'శ్రీధర్, ఓసారి ఇంట్రడ్యూస్ చెయ్యకూడదూ-అంత అందమైన అమ్మాయిని పరిచయం చేసుకునే అదృష్టానివ్వరాదు యీ మిత్రునికి'.
నాకే పెద్ద పరిచయం లేదురా బాబూ ఎంగేజ్ మెంట్ నాడు చూశా, మళ్ళీ ఇవాళే చూస్తున్నాను. పద రాహుల్ గాడిని పట్టుకుందాం. 'నవ్వుకుంటూ ఇద్దరూ రాహుల్ దగ్గరకెళ్ళారు. భావిక నవ్వింది పలకరింపుగా ఇద్దరినీ చూసి-రాహుల్ చెవిలో గుసగుసలాడాడు శ్రీధర్ తెలుగులో. "ఏయ్ నా మీద ఏమిటి చెప్పుకుంటున్నారు. భావిక కినుక నటిస్తూ ఇంగ్లీషులో అంది. 'ఇంక నీ మీద చెప్పుకోవడానికి ఏం వుంది-నీ పక్కన అందాల భామ ఎవరిని అరా తీస్తున్నాడు దివాకర్' అన్నాడు రాహుల్ నవ్వి- భావిక నవ్వి చెల్లెలు చెయ్యి పట్టి లాగి 'మై సిస్టర్ మనీషా.....తెల్సుగా శ్రీధర్ ని రాహుల్ కజిన్, ఈయన దివాకర్ శ్రీధర్ చిన్నప్పటి ఫ్రెండు. హియీజ్ ఏ బ్యాంకర్...' అంటూ పరిచయం చేసింది. 'మా చెల్లెలు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి 'బంజారా హిల్స్ లొ మంచి బ్యూటిక్ నడుపుతూంది' అంది. సుతారంగా నవ్వింది మనీషా, 'మావాడు బ్యాంకర్ నీకేడన్నా బిజినెస్ ఎక్స్ టెన్షన్ కి బ్యాంక్ లోన్లు కావలిస్తే చెప్పు ఇచ్చేస్తాడు' అన్నాడు శ్రీధర్ నవ్వి. అవకాశం పోగొట్టుకోకుండా 'ష్యూర్, ష్యూర్, ఇలాంటివారికి లోన్లిస్తే మా బ్యాంక్ పరపతి పెరుగుతుంది' అన్నాడు నవ్వి మనీషా 'థాంక్స్' అంది మరోసారి సుతారంగా నవ్వి ఈ లోగా ఇంకెవరో పెళ్ళికొడుకుని కూతురిని విష్ చేయడానికి రావడంతో అక్కడనించి కదలక తప్పలేదు. 'నైస్ టూ మీట్ యూ' అంటూ విష్ చేసి మనీషాని మరోసారి పలకరించి దివాకర్ కదిలాడు. డయాస్ నించి కిందకి రాగానే 'తీర్చిదిద్దిన శిల్పంలా వుంది. వంక వెతికి నా లేని అందం-షియీజ్ సూపర్బ్' అన్నాడు దివాకర్.
'అవును భావిక కంటే కూడా మనీషా బాగుంది. అంతేకాక ఆ అమ్మాయిది విశిష్టమైన వ్యక్తిత్వం-అమెరికాపై చదువులకి వెళ్ళమంటే అందరూ అమెరికాకు పోతే ఇండియా ఏమయిపోతుంది. నాకిక్కడే బాగుంది' అంటూ బిజినెస్ స్టార్ట్ చేసింది. తండ్రిది బట్టల వ్యాపారం కనక తను నేర్చుకున్న ఫాషన్ డిజైనింగులో కొత్త బ్యూటిక్ ఓపెన్ చేసింది....'
'ఐ లైక్ హెర్ ఏటిట్యూడ్' - దివాకర్ మెచ్చుకున్నాడు. ఏదో మైమరుపులో వున్నట్టు ఆమె వంకే చూస్తూ అన్నాడు.
'ఏయ్.... ఏమిట్రా ఎమోషనల్ అయిపోతున్నావు....మనీషాని చూడగానే మైకం కమ్మిందా' హాస్యం ఆడాడు.
'నిజమే.... కాని ఏం లాభం....వాళ్ళెక్కడ నేనెక్కడ....డబ్బులో మునిగితేలే వ్యాపార కుటుంబం....ఏదో బ్యాంకు ఉద్యోగం చేసే ఆఫ్టరాల్ గాడ్ని... నాకెక్కడ అందుతుంది' నిరాశ నటిస్తూ అన్నాడు.
