Previous Page Next Page 
మనసున మనసై పేజి 23


    'రా, ఉషా కూడా అక్కడికే వెళ్ళింది. నీవూరా...' అంటూ అటు దారితీసింది-వీళ్ళు వెళ్ళేలోగా దివాకర్ మనీషా టేబిల్ దగ్గరికి వెళ్ళారు. మనీషా నవ్వుతూ ఏదో అంటూ అతని ప్లేటులో ఏదో వేయడం, వాళ్ళిద్దరూ అక్కడి నించుని మాట్లాడుకుంటూ వుండిపోయారు. ఉషారాణి తన ప్రయాణం ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటే ఊఁ! కొడ్తున్న జయంతి దృష్టి వారి వెంబడే వుంది. మరోసారి అటు చూసేసరికి ఇద్దరూ ఆ టేబిల్ దగ్గర కన్పించలేదు. జయంతికి ఎంతో నిరుత్సాహంగా, ఆ వాతావరణం భరించలేనట్టుగా అన్పించింది. ఐస్ క్రీమ్ ప్లేట్ పూర్తిచేసి కింద పెట్టేసింది. ఉషారాణి దగ్గిరకి వెళ్ళి 'ఇంక వెడతాను ఉషా, చాలా లేటయింది' అంటూ స్నేహితురాలి చెయ్యి పట్టుకుని 'మళ్ళీ ఎన్నాళ్ళకి కలుసుకుంటామో వీలుంటే ఉత్తరాలు గాని, ఫోనుగాని చెయ్యి- ఇండియా వస్తే చెప్పు..... ఐ విల్ మిస్ యూ...' అంది కాస్త పట్టుకున్న గొంతుతో... 'ఐటూ' అంటూ ఉషారాణి జయంతి చెయ్యినొక్కి -'జయా, ఇకనైనా ఇంటికెళ్ళు, తొందరగా ఎవరినన్నా చేసుకో అనవసరంగా ఆలస్యం చెయ్యకు నా మాట విను. దివాకర్ ని వదలకు' రహస్యంగా అంటూ నవ్వింది. 'ఈ మహానుభావుడు ఏడి కనపడడేం- వుండు అతను తినడం అయిందో లేదో వెడతా నంటావే' అతన్ని రానీ' అంది దివాకర్ కోసం ఇటు అటు చూసి-'అతనెక్కడో చాలా బిజీగా వున్నాడులే- నే ఆటోలో వెళ్ళిపోతా' అంది జయంతి కాస్త ముభావంగా.
    'వద్దు వద్దు రాత్రి పదిన్నర అయింది ఒంటరిగా వెళ్ళద్దు. వుండు నేను చూసి అతన్ని పిలుచుకువస్తా-' అనే లోపలే శ్రీధర్ తో కలిసి దివాకర్ రావడం కనిపించింది. 'అదిగో వస్తున్నాడు-' అంది ఉషారాణి.
    'ఓ.కె శ్రీధర్. సాయంత్రం చాలా బాగా గడిచింది. మళ్ళీ ఎప్పుడు ఇండియా వచ్చినా ఫోన్ చెయ్యి. రాధారాణిగారు నమస్కారం... వెడతామరి' అంటూ ముందుకు కదిలాడు. జయంతి తెల్లబోయింది తనని పట్టించుకోకుండా ముందుకి వెళ్ళడం చూసి. 'ఏమండోయ్ దివాకర్ గారు మా జయంతిని తీసుకువచ్చిన సంగతి గుర్తులేదేమిటి, వదిలేసి వెళ్ళిపోతున్నారు' గట్టిగా పిల్చింది వెనకనుంచి. దివాకర్ చప్పున ఆగి ఇటుతిరిగి నాలుక కొరుక్కుని ఓ సారీ, వెరీసారీ, రండి వెడదాం' అన్నాడు జయంతి వంక చూసి-జయంతి మొహం నల్లబడింది. తప్పక అతని వెంట నడిచింది.
    'మనవాడి మది మనీషా వెంట తిరుగుతూంది యివాళ. ఆ అమ్మాయి అందానికి బోర్లాపడ్డాడు' నవ్వుతూ అన్నాడు శ్రీధర్. 'మనీషా....వాళ్ళెక్కడ. వాళ్ళకి యితనిలాంటి వారెక్కడ కనిపిస్తారని ఆశ. నేనింక ఏదో మా జయంతిని చేసుకుంటే బాగుండునని ఆలోచిస్తున్నాను'
    'ఏదో అందంగా వుందని వెంట తిరిగాడు. పెళ్ళి అయిపోయిందేమిటి అంతమాత్రాన' అన్నాడు శ్రీధర్.
    కార్లో దివాకర్ ఇంకా పార్టీ ఉషారు తగ్గనట్టు హుషారుగా ఈల వేసుకుంటూ పక్కన జయంతి వుందన్న విషయమే గుర్తులేనట్టు డ్రైవ్ చేస్తున్నాడు. జయంతి చిన్నగా దగ్గింది. 'ఓ, సారీ....పార్టీ భలే బాగుంది కదూ. ఏం జనం... ఏం జనం...వూర్లో వున్న బిజినెస్ కమ్యూనిటీ అంతా ఇక్కడే వుంది యివాళ. ఏం డబ్బు వెదజల్లుతారు వీళ్ళు పెళ్ళికి. ఏం నగలు, ఏం మేకప్పులు ఆడవాళ్ళు....'
    జయంతి మాట్లాడలేదు. కాసేపు వూరుకుని మనసులొ దాచుకోలేని ఉక్రోషం బయటపెడుతూ 'మనీషా చాలా బాగుంది కదూ అందంగా..!' అంది.
    'మీరూ చూశారా..సింప్లి సూపర్బ్ వంక పెట్టలేని అందం-దేముడు ప్రత్యేక శ్రద్ధతో తీర్చి దిద్దినట్టుంది ఆ అమ్మాయి' అన్నాడు సంతోషంగా.
    అతనలా వప్పుకుంటూ అనగానే యింకేం అనాలో అర్ధంకాలేదు జయంతికి. ఉడుకుమోత్తనం వచ్చింది. తన భర్తే పరాయి ఆడదాన్ని మెచ్చుకుంటున్నట్టు బాధ పడిపోయింది. దివాకర్ ఏం అనకుండా కారు డ్రైవ్ చేస్తుంటే జయంతికి చాలా నిరుత్సాహం అన్పించింది. మరో రెండు నిముషాలలో ఇల్లు రాగానే 'ఓ.కే గుడ్ నైట్' అని గబగబ కారు ముందుకు నడిపాడు.
    ఆ రాత్రి చాలా సేపు జయంతికి నిద్రపట్టలేదు. గుండెల్లో ఏదో గుబులుగా అన్పించింది.
    
