Previous Page Next Page 
త్రినేత్రుడు-2 పేజి 23


    త్రినాధ్ అప్పటివరకూ జీవించిన మానవతావాది నిశ్శబ్దంలో జారుకున్నాడు. ఆ స్థానంలో ఇప్పుడు నరరూప రాక్షసుడు నిద్రలేచాడు.

    పబ్లిక్ ఎఫైర్స్ మేనేజర్ ని పిలిపించాడు.

    "చూడండి మేనేజర్- సుదర్శన్ రావు కంపెనీ ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఎంత సేల్స్ చేసింది, ఎంత సేల్స్ టాక్స్ కట్టిందనే వివరాలు మనకు తక్షణం కావాలి. అందుకెంత డబ్బు ఖర్చయినా ఫర్వాలేదు...

    ఈ క్షణం నుంచే మీరా పనిమీద వుండండి. సరీగ్గా నాకు వివరాలు పన్నెండు గంటలకి అందాలి. ఈ క్షణం నుంచే మీకిచ్చిన గడువును లెక్కిస్తాను."

    అతను వినయంగా తలూపి ఆ మరుక్షణమే అదృశ్యమైపోయాడు.

    ఆ వెంటనే ఫైనాన్స్ మేనేజర్ ని పిలిపించాడు. "చూడండి. దేశంలో నెలకొన్న పవర్ షార్టేజీని తగ్గించేందుకు భారత ప్రభుత్వం ప్రయివేట్ పవర్ హౌస్ లకు లైసెన్స్ లు ఇవ్వొద్దని నాకు ఢిల్లీ నుంచి సమాచారం అందింది. అదే నిజమైతే 50 మెగావాట్ల పవర్ స్టేషన్స్ నిర్మించుకోవడానికి మనకు గల వనరుల గురించి రిపోర్ట్ తయారుచేయండి. ప్రభుత్వం దాన్ని మెటీరియలైజ్ చేస్తుందనే నమ్మకమైన సమాచారం అందగానే మన అప్లికేషన్ ముందుగా పోస్ట్ అవ్వాలి.

    ఇకపోతే మనం ఒక జనరల్ హాస్పిటల్ నిర్మించాలనుకుంటున్నాం. ఆ సమయంలో గుప్తాజి మిమ్మల్ని అప్రోచ్ అవుతాడు. కావల్సిన ఫైనాన్స్ అందే ఏర్పాట్లు చేయండి" త్రినాధ్ చెప్పడం ఆపి ఫైనాన్స్ మేనేజర్ వేపు చూసి అతనేదో తనతో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా గ్రహించాడు.

    "ఫర్వాలేదు చెప్పండి" త్రినాధ్ ఒకింత సౌమ్యంగా అన్నాడు.

    "మీ సూచనల మేరకు మనం నాలుగు కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుట్టబోతున్నాం. మనకు ఇప్పటికే వున్న వనరులు వాటికి బొటాబొటిగా సరిపోతాయి. మరలా ఇప్పుడు జనరల్ హాస్పిటల్ అంటే వనరుల ఇబ్బంది తీవ్రమవుతుంది. అదీగాక ప్రొడక్టివ్ పర్ పస్ కి అయితే బ్యాంకులు లోన్ ఇస్తాయిగాని... ఫ్రీ సర్వీస్ ఆర్గనైజేషన్ కంటే అసలు ఇవ్వవు... అందుకే ఆలోచించాల్సి వస్తోంది..." తగ్గుస్థాయిలో భయపడుతూ చెప్పాడు ఆయన.

    త్రినాధ్ మౌనంగా వున్నాడు.