'అదీ నిజమేలే-రాహుల్ అంటే అమెరికాలో వున్నాడు..... ఇద్దరూ ప్రేమించి చేసుకుంటున్నారు కనుక పెద్దవాళ్ళు అభ్యంతరాలు చెప్పలేదు తెలుగువాడైనా, ఇక్కడుండే మనీషాకి వాళ్ళ వాళ్ళలోనే డబ్బుండే వాళ్ళనే చూస్తారులే. ఈ బిజినెస్ కమ్యూనిటీ ముందు మనం ఎక్కడ నిలబడగలం. ఎనీ హౌ.... ఈ ఊర్లోనే వుంటారుగా.... ట్రై యువర్ లక్...' అన్నాడు శ్రీధర్ నవ్వి.
దూరం నుంచి శ్రీధర్, దివాకర్ మనీషాని కలిసి మాట్లాడటం - ఆమెతో మాట్లాడుతుంటే దివాకర్ మొహంలో మెరుపును జయంతి చూసింది ఆమె మనసు ఒక్కసారిగా కుంచించుకుపోయింది. దివాకర్ ఈ రోజు వచ్చిందగ్గిరనుంచి తన నసలు పట్టించుకోలేదు. ఎంతసేపు శ్రీధర్, రాహుల్ భావిక, మనిషాల చుట్టూ పక్కలే తిరుగుతున్నాడు. రిసెప్షన్ కి వచ్చే అందమైన ఆడపిల్లల వెంట అతని దృష్టి పరుగులు తీయడం జయంతి కనిపెడ్తూనే వుంది. అసలే తెలియని చోట, ఆ ఫైవ్ స్టార్ హోటలు, మనుష్యుల మధ్య తను ఇమడనట్టు ఏదో నూన్యతాభావం ఆమెని చుట్టపెట్టింది. ఉషారాణి జనం మధ్య తిరుగుతూ తన అత్తగారు వాళ్ళు, చుట్టాల మధ్య తిరుగుతూ బిజీగా వుంది. దమయంతి కూడా ఒకసారి వచ్చి పలకరించి వాళ్ళ చుట్టాల మధ్య కూర్చుని మాట్లాడుతూంది. ఆఖరికి కొన్ని యుగాల అనంతరం అన్నట్టు ఉషారాణి వచ్చి 'పద పద అంతా భోజనాలకి బయలుదేరుతున్నారు' అంటూ తీసికెళ్ళింది దివాకర్ గుంపులో ఎక్కడ వున్నాడో కనపడలేదు. 'అక్కా రా భోజనానికి' అంటూ దమయంతి వచ్చింది. ఆ పదార్ధాలన్నీ చూస్తూ ఏం తినాలో తెలియక జనం మధ్యలో ఏవో కొన్ని ప్లేటులో పెట్టుకుని ఓ మూల నుంచుంది. ఉషారాణి మాట్లాడుతూ ఎవరో పిలిస్తే ప్లేటు పట్టుకుని అటు వెళ్ళింది. గోపాలకృష్ణ ఓసారి వచ్చి జయంతిని చూసి 'మీకోసమే చూస్తున్నాను- తీసుకున్నారా, అటు చాట్ సెక్షన్ వుంది చూశారా-స్వీట్స్, ఐస్ క్రీమ్ అటు వున్నాయి. ఈ దివాకర్ ఏడి' అంటూ అతనికోసం చూస్తూ వెళ్ళాడు. దివాకర్, శ్రీధర్, భావిక ఓ చోట ప్లేట్లు పట్టుకుని కన్పించారు. అటు వెళ్ళాలో లేదో తెలియక ఆలోచించే లోపలే మనీషా అటు వెళ్ళడం దివాకర్. శ్రీధర్ వాళ్ళతో కలిసి ఏదో అంది-అంతా నవ్వుతున్నారు. అది చూసి జయంతికి ఉక్రోషం వచ్చింది. తనను వెడదాం అంటూ ప్రోత్సహించి తీసుకు వచ్చి వదిలేసి అతనిలా తనని పట్టించుకోకుండా మనిషా అందానికి దాసోహం అయిన వాడిలా ప్రవర్తించడం చూస్తే పట్టరాని అసూయాగ్రహాలు వచ్చాయి.
"ఏం అక్కయ్యా-ఒక్కర్తివి నిల్చోకపోతే మనవాళ్ళు అటున్నారుగా వెళ్ళకపోయావా' అంటూ శ్రీధర్ వాళ్ళ వైపు చూసింది. అక్క గారి మొహం వాడిపోయి ముభావంగా వుండటం, దివాకర్ నవ్వుతూ మనీషాతో ఏదో అనడం జయంతి అలా వుండటానికి కారణం అర్ధం అయినట్లనిపించి 'పద అక్కడికెడదాం' అంది దమయంతి. 'వద్దులే, బాగానే వుందిలే ఇక్కడ...' అంది మొహం ముడుచుకుని.