ఫాదర్ జాన్ కు మెళకువ వచ్చింది. లేచారు. కాస్త కంగారు పడ్డారు. తలుపు తీశారు. బయటికి వచ్చారు.
"మా జానకిని అప్పగించు" ముకుందం గారు కేకపెట్టారు.
ఫాదర్ జాన్ కళ్ళు నల్చుకున్నారు. చూచారు. జనం కనిపించింది. కాస్త బెదిరారు. "జానకి ఏమిటి? ఏమి కధ!" అడిగారు.
"వాలి ముచ్చు, తెలియనట్లడుగు తున్నాడు. చెప్పు ఎక్కడికి పంపించావో?" శకుంతల అరిచింది.
"రావణాసురుని వలె ఉన్నాడు. చెప్పించాలి. ఎక్కడికి పంపించాడో?" షావుకారు అన్నాడు.
"నా కంతా అయోమయంగా ఉంది. నాకేమి తెలియదు. నిజం, ఉండండి, పాల్ ఉన్నాడేమో చూసివస్తా" అని లోనికి ఉరికాడు.
"వీడు వేసిన నాటకమే! బొంకుతున్నాడు. అందరినీ కిరస్తాన్లను చేయాలనుకుంటున్నాడు , వెధవ " ముకుందంగారు అన్నాడు.
"పాల్ కూడా లేడు. నాకేదో భయంగా ఉంది, ముకుందంగారూ! నాకేమీ తెలియదు, వాళ్ళిద్దరూ లేచిపోయినట్లున్నారు. నాకది ఇష్టం లేదు, సత్యం చెవుతున్నాను. వాళ్ళు బస్తీకి వెళ్లుంటారు. ఈ పెళ్ళి జరక్కుండా ఆపాలి. మీకూ ఇష్టం లేదు, నాకూ ఇష్టం లేదు. పెళ్ళి ఎలా జరుగుతుంది? పదండి పోదాం బస్తీకి మనిద్దరం కలిసి ఈ కార్యం సాధించాలి"
ముకుందంగారి నోట మాట రాలేదు. వారు కళ్ళప్పగించి చూస్తున్నారు.
"ఏమిటి చూస్తారు? ఫాదర్ చెప్పింది బావుంది, బయలుదేరండి బస్తీకి" శకుంతల నడుం బిగించింది.
"సరే నడవండి " అన్నారు ముకుందం గారు.
ఫాదర్ జాన్, ముకుందంగారు కలిసి కదిలారు. కలిసి సాగారు. కలిసి నడిచారు. వరద ముంచిన్నాటి వలె నడిచారు.
షావుకారు ఉరికాడు , కారు తెప్పించారు.
ఫాదర్ జాన్, ముకుందం గారు కారేక్కారు.
కారు కదులుతుంది. , శాస్త్రిగారు ఉరికి వచ్చారు. కారును అపు చేశారు. కాస్త బయటికి రమ్మని ముకుందంగారిని పిలిచారు. ముకుందంగారు కారు దిగారు. శాస్త్రి గారు చాటుకు తీసికెళ్ళారు. చెవిలో చెప్పారు. జానకి శీలాన్ని గురించి అనుమానమట. పెళ్ళివారు రావడం లేదట."
ముకుందంగారు మండిపోయారు.
"వెధవ! జానకి శీలాన్ని శంకిస్తాడూ! అవిటి వెధవ, రెండో పెళ్ళివాడికి ఇస్తామనటమే నా తప్పు. బిడ్డను బావిలో తోసుకోడానికి సిద్దపడ్డాను మనవాళ్ళని. పోనీ చేసుకోమంటే పీడా విరగడయింది."
శాస్త్రి గారు ముకుందం గారి ముఖం చూస్తూ నుంచున్నారు.
"జానకి మంచిపనే చేసిందేమో!! మనవాళ్ళందరికీ కట్నాల కొరివి దయ్యాలు పట్టాయి. మతమేమిటి? ధర్మమేమిటి? అన్నీ డబ్బే అయిపోయాయి మనవాళ్ళకు" అన్నాడు.
ముకుందంగారి ముందు లోకం తలకిందులయినట్లు కనిపించింది. పరిసరాలు గిరగిరా తిరుగుతున్నట్లనిపించింది. శాస్త్రిగారిని ఎగాదిగా చూచారు. శాస్త్రిగారి ముఖాన విభూతి రేఖలున్నాయి. గుండ్రని కుంకుమ బొట్టుంది, భుజాన జంధ్యం ఉంది, రొండిన నశ్యం కాయవుంది.
"మతమేమిటి? ధర్మమేమిటి? అన్నీ డబ్బే అయిపోయాయి మన వాళ్ళకు" ఈ మాటలే వినిపిస్తూ వున్నాయి ముకుందంగారికి. ముకుందం గారు అక్కణ్నుంచి కదిలారు. కారు ఎక్కారు. కూర్చున్నారు. వారి వదనంలో ఒక విచిత్రం అయిన మార్పు స్పురించింది. కారు స్టార్టు అయింది.