    "పోనీ- అపోలో- హాస్పిటల్స్ మాదిరి హెల్త్ సర్వీసెస్ మనం వ్యాపారపరంగా డీల్ చేస్తామని ప్రాజెక్ట్ రిపోర్టులో ఉటంకిస్తే లోన్ దొరుకుతుంది- అలా-"

    "స్టాపిట్- ఐ- సే- కిడ్నీ ట్రబుల్ వస్తే విదేశాలకు, ఊపిరితిత్తులు దెబ్బతింటే విదేశాలకు, గుండెకు చిల్లుపడితే విదేశాలకు- సిగ్గు లేదా మనకు? జబ్బు వచ్చేది మనకు. తీరా అది బాగుచేయించుకునేందుకు అమెరికా వెళితే ఆపరేషన్ రూములో కత్తెర పుచ్చుకుని మన దగ్గరకు వచ్చేది ఏ శాస్త్రో, ఏ రెడ్డో, ఏ రావో, ఏ సింగో- రేపీ బ్యాంకుల మేనేజర్లకు రోగాలొస్తే బాగుచేసే హాస్పిటలే వుండదు. తిరిగిరాని అప్పులని తెలిసే రాజకీయ వత్తిడులకు లొంగి అప్పులిస్తారు. కాని మనల్ని మనం బాగుచేసుకుందామంటే అప్పులివ్వరు.

    ఏదిఏమైనా హాస్పిటల్ నిర్మాణం ఆగదు. మన కంపెనీ ఆస్థుల్ని తనఖా పెట్టండి. అప్పు తీసుకురండి. మనం రాజకీయ నాయకులం కాదు ప్రజల మేలు మరచి సొంత జేబులే నింపుకుంటూ వెళ్ళడానికి. మనం పెరిగింది అసంఖ్యాక పేద, మధ్యతరగతి ప్రజల సొమ్ముతో. పెరుగుతున్నదీ వారి ద్వారానే.

    సామాజిక బాధ్యతలేని వ్యాపారి రాజకీయవేత్తతో సమానం... అలాంటి హీనులతో మనం సమంకారాదు.

    యూనో... ఎక్కడ ఫోర్ట్...? అమెరికా జాతీయుడు. అతను ఉత్పత్తి చేసే కార్లను మనదేశ ప్రజలు కొనలేరు. కాని ఫోర్డ్ ఫౌండేషన్ పేరిట ఎన్ని వందల కోట్లు ఆసియా దేశాల పేద ప్రజలకు ఖర్చు పెడుతున్నారు?

    దేశభక్తి, దైవభక్తి, ప్రజలపట్ల బాధ్యతలేని వ్యాపారి జాతికి పుట్టిన కుక్క మూతి పిందెలాంటివాడు. ఇక దీనిలో వాద, ప్రతివాదనలు అనవసరం. డూ... వాట్... ఐసే... దట్సాల్..."

    త్రినాధ్ కంఠంలోని తీవ్రతను గమనించిన ఎఫ్.ఎం. మౌనంగా వెళ్ళిపోయాడు.

    అతను వెళ్ళిన ఐదు నిమిషాలకు సైంటిస్ట్ వచ్చాడు.

    "గుడ్ మార్నింగ్ బాస్" సైంటిస్ట్ లోపలకు వస్తూ అన్నాడు.

    అప్పటికప్పుడు త్రినాధ్ మొహంలొ చిర్నవ్వు... కొద్ది నిమిషాల క్రితం వరకు సీరియస్ గా వున్న త్రినాధ్, ఇప్పుడు తను కనిపించగానే చిర్నవ్వుతో...

    ఎంతటి మానసిక సాధన వుంటే సాధ్యమవుతుందీ కంపార్టు మెంట్ లిజమ్? సైంటిస్ట్ ఆలోచనల్నుంచి చప్పున తేరుకున్నాడు.

    "నో బాస్... ఇప్పుడు నువ్వు సెలవులో వున్నావ్. కనుక ఇద్దరం స్నేహితులం..." అంటూ కుర్చీలోంచి లేచి ఫ్రిజ్ దగ్గరకు వెళ్ళి ఓ కూల్ డ్రింక్ బాటిల్ తీసి మూత తెరిచి సైంటిస్ట్ కి అందించాడు.

