Previous Page Next Page 
మానవత పేజి 22

 

`    శాస్త్రి గారు ముహూర్తాలు లేకున్నా పెట్టారు. అతనికి తొందరగా ఉంది. ముహూర్తం పెట్టుకున్నారు. ఆ తరవాత మరో విషయం తెలిసింది -- వరునికి ఒక ఉంపుడు గత్తె వుందని. ముకుందంగారు విలవిల్లాడారు. ఆ తరువాత మరో విషయం తెలిసింది -  ఆస్తి పాస్తులేమీ లేవనీ , జానకీ ఉద్యోగం మీద ఆధారపడాల్సిందేననీ--- జానకిని కసాయికి అప్పగిస్తున్ననా అనుకున్నాడు. ఆ డాక్టరును చేసుకుంటేనే సుఖ పడ్తుందేమో అనుకున్నారు. అంతలోనే వేదాంతం గుర్తుకు వచ్చింది. ఖర్మ అనుకున్నారు. జానకి నొసట రాసి ఉన్నది రెండో పెళ్ళివాడే! దాన్ని ఎవరు చెరపగలరు?
    పెళ్ళి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
    ముహూర్తం దగ్గర పడ్డది -- ఎల్లుండే పెళ్ళి.
    ముకుందంగారు జానకి దగ్గరికి వెళ్ళారు. జానకి పడుకొని ఉంది. తండ్రిని చూచింది. లేచి కూర్చుంది. ముకుందంగారు మంచం మీద కూర్చున్నారు. కూతురు తల నిమిరారు.
    "అమ్మా! జానకి ! వరుడు కుదిరాడమ్మా నీకు"
    జానకి మాట్లాడలేదు. తల వంచుకుంది.
    "కూతురుకు పెళ్ళి చేయడం తండ్రి కర్తవ్యం. ఈ పెళ్ళి ద్వారా నీకెంత న్యాయం చేకూర్చుతున్నానో చెప్పలేనమ్మా! అయితే, తండ్రి బాధ్యత నేను నెరవేర్చుతున్నానమ్మా! ఈ వృద్దుడితో సహకరించు తల్లీ!" అన్నారు.

 

                                                          19

    తెల్లవారితే పెళ్ళి . ఇల్లు సందడిగా వుంది. పందిళ్ళు వేశారు. తోరణాలు కట్టారు. బాజాలు మోగాయి. జానకికి తలంటి పోశారు. పెళ్ళి పిల్లని చేశారు. జానకి మౌనంగా వుంది. యంత్రవతుగా కదులుతుంది. తండ్రికి మొక్కమన్నారు. ఆమె మొక్కింది. తండ్రి దీవించారు. అది ఆమెకు వినిపించలేదు. తల్లి పటానికి మొక్కమన్నారు.
    జానకి మొక్కింది. ఆమె కళ్ళలో నీళ్ళు నిండాయి. దుఃఖం ఉబికి వచ్చింది - "అమ్మా! " అని ఏడ్చేసింది. గుండెను చీల్చుకొని వచ్చిన పదం అది. ఎక్కెక్కి ఏడ్చింది జానకి. దాగిన దుఖం సాంతం వడిసె దాకా ఏడ్చింది. ఓదార్చారు అమ్మలక్కలు, ఏడవరాదన్నారు.
    ఎంగిలి చేశాననిపించుకుంది. జానకి గదిలో దూరింది. ఇంట్లో సంరంభమూ తగ్గింది. ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. ఇల్లు మామూలు ఇల్లయింది.
    సాయంకాలం అయింది. చీకటి పడుతున్నది. రమాదాసిని పిలిపించింది జానకి. రమాదాసి జానకిని చూచింది. దాచుకున్న దుఖం పొంగింది. రమాదాసిని పట్టుకుని ఏడ్చింది. రమాదాసి ఓదార్చింది. జానకి ఒక ఉత్తరం ఇచ్చింది. పాల్ కు అందించమని చెప్పింది.
    పాల్ ఆస్పత్రిలో ఉన్నాడు. వాలు కుర్చీలో కూర్చున్నాడు. అతని మనసు పరి పరి విధాల పరిభ్రమిస్తుంది.
    రమాదాసి గదిలో అడుగు పెట్టింది.
    "అయ్యా! అమ్మ ఏడుస్తుంది. నా గుండె పగులుతున్నది" అని బావురుమంది.
    పాల్ భరించలేక పోయాడు. అక్కన్నుంచి లేచాడు. గదిలోకి వెళ్ళాడు. స్తంభాన్ని పట్టుకుని కుమిలి కుమిలి ఏడ్చాడు.
    రమాదాసి దుఖాన్ని దిగామింగింది. కళ్ళు తుడుచుకొని గదిలోకి వెళ్ళింది. "ఇగో ! ఈ చీటీ ఇయ్యమన్నది. నాకేమో భయంగా వున్నది." అని చీటీ అందించింది.
    ఉత్తరం అందుకున్నాడు పాల్. కుర్చీలో కూలబడ్డాడు.
    "నా ప్రాణంలో ప్రాణం పాల్ గారికి -----
    సహనం చచ్చిపోయింది. బతికి ప్రయోజనం లేదని తెలిసిపోయింది. ఎదిరించే శక్తి అంతరించింది. చావు తప్ప గత్యంతరం లేదు. హాయిగా చావాలని వుంది. మంచి విషం పంపించండి. పంపకుంటే వేరే ఉపాయాలు చూసుకోవాలి. ఈ రాత్రికి చచ్చిపోవాలి. తప్పదు. తెల్లారితే పెళ్ళి.

