Previous Page Next Page 
మనసున మనసై పేజి 24


    'ఏం లేదు బాగానే వుంది. రాత్రి ఏదో పార్టీకెళ్ళాను. పడుకోవడం ఆలస్యం అయింది.
    'దమయంతి అత్తవారి బంధువుల పెళ్ళికేనని దమయంతి చెప్పిందిలే' అంది. కాస్తాగి 'ఎవరితో వెళ్ళావు-దివాకర్ తోనా' అంది మళ్ళీ. జయంతి ఆశ్చర్యంగా  చూసింది. 'దమయంతి చెప్పిందిలే. మీ బ్యాంకు మేనేజర్ దివాకర్ గోపాలకృష్ణ వాళ్ళంతా ఫ్రెండ్స్ అని. కిందటి మాటుకూడా అతనితో మీ ఉషారాణి పెళ్ళికి వెళ్ళానని అంది. జయంతి తల వూపింది. వాసంతి కాస్త తటపటాయిస్తూ 'ఆ... దివాకర్ మనవాడేటగదా, మనిషి ఎలాంటివాడు. గోపాలకృష్ణ ఏదో అన్నాడులే'    
    జయంతి కాస్త ముఖం చిట్లించి 'ఏమన్నాడు' అంది.
    'ఆ... ఏదో, దివాకర్ కి మన జయంతికి సంబంధం బాగుంటుందన్నాడు. ఏదో మాటలలో చెల్లెలి ముఖంలో భావాలు గమనిస్తూ అంది. జయంతి ముఖం కాస్త ఎర్రబడింది సిగ్గుతో.
    'నేను అతనితో మాట్లాడి చూడమని చెప్పాను. దమయంతి కూడా అంది. కుదిరితే బాగుండును అని అనుకున్నాం అందరం' వాసంతి మాటలు జయంతిలో ఆశలు రేపాయి. ఎవరన్నా తన తరపున అతనితో మాట్లాడితే తన పని సులువవుతుంది. గోపాలకృష్ణ స్నేహితుడు కనక చనువుగా అడగగలడు-కాని తను అంత అవమానించిన అతను ఈ పని భుజంమీద వేసుకుంటాడా....' చెల్లెలు ముఖంలో మారుతున్న భావాలు చూసి 'ఏమిటే ఆ ఆలోచన అతను బాగుంటాడు. మేనేజరు ఉద్యోగం, అన్నీ బాగున్నాయి. నీకేం అభ్యంతరం వుండదుగదా'
    'బాగుంది. అన్నీ మనమే అనేసుకుంటే సరా అతని ఉద్దేశం ఏమిటో' కాస్త సిగ్గుపడుతూనే అంది. 'అతనేమంటాడో గోపాలకృష్ణ అడుగుతాడులే-ముందు నీ సంగతి చెప్పు' అంది కవ్విస్తూ. 'అబ్బ చూద్దాంలే. ఏదో అంతా అయిపోయినట్టు అంటున్నావు. అసలతను ఇప్పటినుంచే చేసుకుంటాడో, లేదో-అతని కోరికలేమిటో?' అర్దోక్తిలో ఆగి అంది. మనీషాలాంటి అందమైన అమ్మాయిలని చూసిన అతని కళ్ళకి తను ఆనుతుందా' అనిపించి కాస్త నిరాశ ఆవరించింది.
    'చూద్దాం-ఎవరికెక్కడ రాసిపెట్టి వుందో' పిల్లాడిని పక్కమీద పడుకోబెట్టి అంది వాసంతి.
    'అదిసరే, యింతకీ బాబుకి పేరేం సెలక్ట్ చేశారు బావగారు' అంటూ లేని ఉత్సాహం తెచ్చుకుని మాటమార్చింది.
    'నాన్నపేరు, అమ్మపేరు అనకుండా మాడర్న్ పేరు పెట్టాలన్నాను. వాళ్ళవాళ్ళేం అనుకుంటారోనని ఆయన భయం- మంచిపేర్లు చెప్పు నాలుగైదు'
    'రాసివుంచుతాలే ఆలోచించి-యింక వెళతానక్కా కాస్త చిరాగ్గా వుంది. వెళ్ళి ఫ్రెష్ అయితే కాస్త హాయిగా వుంటుంది' అంటూ లేచింది.
    
