అదృష్టవశాత్తూ అటుగా ఎవరూ రాలేదు.
మిత్రా మామూలు మనిషయిన మరుక్షణం ఎదురుగా రక్తంలో తడిసిన చంద్రశేఖర్ శవం కనబడింది.
నిశ్శబ్దంగా మంచం క్రింద నుండి లేచి, ముందుగా తలుపులకి గడియపెట్టి శవాన్ని మంచం మీద పడుకోబెట్టాడు.
పక్కనే వున్న దుప్పటిని శవంమీదకి కప్పాడు.
శవాన్ని మంచం మీద పడుకోబెట్టి కిటికీ దగ్గరకొచ్చి చూశాడు.
మిత్రా కిటికీ సందులో కనిపించినంత మేరకూ ఎవరూ లేరు. మిత్రా బయట పడదామని నిర్ధారించికొని ఆగాడు.
ఏవన్నా తన గుర్తులు అక్కడ మర్చిపోయానేమో నని మంచం క్రింద వెతికి చూశాడు. ఏవీ లేవనుకున్న తరువాత అతనికి కనిపించింది. శవం చేతిలో నల్లగా మెరుస్తున్న రివాల్వర్. అదిచూడగానే మిత్రాకి రెయిన్ కోటు వ్యక్తి గుర్తుకు వచ్చాడు. కాబట్టి ఆత్మ సంరక్షణ కోసమయినా ఆ రివాల్వర్ తన చేతిలో వుంటే మంచిదనిపించి శవం చేతిలో వున్న రివాల్వర్ ని అతని చేతిలో తీసుకుని ప్యాంటు బెల్ట్ లో దోపుకున్నాడు.
అదే అతను చేసిన పెద్ద పొరపాటు. నిజానికి చంద్రశేఖర్ చేతిలో రివాల్వర్ వుండి వుంటే కనీసం అతను ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మడానికైనా వీలుండేది. ఒక్కక్షణం కూడా ఆలస్యంచేయకుండా వేగంగా తలుపు తెరిచి బయటకొచ్చాడు.
అప్పుడే అటుగా వస్తున్న ఇద్దరు స్టూడెంట్లు పొరపాటున మిత్రాని గుద్దుకున్నారు.
మిత్రా ఒక్కసారి బోర్లాపడ్డాడు. అతనితో పాటు అతని బెల్ట్ లోని రివాల్వర్ కూడా క్రింద పడిపోయింది.
మిత్రా ఇంకేమి పట్టించు కోకుండా, వాళ్ళిద్దరూ విచిత్రంగా చూస్తున్నా వేగంగా బైక్ దగ్గరకెళ్ళి స్టార్ట్ చేశాడు.
మిత్రాని చూసిని అతని మిత్రుడు రమేష్ కి అతని ఫ్రెండ్స్ కి మిత్రా అలా వేగంగా ఎందుకు వెళుతున్నాడో అర్ధంకాలేదు.
వాళ్ళు క్లాప్స్ కొట్టి మిత్రాని పిలిచారు. కాని మిత్రా వెళుతున్న వేగానికి అతనికి వినిపించలేదు ఎవరు పిలుస్తున్నది.
మిత్రా శరవేగంతో బైక్ ని నడపసాగాడు. అతనికి విపరీతమైన టెన్షన్ గా వుంది. అసలు రూమ్ కి ఎలా చేరుకున్నాడో కూడా తెలియదు. రూమ్ కి రాగానే సరాసరి బెడ్ మీద వాలిపోయాడు.
జరిగిందంతా ఒక దుస్వప్నం అనిపించసాగింది.
ఇప్పుడు తనేంచెయ్యాలి? ఏం చేయబోతున్నాడో అతనికే అర్ధం కాలేదు. ఏంచేయాలన్న ప్రశ్న అతనిని వేధించ సాగింది. అనవసరంగా ఒక హత్యచూసి రెండో హత్యలో ఇరుక్కున్నట్లనిపించింది.
ఏదేమయినా రైన్ కోటు వ్యక్తిని పట్టుకోవాలి. చనిపోయిన చంద్రశేఖర్ అన్నమాటలు అతనికి గుర్తు. "ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఒక నిర్ణీత ప్రదేశంలో బలరాజ్ ని కలవాల్సి ఉంది" అంటే ఆ రెయిన్ కోట్ వ్యక్తి బలరాజ్ ఏమో అన్న అనుమానం మిత్రాకి తొలిసారి కలిగింది.
ఒకవేళ అతనే రైన్ కోటు వ్యక్తయితే చంద్రశేఖర్ చెప్పిన ఎడ్రస్ ప్రకారం అతన్ని మట్టుపెట్టాలి. తరువాత ఈ హత్యల్లోంచి వీలయినంత త్వరగా తప్పించుకోవాలి. కస్యప్ ఎవరయివుండచ్చు. ఎవరయినా తన కనవసరం. అతన్ని పట్టుకోగలిగితే ఈ హత్యలనుంచి బయట పడతాడు... ఈ ఆలోచన్లతో అతని తలలో రక్తనాళికలు పగిలిపోతాయేమో అన్నట్లుంది. నీరసంగా మంచం మీదనుంచి లేచి కూజాలో చల్లని నీళ్ళలో ఓ గ్లాసు తాగి మరోగ్లాసుతో ముఖం కడుక్కున్నాడు. ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఫ్యాన్ ఆన్ చేసి, కొంచెం రిలాక్సింగ్ గా కుర్చీలో వాలాడు.
* * *
"అన్విత! నాకు బోర్ కొడుతుంది. మిగతా జనాలతో పాటు సినిమాకు వెళ్ళినా బావుండేది."
"ఒక పని చేద్దామా, టెంపుల్ కి వెళ్ళు గుడికి వెళ్ళి చాలాకాలం అయింది" తన అభిప్రాయాన్ని చెప్పింది రిమి. బద్ధకంగా వున్న లేవలేక లేచింది అన్విత.
గుడినుంచి తిరిగొస్తుండగా
"హేయ్ అన్వి, అదే మీ హీరోగారిల్లు. తలుపులు కూడా తీసే వున్నాయ్. లోపలేవున్నాడేమో ఓసారి మన మర్డర్ గురించి గుర్తుచేసి భయపెడదామా?" అడిగింది రిమి.
'ఎందుకులే, నిన్నటి మన దెబ్బకు భయపడివుంటాడు.ఇప్పుడు వెళ్ళామంటే జ్వరం పడతాడు" వద్దన్నట్టు మొహం పెట్టింది.
అయినాగాని రిమి అన్వితను వదలకుండా "రూమ్ కి వెళ్ళిన బోరేగా! లెటజ్ హావ్ సమ్ ఫన్" అని మిత్రా రూమ్ వైపుకి దారి తీసింది.
"హలో మిత్రా! ఏమిటి పట్టపగలే కుర్చీలో కూర్చుని పగటి కలలు కంటున్నారు."
రిమి పలకరించింది.
విని ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు మిత్రా! ఎదురుగా అన్విత, రిమిలు కనిపించటంతో కలేమోనన్న భ్రాంతి కొద్ది క్షణాలవరకు వదల్లేదు.