Previous Page Next Page 
శుభోదయం పేజి 22


    తల్లిలా ఓదార్చిన పార్వతమ్మని చూసి, పాతకాలపుదైనా ఆవిడ సంస్కారానికి మనసులోనే జోహార్లు అర్పించింది. పార్వతమ్మ అన్నట్టు, అనుకున్నట్టు ఆవిడ చూపిన సంస్కారం మాత్రం కూడా ఆధునికుడు అనుకున్న మాధవ్ చూపలేకపోయాడని రాధ బాధ. ఎంతైనా మాధవ్ తన భర్త. తమ మధ్య పొరపొచ్చాలు బయట లోకానికి తెలిస్తే తన బతుకు అందరిలో మరింత లోకువ అవుతుందని ఎవరన్నా వచ్చినప్పుడు నువ్వు మొహంమీద పులుముకుని మాట్లాడేది. ఆ సంఘటన తమమీద ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పాలని తాపత్రయపడేది. పైవాళ్ళ దగ్గిర దాచకల్గినా యింట్లో మాదిరి తిరిగే పార్వతమ్మ దగ్గిర ఎలా దాచకలదు? అందులో శారద అనుక్షణం తనచుట్టూ తిరుగుతూ, తను మాట్లాడడంలేదని, మాధవ్ తను మాట్లాడుకోవడంలేదని, ఎప్పుడూ విచారంగా పడుకుంటుందని తల్లికి చెప్పేది. పార్వతమ్మకీ వాళ్ళిద్దరి వరస అనుమానం వచ్చినా అడగలేక వూరుకుంది. ఆఖరికింక ఆగలేక, రాధ మ్లానమైన ముఖం చూడలేక "ఏమిటమ్మా రాధా... మాధవ్... యిలా మారిపోతాడని అనుకోలేదమ్మా... ఎంతో మంచివాడు, సహృదయుడు, ప్రేమించి పెళ్ళాడాడు... ఇంత మాత్రానికే నిన్నిలా..."
    "నా దురదృష్టం పిన్నిగారూ! దౌర్భాగ్యురాలిని అందలం ఎక్కించాలన్నా జరగదు. పుట్టుకతోనే దురదృష్టం నన్నంటే వుంది. ఏదో ఏనాడో చేసిన చిన్న పుణ్యంవల్ల రెండేళ్ళు కలలాగా మంచిరోజులు వచ్చాయి. వెళ్ళిపోయాయి. నా దురదృష్టం నన్ను వరించింది మళ్ళీ..." ఏడ్చింది రాధ.
    ఆవిడ కరిగిపోయింది. "ఛీ... ఛీ... ఈ మగజాతి యింతేనమ్మా... వాళ్ళకి కావల్సింది మన శరీరం తప్ప మనసు కాదు. వాళ్ళెన్ని తిరుగుళ్ళు తిరిగినా వాళ్ళని మనమేం అనకూడదు. అది తప్పేకాదు వాళ్ళకి... కాని మనం చెయ్యని నేరానికి కూడా శిక్ష అనుభవించాలి... వుండు మాధవ్ ని అడుగుతాను, ఇదేం అన్యాయం."
    "వద్దు పిన్నిగారూ... లాభంలేదు- ఆయన మనసు కావాలి కాని నాకు ఆయన దేహంకాదు. ఆయన మనసు యింక నామీద లేదు. ప్రేమ, అనురాగంలేని దాంపత్యం కోసం అలమటించడంలేదు. బలవంతాన యిద్దరం ఏం పొందగలం... కానీండి. ఆయనన్నట్టు కొన్నాళ్ళుపోతే జరిగింది మర్చిపోగలిగితే... మళ్ళీ... మళ్ళీ నా జీవితం చిగురించవచ్చు. యిది మా యిద్దరి మధ్యనే వుండాల్సిన విషయం...ఇంకోరు కలగచేసుకుంటే... బాగుండదు..." వారించింది రాధ.
    ఈ నెలా పదిరోజులలో రాధ మనసు దెబ్బతిని గట్టిపడింది. ఆమెలో మాధవ్ మారిన తీరు చూశాక ఏదో విరక్తి, నిర్లిప్తత చోటు చేసుకుంది. మాధవ్ ఆమెను చూసి గిల్టీగా ఫీలవసాగాడు. ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తే రాధ అడిగిన దానికి జవాబు చెప్పి వూరుకునేది. మాటలు ముందుకి జరిగేవి కాదు. యింకేం మాట్లాడాలో తెలియక మాధవ్ మౌనం వహించేవాడు. మాట పలుకు లేకుండా తనని సాధిస్తుందన్న ఉక్రోషం వచ్చిందో ఓరోజు మాధవ్ కి.
    "రాధా, ఏమిటిది... నేనేదో హంతకుడినన్నట్టు నన్నెందుకిలా ఎవాయిడ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్నావు? ఏదో నేరం చేసినట్లు నన్నెందుకిలా చూస్తున్నావు? మాటా పలుకూ లేకుండా ఎవరిని సాధించాలని నీ ఉద్దేశం?" తీక్షణంగా అడిగాడు.
    వెళుతున్న రాధ గిరుక్కున తిరిగి సూటిగా అతని కళ్ళలోకి చూసింది.