                                   * * *
    
    మర్నాడు ఆఫీసులో దివాకర్ తో మాట్లాడాల్సిన పనేబడలేదు. అతనసలు చాలా ఆలస్యంగా వచ్చాడు. తరువాత ఎవరో కంపెనీ వాళ్ళతో చాలాసేపు మీటింగ్ లో వున్నాడు. సాయంత్రం వరకూ అతనెప్పుడన్నా పిలుస్తాడేమో పనిమీద అని ఆశించిన జయంతికి నిరాశ ఎదురయింది.
    యింటికెడుతూ ఆమె మనసేం బాగులేక 'కాసేపు నర్సింగ్ హోమ్ కెళ్ళి వాసంతి దగ్గర కూర్చుందాం. మళ్ళీ రేపు యింటికి వెళ్ళిపోతుంది కదా' అనుకుని అటువెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి వాసంతి ఒక్కర్తే పిల్లాడికి పాలు యిస్తూ కనిపించింది. 'ఏమిటి ఎవరూ లేరా, ఒక్కర్తివే వున్నావు'.
    'ఆ... యిప్పుడింక లేచి తిరుగుతున్నానుగా, దమయంతికి అనవసరంగా శలవు నష్టం ఎందుకని నేనే వద్దన్నాను. అమ్మ నాల్గుగంటలకి యింటికెళ్ళింది. పనిచూసుకోవాలిగా. మళ్ళీ రాత్రి వస్తుంది భోజనం పట్టుకొని. రేపు యింటికెళ్ళి పోవచ్చన్నారు. కూర్చో కూర్చో అలా.. ఏమిటలా వున్నావు. మొహం వాడిందేం. వంట్లో బాగులేదా' చెల్లెలు మొహం చిన్నపోయి వుండటం చూసి ఆరాతీసింది వాసంతి.

 Previous Page Next Page