    "చాలా రోజుల్నించి చూస్తున్నాడు త్రినాధ్! నువ్వు ఇతరులకి కూల్ డ్రింక్ ఆఫర్ చేస్తూ నువ్వు మాత్రం నీ ఫ్లాస్క్ లో తెచ్చుకున్న టీ మాత్రమే త్రాగుతావు. అదైపోతే మంచినీళ్ళు త్రాగుతావు. ఎప్పుడూ కూల్ డ్రింక్స్ త్రాగడం చూడలేదు..." సైంటిస్ట్ ఆశ్చర్యంగా అన్నాడు.

    "ఇది చైర్ మన్ రూమ్. ఈ రూమ్ లోకొచ్చిన ప్రతి వ్యక్తికి ఒక అర్హత వుంది. ఉండబట్టే ఈ రూమ్ లోకి అనుమతించబడతారు. వచ్చిన వారికి మర్యాద చేయడం నా విధి. నేను కూల్ డ్రింక్ త్రాగాలంటే నాకు వ్యక్తిగత స్తోమత వుండాలిగదా?"

    త్రినాధ్ ఏమన్నాడో అర్ధంకాక కొద్దిక్షణాలు తికమకపడ్డాడు సైంటిస్ట్.

    "నువ్వు మనిషిగా నాకర్ధం కావడంలేదో, లేక నీ మాటలే నాకు అర్ధం కావటంలేదో అంతుపట్టడం లేదు.

    ప్రశాంతంగా నవ్వాడు త్రినాధ్.

    సైంటిస్ట్ కి ఆసక్తి వుండి, అక్కడే ఆగి, మరింత లోతుగా త్రినాధ్ మాటల గురించి ఆలోచించి వుంటే కొన్ని అద్భుతమైన నిజాల్ని తెలుసుకున్న మొదటి వ్యక్తి అతడే అయ్యేవాడు.

    "అదిసరే- నువ్వేదో హాస్పిటల్ కి ప్లాన్ చేస్తున్నావని తెలిసింది. నిజమేనా?" సైంటిస్ట్ కళ్ళలో లీలామాత్రంగా ఆందోళన. సైంటిస్ట్ క్కూడా ఆ విషయం తెలిసినందుకు త్రినాధ్ ఆశ్చర్యపోలేదు.

    ఓసారి వేదాంతిలా నవ్వాడు త్రినాధ్.

    "అదే... అదే మనిషిలోని స్వార్ధం. నేను కొత్త వ్యాపారాల్ని ఆరంభిస్తే ఆనందించారు. కొంగ్రొత్త ఎత్తులకు ఎదుగుతుంటే సంతోషించారు. కాని మనిషి అని అనిపించుకొనేందుకు ప్రయత్నిస్తుంటే ఆశ్చర్యపోతున్నారు- అవాక్కవుతున్నారు."

    "సారీ త్రినాధ్! నేను అప్పుడూ ఇప్పుడూ... మరెప్పుడూ డబ్బు గురించి ఆలోచించలేదు, ఆదేశించలేదు. అలా అయితే నేను ఓ వ్యాపారవేత్తనై వుండేవాడిని. నీకు జరిగిన అవమానమే నాకిప్పుడు గుర్తుందిగాని, నాకు జరిగిన అవమానం గుర్తులేదు. నువ్వు పందెం కాసి సరిగ్గా ఈరోజుకు 3 సంవత్సరాల ఐదు నెలలు.

    మరో ఏడు నెలల్లో అహంకారంపై, అన్యాయంపై, అవినీతిపై అరాచకంపై కమ్చీ దెబ్బ కొట్టనున్న సమయంలో నువ్వు ఆస్థుల్ని తాకట్టు పెట్టి హాస్పిటల్ కట్టిస్తున్నావని తెలిసింది. మరి గెలుపు విషయం గాలికి వదిలేసినట్టేనా?"

