రఘురామయ్య ఊరంతా తిరిగి తిరిగి అతి కష్టంమీద వేయి రూపాయలు అప్పుగా తెచ్చాడు. వెంకటాచలం ఎద్దులబండి కట్టాడు.
బస్టాండ్ వరకు బండిలో వెళ్ళి అక్కణ్నుంచి బస్సులో వెళ్ళాలన్నది అతని ఆలోచన.
చెల్లెల్తోపాటు వుండడానికి బయల్దేరింది ఊర్మిళ. కానీ కాలు కదలడంలేదు. నాలుగడుగులు వేస్తే పిక్కలన్నీ పట్టుకుపోతున్నాయి అయినా మొండిగా నడుస్తోంది. బండి వి ఎల్ డబ్ల్యు క్వార్టర్స్ దాటింది.
ఉజ్వల అరవడం మానేసింది!
అందరూ ఆగిపోయారు. వెంకటాచలం చేతిలోని ఎద్దుల పగ్గాలు కూడా సడెన్గా ఆగాయి.
ఉజ్వల పక్కన కూర్చున్న ఆమె పిన్ని ఒక్కసారిగా ఘొల్లుమంది. బండి నొగట్లో కూర్చున్న వెంకటాచలం ఒక్క ఉదుటున భార్య దగ్గరికి దూకాడు.
నిశ్చలంగా ఉంది ఉజ్వల.
చుట్టూ జనం గుమిగూడారు.
"చచ్చిపోయింది" ఎవరో దూరంగా వస్తున్న వాళ్ళకి అరిచి చెప్పాడు.
బండి వెనక వస్తున్న ఊర్మిళ ఆగిపోయింది!
తనవల్లే తన చెల్లెలు చచ్చిపోయింది. ఆమె చనిపోవాలని తాను అనుకున్నప్పుడు ఆకాశంలో తథాస్తు దేవతలు పోతుంటారు. వాళ్ళు తన కోరిక విని తథాస్తు అని వుంటారు. అందుకే చెల్లెలు చచ్చిపోయింది. తనమూలంగానే ఇదంతా జరిగింది.
తను మాత్రం ఎందుకు బతికి? తనలాంటి పాపాత్మురాలు భూమికి బారం. తనూ చచ్చిపోవాలి అనుకుంటూ ఊర్మిళ పరిగెత్తబోయింది.
కానీ కాళ్ళు కదలడంలేదు. పక్షవాతం వచ్చినట్టు చచ్చుబడి పోయాయి! నిలబడటానిక్కూడా కష్టమైపోయింది. అలానే కూలబడి పోయింది.
ఉజ్వల దహనసంస్కారాలు, కర్మక్రియలు పూర్తియ్యేటప్పటికి నెలయింది. అంతా సద్దుమణిగింది గానీ ఆ ఇంట్లో మాత్రం విషాదం పేరుకుపోయింది!
ఊర్మిళకు పిక్కల్లో నొప్పులతో పాటు ఒళ్ళంతా పొక్కులు ప్రారంభమయ్యాయి.
ఆచారి ఏవో మందులిచ్చాడు గానీ ఫలితం లేకపోయింది. రామాచారి దెయ్యాల మంత్రాలు వేసి, తాయెత్తు కట్టాడుగానీ రోగం తగ్గలేదు.
ఇలా వూర్లోనే కాలక్షేపంచేస్తే తను రెండో కూతుర్నికూడా పోగొట్టుకుని ఒంటరినౌతానేమోనన్న భయం రఘురామయ్కి మొదలయింది!
దాంతో ఊర్మిళను టౌన్ కి పిలుచుకుపోయే స్థోమత లేకపోయినా పెద్ద నర్సింగ్ హోమ్ లో చేర్చాడు.
డాక్టర్ నెలరోజులు ఏవో పరీక్షలు చేసి మందులు వాడాడుగానీ జబ్బుల్లో ఏ ఒక్కటీ తగ్గలేదు! ఇక ఆయన విసిగిపోయి ఇంటికి పంపించి వేశారు.
అలా ఊర్మిళ ఇల్లు చేరింది.
ఊర్మిళ ఎదుర్కొన్న అనుభవాలన్నీ ఒక పద్దతిలో పేర్చి ఆలోచించడం వల్ల ఆమె జబ్బుకి మూలం ఏమిటో తెలిసిపోయింది చంద్ర రేఖకి.
ఊర్లో కొందరు చెప్పడంతో రఘురామయ్య వచ్చి ఆమె శరణు జొచ్చాడు.
"నా కూతురు జబ్బేమిటో అంతుబట్టడంలేదు. దామాచారి చెప్పినట్టు దాటు వేయించాను ఇంగ్లీషు మందులు ఇప్పించాను ఇక నువ్వే దిక్కు" అని రెండు చేతులూ పట్టుకున్నాడు.
అప్పుడు బయల్దేరింది చంద్రరేఖ. ఆమె వెళ్ళేటప్పటికి ఊర్మిళ మంచంలో పడుకుని వుంది. "ఎలా వుంది?" అని అడిగింది ప్రేమగా తల నిమురుతూ.
"నాకు సరయిన శిక్షే వేశాడు భగవంతుడు. చెల్లెల్ని చంపుకున్న దానిని నేను బావుంటానా?" అంది ఊర్మిళ శూన్యంలోకి చూస్తూ.
"నువ్వు చంపుకోవడం ఏమిటి? ఆ పిల్లే జబ్బుచేసి చచ్చిపోయిందని వూళ్ళో జనం అనుకుంటుంటే!"
"ఏమిటి? అలా అనుకుంటున్నారా?" ఊర్మిళ ఆశ్చర్యంతో అడిగింది.
"నిజం అదేకదా! ఆ పిల్లకు అపెండుసైటిస్. ఆ జబ్బు వస్తే ఇరవయ్ నాలుగు గంటల్లో ఆపరేషన్ చేయాలి. కాని ఆ పిల్లకు ఆ జబ్బు వచ్చిందని వూహించలేకపోయాం. అంతే తప్ప నువ్వు చంపడమేమిటి?"