీలగా కదలాడుతున్నాయి.

    "ఇన్ని అద్భుతాల్ని ఎలా సాధించావ్ త్రినాధ్- నిన్నీ స్థితిలో చూసి ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఒకప్పుడు సినిమాహాలు క్యూలో ఓ వ్యక్తి నీ చేతిని విసురుగా లాగాడని, సిద్దప్పపై చేయి చేసుకున్నాడని క్షమించలేక వారిని వేటాడుతూ వెంటబడ్డ అమాయకుడైన తిమ్మడివేనా నువ్వు- ఏది ఏమయినా నాకు చాలా ఆనందంగా వుంది. నీ జీవితం నేటి యువతకు ఆదర్శం కావాలమ్మా."

    అరమోడ్పు కన్నులపై వేలిచివర్లు ఆనించి ఎక్కడో వున్నట్టున్న త్రినాధ్ వైపు అనుమానంగా చూశాడు తను చెప్పేది వింటున్నాడో లేదోనని.

    "వింటున్నాను-" త్రినాధ్ పొడిగా అన్నాడు.

    ఒకింత ఉలికిపడిన రాఘవ తిరిగి మాట్లాడటం ప్రారంభించాడు.

    "నేనానాడే నీకో మాటిచ్చాను. ఏదైనా- ఎంత పెద్దదయినా ఒక తప్పును చట్టం దృష్టికి రాకుండా చూస్తానని. ఇప్పుడది నవ్వు తెప్పిస్తోంది. నువ్వు ఇక తప్పు చేయలేవు. ఎదిగిపోయావు- ఎంతో ఎదిగిపోయావు- నా స్థాయిని దాటి ఎప్పుడో వెళ్ళిపోయావు... నాకు ప్రాణదానం చేసిన నీకు ఏదో మేలుచేసి రుణం తీర్చుకోవాలనుకున్న నా కోర్కె ఇక తీరదు" రాఘవ ఒకింత నిరాశగా అన్నాడు.

    త్రినాధ్ మెల్లగా నవ్వాడు. ఆ తరువాత అన్నాడు- "ఏమో! మీరిచ్చిన ఛాన్స్ ను ఉపయోగించుకొనే అవసరం వస్తుందేమో?"

    రాఘవ ఆశ్చర్యంగా చూశాడు త్రినాధ్ వైపు.

    త్రినాధ్ ఆఫీసులోకి అడుగుపెడుతూ వెనుతిరిగి చూశాడు రాఘవ కోసం.

    రాఘవ బిల్డింగ్ ముందే నిల్చుండిపోయి ఆకాశంలోకి తొంగిచూస్తున్న వసుంధరా ఇండస్ట్రీస్ బిల్డింగ్ నే చూస్తున్నాడు ఆశ్చర్యంగా.

    క్రమశిక్షణ- మిలటరీ క్రమశిక్షణ- ఒకే యూనిఫామ్- ఎవరి పని వారిదే- ఎవరూ కాలాన్ని వృధా చేయటం లేదు. వందలాది ఆఫీసు సిబ్బంది తలలు వంచుకొని యంత్రాల్లా పని చేసుకుపోతున్నారు. అందరి షర్ట్సుపై 'వి' అన్న అక్షరం- రెడ్ కలర్ లో మెరిసిపోతూ కనిపిస్తోంది. 'వి' ఫర్ విక్టరీ- ఒకసారి తలెత్తితే ప్రపంచం స్తంభించిపోతుందేమోనన్న సిన్సియారిటీ- ఆ చివర నుంచి ఈ చివర వరకు అద్దాల మధ్య నుంచి కనిపిస్తున్న ఉద్యోగులు.

    "ఓహ్... అనితర సాధ్యుడివి త్రినాధ్ నువ్వు. "ఆనందోద్వేగంలో మునిగిపోయి వున్న రాఘవను త్రినాధ్ కదిలించేవరకు స్పృహలోకి రాలేకపోయాడు.

    రాఘవను వెంటబెట్టుకునే తన ఛాంబర్ లోకి ప్రవేశించాడు త్రినాధ్.

