"అలాగే అమ్మగారికి చెప్పనులే. ఇందులో ఏం గొప్ప వుంది?"
"వస్తాబాబుగారూ!" నమస్కరించిపోబోయింది.
అప్పుడే యింట్లోకి ప్రవేశిస్తున్న శ్రీదేవి యీ మాటలు వింది.
గదిలోంచి వస్తున్న రాజమ్మా. మాధవ్ ఇద్దరూ ఒక్కసారే చూచారు శ్రీదేవి. ఇద్దరి ముఖాలూ ఓ క్షణం పాటు పాలిపోయాయి.
తబ్బిబ్బవుతూ అంది "గుడినుంచి వస్తున్నారా అమ్మగారూ?"
"బాబు ఏడి?" మాధవ్ ప్రశ్నించాడు.
"ఊ" మూలిగి ఓ క్షణం ఇద్దర్నీ పరిశీలించి అంది. ఆమె చూపుల్లో ఏదో అర్ధం కాని రహస్యం కనిపిస్తోంది.
"ఒక్క నిమిషం అలాగే వుండు రాజమ్మా. ఏమిటండి అమ్మగారితో చెప్పనులేఅంటున్నారు."
శ్రిదేవిలో నున్న విశేషమే అది. ఆవిడ మనస్సులో ఏది దాచుకోదు, ముఖాన్నే అడిగేస్తుంది.
దొంగతనం చేస్తూ దొరికిన దొంగల్లా అయ్యారు ఇద్దరూ.
"ఆ ఏమి లేదు. ఏమి లేదు."
అతని కంఠంలో కొద్దిగా తడబాటు కనిపించింది.
"ఏమి లేకపోతే చెప్పొద్దని ఎందుకనాలి?" గర్జించినట్టుగా అంది.
"అది కాదామ్మగారు"
ఏదో చెప్పబోతున్న రాజమ్మని "నువ్వు ఊరుకో" అని గర్జించి "ఏం జవాబు చెప్పరు? ఏమిటది?" అని ప్రశ్నించింది.
"ఏమి లేదు శ్రీ" రాజమ్మ వైపు చూశాడు.
"మళ్ళీ అదే జవాబు. ఏమి లేకపోతే ఆ మాట ఎందుకు? అది చెప్పొద్దని కోరిందా? మీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారా? లేకపోతే మీరే బ్రతిమాలుతున్నారా?"
నివ్వెరపోయి కోపంగా అన్నాడు "ఎందుకలా మాట్లాడుతావ్? అదంతా ఏమి లేదు. రాజమ్మ ఓ పదిరూపాయలు అడిగింది. ఇచ్చాను పర్స్ నీ సూట్ కేస్ లో వుంది కదూ. అందులోంచి తీసి యిచ్చాను."
"ఎందుకని? జీతం యిచ్చేసి వారం రోజులు కూడా కాలేదే?"
"జీతం కాదండి అమ్మగారూ"
"మరి ఇనామా?"
మండిపడి అన్నాడు. "ఇనామా? ఇనామేమిటి? బహుమతి యివటానికేం జరిగిందని అర్ధం లేకుండా మాట్లాడకు?"
మండిపడుతూ అడిగింది "అదే నేనూ అనేది. అర్ధం లేకుండా ఎందుకు చెపుతారు. బహుమతి యివటానికేం జరిగింది. అది నా నుంచి ఎందుకు దాస్తున్నారు అనేగా నేనడిగేది. జవాబు చెప్పరేం?"
పలకలేదతను.
"సరే?"
చిత్కరీంచినట్టుగా అని చరచరా గదిలోకి వెళ్ళి ట్రంక్ తెరచి ఓ పది రూపాయలు అందుకుని విసురుగా వచ్చి రాజమ్మ పై విసిరేస్తూ "తీసుకో" అంది.