    త్రినాధ్ సీట్లోంచి లేచాడు. మెత్తటి తివాచీపై మెల్లగా పచార్లు చేస్తూ అన్నాడు...

    "ఎవరన్నారు నాకు జరిగిన అవమానాన్ని మర్చిపోయానని...? ఎవరన్నారు గెలుపు విషయాన్ని గాలికి వదిలేసినట్టు? ఎవరన్నారు నేను సుదర్శన్ రావు మీద గెలవనని?"

    "మరి?" సైంటిస్ట్ కంతా అయోమయంగా వుంది.

    "గెలుస్తాను" త్రినాధ్ స్థిరంగా అన్నాడు.

    "నాకు నమ్మకం లేదు."

    త్రినాధ్ నవ్వాడు. చిన్నగా మొదలైన నవ్వు తెరలు తెరలుగా పెద్దది...ఆ హాలు నాలుగు గోడల మధ్య పేరుకున్న నిశ్శబ్దాన్ని బద్దలు చేసింది. ఉన్నట్టుండి చటుక్కున నవ్వాపేశాడు.

    "కేవలం ఆరువేల రూపాయలతో నేను వ్యాపార రంగప్రవేశం చేశాను. అదీ ప్రియాంకను రెచ్చగొట్టి, ఆమెకు అవసరం కల్పించి పెట్టుబడి సంపాదించాను. ఆరువేలతో ఆరుకోట్లు సంపాదించగలనని ఎవరన్నా ఊహించారా? అది అరవైకోట్లు కాగలదని కూడా ఎవరూ నమ్మడం లేదు. లీటరు పెట్రోలు వంద కిలోమీటర్లు వస్తుందంటే అభూత కల్పనన్నారు. మోడీ మోటార్స్, సికింద్రాబాద్ షాప్ లో కొన్న ఒక హోండా మోటార్ సైకిల్ లీటర్ కు 120 కిలోమీటర్లు యిచ్చింది. ఆ వాహనందారు షాక్ అయి వెళ్ళి షోరూమ్ లో చెబితే ఆ బండి వాపసు తీసుకొని రెండు హోండా బండ్లు యిచ్చారట. కొన్ని హోండా మోటార్ సైకిల్స్ లీటరుకు 80 కిలోమీటర్లు ఇస్తున్నాయట. మోటార్ సైకిలే అన్ని కిలోమీటర్లు ఇవ్వగా 50 సి.సి. మోపెడ్ ఇంకా ఎక్కువ ఇస్తుందనేది సింపుల్ లాజిక్. కామన్ సెన్స్ వున్న ప్రతివాడునమ్ముతాడు. మరి ఆ రోజు మనం 100 కి.మీ. ఇస్తుందని ప్రచారం చేస్తే నమ్మారా కొంతమంది స్పెసిమన్స్....?"

    డీసెల్, పెట్రోల్ కు బదులు కంప్రెస్ట్ నేచురల్ గ్యాస్ తో వాహనాన్ని నడపొచ్చంటే మనల్ని చూసి కొంతమంది మానసిక రోగులు నవ్వలేదూ? బొంబాయి, రాజమండ్రి, గుజరాత్, త్రిపురలలో ఓ.ఎన్.జి.సి. కేంద్రాల వద్ద ప్రయోగాలు జరుగుతున్నాయి. అవి నిజమవుతున్నాయి. అంతెందుకు- ఇటీవలే టెలివిజన్ లో హోండా మోటార్ సైకిల్ కి గ్యాస్ సిలిండర్ బిగించి మోటర్ సైకిల్ ను నడిపి చూపించారు. అయినా అవి అభూతకల్పనలనే మానసిక నపుంసకులు చాలామంది వున్నారు. మనిషి చంద్రమండలం మీద కాలు బెడతాడంటే నమ్మలేదు. కాని పెట్టాడు.

    స్పేస్ సిటీస్- అంతరిక్ష నగరాలు నిర్మిస్తారంటే నమ్మలేదు. కాని నిర్మిస్తున్నారు.

