Previous Page Next Page 
మానవత పేజి 23

 

    "మందు ఇచ్చారట డాక్టర్ ఏది?" చైర్మన్ రమాదాసి ని అడిగాడు. రమాదాసి తీసి అందించింది.
    "అమ్మగారికి మందు అక్కర్లేదు, నేను చెప్పినట్లు చేయండి, ఎవరికీ తెలియోద్దు. తెలుస్తే ప్రాణాల మీదికి వస్తుంది." అని వాళ్ళిద్దరికీ ఏం చేయాల్సిందీ ఎలా చేయాల్సింది వివరించి చెప్పాడు. వాళ్ళిద్దరూ సమ్మతించారు. దండాలు పెట్టారు. వెళ్ళిపోయారు.


                                                                20

    "డాక్టర్ కలిశారా?" అడిగింది జానకి.
    "డాక్టర్ దొర కలిసిండు, ఉత్తరం ఏమి ఇయ్యలె. రాత్రి ఒంటిగంటకు గుడి కాడికి రమ్మన్నడు. నిన్ను తీసుకురమ్మన్నడు. విన్నవా?" రమాదాసి ముఖంలో ఉత్సాహం ఉంది. ధ్వనిలో అది కనిపిస్తుంది.
    "ఏమన్నారు ? ఎక్కడికి రమ్మన్నారు? రమ్మన్నారా నన్ను? నిజం! ఎప్పుడు? ఎక్కడికి? ఎలా? జానకికి అమాంతంగా సత్తువ వచ్చేసింది, ఉత్సాహం పొంగింది. రమాదాసి భుజాలు పట్టుకొని ఊపేసింది. రమాదాసి వివరాలు చెప్పింది.
    జానకి హుషారుగా లేచింది. దేవుని గదిలోకి వెళ్ళింది. వత్తులు వెలిగించింది. విగ్రహాలు వెలిగాయి. పూలతో పూజ చేసింది. మంగళ హారతి యిచ్చింది -- హరతితో ముకుందం గారి దగ్గిరికి వచ్చింది. ముకుందం గారు హారతి అందుకున్నారు.  కళ్ళు కద్దుకున్నారు. జానకిలో మార్పును గమనించారు. మనసు మార్చుకున్నదనుకున్నారు. పెళ్ళంటే అది వేరు, ఇలాగే మారిపోతారు ఆడపిల్లలు అనుకున్నారు.
    జానకి విగ్రహలముండు కూచుంది. చేతులు జోడించింది. కళ్ళు మూసుకుంది. ప్రార్ధించింది. తన పధకం నెగ్గాలని ప్రార్ధించింది జానకి. ధ్యానించింది. చాలాసేపు అలా కూర్చుండిపోయింది. తరవాత లేచింది. తండ్రితో కూడా భోజనం చేసింది.
    రాత్రి పదకొండు అయింది. ముకుందంగారు మంచంలో మేను వాల్చారు. వారికీ ఏదో పెద్ద బరువు దించుకున్నట్లుంది. జానకి సమాధానపడింది, పెళ్ళి జరిగిపోతుంది. అన్నీ కుదుట పడ్తాయి. ముకుందంగారికి కన్ను మలిగింది. నిద్ర ఒడిలోకి జారిపోయారు.
    జానకి గదిలో పడుకుంది. ఆమె కన్ను మలగతమ్ లేదు. క్షణాలు బరువుగా దొర్లుతున్నాయి. కాలం కదులుతున్నట్లు కనిపించడం లేదు. రమాదాసి పక్కనే పడుకుంది. ఆమె నిద్రపోతుందేమోనని భయం జానకికి. తేపా లేపుతున్నది ఇంకా పన్నెండే కాలేదు.
    "ఒంటిగంట ఎప్పుడవుతుందే!" అడిగింది జానకి.
    "అయితడమ్మా. ఎంత? ఒక గన్త౧ వస్తడు ఆడికి డాక్టర్ దొర ఫికరు పెట్టుకోకు."
    "కాదే! నాన్నగారు మెలకువతో ఉంటారేమో! ఎలా బయటపడతాం? చూసిరా కాస్త. నాకేదో గుబులుగా ఉంది."
    రమాదాసి బయటికి వెళ్లి వచ్చింది.
    "గుర్రు కొట్టి నిద్రపోతున్నారమ్మా! దేవుడున్నాడమ్మా, దయ తలుస్తాడు, భయపడకు, అంత బాగానే అయితాది"
    జానకి గుండెతో పాటు గడియారం ఆడుతున్నది. ముళ్ళు కదులుతూనే ఉన్నాయి. 12-45 అయింది, "ఇహ పోదాం లేవవే"
    రమాదాసి లేచింది.
    ఇద్దరూ నడుస్తున్నారు చీకట్లో - చిమ్మ చీకటి . చుక్కలు మిలమిల లాడుతున్నాయి. కుక్కలు అరుస్తున్నాయి. వేటినీ లెక్క పెట్టడం లేదు వారు. సాగిపోతున్నారు గబగబా . గుడి దగ్గరికి వచ్చేశారు. అక్కడేదో అలికిడి వినిపించింది. మనషుల జాడలు కనిపించాయి. పాల్ వచ్చాడని దృవపరచుకుంది జానకి. ఉరికింది.
    "జానకీ!" పాల్ అన్నాడు.
    "పాల్!' జానకి అన్నది.
    ఆ పిలుపులో అమృతం ఉంది. వారి గుండెల్లో అమృతవర్షం కురిసింది. పాల్ ముందు జానకి! జానకి ముందు పాల్!
    వారి చూపులకు నాల్కలోచ్చాయి - గుండెలోచ్చాయి - పెదవులోచ్చాయి, తబ్బిబ్బవుతున్నారు- ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
    వారి ఆనందానికి అవధుల్లేవు.
    చైర్మన్ వారిని చూచాడు. అతని గుండె చమర్చింది. కళ్ళు చెమ్మగిల్లాయి. మృత్యువు ఎంత కర్కశమైంది! ఇంత ఆనందాన్ని నలిపెసింది కదా అనుకున్నాడు.
    "ఇహ కదలండి. ఇక్కడ క్షేమం కాదు"
    చైర్మన్ మాటలు విని ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరూ.
    "ఎవరు! చైర్మన్ గారా" ఇద్దరూ ఆశ్చర్యం ప్రకటించారు.
    "అవును గాని త్వరగా బయల్దేరండి , జీపు సిద్దంగా ఉంది. బస్తీకి పోదాం"
    "మీరా! మీరేనా దీనికి కారకులు? మీరేనా మమ్ముల మృత్యువు నుండి రక్షించినవారు?"
    "కాదు, నేను కాదు, మీ ప్రేమ , మీలోని మానవత. ప్రేమ గెలుస్తుంది మానవత గెలుస్తుంది. నేనేం చేయలేదు. అదిగో వాళ్ళిద్దరూ అక్కడ నుంచున్నారు. వారు మానవమూర్తులు. వారిని అభినందించాలి"
    ఇద్దరూ అటు చూశారు. ఏమీ ఎరగనట్లు నుంచొని ఉన్నారు రమాదాసి, ఏసుదాసు.
    "రమాదాసి!' అని కౌగలించుకొంది జానకి.
    "ఏసుదాసూ!" అని ఆలింగనం చేసుకున్నాడు పాల్.
    "చూశారా! జీవితంలో ఎంత అనందం ఉందొ! చనిపోతా మన్నారు!"
    "చైర్మన్ గారూ! మీరు వాస్తవంగా మానవతమూర్తులు. మీలాంటి వారుంటే అనేక మంది జీవించగలరు. అనందించగలరు. మనవసేవ చేయగలరు"
    "సరే గాని నడవండి. ఆలస్యం మంచిది కాదు."
    అంతా కదిలారు. జీపులో ఎక్కారు. జీపు కదిలింది.