వంగి అందుకుని వణికిపోతూ తిరిగి యిచ్చేయడానికి చేయిముందుకు సాచి అంది ప్రార్ధనాపూరకంగా "నాకెందుకమ్మగారు? అక్కర్లేదు. తీసుకోండి"
"ఏం అమ్మగారిస్తే అఖర్లేదా? అయ్యగారు యిస్తే తీసుకుంటావా? అది యీ నెల జీతం. అయ్యగారిలా బహుమతి కాదులే. తీసుకో."
బిగ్గరగా ఏడ్చేసి రెండు పది రూపాయలనోట్లు ఆమె కాళ్ళ వద్ద పడవేసి అంది. "నన్ను మన్నించండి అమ్మగారూ! ఇంకెప్పుడు యిలా అడగను."
అవతలకి జరుగుతూ అంది "సరిసరి! నీకు బుద్ది లేకున్నా నాకైనా బుద్దివుండక్కర్లా. మరోసారి యిలా జరగటానికి అవకాశం యిచ్చినా సంసారంలో నిప్పులు పోసుకుంటానా? ఆ డబ్బు తీసుకో. ఇక రాకు. నా సంగతి తెలుసుగా? ఎంత ఏడ్చి మొత్తుకున్నా లాభం లేదు. మాట అన్నాను ఇహ అంతే."
నోట మాటరాక నివ్వెరపోయి నిల్చుంది రాజమ్మ.
"ఊ! తీసుకో"
ఆజ్ఞాపించినట్టుగా అనేసరికి ఆ ప్రయత్నంగా తీసుకుంది.
"ఇక వెళ్ళిపో"
"శ్రీదేవి"
"మీరు జోక్యం కలిగించుకోకండి. ఏం జరిగింది ఇహ చెప్ప నవసరం లేదు. ఇది నా స్వంత విషయం. మీరు వెళ్ళండవతలకి."
అయింది చాలనుకుని యింకేమి అనలేక గదిలోకి వెళ్ళిపోయాడు విసురుగా.
ఏడుస్తూ వెళ్ళిపోయింది రాజమ్మ. తన దురదృష్టాన్ని నిందించుకుంటూ.
అలాగే చాలాసేపు ఆలోచిస్తూ నిలుచుండిపోయింది శ్రీదేవి. బాబు వచ్చి కాళ్ళకు చుట్టేసుకున్నా అలాగే నిలుచుంది.
భగవాన్!
ఏమిటిది!
మగవాళ్ళింత చవటలైతే ఇక ఆడవాళ్లు బ్రతికేదెలా?
చీ!చీ!
ఆఖరికి పనిమనిషికి కూడా లోంగిపోతే!
అసహ్యం వేసి ఆలోచనల్ని పరిహరించుకోవాలని చూసింది?
కానీ క్షణ క్షణానికి పనిమనిషి ముఖమే గుర్తుకి వచ్చి బాధపెట్టసాగింది. నిజమే. మనిషి యౌవనంలో వుంది. రెండో సంబంధం స్త్రీ లు ఎలా వుంటారు! మాంచి యౌవనంలో పిటపిటలాడుతూ వుంది. కాయకష్టం చేసిన శరీరం కాబట్టి బాగా బిగుతుగా కనిపిస్తుంది. అందగత్తె కాదు. అలా అని అనాకారి కాదు. చామన ఛాయ కంటే కొంచెం లేతరంగులో చక్కని కనుముక్కు తీరుతో అందంగానే కనిపిస్తుంది. చూస్తూ కూర్చుంటే, అయినా తనతో అందంలో సాటిరాదు. కానీ యౌవనం, తను ఓ పిల్లల తల్లి, మళ్ళీ యిప్పుడు పూర్ణ గర్భిణి , తాను అన్ని విధాలా పరిహర్యా.
పైగా ఆ పనిమనిషి భర్త రోగిష్టి, ఇది పెళ్ళయి వచ్చినప్పటి నుంచి ఇక తన భర్త లాటి వాడు కోరితే దానికి అంతకంటే కావలసింది ఏముంది?
భగవాన్!