    అప్పటికే అక్కడ వున్న హిందూ ఏదో చెప్పేందుకు ఆరాటపడుతున్నట్టు గ్రహించాడు త్రినాధ్.

    ఫర్వాలేదు చెప్పమన్నట్టు కనుబొమల్ని ఎగురవేశాడు.

    హిందూ అనుమానంగా రాఘవకేసి చూసింది.

    "మన మనిషే... మనకు ఆప్తుడు. సందేహించకు... చెప్పు-" అన్నాడు త్రినాధ్.

    "మిమ్మల్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రియలిస్టు ఆర్గనైజేషన్ సెక్రటరీ పదవి నుంచి తప్పించారు... దీని వెనుక-"

    త్రినాధ్ చెయ్యెత్తాడు. హిందూని ఇక ఆపమన్నట్లు.

    అతని ముఖంలో ఒకింత అవమానభారం చోటుచేసుకుంది అప్పటికప్పుడు.

    కొద్దినిమిషాలు మౌనంగా వుండిపోయాడు. 

    ఛాంబర్ నిశ్శబ్దంగా వుంది.

    హిందూ, రాఘవ ప్రతిమల్లా వుండిపోయారు.

    సరీగ్గా ఐదు నిమిషాలకు త్రినాధ్ కళ్ళు తెరిచి హిందూవేపు చూశాడు.

    "మొత్తానికి పగ తీర్చుకున్నాడు యోగేష్. ఒక రకంగా నేనా అసోసియేషన్ కి సెక్రటరీగా వుండటానికి తగను. నా ఎదుగుదల ఆ సెక్రటరీ పదవికి అనర్హత అవుతుంది-" నిజాన్ని ఒప్పుకున్నాడేగాని అతని కళ్ళలో దెబ్బతిన్న భావం కదలాడింది.

    అంతలో బోస్ వచ్చాడక్కడికి.
   
    బోస్ ని చూడగానే రాఘవ గుర్తుపట్టేశాడు.

    ఒకప్పుడు ఆ ప్రాంతానికి బోస్ పెద్ద రౌడీ. బోస్ గ్యాంగ్ అప్పట్లో చేసే అల్లర చిల్లర పనులకు రాఘవ ఆగ్రహించని రోజు లేదు.

    పట్టుకున్న ప్రతిసారి బోస్ తండ్రిని చూసి వదిలేయవలసి వచ్చేది. బోస్ వస్తున్నాడంటే వీధి గూండాలకు, రౌడీలకు చెమటలు పట్టేసేవి. అతని ఆవేశం అగ్గి సెగలాంటిది. అతను పగబడితే ఆరనిచిచ్చులా మారిపోయేవాడు.

    గమ్యంలేని తెలీని సమర్ధుడని- ఎవరైనా అతన్ని దారిలో పెట్టగలిగితే గొప్పవాడవుతాడని తనకో నమ్మకం. అలాంటి బోస్- చాలా కాలానికి- ఇక్కడ... ఇలా?

    "చెప్పు బోస్- ఆ బాబు తల్లిని హాస్పిటల్ లో చేర్పించావా?" త్రినాధ్ ఆత్రుతగా అడిగాడు.

    బోస్ తల వంచుకున్నాడు.

    "ఫర్వాలేదు చెప్పు?" త్రినాధ్ సౌమ్యంగా అన్నాడు.

    "ఆ బాబు తల్లి-" బోస్ ఆగిపోయాడు.

    "ఊ- చెప్పు- మన కంపెనీ డాక్టరేమన్నారు? తగ్గుతుందన్నారా?" త్రినాధ్ కి బస్ స్టాండులో జరిగిన సంఘటనే జ్ఞప్తికి వస్తోంది.

    "నయమయ్యే స్టేజీ దాటి ప్రశాంతతను కోరుకుంటూ దూరతీరాలకు సాగిపోయింది- ఆ పసివాడ్ని వదిలేసి."

    "వ్వాట్-" దాదాపు అరిచినంత పనిచేశాడు త్రినాధ్.

    "అవును-"

    గుండె చిక్కబట్టినట్లయింది త్రినాధ్ కి.  

 Previous Page Next Page