                                                          21

    తెల్లవారింది . ముకుందంగారు లేచారు. మాములుగా గుమ్మం దగ్గరికి వెళ్ళారు. గడియ వేయలేదు. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. ముకుందంగారి గుండె పగిలింది. దొంగలు పడ్డారనుకొన్నారు, దోచుకుపోయారనుకున్నారు. గబగబా గదిలోకి ఉరికారు, జానకి కనిపించలేదు. పెట్టెలు, సామాగ్రి యధాతదంగా ఉన్నాయి. బండ పడ్డట్లయింది నెత్తిన. జానకీ జానకీ అంటూ దొడ్లోకి ఉరికారు. జానకి కనిపించలేదు. రమాదాసి లేదు. గబగబా వాకిట్లోకి వచ్చారు కూలబడ్డారు.
    "కిరస్తానీవాడు నన్ను ముంచాడు. జానకిని లేవదీసుకు పోయాడు" అని ఏడ్పు లంకించుకున్నాడు. తల బాదుకోవడం మొదలు పెట్టారు, గుండె బాదుకున్నారు, కొంప కూలి పోయినట్లు ఏడ్పు సాగించారు.
    జనం ఒక్కొక్కరే కూడసాగారు. షావుకారు వచ్చాడు. శకుంతల వచ్చింది. జనంలో గుసగుసలు బైల్దేరాయి. చర్చలు సాగాయి. అన్యాయం జరిగిందనుకొన్నారు. కొందరు. అక్రమం జరిగిపోయిందన్నారు మరికొందరు. ధర్మం లోపోస్తుందన్నారు కొందరు. కలికాలం ఇలాంటి బుద్దులే పుడ్తాయన్నారు అన్యులు.
    "దీన్నీ ఎదుర్కోవాలి ఫాదర్ జాన్ ను అడగాలి" అన్నది శకుంతల.
    "అంతే, అలాగే చేయాలి. నడవండి" అన్నారు షావుకారు.
    ముకుందంగారు కూలబడ్డవారు లేచారు. తలుపులు వేసి బయలుదేరారు.
    జన సమూహం ఫాదర్ జాన్ ఇంటి మీదకి పోయింది. గోల మొదలు పెట్టింది కేకలు వేసింది.

 Previous Page Next Page