* * *
బస్తీలో కళ్యాణ మంటపం , వేదిక అలంకరించి ఉంది. అరటిచెట్లు మామిడి తోరణాలతో కళకళలాడుతున్నది. సభాస్థలిలో కొద్ది మంది యువకులు, యువతులు ఉన్నారు. చైర్మన్ మిత్రులు. కొందరు పెద్దలు కూడా విచ్చేశారు.
వేదిక మీదికి జానకి వచ్చింది. ఆమె వెనుక పాల్ వచ్చాడు. ఏసుదాసు, రమాదాసీ పూల మాలలు తీసుకొని వీడిక మీదికి వచ్చారు. చైర్మన్ అంతకు ముందే వేదిక మీద ఉన్నాడు.
రమాదాసీ పూలమాల అందించింది జానకికి.
జానకి పూలదండ పాల్ మేడలో వేసింది.
ఏసుదాసు పూలదండ అందించాడు పాల్ కు.
పాల్ పూలదండ జానకి మెడలో వేశాడు.
సభలో చప్పట్లు. చైర్మన్ ముందుకు వచ్చాడు.
వీరిద్దరిది నిజమైన ప్రేమ. ప్రేమ కోసం గొప్ప త్యాగానికి తలపడ్డారు! ప్రేమ భాగవత్సస్వరూపం. భగవానుడు కరుణించాడు. వీరిద్దరికీ మనవతలో అపారమైన విశ్వాసం ఉంది. మీరంతా ఆశీర్వదించారు, వీరు భార్య భార్తలైనారు. జానకి మానవతామూర్తి. ఆమె మాట్లాడితే సెలయేళ్ళు పారినట్లు చెట్లు చిగిర్చినట్లు ఉంటుంది. జానకి గారు మాట్లాడాలని ప్రార్ధిస్తున్నాను."
`జానకి ఇసుమంత సిగ్గుపడ్డది, పాల్ ను చూచింది.
మాట్లాడమన్నట్లు చూచాడు పాల్.
జానకి మాట్లాడింది.
"చైర్మన్ మానవతమూర్తి. వారి వల్లనే మా పెళ్ళి సాధ్యం అయింది. రమాదాసీ , ఏసుదాసు మాకు ఆదర్శ దంపతులు. వారి ప్రయత్నమే లేకుంటే మేము ఇప్పటికి పరలోకంలో ఉండేవాళ్ళం."
సభలో చప్పట్లు.
"ప్రేమ మానవతకు మారుపేరు. మానవతకు మతాలు, కులాలు, దేశాలు, భాషలు లేవు. ప్రేమ ఏ మతానికి గుత్త సొమ్ము కాదు. ప్రేమ మనస్సు లోంచి పుడ్తుంది. మనస్సు మంచిని సూచిస్తుంది. ప్రేమ భగవత్స్వరూపం. దానికి రంగులు, దేశాలు, రాజకీయాలు లేవు. హిమాలయం అంత చల్లనిది - అంత ఉన్నతం అయింది.
మేం ప్రేమించుకున్నాం, మనసులు మార్చుకున్నాం - మాలలు కాదు మా మతాలు వేరు, అవి మాకు ఆడు రావు. పాల్ అదివారం చర్చికి వెళతాడు, శనివారం నాడు నేను గుడికి వెళతాను. మా ఇంట్లో క్రీస్తు- రాముడు పక్కపక్కనే ఉంటారు."
కరతాళధ్వనులు ప్రతిధ్వనించాయి.
వేదిక మీదికి వస్తున్నా ఇద్దరు నన్స్ కనిపించారు పాల్ కు, వారి చేతుల్లో పుష్పగుచ్చాలున్నాయి. వారు దగ్గరికి వచ్చారు.
గుర్తించాడు పాల్, "జూలీ !!!" అని కేక పెట్టాడు.
జూలీ పాల్ కు పుష్ప గుచ్చం అందించింది.
"జూలీ నువ్వు.....!"
"అవును పాల్! నేను జూలీనే! నేను నిన్ను ప్రేమించాను! ప్రేమ ఫలించలేదు. జానకి గొప్పది , నీకు తగినది, ఆమె ప్రేమ మూర్తి. ఆనాడు నిన్ను మాత్రం ప్రేమించాను. ఈనాడు మీ ఇద్దరినీ ప్రేమిస్తున్నాను - కాదు -సకల మానవాళిని ప్రేమిస్తున్నాను. లోకంలో దీనులున్నారు. దుఃఖితులున్నారు, వారి కన్నీరు తుడవడానికి జీవితం అంకితం చేశాను. నాకెంతో ఆనందంగా ఉంది పాల్. నేను మానవాళిని ప్రేమిస్తున్నాను" జూలీ కంఠం రుద్డం అయింది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. జానకి గుండె కరిగింది. కళ్ళు నిండాయి.
ఆమె ముందుకు ఉరికింది.
జూలిని కావలించుకుంది -- గట్టిగా!
'అక్కా! నువ్వు త్యాగమూర్తివి " అన్నది.
పాల్ కళ్ళు తుడుచుకున్నాడు.
దూరంగా నుంచున్నారు ఫాదర్ జాన్, ముకుందం గారూ.
వారు ఒకరిని ఒకరు చూచుకున్నారు.
ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లాయి.
----***---