    మానవ నిర్మిత అద్భుతాల్ని అంచనా వేసే డిస్కవరీ మేగ్ జైన్ గురించి ఎవరికన్నా తెలుసా? వీటన్నిటిని ఎప్పుడో వూహించిన ఆర్డర్ క్లార్క్ ని మనవాళ్ళెవరన్నా గుర్తించారా?

    మానవ మేధస్సుకు ఏదీ అసాధ్యం కాదనే ఆశావాదుల మధ్య... అన్నీ అసాధ్యమే అని నీరుగార్చే నిర్భాగ్యపు చవటలూ వున్నారు.

    ఒకడు మనల్ని నమ్మాడా లేదా అని ప్రతిక్షణం చూసుకునేవాడు ఎప్పుడూ ముందడుగు వేయలేడు. మనం నమ్మినదాన్ని నిజం చేసుకునే చివరి క్షణం వరకూ మనమీద మనకు నమ్మకం వుంటే చాలు.

    పదివేలు మనం పెట్టుబడి పెడితే, లక్ష రూపాయల్ని బ్యాంకుల నుంచి వ్యాపారానికి ఋణంగా తెచ్చుకోవచ్చని చెప్పినా నమ్మరు. ఈనాడు ఎవరు ఏ వ్యాపారం చేసినా సొంత డబ్బు ఇన్వెస్ట్ చేయడు- చేయలేడని చెప్పినా నమ్మరు. ఏ నిర్మాతా సొంత డబ్బుతో సినిమా తీయడని చెప్పినా నమ్మరు. ఈ ప్రజలు ఏనాడూ దేన్నీ నమ్మకే అధోగతి పాలవుతున్నారు. అలాంటి నిరాశా నిర్భాగ్యుల లిస్ట్ లోకి నువ్వూ వెళ్ళినందుకు బాధగా వుంది.

    సాఫ్ట్ డ్రింక్ తయారుచేసే ఒక కంపెనీలో బిల్ కలెక్టర్ గా పనిచేసిన 'టోపీవాలా' అనే వ్యక్తి కేవలం కుమ్ కుమ్, టిక్కాలాంటి ఆడవాళ్ళ అలంకరణ సామాగ్రిని అమ్మి కోట్లు గడించాడన్నా నమ్మరు.

    సుదర్శన్ రావు మీద విజయాన్ని చాలా తేలిగ్గా చేజిక్కించుకుంటాను. సరీగ్గా మరో 23న్నర గంటల్లో సుదర్శన్ రావు సామ్రాజ్యంలో చీకటి రాజ్యమేలేలాగా చేయబోతున్నాను" అంటూ ఫోన్ ఎత్తాడు త్రినాధ్.


                                       *    *    *    *


    చిన్నతరహా పారిశ్రామిక వేత్తలు నిర్మించుకున్న ఆడిటోరియం అది.

    ఇప్పుడా ఆడిటోరియం అంతా నిండిపోయి వుంది.

    ఎందుకంత హఠాత్తుగా ఆ సమావేశం ఏర్పాటు చేశారో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

    యోగేష్ స్టేజీ ఎక్కాడు.

    గొంతు సవరించుకున్నాడు.

    అప్పటికే అతని డబ్బులకి అమ్ముడుబోయిన కొందరు చిన్న పారిశ్రామికవేత్తలు ఆ సమావేశంలో అక్కడక్కడా వున్నారు.

    "డియర్ ఫ్రెండ్స్... ఇంత అత్యవసరంగా ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందని ఇప్పటికే మీరంతా మధనపడుతుంటారు. అందుక్కారణం మనకు నిత్యమూ ఎదురవుతున్న మన సమస్యలే. ప్రభుత్వాన్ని అడగవల్సిన పద్ధతిలో అడిగితే మనలాంటి చిన్నతరహా పరిశ్రమల యజమానుల సమస్యలు కొన్నైనా తీరిపోవచ్చు."

 Previous Page Next Page