    "ఎవరు ఎవరిని ఎవాయిడ్ చేస్తున్నారో నేను మళ్ళీ చెప్పాలా? నన్ను చూస్తే మీకు కంటగింపుగా, నా గాలి సోకితే చీదరింపుగా... నా స్పర్శ సోకితే కుష్టురోగి అంటినట్టు జుగుప్సగా ఉంది. అవన్నీ మీ మొహంమీదే కనిపిస్తున్నా నీ దగ్గిర కూర్చుని నవ్వుతూ మాట్లాడాలి. మీరెలా చూసినా సంతోషంగా యింట్లో తిరగాలి. మీరు దయతలచి నన్నింట్లో వుండనిచ్చినందుకే కృతజ్ఞత చూపించి ఆనందించాలి? అవునా, హు... కానీ... నాకు ఓ మనసుందండి, నన్నసహ్యించుకుంటున్నారని తెలిసి ఎలా మీ చేరువవనండీ..." మాట్లాడితే ముందుగా రాధకి గొంతు నిండుకొచ్చి కన్నీరు కారిపోతూందీ మధ్య.
    "అంటే... సెక్స్... సెక్స్ ఒక్కటే నీకు కావాలన్నమాట... అది లేదని నీవు ఏదో కొంపమునిగినట్లు ప్రవర్తిస్తున్నావా... మనిద్దరిమధ్య వున్న సంబంధం దానితో ముడిపడి వుందా?" తనని సమర్థించుకుంటూ అన్నాడు.
    రాధ చిత్రంగా చూసింది. అదోలా నవ్వింది. "నేననవలసిన మాట మీరంటున్నారు మాధవ్. సెక్స్ అన్నది మీ మగవాళ్ళకి ముఖ్యంగాని మాకు కాదు. ప్రేమ లేకపోయినా సెక్స్ ని ఆనందించగలడు పురుషుడు. స్త్రీ అలా కాదు, ప్రేమలేని సెక్స్ నరకం స్త్రీకి. మాధవ్... నీ ప్రేమలేని నీతో సెక్స్ నాకు నరకం. అలాంటి నేను దానికోసం బాధపడ్తున్నానని ఎలా అనగల్గుతున్నావు. మాధవ్... నేను కోరేది నీ చల్లని చూపు. తియ్యని మాట... అనురాగం. మాధవ్... ఒక్కసారి దగ్గిరకి తీసుకుని లాలించావా, ఒక్కసారి నీ ఒడిలోకి నన్ను తీసుకుని ఒదార్చావా? రాధా- నాకు కావల్సింది నీవు... నీ మనసు, నీ ప్రేమకాని నీ శరీరంకాదు, బాధపడకు అని నా కన్నీరు వత్తావా? నీ ఓదార్పు కోసం, సానుభూతి కోసం పరితపించే నాకు నీవు ఏం యిచ్చావు మాధవ్... నన్ను దూరం చేశావు. నా ఉనికిని విస్మరించావు. నన్ను అసహ్యించుకుంటున్నావు... మీ పురుషులకి ఎంతో ముఖ్యమైన సెక్స్ కి కూడా దూరమైనావంటే నా పట్ల నీకెంత అసహ్యం ఏర్పడిందో ఊహించలేనా. యింకా నన్నెలా సంతోషంగా వుండమన్నావు!" వణుకుతున్న గొంతుతో అంది.
    "రాధా... నీవు ఎంతసేపు నీ గురించే ఆలోచిస్తావు. కట్టుకున్న భార్యని, అలా పరాయి పురుషులు నా కళ్ళ ఎదుటే అనుభవిస్తుంటే చూసి ఎలా సహించగలడు అని అనుకున్నావా? అదంతా మర్చిపోవడానికి టైము కావాలన్నాను. నా వీక్ నెస్ ని అర్థం చేసుకోలేవేం... కొంతకాలం పోతే..."
    "హు... మాధవ్... ఆకలేసినప్పుడు అన్నం పెడితేనే అవతలివారు సంతృప్తి పడ్తారు. దుఃఖంలో వున్నవారికే సానుభూతి కావాలి. జబ్బుగా వున్నప్పుడే మందు కావాలి. దొంగలు పడ్డాక ఆర్నెల్లకి కుక్క మొగిరిందన్నట్ట. ఇంకో ఏడాది పోయాక నీ సానుభూతి నాకవసరం వుండదు మాధవ్... ఈలోగా నా మనసు బండబారిపోతుంది. అప్పుడు యింక ఎవరి సానుభూతి నాకక్కరలేదు... దెబ్బలు తినిన శరీరం తరువాత మొద్దుబారిపోతుంది..." వ్యంగ్యంగా అంది రాధ.
    "హు... నీవు పురుషుడవయితే నా బాధ అర్థమయ్యేది... ఒక మగవాడికి ఎలా వుంటుందో నీకేం తెలుస్తుంది..."
    రాధ తీవ్రంగా చూసింది. "ఏమిటి తెలియాలి మాధవ్... నీ చేతికి దెబ్బ తగిలితే వైద్యం చేయించుకుని బాగుపరుచుకున్నావు. నా శరీరంలో ఒక అవయవం బాధకి గురి అయింది. అంతమాత్రాన నన్ను కించపరిచి, అవమానపరిచి, తిరస్కరించాలా? మాధవ్... ఈ పవిత్రత, నీతి అంతా మనసుకి సంబంధించాలిగాని శరీరానికి కాదని చదువుకుని, నవీనుడవైన నీవు నమ్మలేవా?... నీ చదువు, సంస్కారం ఇంతేనా?"

 Previous Page Next Page