                                * * *
    
    తరువాత రెండు రోజులకి ఆఫీసులో దివాకర్ కాబిన్ లోకి వెళ్ళింది జయంతి ఏదో కాగితాలు పట్టుకుని...అతనెవరితోనో మాట్లాడుతున్నారు ఫోనులో - అతని మొహం నిండా సంతోషం..... 'అఫ్ కోర్స్, ఇటీజ్ మై ప్లెజర్, తప్పకుండా వచ్చి మీ బుటిక్ చూస్తాను...' అంటున్నాడు. జయంతి లోపలికి అడుగుపెట్టగానే అప్రసన్నంగా చూస్తూ 'జస్ట్ ఎ మినిట్' అంటూ మౌత్ పీస్ మూసి 'ఎస్' అన్నాడు కాస్త అసహనంగా.
    'ఈ స్టేట్ మెంట్ కావాలన్నారు' ....ఏదో చెప్పబోయింది.
    'లీవిట్ ఆన్ ది టేబిల్, తరువాత చూస్తా' యింక వెళ్ళచ్చు అన్నట్టు చూసి.
    జయంతికి బుటిక్ అన్నపదం వినగానే అర్ధం అయింది మనీషాతో మాట్లాడుతున్నాడని. అతను ఆమెతో మాట్లాడుతున్నప్పుడు తను మధ్యలొ వెళ్ళినందుకు అతని మొహంలో కన్పించిన అసహనం, చిరాకు ఆమె మనసులో ముల్లుగుచ్చినట్టనిపించింది. వాడిపోయిన మొహంతో సీట్లోకి వచ్చి కూర్చుంది. పనిమీద మనసు లగ్నం చేయలేకపోయింది. దివాకర్ మనీషా అందానికి దాసోహమై ఆమెని ప్రసన్నురాలిని చేసుకోడానికి తాపత్రయపడ్తున్నాడన్నమాట! ఆమెని చూసిన కళ్ళకి తానెక్కడ ఆనుతుంది. పెళ్ళి రిసెప్షనులో ఆమెని చూసిందగ్గర నించి తనని అసలు పట్టించుకోవడం మానేసాడు. అంటే అతని ఆశలు, కోరికలు చాలా ఎత్తులో వున్నాయన్నమాట. అలాంటి అతని మీద తను ఆశలు పెంచుకోడం తన తెలివి తక్కువతనమో! ఏదో రెండుసార్లు సరదాగా మాట్లాడాడని, కారులో తీసికెళ్ళాడని తనంటే యిష్టమన్న భావం కలగడం ఏమిటి- ఆత్మ విమర్శ చేసుకోసాగింది. దివాకర్ తనకు అందడు అన్న భావం బలపడి జయంతి మొహం మాడిపోయింది. అతని ముందు తను ఫూల్ అయినందుకు మ్లానమయింది మనసు. ఈసారి చచ్చినా అతనితో ఎక్కడికి వెళ్ళకూడదు- పై అధికారిగా తప్ప మాట్లాడకూడదు- అతని చేత చీదరించుకోవడానికి తనకేం అవసరం పౌరుషంగా అనుకుంది. 'జయంతీ, ఏమిటలా పెదాలు బిగబట్టి కోపంగా చూస్తున్నావు. ఎవరిమీద కోపం?' పక్కటేబిలు మీనాక్షి పలకరించింది.
    తన ముఖం తన మనసులో భావాలని చూపెడుతోంది కాబోలు-అందుకే ఫేస్ ఈజ్ ది ఇండెక్స్.... తనిలా బయటపడిపోతుందేమిటి... సర్దుకుని నవ్వుతూ 'ఎందుకో ఈరోజు అందరిమీద కోపంగా ఉంది' అంది జయంతి తమాషాగా అన్నట్టు.

 Previous Page Next Page