                                                                                                        మీ ప్రియురాలు
                                                                                                           జానకి పాల్"
    పాల్ నెత్తిన కొండ చరియ విరిగి పడింది. నిశ్చేతనుడైనాడు కొన్ని క్షణాలు నక్షత్రాలు టపటపా రాలిపడుతున్నట్లనిపించింది.
    జానకి చనిపోతుంది. ఉండదు. వెళ్ళిపోతుంది. జానకి ప్రేమ మూర్తి. ఆమె చావరాడు, ఏం చేయాలి తాను? తాను వెళ్తాడు. జానకిని లాక్కొస్తాడు. ముకుందం గారు గొడవ చేస్తాడు. జనం కూడ్తారు, తిడ్తారు, కొడ్తారు. రాళ్ళు విసురుతారు. తమను బతకనీయారు. సమాజం ప్రేమను సహించదు. వీల్లేదు. వేరే గతి లేదు. జానకి చనిపోతుంది. జానకి లేని లోకం ఏది? జానకి లేని బతుకేమి? జానకి బలి అవుతుంది. తాను బలి అవుతాడు. అంతే బలి కావాల్సిందే!
    పాల్  లేచాడు. గబగబా యేవో మందులు తీశాడు. కాగితం అందుకున్నాడు. ఉత్తరం రాశాడు. రమాదాసిని పిల్చి "మందు జానకిగారికి ఇవ్వు. వళ్ళు బావుండలేదని రాసింది. దీనితో బాగవుతుంది. మందు ఎలా వేసుకోవాలో రాశాను. ఉత్తరం ఇవ్వు. ఎవరికీ చూపకు."
    "ఇంకేమన్న చెప్పమంటారా/ తెల్లారితే పెళ్ళి"
    "అన్నీ అందులో రాశా " పాల్ కళ్ళలో నీళ్ళు నిండాయి. "నువ్వెళ్ళు"
    రమాదాసి మాట్లాడలేదు. బయట ఏసుదాసు నుంచున్నాడు. "ఏమన్నారు?" అడిగాడు.
    "చీటీచ్చిండు. మందిచ్చిండు , ఎవ్వరికీ చూపిచ్చోద్దన్నాడు, నాకయితే గుబులు గున్నది."
    "నకట్లనే ఉన్నది. పీచు పీచు మంటంది. ఏం చెద్ద,మంటావు?
    "ముంగల నడువ్ లోన ఇంటడు"
    ఇద్దరూ నడిచారు - కొంతదూరం .చీకట్లో చెట్టు కింద నుంచున్నారు. "ఎట్ల ఏం చేద్దామంటవ్?" అడిగింది రమాదాసి.
    "మనకు చదువు రాదాయే" విచారం వ్యక్తపరిచాడు.
    "చదువోచ్చినోరికి ఇద్దమా! చదివింతమా?"
    "చైర్మన్ దొర మంచోడు"
    "ఆవు"
    "ఆయనకు చూపిస్తే ?"
    "బాగానే ఉంటది"
    ఇద్దరూ చైర్మన్ ఇంటికి వెళ్ళారు.
    చైర్మన్ వారిని చూచాడు. "ఏమిటిలా వచ్చారు?" అడిగాడు.
    "చీటీ ఎవ్వరికీ చూపిచ్చోద్డన్నాడు డాక్టర్ దొర. మాకు గుబులుగున్నది. మీ కాడికొచ్చినం" జరిగినదంతా చెప్పింది రమాదాసి.
    చైర్మన్ గబగబా చీటీ అందుకుని చదివాడు.
    "ప్రాణ ప్రియ జానకిగారికి
    మీరన్నది నిజం. సహనం చచ్చిపోయింది. మనం ఓడిపోయాం. ఎదిరించే శక్తి అంతరించింది. మనం బతికి ప్రయోజనం లేదు. మీరు కోరినట్లు విషం పంపుతున్నాను. అది చాలా శక్తివంతం అయింది. సరిగ్గా రాత్రి రెండు గంటలకు నేను తింటున్నాను. మనం రేపటి ఉదయం చూడం. మన ఇద్దరినీ ఒకేచోట సమాధి చేయించమని చైర్మన్ గారిని కోరాను. వారు మంచివారు , అలాగే చేస్తారు.
                                                                                                  మిమ్మల్ని మరవలేని
                                                                                                   జానకీ ప్రియుడు పాల్"
    చైర్మన్ కళ్ళల్లో నీళ్ళు గిర్రున నీరు తిరిగింది. జానకి, పాల్ కనిపించారు . వారిద్దరూ పూలదండలు మార్చుకున్నారు. వెంటనే ఇద్దరి కళేబరాలు కనిపించాయి. వీల్లేదు, వారు చావడానికి వీల్లేదు. ప్రేమ జయించాలి. మానవత జయించాలి. మూర్ఖత్వం మంటకలవాలి. మౌడ్యం ఓడిపోవాలి. అవును ఓడాలి, వారిని ఓడించాలి.

 Previous Page Next Page